పరవాడ, ఏప్రిల్ 23: ఆందోళనతో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సోమవారం దద్ధరిల్లింది. పరవాడ మండలం తాడి గ్రామ పంచాయతీ ప్రజల ఆగ్రహానికి ఔషధ కంపెనీలన్నీ మూతపడ్డాయి. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామ పంచాయతీ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సోమవారం ఫార్మాసిటీని స్తంభింపజేశారు. తాడి గ్రామ పంచాయతీ పరిధిలోగల ప్రజలంతా ఫార్మాసిటీ ప్రధాన రహదారిని నిర్బంధించి వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు. ఔషధ కంపెనీల్లో విధులు నిర్వర్తించే కార్మికులు, ఉద్యోగులను బయటకు పంపివేశారు. ఆందోళనకారులను కాదని ఆయా సంస్థల్లో విధులకు హాజరయ్యే కార్మికులపై దాడులకు దిగారు. ఒక సందర్భంలో ఫార్మాసిటీలోగల రాంకీ కమర్షియల్ హబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హబ్‌లో పనిచేసే కార్మికుడు ఆందోళనకారుల కళ్లుగప్పి విధులకు హాజరయ్యేందుకు వెళ్లారు. దీనిని గమనించిన ఆందోళనకారులు ఆయన వెంట పడ్డారు. కమర్షియల్ హబ్ ప్రధాన ద్వారం వెనుకవైపు దాక్కోవడంతో ఆందోళనకారులు గేట్లను నెట్టుకుని లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఫలించలేదు. విధులకు హాజరైన కార్మికులను పోలీసులు బయటకు రప్పించారు. వెంటనే ఆందోళనకారులు తలో చేయి ఆయనపై చేసుకున్నారు. దీంతో కార్మికుడు కంటతడి పెట్టారు. వెంటనే గాజువాక సి.ఐ. అప్పలరాజు ఆ కార్మికుడిని ఆందోళనకారులవద్ద నుండి విడిపించి బయటకు తీసుకెళ్లారు. రహదారి నిర్బంధంలో ఒక ద్విచక్ర వాహనచోదకుడు ఆందోళనకారుల పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఆందోళనకారులు వాహనచోదకుడిపై దాడికి దిగారు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు ఇటువంటి సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. హబ్ ప్రధాన ద్వారం నుండి ఆందోళనకారులను వెనక్కు పంపే ప్రయత్నాన్ని పోలీసులు, ప్రజాప్రతినిధులు చేశారు. వారు మాత్రం అక్కడినుండి అడుగు కూడా కదపలేదు. ఆందోళన ఒక సందర్భంలో ప్రజాప్రతినిధుల చేతులు కూడా దాటిపోయినట్లు కనిపించింది.
సోమవారం ఉదయం 6 గంటల నుండే ఫార్మాసిటీ ప్రధాన రహదారులన్నింటినీ తాడి ప్రజలు స్తంభింపజేశారు. తొలుత మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఫార్మాసిటీ వద్దకు చేరుకుని ఆందోళనకారులకు మద్దతు తెలపడంతో రహదారిని నిర్బంధించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తాడి గ్రామాన్ని తరలించాలని కోరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆందోళనకారులు ఏర్పాటుచేసిన శిబిరం వద్దకు చేరుకున్నారు. ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. గ్రామాన్ని తరలించేవరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఆందోళనకారులు సోమవారం తెల్లవారుజామునే ఫార్మాసిటీలో గల అన్ని ఔషధ కంపెనీల వద్దకు వెళ్లి అక్కడి కార్మికులను బయటకు తీసుకువచ్చారు. దీంతో పలు పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ఆందోళన కొనసాగితే సంస్థల్లో కెమికల్ రియాక్షన్ వచ్చి పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆయా సంస్థల యాజమాన్యాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి. ఆందోళనకారుల్లో ఉన్న ఉద్రిక్తతను దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తును గాజువాక ఎ.సి.పి. దాసరి రవిబాబు ఆధ్వర్యంలో సంఘటనా స్థలిని మోహరించారు. వజ్ర వాహనంతోపాటు రోప్ పార్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్, ఎ.ఆర్. ఫోర్స్‌లను అక్కడకు రప్పించారు. పోలీసు బలగాలను గమనించిన ఆందోళనకారులు కాస్తంత శాంతించినట్లు కానవచ్చింది. మధ్యాహ్నం వరకు ఉద్రిక్త వాతావరణం కనిపించినా సాయంత్రానికి కాస్తా చల్లబడింది. ఆందోళనను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ, ఎపిఐఐసి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎపిఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సత్యనారాయణరావు ఆందోళనకారులతో మాట్లాడారు. గ్రామాన్ని తరలించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని, ప్రజలు కాస్త ఓపికతో ఉండాలని ఆయన కోరారు. దీనికి ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వెనుదిరిగారు.
ఎమ్మెల్యే హామీతో ఆందోళనను విరమణ
సమస్య పరిష్కారానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు హామీఇవ్వడంతో తాడి గ్రామ ప్రజలు ఆందోళన విరమించారు. ఎపిఐఐసి ఇ.డి. సత్యనారాయణరావు మాట వినని తాడి ప్రజలు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పంచకర్ల ఎపిఐఐసి ఎం.డి.తోపాటు రాష్టస్థ్రాయి అధికారులతో ఈ ఆందోళనపై టెలిపోన్‌లో సంప్రదించారు. రాష్టస్థ్రాయి అధికారులతో తాడి సమస్యపై సమావేశాన్ని ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆందోళనకారులకు తెలిపారు. అప్పటివరకు ఆందోళనను వాయిదా వేసుకోవాలని కోరారు. దీంతో ఆందోళనకారులు 15 రోజులపాటు వారి ఆందోళనను వాయిదా వేసుకున్నారు. తాత్కాలికంగా ఆందోళన నిలుపుదల చేస్తున్నట్లు మాజీ మండలాధ్యక్షులు మాదంశెట్టి నీలబాబు తెలిపారు. దీంతో పలు ఔషధ కంపెనీల యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఆందోళనతో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ
english title:
pharma city
Date:
Tuesday, April 24, 2012