పాలకొండ, ఏప్రిల్ 20: ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత లభిస్తుందని ఈ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లైతే వివిధ పంటల రూపేణా అధిక ఆదాయం పొందవచ్చునని కలెక్టర్ జి. వెంకట్రామ్‌రెడ్డి రైతులకు సూచించారు. పాలకొండ పట్టణంలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో సుస్థిర వ్యవసాయ పద్ధతిపై రెవెన్యూ డివిజన్ పరిధిలోశుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఔషధ మొక్కలు, వాటి వినియోగం, సాగుపై ప్రతీ ఒక్క రైతు పూర్తి అవగాహన కల్గి ఉండడం ద్వారా వ్యవసాయం సంపూర్ణంగా నిర్వహించవచ్చునని పేర్కొన్నారు. అనంతరం శాస్తవ్రేత్తలు విశాలాక్షి, రఘునాధ్‌లు మాట్లాడుతూ ఒక కిలో బియ్యం తయారీ కోసం మూడు వేల లీటర్ల వరకు నీరు అవసరమవుతుందన్నారు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆరు తడి పంటలు వేయాలని సూచించారు. కేవలం పశువుల ద్వారా వచ్చిన గత్తం, సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా రైతులు ఆర్థికంగా లాభ పడవచ్చునని అన్నారు. బ్రిటీష్ పాలనలో రసాయన ఎరువులు భారత దేశానికి వచ్చాయని, అంతక ముందు రైతులు సేంద్రియ ఎరువులనే వినియోగించి, అధిక దిగుబడులు సాధించేవారని పేర్కొన్నారు. సింధూ నాగరికత యుగంలో కూడా పాడి పశువుల పెంపకం చేపట్టి రైతులు అనేక విధాలగా లాభ పడ్డారని చెప్పారు. 17వ శతాబ్దంలో వచ్చిన వ్యవసాయ విప్లవం ద్వారా రసాయనిక ఎరువులు వాడే పద్ధతులు ప్రారంభమయ్యాయని అన్నారు.
రసాయనిక ఎరువుల వలన మానవుని ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తుందన్నందున మళ్లీ పాత పద్ధతులనే వ్యవసాయ రంగంలో అనుసరించాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, నాబార్డు ఎజి ఎం సుబ్రహ్మణ్యం, వ్యవసాయ శాఖ జెడి మురళీ,తదితరులు పాల్గొన్నారు.
చిన్న బజార్‌ను విస్తరిస్తాం
పాతశ్రీకాకుళం, ఏప్రిల్ 20: పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే చిన్నబజారు రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్ స్పష్టం చేసారు. ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 9వ వార్డు పరిధిలోని తుమ్మావీధి మున్సిపల్ పాఠశాలలో, 10వ వార్డు పరిధిలోని గొంటివీధి పాఠశాలలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో చిన్నబజార్ రోడ్డులో నివసించే వారు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నామని, ఉడా ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ జరుగనుందని తెలిపాయి. దీనికోసం నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా తగిన మొత్తాన్ని సిద్ధం చేసామని, 40 అడుగుల మేర రోడ్ల నిర్మాణంతో పాటు ఇరువైపులా డ్రెయిన్లు కూడా నిర్మిస్తామ్తమన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ఫాసర్ డాక్టర్ భాస్కరరావు, టి.పి.వో. దేవకుమార్, పి.వో. నందిగాం భాస్కరరావు, డి.ఇ. సుగుణాకర్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ , ఆరోగ్య శాఖాధికారులతో పాటు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి, మాజీ కౌన్సిలర్లు బలగ పండరీనాధ్, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అనాథ పిల్లలకు చేయూత
జి.సిగడాం, ఏప్రిల్ 20: అనాథ పిల్లలకు సమగ్రబాలల పరిరక్షణ పథకం ద్వారా చేయూతనిస్తున్నామని జిల్లా శిశు గృహ మేనేజర్ ఇప్పిలి లక్ష్మునాయుడు తెలిపారు. శుక్రవారం మండలకేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ అనాథ, నిరాదరణకు గురైన పిల్లలు, వీధిబాలలు, బాలకార్మికులకు రక్షణ కల్పించి పునరావాసం కల్పించనున్నామన్నారు. అటువంటి పిల్లలను పిల్లలు లేని తల్లిదండ్రులకు చట్టపరంగా దత్తత చేస్తామన్నారు. ఇంతవరకు నలుగురు దంపతుల నుంచి పిల్లలకు కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలో బాల్యవివాహాలు నిరోధించామన్నారు.
పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి
జి.సిగడాం, ఏప్రిల్ 20: పాఠశాల అభివృద్ధికి యాజమాన్య కమిటీలు కృషిచేయాలని ఎంఇఓ ఎం.వి.ప్రసాదరావు అన్నారు. శుక్రవారం మండలం మెట్టవలస ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణాకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు కమిటీ సభ్యులు తమవంతు కృషిచేయాలన్నారు. ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ది చెందాలంటే విద్య అవసరమన్నారు. విద్యాహక్కు చట్టం గూర్చి కమిటీ సభ్యులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో తమపిల్లలను చదివించి సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ నారాయణప్పడు, గౌరీశ్వరరావు, రవికుమార్, సిహెచ్‌ఆర్‌కె రంగారావు తదితరులు ఉన్నారు.
ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 20: మండలంలోని కింతలిమిల్లు సమీపంలో పెట్రోల్‌బంకు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. హెడ్‌కానిస్టేబుల్ అసిరినాయుడు, తన కుమారుడు చందు కలసి మోటారు బైక్‌తో శ్రీకాకుళం నుంచి పోలీసు క్వార్టర్స్ వైపు వెళ్తుండగా ఎదురుగా ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుడికి రిమ్స్‌లో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు.
కుమారుడు చందు కూడా గాయాల పాలయ్యాడు. అవుట్‌పోస్టు పోలీసులు వివరాలు సేకరించి స్థానిక పోలీసు స్టేషన్‌కు బదలాయించగా ఎస్సై ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.