విశాఖపట్నం, ఏప్రిల్ 19: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది బినామీల పరిస్థితి. అర్హత ఉందో.. లేదో కానీ ఏళ్ళ తరబడి తెల్ల రంగు రేషన్ కార్డులను అనుభవిస్తున్న వీరికి ఇకపై ఆ కార్డు ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే వీరి పేరిట మద్యం దుకాణాలు ఉండడమే ఇందుకు కారణం. విశాఖ రూరల్‌లో 212 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో 177 మంది యజమానులకు తెల్ల రంగు రేషన్ కార్డులు ఉన్నట్టు గుర్తించారు. అలాగే 25 మందికి పింక్ రంగు రేషన్ కార్డులు ఉన్నారు. 11 మందికి ఎటువంటి రేషన్ కార్డులు లేవు. ముగ్గురు యజమానులు వివరాలు లభ్యం కాలేదు. ఇక విశాఖ అర్బన్‌లో 153 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో 61 దుకాణ యజమానులకు తెల్ల రంగు రేషన్ కార్డులు ఉన్నాయి. 52 మందికి పింక్ రేషన్ కార్డులు ఉన్నాయి. 40 కార్డుల అడ్రస్‌లు లభ్యం కాలేదు. ఈ జాబితాను రెండు రోజుల కిందటే సివిల్ సప్లైస్ అధికారులు ఎసిబికి అందచేశారు. వీరు ఆయా కార్డుదారుల వద్దకు వెళ్లి, ఈ దుకాణాలు వారి వారి పేరిట ఏవిధంగా వచ్చాయి? నిజం చెప్పమంటున్నారు. ఒకవేళ చెప్పకపోతే, జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క బినామీ కూడా జవాబు చెప్పలేదు. ఎసిబి అధికారులు మాత్రం వీరిని వదిలే పరిస్థితి కనిపించడం లే దు. దీంతో కొంతమంది బినామీలు తమతమ గ్రామాలు వదిలి ఇతర ప్రాం తాలకు వెళ్లిపోతున్నారు.ఇదిలా ఉండ గా మద్యం దుకాణం ఉండి, తెలుపు రంగు రేషన్ కార్డు ఉంటే, ఆ కార్డును రద్దు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వీరందరికి త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. వా రం రోజులు వ్యవధి ఇచ్చి కార్డులను ర ద్దు చేయనున్నారు. ఆ తరువాత వారు అప్పీలు చేసుకుంటే, వాస్తవాలను పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు.
నా కార్డు సరెండర్ చేయండి!
ఇదిలా ఉండగా నరవ ప్రాంతంలో మద్యం దుకాణం కలిగిన ఓ వ్యక్తికి తెలుపు రంగు రేషన్ కార్డు ఉంది. తనకు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని అందువలన తన కార్డును సరెండర్ చేసుకోవాలంటూ ఆ కార్డును సివిల్ సప్లైస్ కార్యాలయంలో వదిలి వెళ్లినట్టు తెలిసింది.
విజయవంతంగా ‘ప్రజాపథం’
విశాఖపట్నం, ఏప్రిల్ 19: ఈ నెల 15న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించిన ప్రజాపథం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ లవ్ అగర్వాల్ తెలిపారు. అధికారుల లెక్కల ప్రకారం 67 గ్రామ పంచాయతీల్లో, అయిదు వార్డుల్లో ప్రజాపథం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడమైందన్నారు. జిల్లాలో 12 నియోజకవర్గాల్లో దీనిని నిర్వహించారు. విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాలతోపాటు చోడవరం, మాడుగుల, అరకువేలీ, అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, పాడేరు నియోజకవర్గాల్లో ఈ ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జిల్లాలో గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇంతవరకు 216 గ్రామ పంచాయతీలు, 30 వార్డుల్లో ఈ ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆయన తెలిపారు.
సమస్యాత్మక గ్రామాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన బందోబస్త్ మధ్య ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి జివిఎంసి పరిధిలో 33వ వార్డుల్లో అక్కయపాలెంలో నిర్వహించిన ప్రజాపథంలో పాల్గొనగా, పాయకరావుపేట నియోజకవర్గం పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ అధ్యక్షుడు తోట నగేష్ పాల్గొన్నారు.
భవిష్యత్ వైఎస్సార్ కాంగ్రెస్‌దే
నక్కపల్లి, ఏప్రిల్ 19: రానున్న రోజుల్లో తమపార్టీకి స్వర్ణయుగం రానుందని గురువారం మండలంలోని చినతీనార్ల, పెదతీనార్ల, దొండవాక, రాజయ్యపేట గ్రామాల్లో జరిగిన రోడ్డు షోలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు. పాయకరావుపేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన రోడ్డుషోలో మత్స్యకారులనుండి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఏ గ్రామంలో చూసినా అధికసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో జగన్ ప్రసంగిస్తూ రైతురాజ్యం వస్తే ప్రతీ పేదవిద్యార్థినికి నెలకు 500రూపాయలు వంతున ఉపకార వేతనాన్ని అందజేసేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన మత్స్యకారునికి ఐదులక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు కృషిచేస్తామన్నారు. ప్రతీ సముద్ర తీరప్రాంతంలో మత్స్యకారుల పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు రైతన్న ఒకవైపు, కుళ్లుకుతంత్రాలు మరోవైపు మధ్య ఈ ఎన్నికలు జరగనున్నందున ఓటర్లంతా ఆలోచించి ఓటువేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశ్వాసానికి కట్టుబడి మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు అధికార పార్టీతో పోరాటం తప్పదని తెలిసి కూడా పదవి త్యాగం చేసినందున తిరిగి ఆయనకే ఓటువేసి గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బాబురావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ తరపున సమస్యల పరిష్కారానికి ఆయన కృషిచేస్తారన్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన రాజ్యమేలుతుందని తీవ్రంగా దుయ్యబట్టారు. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి, 108 ఫోన్‌చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్, తెలుగుదేశంలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చినతీనార్ల, పెదతీనార్ల, రాజయ్యపేట గ్రామాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాలను జగన్ మోహన రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ, జిల్లా యువజన విభాగం నాయకుడు అదీప్‌రాజు, వీసం రామకృష్ణ, లొడగల చంద్రరావు, గొర్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావుతో సహా పలువురు నాయకులున్నారు.
ఎస్.రాయవరంలో...
ఎస్.రాయవరం : పాయకరావుపేట నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి గురువారం నాడు ఎస్.రాయవరం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కశింకోట నుండి నేరుగా మండలంలోని మత్స్యకార గ్రామమైన బంగారమ్మపాలెం చేరుకుని అక్కడినుండి ఆ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావుకు మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచార సభల్లో స్థానికులనుద్ధేశించి ప్రసంగిస్తూ త్వరలో జరగనున్న ఉప ఎన్నికల సభలో ప్రసంగిస్తూ రైతన్న, పేదవాడు ఒకవైపు అయితే కుళ్లుకుతంత్రాలు మరోవైపు పోటీపడుతున్నాయని అధికార పార్టీని తీవ్రంగా విమర్శించారు. పేదవాడికి, రైతన్నకు అండగా నిలిచే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాబూరావుకు ఓటువేసి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతోపాటు ఢిల్లీలోని నేతలకు కనువిప్పు కలిగించాలని విజ్ఞప్తి చేసారు. మత్స్యకారుల్లో పేదరికం పోవాలంటే ప్రతీ ఇంటిలో ఒకరు విద్యావంతులు కావాలని వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తనదని, త్వరలోనే సువర్ణయుగం పాలన ఖాయమని ఆనాడు పేదల బాధలు తీరతాయని జగన్ మోహన రెడ్డి అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వేటకు వెళ్లి ప్రమాదంలో మరణించిన మత్స్యకారులకు ఐదులక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. చిన ఉప్పలం, రేవుపోలవరం, కొత్త రేవుపోలవరం, గుడివాడ, గుర్రాజుపేట గ్రామాల్లో స్థానిక నేతలను ఉద్ధేశించి జగన్ ప్రసంగించారు. రైతులు, పేదల కోసం పదవిని వదులుకున్న బాబూరావుకు ఓటువేసి గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర నాయకులు కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, స్థానిక పార్టీనాయకులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు.
అభిమానుల జేబులకు చిల్లు
ఒకపక్క గ్రామానికి వచ్చిన రాజకీయ నేతను దగ్గరనుండి చూద్దామంటూ గుంపులుగా చేరిన పలువురు ప్రజల జేబులను జేబుదొంగలు ఖాళీచేసారు. సెల్‌ఫోన్లు, పర్సులు మాయం కావడంతో లబోదిబోమంటూ వెనుదిరిగారు.
అరకులోయ మహిళకు స్వైన్‌ఫ్లూ!
విశాఖపట్నం, ఏప్రిల్ 19: అరకులోయకు చెందిన మహిళకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకింది. దీంతో అక్కడి వైద్యాధికారులు హుటాహుటిన విశాఖపట్నంలోని కెజిహెచ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇప్పటి వరకు మొత్తం పది మంది ఈ వ్యాధి సోకింది.
మంచినీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరు
చోడవరం, ఏప్రిల్ 19: నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి నివారణకోసం 9.35కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. గురువారం మండలంలోని గోవాడ గ్రామంలోని డిసిసి కార్యదర్శి ఏడువాక సత్యారావు నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచినీటి ఎద్దడి నివారణ కోసం చోడవరం నియోజకవర్గ పరిధిలో 49గ్రామ పంచాయతీలను ఎంపికచేసి నాలుగు విడతలలో తొమ్మిది కోట్ల 35లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలియజేసారు. మొదటివిడతలో ఆరుగ్రామాలు, రెండవ విడతలో 21గ్రామాలు, మూడవ విడతలో ఆరుగ్రామాలు, నాల్గవ విడతలో 16గ్రామాలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. రెండవ విడతలో మండలంలోని ఎం.కొత్తపల్లి గ్రామానికి రక్షిత మంచినీటి పథకం మంజూరైందని దీనికి 3.73లక్షల రూపాయలకే కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఈ పథకం నిర్మాణానికి రెండునెలల్లో టెం డర్లు ఖరారు చేసి ఆరు మాసాలలో పనులు పూర్తిచేస్తామని చెప్పారు. ప్రజ ల మంచినీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనాభా ప్రాతిపధికన మనిషికి 40లీటర్ల వంతున కేటాయించి ఐదుశాతం నిధులు గ్రామస్థులు చెల్లించేలా 109గ్రామాలను గుర్తించి 20 గ్రామాలకు ఒక క్లష్టర్ ఏర్పాటు చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంచినీరు కోసం సమ్మచింతల వద్ద రిజర్వాయర్ నిర్మా ణం, పెద్దేరు రిజర్వాయర్ కాలువ లైనిం గ్ పనులు పూర్తిచేస్తే వృధాగా పోతున్న ఆరుశాతం వృధానీటిని వినియోగంలోకి తీసుకురావచ్చన్నారు. అలాగే తాళ్లపాలెం వద్ద పోలవరం కాలువకు సాగునీరు అవసరాలు తీర్చవచ్చు. దీనికి అవసరమైన ప్రణాళికను రూపొందించామన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖామంత్రి బసవరాజు సారయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ మంత్రి జానారెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చక్కెర శాఖామంత్రి గీతారెడ్డిలతోపాటు జిల్లా మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాసరావులను ప్రజాపథం కార్యక్రమాలకు ఆహ్వానించి ఈ ప్రాంత అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషిచేస్తున్నట్లు ఆయన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఏడువాక సత్యారావు, పల్లా నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
అధికారులను అడ్డుకున్న గిరిజన సంఘం కార్యకర్తలు
డుంబ్రిగుడ, ఏప్రిల్ 19: డుంబ్రిగుడ మండలం కొర్రా పంచాయతీ గత్తరబిల్డ గ్రామంలో మంచినీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం కార్యకర్తలు ప్రజాపథం అధికారులను గురువారం అడ్డుకున్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.దయానిది ఆధ్వర్యంలో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కొర్రా, గసబ ప్రజాపథం చేపట్టడానికి వేళ్ళే అధికారులను నిలదీసారు. గతంలో జరిగిన పల్లెపిలుపు కార్యక్రమంలో గిరిజనులు తెలియచేసిన సమస్యలపై పాలకులు ఇచ్చిన హామీలపై ఎంతవరకు చర్యలు తీసుకున్నారని వారు అధికారులను ప్రశ్నించారు. మంచినీటి సౌకర్యం కల్పించాలని నినాదాలు చేస్తూ సుమారు మూడు గంటల పాటు అధికారులను నిర్భందించారు. దీంతో ప్రత్యేక అధికారి జె.వెంకటరావు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా గిరిజనులు వెనక్కి తగ్గకపోగా సమస్యలు పరిష్కరించని అధికారులు వెనక్కి వెళ్ళిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అధికారులు చేసేది ఏమీ లేక ప్రజాపథం నిర్వహించకుండా గత్తరబిల్డ నుంచి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ప్రజాపథం కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌కు సిఫార్సు చేస్తున్నట్టు మండల ప్రత్యేక అధికారి జె.వెంకటరావు గురువారం విలేఖరులకు తెలిపారు. డుంబ్రిగుడ మండలం కొర్రా పంచాయతీలో గురువారం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమానికి ఆర్.డబ్ల్యు.ఎస్. ఎ.ఇ.ఇ., గిరిజన సంక్షే మ శాఖ మండల సహాయ అధికారి గైర్హాజరైనట్టు ఆయన చెప్పారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజాపథం కార్యక్రమానికి హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అరకు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన వి.ఆర్.ఓ. దేము డు మద్యం సేవించి ఉండడాన్ని గమనించి వైద్య పరీక్షల నిమిత్తం అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న వి.ఆర్.ఓ.పై కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎం.పి.డి.ఓ. అరుణ, ఎ.ఓ. సుజన తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ మారిటైం వర్సిటీ ఏర్పాటుతో
యువతకు ఉజ్వల భవిత
సబ్బవరం, ఏప్రిల్ 19: సబ్బవరం మండలం వంగలి గ్రామంలో అంతర్జాతీయ విలువలు కలిగిన ఇండియన్ మారిటైం వర్శిటీ (నౌకలకు డిజైన్‌చేసే యూనివర్శిటీ) నిర్మాణం వల్ల యువకులకు, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పెందుర్తిఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అన్నారు. గురువారం సాయంత్రం వంగలి గ్రామంలో జరిగిన ఐఎంయు భూముల కేటాయింపులోని రైతులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వ భూములు హక్కుదారులు, ఆక్రమణదారుల వద్దనుంచి తీసుకున్నప్పటికీ వారికి తగిన పరిహారం ఇప్పించటంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మారిటైం వర్శిటీ అధికారులు సహకరించటం పట్ల ఆయన అభినందించారు. అంతేకాక చాలా సందర్భాల్లో భూముల కోల్పోయిన రైతులు కూడా అల్లర్లు చేయటం తాను చూశానని, కానీ వంగలి విషయంలో రైతులు కూడా తన మీదే భారం ఉంచి తమప్రాంతానికి అంతర్జాతీయ విలువలు కలిగిన సంస్థ రావాలనుకుని ఎంతో తోడ్పాటు అందించటం హర్షణీయమన్నారు. అయితే ఇక్కడి గ్రామ మాజీ సర్పంచు గవర అప్పలనాయుడు రైతుల అభీష్టం మేరకు చేసిన సూచనలను మారిటైం వర్శిటీ డైరెక్టర్ మిశ్రా దృష్టికి తెస్తూ తమ గ్రామం మీదుగా వర్శిటీ రోడ్డు నిర్మాణంతోపాటు ఇక్కడి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ఐఎంయు అధికారులు సహకారం అందించాలన్నారు. అయితే శాస్తస్రాంకేతి రంగ పోస్టులు తప్ప ఇక్కడి నిర్వాసితుల పిల్లల విద్యార్హతలను బట్టి చిన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. త్వరలో గ్రేటర్ విశాఖపట్టణంలో సబ్బవరం విలీనం ప్రక్రియ చురుగ్గా కార్యరూపం దాల్చుతున్నందు న ఇక్కడి భూములకు ధరలు పెరిగి మండల రైతాంగం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఐఎంయు విశాఖ క్యాంపస్ డైరెక్టర్ ఎస్సీ మిశ్రా మాట్లాడుతూ భూములు తమ సంస్థ ఏర్పాటుకు ఇచ్చినందుకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు కోరుతున్నట్లు ఉద్యోగ విషయాలు ఐఎంయు నిబంధనలకు లోబడి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిక్‌లోనే కల్పించే అవకాశం ఉందన్నారు. ఒక వేళ ఏమాత్రం అవకాశమున్నప్పటికీ రైతుల పిల్లలకే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. సుమారు 1000 మంది విద్యార్ధులకు అవసరమైన వౌలిక సదుపాయాల విషయంలో విద్యవిషయాల్లో స్ధానికులకు తప్పక అవకాశం కల్పిస్తామన్నారు. తర్వాత జిల్లాజాయింట్ కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ తూర్పుతీర రక్షణ విషయాలకు సంబంధించిన ఈ మారిటైం వర్శిటీకి 1991లోనే రూపకల్పన జరిగిందన్నారు. అందుకు తగిన భూముల కోసం అనే్వషణ ఇక్కడి రైతుల సహకారంతో పూర్తయిందన్నారు. చివరి క్షణంలో ఇక్కడి నుంచి తరలిపోవాల్సిన ఐఎంయును ఎమ్మెల్యే పంచకర్ల ఫైట్ చేసి తీసుకురావటం ప్రశంసనీయమన్నారు. ఎన్‌ఎస్ డిఆర్‌సి లోవిలీనమయిన ఈవర్శిటీ ఇక్కడ రావటం ఈప్రాంత ప్రజల అదృష్టంగా అభిప్రాయపడ్డారు. జీవో 68 ప్రకారం ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద ఎకరానికి 2.40లక్ష నష్టపరిహారం, 30శాతం సొలేషియం, చెట్లకు నష్టపరిహారం అందిస్తున్నామన్నారు. అది కాక మరో 50 వేలు చొప్పున ఎకరానికి లభించే అవకాశం ఉందన్నారు. అది తర్వాత అందజేస్తామన్నారు. ఇక్కడి సర్వేనెంబర్ 212/1,2లో మొత్తం సేకరించిన భూమి 107 ఎకరాలకు నష్టపరిహారంకింద 2,47,13,993 రూపాయలను పంపిణీ చేయటం జరుగుతుందని తహశీల్దార్ ఎస్‌డి అనిత తెలిపారు. ఆక్రమణదారులకు కూడా మెరుగైన ప్యాకేజీ లభించిందన్నారు. అనంతరం లబ్ధిదారులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఐఎంయు పిఎఓ ఎ.రమేష్‌బాబు, ఇంజినీర్ సి.రవిబాబు, ఎకాడమిక్ కోఆర్డినేటర్ బి.వి.రామలింగేశ్వరరావు, ఆర్డీవో బి.సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు గవర శ్రీనివాసరావు, పిబివిఎస్‌ఎన్ రాజు, సాలాపు వెంకటేశ్వరరావు, గొర్లిఅచ్చిమనాయుడు, ఆర్‌ఇసిఎస్ డైరెక్టర్ ఎస్.నారాయణమూర్తి, బి.అప్పారావుఎస్.తినాధరామకాసు, ఆర్‌ఐ రమేష్‌బాబులు పాల్గొన్నారు.
సత్యదేవుని రథానికి ఘనస్వాగతం
నర్సీపట్నం, ఏప్రిల్ 19: దేవాదాయ, ధర్మాదాయ శాఖ, హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు, అన్నవరం వీరవెంకటసత్యనారాయణస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సత్యదేవుని రథయాత్రకు ఇక్కడ ఘనస్వాగతం లభించింది. గురువారం ఉద యం అన్నవరం నుండి బయలు దేరిన స్వామి వారి ప్రచార రథం రాత్రి ఏడు గంటల సమయానికి డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంకు చేరుకుంది. ఈసందర్భంగా శ్రీకన్య సెంటర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. స్థానిక శాసన సభ్యురాలు బోళెం ముత్యాలపాప పూజాసామగ్రిని అందజేయగా, వేదపండితులు సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేసారు. రథయాత్ర ఇక్కడకు చేరుకుంటుందని తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బలిఘట్టం గ్రామం వద్ద నర్సీపట్నం మాజీ సర్పంచ్ చింతకాయల సన్యాసిపాత్రుడు ఆధ్వర్యంలో భక్తులు స్వామి వారి రథానికి స్వాగతం పలికారు. బ్యాండు మేళాలు, డప్పులు, కోలాటాలతో రథానికి స్వాగ తం పలికి సత్యదేవుని వెంట నడిచారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి స్థానిక టి.టి.డి. దేవస్థానానికి రథం చేరుకుంది.
* నేడు సత్యదేవుని సామూహిక వ్రతాలు
శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ మినీస్టేడియంలో ఉదయం ఐదు గంటలకు స్వామి వారికి సుప్రభాతం, ఆరు గంటలకు నిత్య అర్చన, ఏడున్నర గంటలకు బాలభోగం నివేదన, ప్రసాద వితరణ, ఎనిమిది గంటలకు స్వామి వారి సామూహిక ఉచిత వ్రతములు, మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వదర్శనములు, అనంతరం మహానివేదన జరుగుతాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇక్కడి నుండి స్వామి వారి రతం ఊరేగింపుగా బయలు దేరి పెదబొడ్డేపల్లి జంక్షన్ మీదుగా రోలుగుంట, కొత్తకోట, రావికమతం, దొండపూడి, మాడుగుల చేరుకుంటుందని నిర్వాహకులు సన్యాసిపాత్రుడు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి ప్రజల సహకారం అవసరం
ముంచంగిపుట్టు, ఏప్రిల్ 19: సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తున్నామని, ప్రజలు సహకరించిన నాడే వాటిని అమలు పరచగలిగే అవకాశం ఉంటుందని పాడేరు ఐ.టి.డి.ఎ.,ప్రాజెక్టు అధికారి శ్రీకాంత్ ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన ముంచంగిపుట్టు మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజాపధం కార్యక్రమంలో పాల్గొని గిరిజన ప్రాంతంలో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అయితే ఒకేసారి అన్ని సమస్యలు పరిష్కారం సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వం అందించే నిధులను గిరిజన ప్రాంతాలలోని ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజాపధం కార్యక్రమంలో అనేక సమస్యలను లేవనెత్తి వాటి పరిష్కారం విషయంపై పట్టు బట్టిన సి.పి.ఎం. నాయకులకు ఆయన సమాధానాలు ఇచ్చి కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో పాల్గొన్న అరకులోయ శాసన సభ్యుడు సివేరి సోమ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపని అధికారులపై మండిపడ్డారు. గతంలో వచ్చిన వినతులపై సరైన సమాచారం లేకుండా వచ్చిన అధికారుల ప్రవర్తనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పధకాలు, వాటి అమలు, సమస్యలను ఎంతవరకు పరిష్కరించామనే సమాచారం లేకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అబాసుపాలవుతామని వారిని హెచ్చరించారు. ఇకపై పూర్తి సమాచారంతో కార్యక్రమాలకు హాజరు కావాలని సోమ సూచించారు. ప్రజాపధం కార్యక్రమంలో పాల్గొన్న గిరిజనులు తమ సమస్యలను అధికారులకు అందించి పరిష్కరించేందుకు కృషిచేయాలని కోరారు. అయితే అతి తక్కువ స్ధాయిలో ప్రజలు పాల్గొనడంతో ప్రజలు లేని ప్రజాపధం ఎందుకు అని స్ధానిక సి.పి.ఎం.నాయకులు అధికారులను నిలదీయడంతో ప్రజాపధం రసాబాసగా మారింది. గురువారం మండలంలోని దోడిపుట్టు, మాకవరం, జోలాపుట్టు, పనసపుట్టు పంచాయతీలలో నిర్వహించిన ప్రజాపధం కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించని ప్రజాపధంతో ప్రజలకు ఒరిగిందేమి లేదని సి.పి.ఎం నాయకులు నిలదీసారు. ప్రత్యేకంగా మాకవరం ప్రజాపధం కార్యక్రమంలో గ్రామాలలోని సమస్యలను తెలియచేసి వాటిని గతంలో నిర్వహించిన పలు కార్యక్రమాల ద్వారా సుమారుగా ఐదు సార్లు ఇవే సమస్యలను విన్నవించామని వారు తెలిపారు. ఇంతవరకు పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు ఈ ప్రజాపధం ద్వారా ఎం సాధిస్తారని అధికారులను నిలదీయడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. అధికారుల సమాధానాలతో సంతృప్తి చెందని నాయకులు ఖచ్చితమైన సమాధానం కావాలని పట్టుబట్టి ప్రాజెక్టు అధికారి వాహనాన్ని చుట్టుముట్టారు. దీనిపై ప్రాజెక్టు అధికారి కొంత అసహనానికి గురయ్యారు. అనంతరం జోలాపుట్టు ప్రజాపధం కార్యక్రమంలో పాల్గొని పావలా వడ్డీ రుణాలు పంపిణీ చేశారు. పంచాయతీలోని 15 గ్రామాలలో నెలకొన్న మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు 18 లక్షలతో పనులు చేపట్టనున్నట్టు శ్రీకాంత్, సోమ తెలిపారు. అదేవిధంగా పలువురు గిరిజనులకు జాబ్ కార్డులను పంపిణీ చేశారు. లబ్బూరు గ్రామ ప్రజలు తమకు దోమతెరలను సక్రమంగా పంపిణీ చేయలేదని, అరోగ్యసిబ్బంది సక్రమంగా వైద్యసేవలు అందించడం లేదని ఫిర్యాదు చేయగా ప్రాజెక్టు అధికారి వైధ్యాదికారి భానుప్రకాష్ పై మండిపడ్డారు. వైద్యసిబ్బంది పనితీరు మెరుగు పరుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్ధాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.