శ్రీకాకుళం , ఏప్రిల్ 20: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలికలు మరోసారి సత్తా చాటారు. శుక్రవారం ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల చేసినప్పటికీ ఇంటర్‌నెట్ కనెక్టు కాకపోవడంతో విద్యార్థులు ఫలితాల కోసం వేచి ఉండాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు 50శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 49శాతం సాధించగా ఈ ఏడాది ఒక శాతం పురోగతి సాధించగలిగారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 23,393మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 11,662మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి ఉత్తీర్ణతాశాతం ఒకేవిధంగా ఉంది. బాలురు 12,325మంది పరీక్షకు హాజరు కాగా 5779మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బాలికలు 11,068మంది పరీక్షకు హాజరు కాగా 5833మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో బాలికలే పైచేయిగా నిలిచారు.
ఎంపిసిలో టాపర్స్ వీరే!
జిల్లా స్థాయిలో బస్వా సంతోష్ 470మార్కులకు గాను 464 మార్కులు సాధించాడు. సరితాదేవి కిరణ్మయి 463మార్కులు, ముల్లపూడి వరలక్ష్మీ రాజేంద్ర 462, మాడుగుల చైతన్య 462, గన్నవరపు కృష్ణతేజ, పొట్నూరు సాయిసుధ, అంపోలు భవానీ, అరవల పవన్‌సాయి, కొంచాడ సుధీర్, వానపల్లి కుమార్, వూన్న దీప్తిలు 461 మార్కులు సొంతం చేసుకున్నారు. అనంతపల్లి సాయివినీత్, మార్పు శ్రీవిద్య, వాండ్రంగి శ్రావ్య, గార వౌనిక, మనీసాలు 460మార్కులు సాధించారు.
బై.పి.సిలో..
బై.పి.సి విభాగంలో 440మార్కులకు గాను సువ్వారి ప్రతిమ 432 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించగా, వేమూరు మృదుల 430, నల్లాన బిందుమాధవి 429, నిహారిక డైసీమోషల్ 428మార్కులు, రాయిల రూప్‌కుమార్ 420మార్కులు సాధించారు. సాధించారు. ఇదిలా ఉండగా ఆర్ట్స్ విభాగంలో 500మార్కులకు గాను 444 మార్కులు బి.కృష్ణ సాధించాడు.
సప్లిమెంటరీ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు
ఇంటర్మీడియట్‌లో పరీక్ష తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష కోసం మే 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌ఐఓ ఎన్.వి.తిరుమలాచార్యులు తెలిపారు. ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. అలాగే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రీవ్యాల్యూషన్ కోసం మే 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నిరుపేదల్లో వెలుగులు నింపేందుకే ‘ఉపాధి’
నరసన్నపేట, ఏప్రిల్ 20: దేశంలోని ప్రతి నిరుపేద కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపేందుకే కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం మండలలోని విఎన్‌పురం, ఉర్లాం పంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి పనులను మంత్రి ధర్మాన తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా నేరుగా ఆయా ఉపాధి కూలీలను పథకం పనితీరు గూర్చి అడిగి తెలుసుకున్నారు. రోజుకూలీ 137 రూపాయలు వరకు రావాల్సి ఉండగా 30నుంచి 90రూపాయల వరకే వస్తున్నాయని కూలీలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఉపాధి అధికారులు కనీస వేతనం వచ్చే విధంగా కొలతలతో కూడిన పనులను అప్పగిస్తారని, వాటిని ఒకరోజులో పూర్తిచేయగలిగితే తప్పనిసరిగా కనీసవేతనం లభిస్తుందన్నారు. రోజుకు కనీసం ఐదు నుంచి ఆరుగంటల వరకు పనిచేసినట్లయితే 120నుంచి 137రూపాయల వరకు వేతనం అందుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతీ ఏడాది లక్షకోట్ల రూపాయలను వెచ్చిస్తే, అందులో రాష్ట్రంలో ఎనిమిదివేల కోట్ల రూపాయల మేర విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక పనిగా కాకుండా చట్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని, దీనిని హక్కుగా నిరుపేదలు వినియోగించుకోవాలని సూచించారు. జాబ్‌కార్డులు కావాలని కోరగా రెండురోజుల్లో జారీచేయాలంటూ అధికారులను ఆదేశించారు. గ్రామానికి రహదారి, ఇతర పనులు అవసరమని, మాలపల్లిచెరువుకు మెట్లు నిర్మించాలని ప్రజలు కోరారు. దీనిపై స్పందించిన ఎంపి కృపారాణి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విఎన్‌పురం పంచాయితీలో జరుగుతున్న చెరువుపనుల్లో భాగంగా ఉపాధి కూలీలతో ఆయన మమేకమయ్యారు. ఉర్లాం పంచాయతీలో ఉపాధి కూలీలు సకాలంలో వేతనాలు అందడం లేదని, నేటికి మూడువారాలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆయన స్పందిస్తూ దీనిపై గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యంను ప్రశ్నించగా సాంకేతిక లోపాలు కొంతమేర కలుగుతున్నాయని, వీటిని సరిచేస్తామన్నారు. అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వేతనాలు అందించడంలో 15రోజులు జాప్యం జరిగితే 0.3శాతం వడ్డీని అందజేస్తామని, అలాగే పనికల్పించలేని పరిస్థితుల్లో తగు పరిహారం ఆయా జాబ్‌కార్డుదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఉపాధి కూలీలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్సి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ , డిసిఎంఎస్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు చింతు రామారావు, జల్లు చంద్రవౌళి, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పుట్టా ఆదిలక్ష్మీ, వాసుదేవరావు, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ జయలక్ష్మీ, జిల్లా పరిషత్ సిఇఓ సుధాకర్, అదనపుప్రాజెక్టు డైరెక్టర్ బి.వేణుగోపాలరావు, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, డుమా పిడి కల్యాణచక్రవర్తి, మండల ప్రత్యేకాధికారి సిహెచ్ రంగయ్య, ఆర్‌డిఓ ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.