శ్రీకాకుళం, ఏప్రిల్ 20: రాజకీయాలకతీతంగా విధులు నిర్వహించి ఉపాధి హామీ పథకం ఉద్దేశాన్ని మెరుగుపరచాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశమందిరంలో శుక్రవారం సాయంత్రం ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ పేదలకు పనికల్పించి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపేలా ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈపథకం ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఉపాధి పథకం ద్వారా సుమారు 30వేల మంది ఉద్యోగులు, కోటి మందికిపైగా వ్యవసాయ కూలీలు ఉపాధి పొందుతున్నారన్నారు. ఇటువంటి మంచి పథకాన్ని ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదని, ఈ పథకంలో చైతన్యవంతంగా, నిజాయితీగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పేర్కొన్నారు. అందరి కూలీలకు పనికల్పించిన నాడే ఈ పథకానికి సార్ధకత ఏర్పడుతుందన్నారు. సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించడానికి తామున్నామని ఆయన భరోసా ఇస్తూ పేదవారి గూర్చి ఆలోచించాలని, పనులు వేగవంతం చేయాలన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో ఐదుసంవత్సరాల నుంచి ఈ పథకం అమలుపరుస్తున్నామన్నారు. కొన్ని గ్రామాలలో ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవేమనని, సూక్ష్మాన్ని గ్రహించి ప్రభుత్వానికి కొంతమంది సిబ్బంది వ్యతిరేకంగా పనిచేయడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ పథకంలో జోక్యం చేసుకోవద్దని చెప్పామని, గతంలో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రతీ కార్యకర్త పథకాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అర్హులకు అన్యాయం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సుందరాపురం, తామారపల్లి, మగతాపురం, కెళ్లవలస, మదనాపురం, శ్రీముఖలింగం, కొమనాపల్లి, తలతరియా ఫీల్డు అసిస్టెంట్లను హెచ్చరించారు. ఎటువంటి ఫిర్యాదు లేకుండా పనిచేయాలని, రాజకీయాలకతీతంగా కూలీలకు పనికల్పించాలని ఈ పర్యాయం ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ తరువాత ఏ క్షణమైనా ఉపఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని క్షేత్రస్థాయి సిబ్బంది పనులు నిలిచిపోకుండా అవసరమైన పరిపాలనాపరమైన ఆమోదాలు ముందుగానే పొందాలని సూచించారు. సమావేశంలో ముందుగా సలహాలు, సూచనలు అందించాలని మంత్రి ధర్మాన కోరగా ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ మాట్లాడుతూ రహదారి నిర్మాణంలో అవసరమైన మట్టిని బయట నుంచి తీసుకువచ్చేందుకు అనుమతి కావాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా పారిశుద్ద్య సమస్య తాండవిస్తోందని, ఉపాధి హామీ నిధులు పారిశుద్ద్యానికి వెచ్చించాలని కోరారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో చేస్తున్న పనిని సోషల్ ఆడిట్ పేరుతో 18నుంచి 20సంవత్సరాల మధ్య యువకులు పర్యవేక్షణ నిర్వహిస్తుండడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పదవీవిరమణ చేసిన అధికారులతో పర్యవేక్షణ చేపడితే బాగుంటుందని సూచించారు. ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా ఎంపిక కాబడిన ఎపిడిలు సంబంధిత గ్రూపు-1 అధికారులైన ఎంపిడిఓలపై అజమాయిషీ చలాయిస్తున్నారని పరిశీలించాలని కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సోషల్ ఆడిట్ అనేది పార్లమెంట్ చట్టం నుంచి వచ్చింది కావున వారు పనిపై రిపోర్టు మాత్రమే చేయనున్నారని, దీనిపై విచారించి గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారి చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. అనంతరం క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, కమిషనర్ జయలలిత, డిఆర్‌డిఏ పి.డి పి.రజనీకాంతరావు, డుమా పి.డి ఎ.కల్యాణచక్రవర్తి, ఎంపిడిఓలు, ఎపిఒలు, ఫీల్డు అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా విధులు నిర్వహించి ఉపాధి హామీ పథకం ఉద్దేశాన్ని
english title:
be apolitical
Date:
Saturday, April 21, 2012