నరసన్నపేట, ఏప్రిల్ 20: రోడ్లు అవసరమా...పింఛన్లు కావాలా..ఇందిరమ్మ ఇళ్లు కావాలా...రేషన్‌కార్డు లేదా..గ్యాస్ కనెక్షన్ అవసరమా..అయితే దరఖాస్తు చేసుకోండి...వెంటనే మంజూరు చేస్తానంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు. శుక్రవారం మండలంలోని లుకలాం పంచాయతీలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేయగా సభకు మంత్రి ధర్మాన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి అవిరామంగా కృషిచేస్తోందన్నారు. పేద ప్రజల కష్టాలను చూసి వాటి నుంచి గట్టెక్కించేందుకు ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేస్తోందని, ఇది ఒక చట్టంగా రూపొందించామన్నారు. నిరుపేద పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేయడమే కాకుండా ఉపాధి హామీ పథకం క్రింద ఆయా కుటుంబాలకు ప్రతీ రోజు వేతనం వచ్చేటట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ఆరోగ్యానికి భరోసా ఇచ్చామని, గర్భిణీలను 108 వాహనంలో ఆసుపత్రులకు ప్రసవానికి తీసుకువచ్చి తిరిగి ఇంటివద్దకు చేరుస్తున్నామని, అంతేకాకుండా వేయి రూపాయల పారితోషికం కూడా అందిస్తున్నామని వివరించారు. ప్రతీ పేదవాడి ఇంటికి 125 రూపాయలకే రాజీవ్ గృహవిద్యుత్‌కరణ పథకాన్ని అమలుచేసామని తెలిపారు. ఉపాధి పథకంపై ఆయన సమీక్ష జరుపుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ బతికే నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ఒక వరమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని నిలుపుదల చేయాలా, లేక కొనసాగించాలా అని సభలో ఉపాధి కూలీలను అడుగగా అన్నం పెడుతున్న ఈ పథకాన్ని నిలుపుదల చేయొద్దంటూ మహిళలు కోరారు. కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ పథకానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమవుతున్నారని, అన్నం పెట్టిన చేతికే కన్నం పెట్టడానికి చూస్తున్నారని వారి మాటలను ఎవరు నమ్మొద్దని పేర్కొన్నారు. మంత్రి మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి గ్రామీణశాఖ తరపున ఇప్పటికే మూడుకోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామన్నారు. లుకలాం నుంచి కామేశ్వరిపేటకు రహదారి మరమ్మతులు చేపట్టాలంటూ స్థానికులు మంత్రిని కోరగా వెంటనే ఆయన మంజూరు చేశారు. ఎంపి కిల్లి కృపారాణి మాట్లాడుతూ అభివృద్ధి చేయగలిగేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. అనంతరం స్వయంసహాయక సంఘాలకు పావలావడ్డీ రుణాలను చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, కమిషనర్ జయలక్ష్మీ, సిఇఓ సుధాకర్, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, డుమా పి.డి కల్యాణ చక్రవర్తి, మండల ప్రత్యేకాధికారి రంగయ్య, తహశీల్దార్ రవి, ఎంపిడిఓ జి.రవికుమార్, స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
రోడ్లు అవసరమా...పింఛన్లు కావాలా..ఇందిరమ్మ ఇళ్లు కావాలా...రేషన్‌కార్డు లేదా..గ్యాస్
english title:
govt schemes
Date:
Saturday, April 21, 2012