Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ధర్నా, మహాధర్నా వాయిదా

$
0
0

విజయనగరం, ఏప్రిల్ 19: మద్యంపై ఉద్యమాల వేడి తాత్కాలికంగా చల్లబడింది. మద్యంపై ధర్నాకు తెలుగుదేశం పార్టీకి సిద్ధ పడితే తాము అడ్డుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ గత మూడు రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు మందుగానే పోలీసు చట్టం అమల్లోకి తెచ్చారు. దీంతో ఈనెల 17 నుంచి వచ్చే నెల 5 వరకూ డివిజన్‌లో ధర్నాలు, ఆందోళనలు, ఉద్యమాలపై నిషేధం అమలవుతుంది. ఇరు పార్టీల నేతలతో బుధవారం సమావేశమైన ఎస్పీ కార్తికేయ ఆందోళనలను విరమించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై పార్టీ అధినాయకులతో చర్చించిన మీదట నిర్ణయం తెలియజేస్తామని స్పష్టం చేసిన రాజకీయ పక్షాల ప్రతినిధులు ధర్నా, మహాధర్నాలను వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. మద్యం అక్రమాలపై అధికార పార్టీతో పాటు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణను లక్ష్యంగా చేసుకుని విపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా కేంద్రంలో ధర్నాకు సిద్ధ పడ్డారు. మద్యం వ్యాపారంలో మంత్రి బొత్స ఆయన కుటుంబీకుల పాత్రకు ప్రాధాన్యతను ఇచ్చి ఈ ధర్నాకు సిద్ధ పడ్డారు. ఈ అంశానికి విపరీతమైన ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు పార్టీ మైలేజి పెంచుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఈధర్నాను అస్త్రంగా వాడుకునేందుకు యత్నించింది.
దీంతో కేవలం రాజకీయ లబ్దికోసం చంద్రబాబు మద్యంపై ఉద్యమానికి సిద్ధ పడ్డారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతి దాడికి సిద్ధ పడింది. చంద్రబాబు ధర్నా చేయాలని ప్రయత్నిస్తే తాము అడ్డుకుంటామని, ముందు సొంత పార్టీలో మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకుని తర్వాత ధర్నాలు చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే హెచ్చరించింది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన మద్యం వ్యతిరేక ధర్నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో మద్యం వ్యాపారులపై చర్యలకోసం డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సైతం మహాధర్నాకు పిలుపునిచ్చింది. గత నాలుగు రోజులుగా ఈ అంశంపై ఇరు పార్టీల మధ్య తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం కొనసాగింది. రెండు పార్టీల ప్రతినిధులు ఆయా పార్టీల జిల్లా అధ్యక్షుల ద్వారా వారివారి అధిష్టానాలకు లేఖాస్త్రాలను సైతం సంధించుకున్నారు. పరిస్థితి విషమించేలా ఉందని గుర్తించిన పోలీసులు ఇరు పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. పోలీసు చట్టం అమల్లో ఉన్నందున ధర్నాలు, ఉద్యమాలు నిషేధమని వివరించారు. ఇరు పార్టీలు ఒకే రోజున ధర్నాలకు సిద్ధ పడితే శాంతి భద్రతలు విషమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరు పార్టీలు ధర్నాలకు వేర్వేరుగా తేదీలను ఖరారు చేసుకోవాలని సూచించారు. దీంతో రెండు రాజకీయ పక్షాలు తమ ఆందోళనలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. దీనిపై ఇరు పార్టీల ప్రతినిధులతో ఆంధ్రభూమి మాట్లాడగా ధర్నాను వాయిదా వేసుకోవడం వాస్తవమేనని అంగీకరించారు.

బయోమెట్రిక్ పద్ధతిలో కూలి చెల్లింపు
విజయనగరం, ఏప్రిల్ 19: ఉపాధి కూలీలకు వేతనాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు తపాలాశాఖతో కలిపి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టం చేశారు. జిల్లాలోని 19 మండలాల్లో ఈ విధానాన్ని మే నెల నుంచి అమలు చేయనున్నట్టు గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన వెల్లడించారు. తపాలాశాఖ, ఎ.పి.ఆన్‌లైన్ సంయుక్తంగా ఉపాధికూలీలకు చెల్లింపులను చేపడతాయని తెలిపారు. వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నివారించడంతో పాటు బోగస్ చెల్లింపులను నిరోధించడమే లక్ష్యంగా ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నట్టు ఆయన తెలిపారు. చేతివేలిముద్రల ఆధారంతో ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించడం జరుగుతుందన్నారు. దీనికోసం తపాలాశాఖ, ఉపాధిహామీ పథకం సిబ్బంది సమన్వయంతో పనిచేసి కూలీలకు సత్వరం వేతనాలు అందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 15 మండలాల్లో కార్పొరేషన్ బ్యాంకు, ఇంటిగ్రా సంస్థతో కలసి స్మార్ట్ కార్డుల ద్వారా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. రెండు సంస్థలకు అవకాశం ఇవ్వడం ద్వారా పోటీతత్వం నెలకొని లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇప్పటికే నాలుగు మండలాల్లో వేతన దారుల వేలిముద్రలతో పాటు సమాచారం సేకరించే ప్రక్రియ మొదలైందన్నారు. బయోమెట్రిక్ విధానంలో చెల్లింపులను మే 21 నాటికి ప్రారంభించాలని యోచిస్తున్నామని పార్వతీపురం డివిజన్ పోస్టల్ సూపరింటిండెంట్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ కోతలు ఈ విధానానికి తీవ్ర అంతరాయం కల్గిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. తపాలాశాఖ నుంచి ఒకరు, ఉపాధిహామీ పథకం నుంచి ఒకరు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు నియమించాలని పథక సంచాలకులకు సూచించారు. జిల్లాలో మూడు లక్షల మంది ఉపాధి వేతన దారులు ఉన్నారని, వీరికి సకాలంలో వేతనాలు అందించడం ద్వారా వారి మనసులు చూరగొనాలని అన్నార. సమావేశంలో పథక సంచాలకులు జి.శ్రీరాములు నాయుడు, పొస్టల్ సూపరింటిండెంట్లు మురళీమోహన రావు, వై.ఎస్.నరసింహరావు, డ్వామా పిడి అప్పలనాయుడు, ఎంపిడిఓలు, ఎ.పిఓలు, తపాలాశాఖ అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం?
విజయనగరం, ఏప్రిల్ 19: మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోందా ? ఉప ఎన్నికలకు ముందే మున్సిపోల్స్ ఉంటాయా? తాజాగా మున్సిపల్ పరిపాలనా శాఖ నుంచి అందుతున్న సమాచారం ఇందుకు అవుననే సమాధాన్నిస్తోంది. మున్సిపాలిటీల్లో గత రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. బి.సి జనగణన పూర్తి చేసిన అనంతరం ఎన్నికలు నిర్వహించాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా న్యాయస్థానం వద్ద తన వాదనలు విన్పించిన రాష్ట్ర ప్రభుత్వం 2001 జనాభా ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి కోరింది. తాజాగా మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో విజయనగరంతో పాటు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో శివారు ప్రాంతాలను విలీనం చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతున్నారు. విజయనగరం మున్సిపాలిటీ విషయానికొస్తే 2001 లెక్కల ప్రకారం మున్సిపాలిటీలో జనాభా 1.71 లక్షలుకాగా 38 వార్డులున్నాయి. ఇటీవల విజయనగరం మున్సిపాలిటీలో కె.ఎల్.పురం, గాజులరేగ, ధర్మపురి, జమ్ము పంచాయతీలను విలీనం చేశారు. తమ ప్రాంతాల విలీనం తగదంటూ విలీన ప్రాంత ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఇటీవలే కోర్టు తీర్పుకూడా వెలువడింది. తాజాగా అయ్యన్నపేట, కణపాకతో పాటు గతంలో అసంపూర్తిగా విలీనం చేసిన ప్రాంతాలను సైతం కలిపారు. దీంతో పట్టణ జనాభా 2.37 లక్షలకు పెరిగింది. మున్సిపల్ పరిపాలనా విభాగం సూచన మేరకు రెండు వార్డులను పెంచడంతో పాటు 10 శాతం జనాభాను పెంచుతూ వార్డుల పునర్విభజన చేయాలని నిర్ణయించినట్టు తెల్సింది. ఇక పార్వతీపురం మినహా ఎక్కడా జనాభా పెరిగిన దాఖలాలు లేవు. 2001లో పార్వతీపురం మున్సిపాలిటీ జనాభా 49వేలుకాగా 26 వార్డులు ఉండేవి. తాజా గణాంకాల ప్రకారం పార్వతీపురం జనాభా 60 వేలకు పెరిగింది. వార్డులు కూడా ప్రస్తుతం 30 ఉన్నాయి. ఇక్కడ వార్డుల పునర్విభజన చేపట్టాల్సిన అవసరం లేకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక బొబ్బిలి మున్సిపాలిటీ విషయానికొస్తే 2001లో జనాభా 30096 కాగా వార్డుల సంఖ్య 30గా ఉంది. తాజాగా ఈ మున్సిపాలిటీ జనాభా 57,686కు చేరుకుంది. ఇక్కడ కూడా వార్డుల సంఖ్యలో మార్పు వచ్చే అవకాశం లేదు. సాలూరులో 2001 జనాభా 48,354 ఉండగా వార్డుల సంఖ్య 24, తాజాగా జనాభా 49,350కాగా వార్డుల సంఖ్యలో కూడా మారే అవకాశం లేదు. విజయనగరం పట్టణం మినహాయిస్తే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య యధాతథంగా ఉండే అవకాశాలే కన్పిస్తున్నాయి.

‘గ్రామాభివృద్ధికి కృషి చేయండి’
విజయనగరం (తోటపాలెం), ఏప్రిల్ 19: మండలపరిషత్ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధిపథంలో నడిపేందుకు మండల శాఖాధికారులు కృషిచేయాలని మండల ప్రత్యేకాధకారి జి.రాజకుమారి అన్నారు. స్థానిక మండలాభివృద్ధి కార్యాలయంలో మండల శాఖాధికారులు, గ్రామ కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం పండించడంలో 2006నుండి 2012 వరకు చూసినట్లయితే చాలా వెనుకంజలో ఉందన్నారు. నీరు లేని ప్రాంతాల అభివృద్ధి చాలా బాగుందని, అన్ని సౌకర్యాలు ఉన్న మన జిల్లాలో అభివృద్ధి జాడలేకపోవడం విచారకరమన్నారు. గ్రామస్థాయిలో రైతులను కలసి వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో అడిగి తెలుసుకోవాలన్నారు. తదుపరి ప్రభుత్వం అందించిన పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామానికి 25 బోర్ల వంతున మండలంలో 375 బోర్లు మంజూరు చేయడం జరిగిందని, వీటిపై రైతులకు వివరించి పనులు సాగేలా చూడాలన్నారు. రైతులకు వ్యవసాయంపై ఖరీఫ్ సీజన్‌కు ముందే మెరుగైన పంటల దిగుబడికోసం అవగాహన కల్పించాలన్నారు. సాక్షర భారత్, ఉపాధిహామీ పనుల విషయంలో మండలంలో మంచి ఫలితాలు సాధించామన్నారు. ఆరెండు శాఖలను ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈనెల 24 నుంచి ప్రజాపథం ప్రారంభం కానుందనితెలిపారు. సాక్షర భారత్ ఈయేడాది మొదటి విడత పూర్తయిందని, దాని ఫలితంగా సిగ్రేడు వచ్చిన వారిని ఆగస్టులో ప్రారంభం కానున్న రెండో విడత పరీక్షలకు సన్నద్ధ్ధం చేయాలన్నారు. జిల్లాలో మొదటి స్థానంలో మండలాన్ని నిలిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల అభివృద్ధి అధికారి డి.సత్యనారాయణ, తహశల్దారు డి.లక్ష్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

బొడ్డమానుగూడ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
కురుపాం, ఏప్రిల్ 19: మండలంలోని బొడ్డమానుగూడ సమీపంలో ఇటీవల చెరువు ఊబిలో చిక్కుకుని చనిపోయిన బిడ్డిక పూర్ణయ్య కుటుంబాన్ని కురుపాం ఎమ్మెల్యే వి.టి.జనార్థన థాట్రాజ్ గురువారం పరామర్శించారు. గ్రామానికి వెళ్లి పూర్ణయ్య భార్య లక్ష్మి, అతని కుమారుని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద్భందు పథకం ద్వారా నిధులు వచ్చేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలను కుటుంబానికి అందేటట్లు కృషి చేస్తానన్నారు. మిగిలిన కుమారుడిని చక్కగా చదివించాలని, అందుకు తగిన ఏర్పాట్లును కూడా చేస్తామన్నారు. ఈయన వెంట కాంగ్రెస్ మండల కన్వీనర్ కోలా చిరంజీవి, మాజీ జడ్పీటిసి కె.వి. కొండయ్య, తహసీల్దారు పి. రాములు, , తదితరులు పాల్గొన్నారు.

అధికారులను నిలదీసిన గ్రామస్థులు
మెరకముడిదాం, ఏప్రిల్ 19: ప్రజాపధం కార్యక్రమంలో భాగంగా గురువారం భైరీపురంలో నిర్వహించిన గ్రామసభలో ఉపాధిపనులు కేటాయించ లేదని అధికారులను గ్రామస్థులు నిలదీసారు. ఉదయం తొమ్మిది గంటలకు గొట్టిపల్లిలో ప్రారంభం కావస్సిన ఈ కార్యక్రమం సుమారు ఉదయం పది గంటలవరకూ ప్రారంభంకాలేదు. అనంతరం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అధికారులు పలు వినతులు స్వీకరించారు. అనంతరం భైరీపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధిహమి పధకం పి.ఒ తమ శాఖపనితీరును గ్రామసభలో వివరిస్తుండగా పలువురు కూలీలు లేచి తమకు పనులు ఎందుకు కేటాయించంలేదని పి.ఒను నిలదీసారు. పి.ఒ దీనికి బదులు చెప్పకుండానే పనులు కేటాయించడంలో అధికారులు విఫలమైయ్యారని వీరు వాగ్వివాదానికి దిగారు. దీంతో అధికారులు గ్రామసభను ముగించుకుని వెల్లిపాయారు . అనంతరం గర్భాంలో నిర్వహించిన సభలో అంతంత మాత్రంగానే ప్రజలు హజరు కావడంతో త్వరగా ముగించుకుని అధికారులు వెల్లి పోయారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి తాడ్డి కృష్ణారావు, మాజీ జడ్.పి.టి.సి సభ్యుడు కోట్ల విశే్వశ్వరరావు తాడ్టి వేణుగోపాలరావు మండల ప్రత్యేక అధికారి నారాయణస్వామి ఎంపి డి.ఒ సిహెచ్ సుబ్బలక్ష్మి తహశీల్దారు పెంటయ్య పలు శాఖల అధికారులు పాల్గోన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

జామి, ఏప్రిల్ 19: ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య సూచించారు. జామి మండలం జాగరం గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమం ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో అన్ని వసతులు ఉన్నాయని, వైద్యాదికారులు అందుబాటులో ఉన్నారని, ప్రజలు వైద్య సేవలకోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చే విధంగా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణులు ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవం చేసుకునే విధంగా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రుల్లో ప్రసవం వల్ల తల్లీ, బిడ్డ క్షేమంగా ఉంటారని, పేదలకు పలు ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈసందర్భంగా గ్రామంలో ఎంతమంది గర్భిణులు ఉన్నారు, వారు ఎక్కడ ప్రసవం చేసుకుంటారని స్థానిక వైద్య సిబ్బందిని వివరణకోరారు. గ్రామంలో 24మంది గర్భిణులు ఈనెలలో ప్రసవించాల్సి ఉందని తెలపగా, వీరంతా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో 45 మహిళా
స్వయం సహాయ సంఘాలకు 1.8 లక్షల రూపాయల మేర పావలావడ్డీ రాయితీని కలెక్టర్ అందించారు. అలాగే మహిళా సంఘాలకు దీపం కనెక్షన్లను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఇక గ్రామంలో ఉపాధి కూలీలకు వేసవి బోనస్‌గా 30 రూపాయల అదనపు వేతనాన్ని చెల్లించడంతో పాటు మంచినీటికి మరో అయిదు రూపాయలు ఇస్తామని తెలిపారు. కూలీలు నిబంధనల ప్రకారం రోజుకు ఆరు గంటల పాటు పనిచేస్తే 120 రూపాయల కూలీ లభిస్తుందని తెలిపారు.
మంచినీటి పథకానికి మోక్షం
గ్రామంలో నిరుపయోగంగా పడిఉన్న రక్షిత మంచినీటి పధకానికి జిల్లా పరిషత్ నిధులతో మరమ్మతులు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి అన్నపూర్ణమ్మ, ఎంపిడిఓ సూర్యం, తహశీల్దారు రాజేశ్వరి తదితర అధికారులు పాల్గొన్నారు.,

‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యపాలన ఉందా?’
లక్కవరపుకోట, ఏప్రిల్ 19: రాష్ట్రప్రభుత్వంలో ప్రజాస్వామ్యపాలన నడుస్తుందా ?లేక రాక్షసపాలన నడుస్తుందా? అర్థంకాని పరిస్థితిలో ఉన్నదని స్థానిక ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 21న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో ప్రజాస్వామ్య పద్దతిలో ధర్నా చేస్తామని అనుమతిని కోరితే జిల్లా యంత్రాంగం అధికార పార్టీకి వంతపాడి అనుమతిని నిరాకరించడంపై ఆమె తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. 9 సంవత్సరాలు రాష్టమ్రుఖ్యమంత్రిగా పరిపాలించి, ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబునాయుడు ధర్నాను జిల్లాకు చెందిన అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం అన్నది వారి రాక్షసపాలనకు పరాకాష్ఠ అని అన్నారు. రాష్ట్ర నాయకున్ని విమర్శించే అర్హత జిల్లా కార్యకర్తలకు లేదన్నారు. ప్రతిపక్షం ధర్నా చేస్తే పాలకపక్షం ఎదురు ధర్నా చేయడం రాష్టచ్రరిత్రలో జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షం ధర్నా చేస్తే పాలకపక్షం అవినీతి ఎక్కడ బయట పడుతుందోననే భయంతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని విమర్శించారు.
‘వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి’
విజయనగరం (తోటపాలెం), ఏప్రిల్ 19: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రల పరిధిలో ఉన్న గ్రామాలలోని పరిస్థితిని బట్టి అక్కడి గుర్తించి వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యు.స్వరాజ్యలక్ష్మి అన్నారు. ఇక్కడ వైద్యాధికారులు, ఎస్‌పిహెచ్‌ఒలుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెలైన్సు ప్రాజెక్టు ద్వారా వ్యాధులు నిర్మూలనకు సహకరించాలన్నారు. గ్రామస్థాయిలో ఉన్న పరిస్థితులను గుర్తించి ఎప్పటికప్పడు రికార్డులో నమోదు చేయాలన్నారు. నమోదు చేసిన వివరాలను కార్యాలయానికి అందజేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన వాటిని పరిశీలన నిమిత్తం హైదరాబాద్‌కు పంపిస్తామన్నారు. మిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉజ్వల, డిఎస్‌ఒ డాక్టర్ రాఘవరావు, రిసోర్సుపర్శన్ డాక్టర్ కామేశ్వరావు, డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎన్‌సిపి మెడికల్ అధికారి డాక్టర్ ఎస్ ప్రసాద్‌రావు, ఐడిఎస్‌పి శ్రీను, పైడి వెంకటరమణ, రాజు, జయప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.

‘మద్యం వ్యాపారుల వివరాలు సోనియాకు పంపండి’
విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 19: జిల్లాలో మద్యం బినామీ వ్యాపారులతో సంబంధం ఉన్న కాంగ్రెస్‌నాయకుల జాబితాను కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీకి పంపాలని తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు. ఈ మేరకు పార్టీ అధికారి ప్రతినిధి కనకల మురళీమోహన్ ద్వారా గురువారం మధ్యాహ్నం జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రరావుకి ఒక లేఖను పంపారు. గురువారం ఇక్కడ అశోక్ బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం వ్యాపారంతో తెలుగుదేశం నేతలకు సంబంధం ఉందని ప్రకటించడం హాస్యాస్పందంగా ఉన్నారు. ఈనెల 21న జరుగనున్న ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యుడు పి.అశోక్‌గజపతిరాజు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షరాలు శోభా హైమావతి, డాక్టర్ కె.ఎ.నాయుడు, పాల్గొన్నారు.

‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది మీరే’
విజయనగరం (కలెక్టరేట్), ఏప్రిల్ 19: కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిసుందనడం సరికాదని నిజానికి తెలుగుదేశమే ప్రజాస్వామ్య విలువలను పాతర వేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. చంద్రబాబునాయుడు తలపెట్టిన ధర్నాకు వ్యతిరకేంగా కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్న ధర్నాను తప్పుపడుతూ ఆ పార్టీ నాయకులపై తెలుగుదేశం గురువారం యుపిఎ చైర్మన్ సోనియాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కోలగట్ల గురువారం మధ్యాహ్నం విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ వ్యక్తిగత కక్షతో బొత్స సత్యనారాయణపై అసత్య ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంతో టిడిపికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ ధర్నా జరగదన్న ప్రచారాన్ని పార్టీ కార్యకర్తలు నమ్మవద్దన్నారు. ఆ పార్టీ నాయకులు యడ్ల ఆదిరాజు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ముగిసిన శరీర దారుఢ్య పరీక్షలు
విజయనగరం (కంటోనె్మంట్), ఏప్రిల్ 19: జిల్లాలో ఖాళీగా ఉన్న మహిళా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు నిర్వహించిన శరీర దారుఢ్య పరీక్షలు గురువారంతో ముగిశాయి. జిల్లా ఎస్పీ కార్తికేయ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఎంపికల్లో మొత్తం 660 మంది అభ్యర్థులు రాత పరీక్షకు ఎంపికయ్యారు. రెండో రోజు గురువారం నిర్వహించిన ఎంపికల్లో 453 మంది అభ్యర్ధులు హాజరు కాగా వీరిలో 255 మంది అభ్యర్ధులు తదుపరి నిర్వహించే రాత పరీక్షకు ఎంపికయ్యారు. అర్హత సాధించిన వారికి 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ఫుట్ త్రో వంటి శరీర దారుఢ్య పరీక్షలను నిర్వహించారు. వీటిలో అర్హత సాధించిన వారికి తదుపరి నిర్వహించే రాత పరీక్షకు అవసరమైన హాల్ టికెట్లను జారీచేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్ధులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. తాగేందుకు మంచి నీటి సదుపాయం కల్పించడంతోపాటు ప్రాథమిక చికిత్సకోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈ ఎంపికల్లో బొబ్బిలి డిఎస్పీ శ్రీదేవీరావు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు ఎస్వీ అప్పారావు, పి.నాగేశ్వరరావు, పలువురు సిఐలు, ఎస్‌ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మంచినీటి సౌకర్యానికి నిధులు మంజూరు
భోగాపురం, ఏప్రిల్ 19: తీరప్రాంత గ్రామాల్లో మంచినీటి సౌకర్యాల కల్పనకు రెండుకోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే అప్పలనాయుడు తెలిపారు. గురువారం మండలంలోని నందిగాం, రామచంద్రపేట, కొండ్రాజుపేట, ముక్కాం, ముంజేరు గ్రామాల్లో ప్రజాపథం గ్రామసభలు నిర్వహించారు. ఎంపిడిఒ కె.రామచంద్రరావు, గ్రామసభలు ప్రారంభించారని ఎమ్మెల్యే అప్పలనాయుడు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నందిగాం, ముంజేరు, కొండ్రాజుపాలెం తదితర గ్రామాల్లో నీటి సమస్య తీర్చడానికి త్వరలో పథకం ఏర్పాటుకు సన్నాహాలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే వేసవికి ఈ గ్రామాల్లో మంచినీటి సమస్య పూర్తిస్థాయిలో తీరనున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వడ్డీలేని రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. ప్రజాపథంలో ప్రజలనుంచి వచ్చిన సమస్యలు అధికారులు పరిష్కరించడంతలవో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మత్స్యశాఖ ఎడి ఫణికుమార్ మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో వివిధ సంక్షేమపథకాల అభివృద్ధికి రెండుకోట్ల రూపాయలు అవసరంగా గుర్తించి నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపామన్నారు.లీన్‌సీజన్ పథకం ద్వారా మత్స్యకారులు లబ్దిపొందేవిధంగా ఆరువందల రూపాయలు ప్రతి మత్స్యకారునికి చెల్లిస్తే 1200 రూపాయలుస సహాయంలా వస్తుందన్నారు. దీనిని మత్స్యకారులందరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ముక్కాం గ్రామంలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సాక్షిగా వాగ్వివాదానికి దిగారు. ఆగ్రామ మాజీ సర్పంచు మైలపల్ల అప్పలకొండ, మాజీ ఉపసర్పంచు బడే నాయుడుల మధ్య వాగ్వివాదానికి దారితీసింది.
ప్రత్యేకాధికారి రాబర్ట్, మండల కాంగ్రెస్ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణ చొరవతో వాగ్వివాదం సద్దుమణిగింది.

‘క్షయ వ్యాధి కేసులు నమోదు చేయాలి’
విజయనగరం , ఏప్రిల్ 19: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు వచ్చిన క్షయవ్యాధి కేసుల వివరాలను నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య1శాఖాధికారి యు.స్వరాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక జిల్లావైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో లైబ్ అప్ రేటర్లు, సిబ్బందితో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయ రోగులతో మందులను వాడి పూర్తి స్థాయిలో నయమయ్యేలా చూడాలన్నారు. వారికి వైద్య సేవలు అందించడంలో జిల్లా ముందంజలో ఉందన్నారు. టిబి వ్యాధి పరీక్షలకు వచ్చిన వారికి కఫం పరీక్ష నిర్వహించాలన్నారు. వ్యాధిగ్రస్తులుగా నిర్ధరణ అయితే వారికి ఆరు నెలల నుండి పనె్నండు నెలల వరకూ మందులను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరిధిలో ఉన్న వైద్య సిబ్బందితో వాడించాలన్నారు. కొంత కాలం మందులు వాడి ఆపేసిన వారిని గుర్తించి వారికి నయమయేంత వరకూ వాడేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణాధికారి టి.రామారావు, డాక్టర్ శాంత, డాక్టర్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.

మద్య నిషేధాన్ని కోరుతూ 21న ప్రజాధర్నా
బొండపల్లి, ఏప్రిల్ 19: ప్రజల ప్రాణాలు హరిస్తున్న మద్యాన్ని నిషేధించాలని కోరుతూ ఈనెల 21న కలెక్టరేట్ వద్ద దళితసంఘాలు, ప్రజాసంఘాలు, విద్యావంతులు, లోక్‌సత్తాపార్టీ సంయుక్తంగా ప్రజాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దళిత ఐక్యవేదిక జిల్లాఅధ్యక్షుడు డోల రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం ఇక్కడ మండల భవన సముదాయం వద్ద ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 21న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్యం, అవినీతిపై ధర్నాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్యం, అవినీతిని దేశం పార్టీ ప్రారంభించగా కాంగ్రెస్ వాటిని పెంచి పోషించిందని ఆరోపించారు. మద్యం వల్ల పేదలు, దళితకుటుంబాలు ఛిన్నాభిన్నం అవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న వీటిని తరిమికొట్టడానికి విద్యావంతులు దళితులు కదలిరావాలన్నారు. జిల్లాలో మద్యం షాపులను బినామీలతో నడుపుతున్న సూత్రధారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు.

మద్యంపై ఉద్యమాల వేడి తాత్కాలికంగా చల్లబడింది
english title: 
postponed

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>