ఆదోని, ఏప్రిల్ 20: ఇసుక రవాణాను నమ్ముకొని గత ఎన్నో ఏళ్లుగా జీవనం చేస్తున్నామని, అలాంటిది హఠాత్తుగా ట్రాక్టర్లను సీజ్ చేసి రవాణాను అడ్డుకోవడం తగదంటూ ఇసుక ట్రాక్టర్ల యజమానులు, కూలీలు పెద్దఎత్తున శుక్రవారం పట్టణంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా ట్రాక్టర్లతో వచ్చి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు బాలరాజు, సుబ్బు, రమేష్, లతీఫ్, నూర్‌బాయి, ఉసేన్‌పీరాలు మాట్లాడుతూ ఇసుక రవాణా చేస్తూ, సుమారు 3 వేల మంది దాకా జీవనం చేస్తున్నామని పేర్కొన్నారు. తాము వంకల నుంచి, వాగు నుండి గాని ఇసుకను తరలించడం లేదని, పొలాల యజమానులకు డబ్బులు చెల్లించి ఇసుకను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేస్తున్నారని ఇప్పటికే మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారని, కనీసం వాటిని వదలడం లేదన్నారు. జరిమాన కడుతామన్నా వదలడం లేదని వాపోయారు. తమకు ఇదొక్కటే జీవనాధారమని, దీనిని కూడా లేకుండా చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని, అందువలన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహశీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రజినీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు నల్లన్న, తదితరులు పాల్గొన్నారు.
ఇసుక రవాణాను నమ్ముకొని గత ఎన్నో ఏళ్లుగా జీవనం చేస్తున్నామని, అలాంటిది హఠాత్తుగా
english title:
sand transport
Date:
Saturday, April 21, 2012