విజయనగరం, ఏప్రిల్ 23: ఎన్టీరామారావు అమలు చేసిన మద్య నిషేధానికి మద్యలోనే మంగళం పాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మద్యంపై ఉద్యమాలు చేయడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో సోమవారం చేపట్టిన మద్యం వ్యతిరేక ధర్నాకు నిరసనగా స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ చేపట్టిన మహా ధర్నాలో ఆయన ప్రసంగించారు. రాజకీయ లబ్ధి, పదవీ వ్యామోహంతోనే చంద్రబాబు ఉద్యమం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ బలమైన శక్తిగా ఎదుగుతుండడం, టిడిపికి మళ్ళీ అధికారం అందకుండా పోతుందన్న భయంతోనే చంద్రబాబు నాయుడు ఇలా ఊరూరా ఆందోళనలకు దిగుతున్నారని తోట విమర్శించారు. అందులో భాగమే విజయనగరం జిల్లాలో ఈ ధర్నా అని ఆయన అన్నారు. రెండు రోజుల కిందట తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి సెజ్ బాధితులకు బాసటగా నిలుస్తానని చంద్రబాబు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
పదేళ్ళ కిందట సరిగ్గా ఇదే రోజున ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సెజ్‌లకు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మంత్రి తోట గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తానంటూ పనికట్టుకుని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని రైతులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రశాంతమైన విజయనగరం జిల్లాను పాకిస్థాన్‌తో పోల్చిన చంద్రబాబు జిల్లా ప్రజలను అవమానించారని పేర్కొన్నారు. నెల్లిమర్ల శాసనసభ్యుడు బడుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ఇంటి పేరు నారా, ఆయన తెచ్చింది సారా అంటూ వ్యగ్యంగా మాట్లాడారు. ప్రశాంతమైన రాజకీయ వాతావరణంతో విలసిల్లే విజయనగరం జిల్లాలో రాజకీయ వైషమ్యాలకు తెర తీశారని ఆరోపించారు. గజపతినగరం శాసనసభ్యుడు బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ మద్యంపై ఉద్యమించే హక్కు, అర్హత తెలుగుదేశం పార్టీకి లేవన్నారు. తమ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తమ కుటుంబంలో అంతా కిందిస్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగామని, ప్రజల్లో తమకున్న ఇమేజికి ఇదే నిదర్శనమని అన్నారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, విమర్శలన్నింటికీ ప్రజాకోర్టులోనే సమాధానం చెప్తామని స్పష్టం చేశారు. పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ రాజకీయంగా ఎదుగుతున్న తీరును చూసి ఓర్వలేకే చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సభకు అధ్యక్షత వహించిన కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జిల్లాలో మద్యం వ్యాపారం చేస్తున్న మీ పార్టీ నాయకులపై చర్యలు మాని, అధికార పార్టీపై రాజకీయ ఉద్యమం చేయడం దారుణమన్నారు. సెజ్ రైతులకు బాసటగాను, అన్నాహజారేకు మద్దతుగాను చంద్రబాబు చేపడుతున్న ఉద్యమాలు చూస్తూ ప్రజలు వినోదం పొందుతున్నారని పేర్కొన్నారు. మద్యం ఉద్యమం పేరుతో చేసిన ఘనకార్యాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు స్వచ్ఛంధంగా తరలివచ్చారని, ఇదే పరిస్థితి ఇతర జిల్లాలోను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, డి.సి.సి.బి అధ్యక్షుడు మరిశర్ల శివున్నాయుడు, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ కె.వి.సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ధర్నాలో మంత్రి తోట విమర్శ
english title:
cha
Date:
Tuesday, April 24, 2012