వెలుగోడు, ఏప్రిల్ 20: రైతులు వాడే ప్రతి బస్తా ఎరువుపై ప్రభుత్వం రూ.400 నుండి రూ.500 వరకు సబ్సిడీ భరిస్తోందని న్యాయశాఖామాత్యులు ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. శుక్రవారం వెలుగోడు మండలంలోని రేగడగూడూరు, అబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన ప్రజాపథం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వీలైనంత తక్కువగా రసాయన ఎరువులను వాడాలని, సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు గతంలో పశువులను పెంచి వాటిపై ఆధారపడేవారని వాటినుండి వచ్చే వ్యర్థాలను ఎరువులుగా వాడడం వల్ల ఎంతో ఖర్చును ఆదా చేసేవారన్నారు. నేడు పశువులను వ్యవసాయంలో వాడడం తగ్గించారన్నారు. అందుకే పాడి పశువులను ఎక్కువగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో రేగడగూడూరుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు గ్రామంలో 1,279 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. రేగడగూడూరు నుండి వాడాల వరకు, రేగడగూడూరు నుండి పెంచికలపల్లె వరకురోడ్ల నిర్మాణం చేయాలని ప్రజలు కోరగా రేగడగూడూరు వాడాల రోడ్డు కు రూ.65లక్షలు, రేగడగూడూరు పెంచికలపల్లె రోడ్డుకు రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కలెక్టర్ రాంశంకర్ నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారించడం కొరకు నిధులను పుష్కలంగా వున్నాయని నీటి సమస్య వున్నవారు ఎంపీడీఓను కలసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కింది స్థాయి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి రూ.1.75లక్షలు, పైస్థాయి ఆరోగ్యకేంద్రానికి రూ.2.25లక్షలు ప్రతి ఏటా అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఈ నిధులను మురగబెడుతున్నారని వాటిని సక్రమంగా ప్రజల కొరకు వినియోగించాలని ఆయన కోరారు. రూ.142 కోట్ల కరవు నిధులను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేసిందన్నారు. ఈ నిధులు నేరుగా రైతుల అకౌంట్లకే జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమణ, ద్వామా పిడి గోవిందప్ప, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నరసింహులు, జిల్లాపరిషత్ సిఇఓ సూర్యప్రకాష్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
రైతులు వాడే ప్రతి బస్తా ఎరువుపై ప్రభుత్వం రూ.400 నుండి రూ.500 వరకు సబ్సిడీ భరిస్తోందని
english title:
subsidy
Date:
Saturday, April 21, 2012