మహానంది, ఏప్రిల్ 20: మహానంది మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు, భారీ వర్షానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా రైతులకు పంటలు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతుంటే శుక్రవారం వీచిన ఈదురు గాలులకు అరటి తోటలు భారీగా నేలవాలి లక్షలాది రూపాయల పంట నష్టం తెచ్చిపెట్టాయి. మండలంలో దాదాపు 50 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి ఉంటుందని రైతులు తెలిపారు. అలాగే భారీగా చెట్లు నేల వాలాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మండలంలో అతలాకుతలం చేసింది. అరటి తోటలతోపాటు మామిడి, మునగ పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఒకే నెలలో రెండుసార్లు ఈదురు గాలులు వీచి పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలా రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కొలిమిగుండ్లలో...
కొలిమిగుండ: కొలిమిగుండ్లలో శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. కొలిమిగుండ్ల, బెలుం, బెలుం శింగవరం, పెట్నికోట, కల్వటాల తదితర గ్రామాల్లో పెను గాలులతో కూడిన చిరుజల్లులు, ఒక మోస్తరు వర్షం కురియడంతోపాటు వడగండ్ల వాన కురిసింది. పెను గాలులతో కూడిన వర్షం రావడంతో కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో చెట్లు విరిగి పోయాయి.
పాములపాడులో...
పాములపాడు: మండు వేసవిలో అకాల వర్షాలతోపాటు భారీ ఈదురు గాలులు వీచడంతో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరగడంతో గంటల సేపు వాహనాలు రోడ్డు మీదే నిలిచిపోయిన సంఘటన మండలంలో నెలకొంది. శుక్రవారం మండలంలోని భానుముక్కుల, యర్రగూడూరు మధ్య గల రోడ్డుపై ఈదురు గాలులకు నేలకొరిగిన వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో దాదాపు గంటన్నరసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి జెసిపిల ద్వారా వృక్షాలను తొలగించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం తొలగిపోయింది.