శ్రీకాకుళం, ఏప్రిల్ 19: జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. నిన్నటి వరకు ఎన్నికలంటేనే భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు జూన్ చివరి లోగా సహకార ఎన్నికలు నిర్వహిస్తామంటూ మంత్రులు ప్రకటిస్తున్నా.. ఎన్నికల నిర్వహణపై జిల్లా సహకార యంత్రాంగానికి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఎన్నికలు జరుగుతాయా.. లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 2005 అక్టోబర్‌లో రెండు విడతలుగా సహకార ఎన్నికలు జరిగాయి. నాబార్డు మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్లకు ఒకసారి అంటే 2010లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది, కానీ ప్రభుత్వం పాలక మండళ్ల కాలపరిమితి పొడిగిస్తూ వస్తోంది.
ఈ ఏడాది అక్టోబర్ వరకు డిసిసిబీ, సొసైటీల కాలపరిమితిని పొడిగిస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ కూడా ఉంది. ఇటీవల సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం జూన్‌లో ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయించినా అంత వరకు జిల్లా అధికారులకు మాత్రం ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఎన్నికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 49 సంఘాల్లో 1,01,623 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 82171, మహిళలు 19452 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో ఎస్.సి. 3860, ఎస్.టి.1993, బి.సి 87043, ఓసి 6727 మంది ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎక్కువ మంది రైతులను సొసైటీల్లో సభ్యులుగా చేర్పించాలంటూ విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రస్తుతం సభ్యుల సంఖ్య లక్ష దాటింది. దశాబ్దం క్రితం కేవలం పది రూపాయలు మాత్రమే ఉన్న సభ్యత్వ రుసుము ప్రస్తుతం రూ.330లు చేసారు. కనీస వ్యవసాయ భూమి అయినా ఉన్న రైతులను మాత్రమే సభ్యులుగా చేర్చుకుంటారు. సభ్యత్వం తీసుకున్న ఏడాది తరువాత ఓటరుగా పరిగణలోనికి తీసుకుంటారు. సహకార సంఘాల పదవీకాలం ఈనెల 22వ తేదీతో ముగుస్తుంది, సహకార బ్యాంకు డైరెక్టర్ల పదవీకాలం మే 22వ తేదీతో ముగియనుంది. దీంతో ఎన్నికలకు ప్రభుత్వం ఎప్పుడు పచ్చజెండా ఊపుతుందో తెలియాల్సి ఉంది.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు
సహకార ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు ఇప్పటి వరకు అందలేదని జిల్లా సహకార శాఖ అధికారి బి.శ్రీహరిరావు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ అధికారులను నియమిస్తామని స్పష్టం చేసారు.
అన్-హెల్తీ అసిస్టెంట్లు!
శ్రీకాకుళం, ఏప్రిల్ 19: గ్రామాల్లో పేదోళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన మేల్ హెల్త్ అసిస్టెంట్‌లే అనారోగ్యం పాలైతే...పల్లెలు మంచంపై పడుకోకుండా ఏమవుతాయి. అసలే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే మండు వేసవి. ఆపై అంతంతమాత్రంగా మందులు సప్లై, వాటిని సరైన సమయంలో సూచనలు చేస్తూ ఇచ్చే ఎం.పి.హెచ్.ఎ(ఎం) విధులకు విడవని న్యాయపరమైన సంకేళ్లు. దీంతో ప్రతీ పల్లె జ్వరంతో పీడిస్తుంది. అక్కడ పేదోళ్లకు వైద్యసేవలు అందించే మేల్‌హెల్త్ వర్కర్లు అంతా విధులకు దూరంగా ఉన్నారు. ఇందుకు అధికారుల ప్రణాళికలోపం...ప్రభుత్వ పెద్దల హడావిడి చర్యలు వెరసి 199 మంది ఉద్యోగుల భవితవ్యం అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. ఇందులో 89 మంది మేల్ హెల్త్ అసిస్టెంట్లు మెరిట్ లిస్టులో ఉండగా, మిగిలిన 110 మంది గాలిలో ఊగిసిలాడుతున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఏర్పడిన అగాధమే అధికారులను అడుగులు ముందుకు వేయకుండా చేస్తుంది. రాష్ట్రంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని, ప్రజలకు అవగాహన కల్పించి సీజనల్ వ్యాధుల నుండి రక్షించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం హెల్త్ అసిస్టెంట్ (మేల్) లను నియమించాలని తలపెట్టింది. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు, సీజనల్ వ్యాధులబారిన పడిన వారిని గుర్తించి వారికి తగు వైద్య సహాయం అందించాలని వీరికి విధులు కేటాయించింది. ప్రభుత్వం 2001లో జి.వో నెం.217 ద్వారా మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంటు (మేల్) రిక్రూట్‌మెంట్‌ను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టింది. జిల్లాలో 56 పోస్టులను వివిధ అర్హతల ప్రాతిపదికన అప్పట్లో నియామకం కూడా జరిగింది. కొంతమంది అభ్యర్థ్ధులు తాము అర్హులమని తమను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పి కోర్టును ఆశ్రయించగా మరల జి.వో. నెం.459ను ప్రభుత్వం 25 మే 2002లో విడుదల చేసి రిక్రూట్‌మెంట్ చేపట్టాల్సిందిగా కోరడంతో అధికారులు వారిని బుజ్జగించేందుకు కోర్టుకు వెళ్లిన వారినందరినీ నియామకం చేపట్టారు. దీంతో మొత్తం 199 మంది మగ ఆరోగ్య కార్యకర్తలు జిల్లాలో పనిచేస్తున్నారు. వీరికి ప్రతి సంవత్సరం రీ-్ఫస్టింగ్ ఆర్డరు ఇవ్వాల్సి ఉంది. అయితే డైరెక్టర్ హెల్త్ నుండి ఇటీవల వీరి గైడ్‌లైన్లు పంపిస్తూ జీ.వో.నెం.273 విడుదల చేశారు. ఈ ప్రకారం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు 89 మందికే రీ-్ఫస్టింగ్ ఆర్డర్లు ఇస్తామనడంతో జీవోల గందరగోళంలో 110 మంది భవితవ్యం అయోమయంలో పడింది. వారు మొదటి రెస్పాండెంట్‌గా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, రెండో రెస్పాండెంట్‌గా డైరెక్టరు ఆఫ్ హెల్త్, మూడవ రెస్పాండెంట్‌గా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేరుస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో చేసేదేమీలేక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు డైరెక్టరు ఆఫ్ హెల్త్‌కు లేఖ రాస్తూ సరైన గైడ్‌లైన్స్ ఇవ్వాలని, మొదటి రెస్పాండెంట్‌గా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పేరును తొలగించాలని కోరారు. కోర్టుకు హాజరై పేరును వెకేట్ చెయించుకోవలసిందిగా హెల్త్ డైరెక్టరు సూచించడంతో హుటాహటిన వెకేట్ చెయించుకొనేందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హైదరాబాదు బయలు దేరి వెళ్లారు. కాగా మగ ఆరోగ్య కార్యకర్తల భవిత్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లా అధికారులు న్యాయం చేయాలి : సాయిప్రసాద్
మగ ఆరోగ్య కార్యకర్తల విషయంలో జిల్లా కలెక్టరు, వైద్య ఆరోగ్యశాఖా అధికారులు సరైన నిర్ణయం తీసుకొని ఇక్కడి పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి న్యాయం చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి.ప్రసాద్ కోరారు. జీ.వో.నెం.273లో ప్రభుత్వం 2003 సంవత్సరం సెప్టెంబరు 11 నాటికి కౌన్సిలింగ్ ద్వారా ఎంతమంది కార్యకర్తలు నియమింపబడి ఉన్నారో వారందరికీ రీ-్ఫస్టింగ్ ఆర్డరు ఇమ్మని వివరణ స్పష్టంగా ఉందన్నారు. జిల్లాలో మాత్రము 89 మందికే ఆర్డర్లు ఇవ్వడంతో 110 మంది భవితవ్యం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడి నందునే కోర్టును ఆశ్రయించామని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల మేరకే నియమకాలు : డిఎంహెచ్‌ఓ శారద
తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని ఇందులో తమ ప్రమేయమేమీ లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం.శారద తెలిపారు. మగ ఆరోగ్య కార్యకర్తలు అన్యాయం జరిగిందంటూ ట్రిబ్యునల్‌లో తమను మొదటి రెస్పాండెంట్‌గా పేర్కొనడం వలన తాము ఇబ్బందుల పాలవుతామన్నారు. ఈవిషయం డైరెక్టరు హెల్త్‌కు తెలియజేయగా కోర్టుకు హాజరై పేరును వెకేట్ చేయించుకోవలసినదిగా సూచించడంతో తాము వెకేట్ చేయించుకునేందుకు చర్యలు తీసుకున్నామని, త్వరలో ట్రిబ్యునల్‌కు హాజరవుతామన్నారు.
సమస్యలు పట్టవా?
పలాస, ఏప్రిల్ 19: స్థానిక వెంకటేశ్వరకాలనీలో పుట్టడం తాము చేసుకున్న పాపమా.. అంటూ ప్రజాపథంలో అధికారులను ప్రజలు నిలదీసారు. అధికారులకు తమ సమస్యలు పట్టవా అని మండి పడ్డారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 7,8,9,10,11 వార్డుల్లో ప్రజాపథాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభ నిర్వహిస్తుండగా రైతులు, డ్వాక్రా సంఘ మహిళలు రాలేదా అని ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆరా తీసారు. రైతులు రాలేదని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ ప్రజాపథానికి రాకుంటే చెక్కులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా రైతుల అకౌంట్‌ల్లో జమ చేస్తుండడంతో రైతులు ప్రజాపథానికి రావడం లేదని ఆయన మండిపడ్డారు. అటువంటి వారి ఖాతాలను స్తంభింపజేయాలని సూచించారు. ఒరియా పాఠశాలలో జరిగిన ప్రజాపథంలో అధికారుల తీరును నిరసిస్తూ ప్రజలు మండిపడ్డారు. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోతుందని, మంచినీటి సరఫరా అంతంమాత్రంగా ఉందని, అధికారులను నిలదీసారు. పింఛన్లు రావడం లేదంటూ కొంతమంది మహిళలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భర్త మృతి చెంది మూడేళ్లు గడుస్తున్నా పింఛన్లు మంజూరు కావడం లేదని, సమావేశంలో అధికారులు మంజూరు చేసామని చెబుతున్నారని కౌన్సిలర్ చంద్రశేఖర్ త్యాడి, మాజీ కౌన్సిలరు దుర్గాశంకర్‌పండా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈకార్యక్రమంలో ఛైర్‌పర్సన్ కోట్ని లక్ష్మి, కమిషనర్ ఫణిరామ్, టిపి ఎస్ రమణమూర్తి, కౌన్సిలర్లు రేగి గవరయ్య, గోళ్ల చంద్రరావు, గుజ్జు జోగారావు, మల్లా కృష్ణారావు, నంబాళ్ల వెంకటరావు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.
ప్రజాపథంలో ‘మాజీ’ల హవా
పాతశ్రీకాకుళం, ఏప్రిల్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం తమకేడర్‌కు ఊతమిచ్చి స్థానిక ఎన్నికల్లో ఉనికిని చాటుకునేందుకు ప్రజాపథం కార్యక్రమాన్ని రూపొందించందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణ గ్రామాల నుంచి మున్సిపాలిటీ వరకు మాజీలే వేదికలపై కూర్చుని ఇంకా పదవిలో ఉంటున్నట్లు ప్రసంగాలు గుప్పించడం సామాన్యులు సైతం విసుక్కుంటున్నారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పాల్సిన విపక్షాలు ప్రజాపథంవైపు చూడకపోవడం అర్జీలు ఇచ్చేందుకు పౌరులు సాహసించలేని దుస్థితి నెలకొంది. ఎప్పుడూ ప్రజల పక్షానే ఉద్యమిస్తాంటూ నాలుగు గోడల మధ్య గళం విప్పే తెలుగుదేశం, ప్రజాసమస్యలపై పోరాడతాం అంటూ పట్టణంలో పర్యటించే వామపక్షాలు వైఖరిపై ప్రజలు ఆడిపోసుకుంటున్నారు. సిటిజన్ ఫోరం పేరిట నిత్యం మున్సిపాలిటీ సమస్యలపై పోరాటం సాగించిన ఆ ప్రతినిధులు కూడా మొక్కుబడికైనా ప్రజాపథం సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ ఏకరువు పెట్టకపోవడం విడ్డూరంగా ఉంది.
ప్రభుత్వ ధనంతో, ప్రభుత్వాధికారులచే ఏర్పాటు చేస్తున్న ప్రజాపథం కార్యక్రమంలో మాజీలు తమ ఉనికిని చాటుకునేందుకు వేదికలుగా మార్చుకుంటున్నా దీనిని అడ్డుకునే సాహసం ఏ ఒక్కరు చేయకపోవడం విచారకరం. ప్రజాపథం కార్యక్రమంలో ప్రధానంగా తాగునీరు, ఆరోగ్యశ్రీ, 108,104, ఉపాధి హామీ పథకం అంశాలతో చర్చించాల్సి ఉండగా, మున్సిపాలిటీలో కనీసం ఏ ఒక్క అంశంపైనా ఇంత వరకు చర్చించకపోవడం బాధాకరం. మున్సిపాలిటీ ఖర్చుతో షామియానాలు, మైక్‌సెట్లు ఏర్పాటు చేస్తే మాజీలు ఆ వేదికలపై తమ హయాంలో ఎంతో చేసేసామంటూ ప్రచారం చేసుకున్నారు. సాయంత్రం 6గంటల తరువాత ప్రజాపథం కార్యక్రమాన్ని అధికారులు ముగించినా మాజీ ప్రజాప్రతినిధులు మాత్రం మైకులు వదలకుండా ఐదేళ్లు పట్టణంలో ఎంతో చేసేసామంటూ ప్రసంగాలతో హోరెత్తించారు. ప్రజాపథం ప్రారంభమైన తరువాత ఎనిమిది వార్డుల్లో సమావేశాలు పూర్తయినా ఏ ఒక్క సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష నాయకులు గాని, వామపక్షాల నాయకులు గాని, ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులు గాని కనుచూపు మేరలో కనిపించకపోవడం శోచనీయం. ప్రజాపథం ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్నారా? లేక మాజీలు ప్రచార సభలుగా మార్చుకుంటున్నారా అంటూ ప్రజలే ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొంది. గురువారం మున్సిపాలిటీలో 7,8 వార్డుల్లో జరిగిన ప్రజాపథంలో మాజీలు, కాంగ్రెస్ కార్యకర్తలే దర్శనమిచ్చారు. మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు ప్రజలకు ప్రజాపథం కోసం సమాచారం వినిపించి కూర్చున్న వెంటనే మాజీ ప్రజాప్రతినిధులు మైకులు అందుకోవడం కనిపించింది.
జగన్ సంజాయిషీ ఇవ్వాలి
బలగ, ఏప్రిల్ 19: రాష్ట్రంలో వై ఎస్సార్ కష్టార్జితంతో వచ్చిన ప్రభుత్నాన్ని కూలదోయనంటూనే ఉప ఎన్నికలకు దారితీసే విధంగా ప్రవర్తించిన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు రత్నాల నర్శింహమూర్తి, ముస్తాక్ మహమ్మద్‌లు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్ తన బలం నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను పావుగా వాడుకొని కోట్లాదిరూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. నరసన్నపేట నియోజక వర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపుపై జగన్‌కు బెంగ పట్టుకుందని, అనుమానంతోనే ఎన్నికలు ప్రకటన విడుదలవకముందే నియోజకవర్గంలో నాలుగురోజులు ప్రచారం చేసారన్నారు. ప్రచారంలో 120 సంవత్సరాలు చరిత్ర కలిగిన తమ పార్టీని విమర్శించే స్థాయి జగన్‌కు లేదన్నారు. పేద, రైతు, అవినీతి వంటి మాటలు జగన్‌వెంట రావడం దురదృష్టకరమని, అవినీతిలో కూరుకుపోయిన ఆయన పేదవారికి, రైతులకు ఏమిచేయగలరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న జగన్ ముందుగా తన పార్టీ విధివిధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు ధర్మాన రామ్ మనోహరనాయుడు, పాలిశెట్టి మధుబాబు, కోణార్క్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ గౌతు లచ్చన్నకు ఘననివాళి
శ్రీకాకుళం, ఏప్రిల్ 19: జిల్లా గర్వించదగిన స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత సర్దార్ గౌతు లచ్చన్న జిల్లా అభివృద్ధి కోసం అనుక్షణం పరితపించిన నాయకుడని రాష్టర్రోడ్లు భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బలహీనవర్గాల అభివృద్ధి కోసం రాజ్యనిర్వహణలో వారికి దక్కాల్సిన వాటాల కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సర్దార్ గౌతు లచ్చన్న ఆరోవర్థంతి సందర్భంగా మంత్రి ధర్మాన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం జరిగిన ఓ ప్రధాన ఘట్టంలో ముఖ్యభూమికను నిర్వహించిన గౌతులచ్చన్న జిల్లా ప్రజలకు, యువతరానికి, భావితరాలకు ఆదర్శప్రాయుడన్నారు. గౌతులచ్చన్న ఒక ప్రాంతానికే పరిమితమైన నాయకుడు కాదని, అణగారిన వర్గాల కోసం అనుక్షణం పరితపించే సర్దార్ గౌతులచ్చన్న జీవితం బావితరాలకు స్పూర్తినిస్తుందన్నారు. సర్దార్‌గౌతులచ్చన్న దివ్యస్మృతి చిరస్థాయిగా నిలవాలని, ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందన్నారు. గౌతులచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆయన కృషిని జిల్లా ప్రజానీకం మరోసారి గుర్తించుకుని ఆయన ఆశయాలకు పునరంకితం కావాలని ధర్మాన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సర్దార్ సేవలు అజరామరం
కేంద్ర మాజీ మంత్రి కింజరాపు
పాతశ్రీకాకుళం: స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న సేవలు అజరామరమని కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కొనియాడారు. స్థానిక డే అండ్ నైట్ జంక్షన్‌లో గురువారం లచ్చన్న వర్ధంతి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిథి డి.వి.ఎస్.ప్రకాష్ సారధ్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా పోలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రన్నాయుడు, కావలి ప్రతిభాభారతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ఇతర నాయకులు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల నేతగా, గీత కార్మికుల ఆశాజ్యోతిగా లచ్చన్న ఎంతో కృషి చేసారన్నారు. తన జీవితకాలం పేద ప్రజల కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, కోరాడ బాబు, సింతు సుధాకర్ పలువురు తెలుగుదేశం నాయకులు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్లు అంధవరపు వరహానరసింహం, ఎం.వి.పద్మావతితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కూచిపూడి నృత్యంలో విద్యార్థి బాలచందర్ ప్రతిభ
ఎచ్చెర్ల, ఏప్రిల్ 19: ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన కూచిపూడి మహా నృత్యంలో చిలకపాలెం శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి పూజారి బాలచందర్ ఉత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటుచేసుకున్నారు. కూచిపూడి మహానాట్యంలో ఒక్కసారిగా 2,850 మంది నృత్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డు సృష్టించారు. శివానీ కళాప్రాంగణంతోపాటు రాష్ట్ర, జాతీయస్థాయి వేదికలపై సుమారు 450 ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలను అందుకున్నారు. విద్యార్థి బాలచందర్ ప్రతిభ పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మురళీకృష్ణ, హె.వో.డి పి.రమణమూర్తి, యాజమాన్య ప్రతినిధులు పి.డి.పి.రాజు, డి.వెంకటరావు, కె.దుర్గాశ్రీనివాస్, సాయినాధ్‌రెడ్డి, జె.సూర్యచంద్ర, ఎస్.శ్రీనివాసరావు, ఫిజికల్ డైరెక్టర్ టి.బాలాజీ, అధ్యాపక సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు.
ఒడిషా సరిహద్దులో జోరుగా నాటుసారా అమ్మకాలు
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 19: ఆంధ్రా, ఒడిషా సరిహద్దులో నాటుసారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయినా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని సరిహద్దులో ఉన్న గ్రామాల మహిళలు వాపోతున్నారు. ఇచ్ఛాపురం మండలంలో బొడ్డబడ, కొళిగాం, కీర్తిపురం, పాయితారి, జగన్నాధపురం, లొద్దపుట్టి, మశాఖపురం, బిర్లంగి, కేదారిపురం గ్రామాలు ఒడిషా రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నాయి. ఈ గ్రామాలకు చెందిన మందుబాబులు నిత్యం ఒడిషా సరిహద్దు గ్రామాలకు వెళ్లి నాటుసారా సేవించడం పరిపాటిగా మారింది. పగలంతా మహిళలు, వారి కుటుంబీకులు కష్టపడి సంపాదించిన డబ్బులను ఒడిషా సారాకు ఖర్చు పెడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పోలీసు అధికారులు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని, దీని వలన యువకులు కూడా చాలా మంది నాటుసారాకు బానిసలవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాటు సారా అడ్డుకోకపోవడంతో రోజురోజుకు మందుబాబులకు అడ్డు ఆపులేకుండాపోతుందని స్థానికులు తెలియజేస్తున్నారు. గతంలో నాటుసారా తాగి 2007లో రత్తకన్నకు చెందిన 13 మంది మృతి చెందారని మరోసారి అలాంటి సంఘటనలు ఎదురుకాకుండా ఎక్సైజ్ అధికారులు నాటుసారాను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు.
మున్సిపాలిటీకి నేడు జెసి రాక
పాతశ్రీకాకుళం, ఏప్రిల్ 19: సుదీర్ఘ చరిత్ర ఉన్న శ్రీకాకుళం మున్సిపాలిటీకి రెండేళ్ల తరువాత కొత్త స్పెషలాఫీసర్ శుక్రవారం సందర్శించనున్నారు. 2010 సెప్టెంబర్‌తో మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం పూర్తయిన తరువాత అప్పటి జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీ్ధర్‌ను శ్రీకాకుళం మున్సిపల్ ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఒకసారి, ఆ తరువాత మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సందర్భంలో రెండవ పర్యాయం వచ్చారు. అప్పటి నుంచి ఆయన మున్సిపాలిటీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ జెసి క్యాంపు కార్యాలయం నుంచే నిర్వహించేవారు. కౌన్సిల్ పదవీకాలం పూర్తయ్యేందుకు మూడు నెలల ముందు మున్సిపల్ చైర్‌పర్సన్ ఛాంబర్‌ను సుమారు రూ.3లక్షలతో ఆధునీకరించారు. ఆ తరువాత ప్రత్యేకాధికారికి చైర్‌పర్సన్ ఛాంబర్ కేటాయించారు. మున్సిపల్ స్పెషలాఫీసర్‌గా నియమించబడిన జాయింట్ కలెక్టర్ మొదట మూడు నెలలు ఎంతో వేగంగా మున్సిపల్ సమస్యలపై స్పందిస్తూ, పట్టణంలో తెల్లవారుతూనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించేవారు. ఏమయిందో ఏమో అనంతరం ఫైళ్లపై సంతకాలకే పరిమితమయ్యారు. మున్సిపల్ కార్యాలయంలోని స్పెషలాఫీసర్‌కు కేటాయించిన ఛాంబర్ నిరుపయోగంగా మారడంతో ఎయిర్‌కండిషన్ మిషన్‌లో ఉడతలు కాపురం పెట్టి వైర్లు అన్నీ కొరికిపడేసాయి. లక్షలు ఖర్చు చేసిన ఛాంబర్ పెచ్చులూడింది. దీంతో ఆ ఛాంబర్‌ను వినియోగించాలని కమిషనర్ టి.పి.వో.కు ఆదేశించారు. గత రెండు నెలలుగా టి.పి.వో. స్పెషలాఫీసర్ ఛాంబర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జెసిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలా భాస్కర్ మున్సిపల్ ప్రత్యేకాధికారి హోదాలో శుక్రవారం కార్యాలయానికి రానున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్ ఆఘమేఘాలమీద గురువారం ఉదయం తన ఛాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, స్పెషలాఫీసర్ ఛాంబర్‌ను శుభ్రం చేయించడంతో పాటు, మున్సిపాలిటీకి సంబంధించిన రికార్డులు అన్నీ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రధానంగా టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.
టౌన్ ప్లానింగ్ విభాగంలో గుబులు....
మున్సిపల్ ప్రత్యేకాధికారిగా జాయింట్ కలెక్టర్ భాస్కర్ శుక్రవారం రానుండడంతో టి.పి.వో. ఛాంబర్ ఖాళీ చేసి, తన పాత గదికే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతే కాకుండా మున్సిపాలిటీలోని ఇతర విభాగాలన్నింటి కంటే టౌన్ ప్లానింగ్ విభాగంలోనే షటిల్ సర్వీసు సిబ్బంది అధికంగా ఉన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు నిత్యం విశాఖ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఏ అధికారి పిలిచినా, ఏ సమాచారం కావాల్సి ఉన్నా వెంటనే హాజరయ్యేది స్థానికంగా ఉండే టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ మాత్రమే. మున్సిపాలిటీకి అత్యంత కీలకమైన టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది స్థానికంగా ఉంటూ, అందుబాటులో ఉండకుండా విశాఖ నుంచి రాకపోకలు సాగించడం వలన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ దీనిపై ఇంత వరకు ఎవరూ దృష్టి సారించకపోవడంతో ఇప్పటి వరకు సజావుగా సాగినా, ఇక ముందు షటిల్ సర్వీసులు కష్టసాధ్యమే అని చెప్పకతప్పదు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఇంజనీర్ వేణుగోపాల్ కూడా విశాఖపట్నం నుంచి వస్తుండడంతో ఆ శాఖకు సంబంధించి అనేక పథకాలకు సంబంధించి ఎంబుక్‌లో సంతకాలు, పలు పనులకు అంచనాల పరిశీలించి ఆన్‌లైన్‌లో పెట్టడం ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేకాధికారిగా జాయింట్ కలెక్టర్ మున్సిపాలిటీలో తన పంథాలో చర్యలు చేపడతారో, లేక గత జాయింట్ కలెక్టర్ మాదిరిగా చూసీ చూడనట్లుగా వదిలేస్తారో వేచి చూడాల్సిందే.
పోటాపోటీగా ప్రచారం
జలుమూరు, ఏప్రిల్ 19: అధికారికంగా ఉపఎన్నిక తేదీ ఖరారు కాకపోయినా రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో గ్రామాలలో ఎన్నికల సందడి ఆరంభమైంది. వివిధ రాజకీయ పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారానికి పచ్చజెండా ఊపడంతో అభ్యర్థులు కూడా అదేపనిగా ప్రచారం పోటాపోటీగా నిర్వహించడం కనిపిస్తోంది. అన్ని గ్రామాలలో మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాసు, ఆయన సతీమణి ప్రచారం ముమ్మరం చేసి ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు.కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన రాందాసు కూడా రాజకీయాల్లో కొత్త అయినా విజయంకోసం సహకరించాలని పోటాపోటీగా ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ఈ రెండు పార్టీలకు ధీటుగా తెలుగుదేశంపార్టీ ఇప్పటికే చాలా గ్రామాలలో పర్యటించి ప్రచారం సాగిస్తూ బంధువులను, స్నేహితులను కలుసుకుంటూ విజయానికి బాసటగా నిలవాలని అభ్యర్థి శిమ్మస్వామిబాబు కోరుతున్నారు. ఈయనకు అండగా మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, మాజీఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణరావు, కింజరాపు అచ్చెన్నాయుడు గ్రామాలను చుట్టుముడుతూ తెలుగుతమ్ముళ్లులో ఉత్సాహం నిలుపుతున్నారు.
నేడు మంత్రి మాణిక్య వరప్రసాద్ రాక
శ్రీకాకుళం, ఏప్రిల్ 19: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాదరావు శుక్రవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఉదయం 9.30గంటలకు ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకుని అధికార, అనధికారులను కలుసుకుంటారు. పదిగంటల నుంచి నరసన్నపేట మండలం విఎన్‌పురం, ఉర్లాం గ్రామాలలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేస్తారు. నరసన్నపేట మండలం లుకలాం, సత్యవరం గ్రామాలలో నిర్వహించే ప్రజాపథంకార్యక్రమాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్లతో కలిసి పాల్గొంటారు. మధ్యాహ్నం మూడుగంటలకు జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ఉపాధి హామీ పథకం, జలప్రభ ఇతర ప్రాజెక్టులపై సంబంధిత శాఖలతో సమీక్షిస్తారు.