సీతంపేట, ఏప్రిల్ 20: మండలంలోని దంజుపాయి, కిల్లాడ గ్రామాల్లో శుక్రవారం వేకువజామున గజరాజులు అలజడి సృష్టించాయి. అయితే ఈ ప్రాంతంలో గడచిన 15 రోజులుగా తరచూ అలజడి సృష్టిస్తున్న ఏనుగులు ఒడిషా నుండి జిల్లాకు ఏవిధంగా వచ్చాయో అదే వైపుగా గజరాజులు శక్రవారం వేకువజామున కదలాయి. ఈ ఏనుగులు దంజుపాయి గ్రామం మీదుగా వెళ్ళి అప్పన్నగూడ, చింతమానుగూడ, జగ్గడుగూడ గ్రామాల్లో ఘీంకారాలు చేస్తూ గిరిజనులను భయాందోళనలకు గురిచేశాయి. దంజుపాయి గ్రామంలో ఆరిక అప్పయ్య, బిడ్డిక సుంకయ్య, అప్పలనాయుడు , బిడ్డిక అప్పారావులకు చెందిన పలు రకాల పంటలను ధ్వంసం చేశాయి. అలాగే వరి పంటను కూడా నాశనం చేశాయి. దంజుపాయి గ్రామంవైపు ఏనుగులు రావడం ఇదే మొదటిసారి కావడంతో భయభ్రాంతులకు గురయ్యామని అప్పన్నగూడ గిరిజనులు చెప్పారు. ఈ ప్రాంతం నుండి ఏనుగులను తరలించాలని వారు కోరుతున్నారు.
ఏనుగుకు గాయం?
ఏనుగుల గుంపులో ఉన్న నాలుగు ఏనుగుల్లో ఒక ఏనుగు కాలికి తీవ్ర గాయమైందని ఆ ఏనుగు నడవలేని స్థితిలో ఉండి ఒక గుంతలో పడిందని ఆ ఏనుగును రక్షించేందుకు గిరిజనులు ప్రయత్నాలు చేసినప్పటికీ మిగిలిన ఏనుగు దగ్గరకు రాకుండా చేశాయని గిరిజనులు చెబుతున్నారు. దీంతో అటవీశాఖాధికారులు అప్రమత్తమై దంజుపాయి, కిల్లాడ, జగ్గడగూడ తదితర గ్రామాల్లో ఏనుగుల సమాచారం కోసం జల్లెడ పట్టారు. జిల్లా అటవీశాఖాధికారి మహమ్మద్ తయూబ్‌కూడా సిబ్బంది సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఏనుగు గుంపులో ఒక ఏనుగుకు గాయమైన విషయం వాస్తవమేనని, దీనిపై తమకు సమాచారం ఉందన్నారు.
టీడీపీ అభ్యర్థి విజయం ఖాయం
జలుమూరు, ఏప్రిల్ 20: శ్రీకాకుళం జిల్లాలో ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరు దశాబ్దాల పాటు వ్యతిరేకించారని, అదే పరిస్థితి నరసన్నపేట ఉపఎన్నికలో పునరావృతం అవుతుందని మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జోస్యం చెప్పారు. . శుక్రవారం రాత్రి చల్లవానిపేట జంక్షన్‌లో కలిసిన పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ నరసన్నపేటలో తెలుగుదేశం అభ్యర్థి స్వామిబాబు విజయం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా పనిచేస్తుందని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారయంత్రాంగమే కాకుండా వసతి గృహాల్లో వార్డెన్లు ఆసుపత్రుల్లో వైద్యులు ప్రజలకు చేరువలో లేకుండా విధులకు డుమ్మా కొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇటువంటి అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం పర్యవేక్షణ సాగించలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థలో మార్పులు చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడడం విచారకరమన్నారు.
సామాన్య ప్రజల కోసం కిలో బియ్యం రూపాయికి అందిస్తున్నామని కిరణ్‌సర్కారు గొప్పలు చెప్పుకోవడమే తప్ప ధరలు నియంత్రించలేని స్థితిలో ఉందని విమర్శించారు. ఈయనతోపాటు జిల్లా దేశం పార్టీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బగ్గులక్ష్మణరావు తదితరులు ఉన్నారు.