మార్కాపురం, ఏప్రిల్ 23: బెంగళూర్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం తెల్లవారుఝామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. మార్కాపురం - గజ్జలకొండ స్టేషన్ల మధ్య ఈ చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి 2.30గంటల సమయంలో మార్కాపురం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు దుండగులు చైన్ లాగి రైలును ఆపి బోగిలో ఉన్న వైఎస్ రెడ్డి, కె సబిత మెడల్లో ఉన్న బంగారు గొలుసులను లాక్కొని పారిపోయారు. దీంతో 10 నిమిషాల పాటు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. బాధితులు గుంటూరు రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈసంఘటనపై జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి సోమవారం ఉదయం మార్కాపురం వచ్చి సంఘటనా స్థలానికి వెళ్ళి విచారణ జరిపారు. మార్కాపురం డివైఎస్పీ డి మురళీధర్, సిఐ రాఘవేంద్ర, రూరల్ ఎస్సై రాములునాయక్ తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.
గూండాయిజం చేస్తే ఒక్కరూ మిగలరు
అంతర్జాతీయ సువార్తీకుడు కెఎ పాల్ హెచ్చరిక
ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 23: తనపై గూండాయిజం చేస్తే ఒక్కరూ మిగలరని, ఇప్పటికే ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని అంతర్జాతీయ సువార్తీకులు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ అన్నారు. సోమవారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాను శపించబట్టే కాలగర్భంలో కలిసిపోయారన్నారు. అదేవిధంగా తన సోదరుడు డేవిడ్‌రాజు, భీమిలి, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి పాస్టర్లు థామస్, ఎంఐజె ప్రకాష్, జాషువా, జాన్ ఎలీషాల పరిస్థితి కూడా అదేనన్నారు. వీరందరు తనను ఎన్నో రకాలుగా హింసించారని, తట్టుకోలేక తాను ప్రార్థనలు నిర్వహించడంవల్లే దారుణంగా చనిపోయారన్నారు. శాంతి మహోత్సవాల పేరుతో ప్రశాంతంగా దైవ సందేశాన్ని ప్రజలకు అందించేందుకు ఒంగోలు వస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని జెస్సీపాల్ ఇంటికి వెళ్ళి శాంతి మహోత్సవాలకు పాస్టర్లు వెళ్లకుండా చూడాలని ఆయనను భయపెట్టారని ఆరోపించారు. దైవజనులను బెదిరించి బాలినేని గుండాయిజం చేశారన్నారు. ఆదివారం రాత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది యువకులు తమపై దౌర్జాన్యానికి దిగి అల్లర్లు సృష్టించారన్నారు. తన విషయంలో గుండాయిజం చేసినవారు ఈ భూమిమీద ఒక్కరు కూడా మిగలలేదన్నారు. పాస్టర్లను ఆపగలరేమోకాని సభ్యులను ఆపలేరన్నారు. మహోత్సవాలకు రాని సంఘాలు నిర్వహించే సమావేశాలకు సభ్యులెవరు వెళ్ళవద్దని పిలుపునిచ్చారు. రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ప్రతిరోజు 50 వేల మందికి పైగా ప్రజలు వచ్చారన్నారు. తాను నగదు, మద్యం, మాంసం పంచిపెట్టలేదని, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారన్నారు. ప్రస్తుతం తనను చంపాలని కొంతమంది చూస్తున్నారన్నారు. తాను కళ్ళుతెరిచి వాళ్ళపై దృష్టిపెడితే వారు ఈ భూమిమీద మిగలరని పరోక్షంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. తాను దీవిస్తే ప్రశాంతంగా ఉంటారని, శపిస్తే కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి లక్షలాది మంది జీవితాలలో వెలుగులు నింపామన్నారు. తాను కూడా పల్లెటూరు నుండి పట్టణానికి వచ్చానన్నారు. జూలై 24వ తేదిలోపు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఒకవేళ ఆగస్టులో ఉప ఎన్నికలు జరిగితే పాయకరావుపేట, రామచంద్రాపురం, పత్తిపాడు, ఒంగోలుతోపాటు మరో స్థానంలో పోటీ చేస్తామన్నారు. ఈసమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ అనుమూల సత్యనారాయణరావు, ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూరప్పడు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ నేత దాచర్ల రవికుమార్, రెడ్డి ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు.
బొత్సను పదవి నుండి బర్తరఫ్ చేయాలి
టిడిపి జిల్లా అధ్యక్షుడు దామచర్ల డిమాండ్
ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 23: మద్యం మాఫియా డాన్ బొత్స సత్యనారాయణను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో దామచర్ల మాట్లాడుతూ తమపార్టీ అధినేత చంద్రబాబునాయుడ్ని విమర్శించే నైతిక అర్హత బొత్సకు లేదన్నారు. ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అధికార దాహంతో రెచ్చిపోతున్న బొత్సను ప్రజలందరు గమనిస్తున్నారన్నారు. బొత్సను పశువుతో పోలిస్తే పశువులు కూడా సిగ్గుపడి పాలుకూడా ఇవ్వవని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ మద్యం మాఫియాపై ముందుగానే విజయనగరంలో ధర్నాకు సిద్ధమైతే అధికార దాహంతో ఎదురుదాడికి దిగేందుకు పోలీస్ బలగాన్ని రంగంలోకి దింపి కాంగ్రెస్‌పార్టీ కూడా ధర్నా చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవినీతికూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు చిమటా సాంబు మాట్లాడుతూ చంద్రబాబునాయుడ్ని బొత్స విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. తన అవినీతి సామ్రాజ్యం ఎక్కడ కుప్పకూలి పోతుందోనన్న భయంతోనే చంద్రబాబుపై ఎదురు దాడికి దిగారని ఆరోపించారు. రాష్ట్రానికి ఓక్స్ కర్మాగారాన్ని రాకుండా బొత్స అడ్డుకోవడం వల్ల 10 వేల మంది నిరుద్యోగులు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వానికి 10 వేల కోట్ల రూపాయల ఆదాయం రాకుండా పోయిందన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత పసుమర్తి హగ్గయ్యరాజ్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 202 బూత్ లెవల్ ఆఫీసర్లను నియమించారని, 15 బూత్‌లకు ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించినప్పటికి ఒక్క ఆఫీసర్ కూడా అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆఫీసర్లకు ఫోన్ చేస్తే సరిగా స్పందించడం లేదన్నారు. ఇప్పటికైన బూత్‌లెవల్ ఆఫీసర్లు సక్రమంగా పనిచేసే విధంగా జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈసమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొల్లినేని వాసుకృష్ణ, మారెళ్ల వివేకానంద, యక్కల తులసీరావు, బొమ్మినేని మురళీకృష్ణ, కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘బ్యాంకు మిత్రల సమస్యలు పరిష్కరించాలి’
కలెక్టరేట్ వద్ద బైఠాయింపు
ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 23: ఐకెపిలో పనిచేస్తున్న బ్యాంకు మిత్రల సమస్యలను పరిష్కరించాలని ఎపి ఎన్‌జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బషీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎపి ఐకెపి బ్యాంకు మిత్రల యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలు సోమవారం 5వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి రమాదేవి అధ్యక్షత వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించిన అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల చేత వెట్టిచాకిరి చేయిస్తోందని విమర్శించారు. పొదుపు గ్రూపుల పనులే కాక బ్యాంకు లావాదేవీలు నడుపుతున్న బ్యాంకు మిత్రలకు వేతనాలు లేకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాసులు మాట్లాడుతూ చర్చల పేరుతో పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయవద్దని డిఆర్‌డిఎ ఉద్యోగులను కోరారు. డిఆర్‌డిఎ పిడి ఆధ్వర్యంలో చర్చలు జరిగి రాతపూర్వక హామీ ఇచ్చేంతవరకు పోరాటాన్ని కొనసాగించాలని బ్యాంకు మిత్రలకు పిలుపునిచ్చారు. విఆర్‌ఎ సంఘం ప్రధాన కార్యదర్శి కె మాణిక్యరావు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం కార్యదర్శి సిహెచ్ మజూందర్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద గంటపాటు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరువాత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలులో ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా అరెస్టులు, లాఠీచార్జీలకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి బ్యాంకు మిత్రలు రమాదేవి, సునీత, విజయ కుమారి, సుష్మ, వాణి, నాగమల్లేశ్వరి, లక్ష్మి, వెంకటలక్ష్మి, దైవ కటాక్షం, మాధవి తదితరులు నాయకత్వం వహించారు.