భువనగిరి, ఏప్రిల్ 23: మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్‌తో తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, భానుకిరణ్‌తో తన కుమారుడు కార్తిక్‌రెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు కొంత మంది కావాలని అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. వాస్తవాలు సిఐడి విచారణలో బయటకు వస్తాయని ఆమె అన్నారు. కాగా విజయనగరం జిల్లాలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదమున్నందునే ఎస్‌పి ముందు జాగ్రత్త చర్యగా 144సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ని విధించారని తెలిపారు. దీనిలో భాగంగానే కలెక్టరేట్ ఎదుట టిడిపి, కాంగ్రెస్ పార్టీలు చేపట్టబోయే ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. అయతే చంద్రబాబు నాయుడు పోలీసు నిబంధనలకు విరుద్దంగా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు వెళ్ళడం విచారకమన్నారు. ఎసిబి డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని ఆకస్మిక బదిలీ చేయడం పట్ల హై కోర్టు అధికారి బదిలీని పునః పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించిందని దీని పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించిన విలేఖరులకు ఆమె సమాధానాన్ని చెప్పకుండా వౌనం వహించారు.
...................................................
28 వరకు ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు
విశాఖపట్నం, ఏప్రిల్ 23: బిఇడిలో ప్రవేశానికి జూన్ 8న నిర్వహించే ప్రవేశపరీక్ష (ఎడ్‌సెట్)కు సంబంధించి ఈ నెల 28 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ నిమ్మ వెంకట్రావు తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 28 వరకు దరఖాస్తులను పంపించేందుకు గడువు ఉంటుందన్నారు. ఒక లక్షా 20 వేల దరఖాస్తులు ఇంతవరకు వచ్చాయని, సోమవారం ఒక్కరోజే 30 వేల వరకు చేరాయన్నారు. రాష్టవ్య్రాప్తంగా 650 బిఇడి కళాశాలలుండగా, వీటిలో 65 వేల సీట్లు ఉన్నాయన్నారు. జూన్ 8న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
..............................
పద్మావతీ అమ్మవారికి వజ్రకిరీటం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఏప్రిల్ 23: చెన్నైకి చెందిన యాగ్రి ఎస్టేట్ అధినేత జయప్రకాష్ 71 లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సోమవారం తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి బహూకరించారు. దీని బరువు దాదాపు రెండున్నకిలోలు. కాగా మంగళవారం అక్షయతృతీయ పర్వదినం రానుండగా సిరుల తల్లి శ్రీపద్మావతమ్మకు బంగారు కిరీటం బహూకరించడం గమనార్హం. దీనిని ఆలయ డిప్యూటీ ఇఓ గోపాలకృష్ణ, ఏఇఓ వేణుగోపాల్ అందుకున్నారు. ఈ కిరీటాన్ని శుక్రవారం అమ్మవారికి తొలిసారిగా అలంకరించి భక్తులకు దర్శన బాగ్యం కల్పించనున్నారు.
.....................................
చందనోత్సవానికి సర్వం సిద్ధం
విశాఖపట్నం, ఏప్రిల్ 23: చందనోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మహా ఉత్సవానికి శ్రీ నరసింహస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు సోమవారం నాటికే సింహాచలం చేరుకున్నారు. పలుచోట్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిచాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద, పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటైంది. రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమయ్యే చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను ఆలయ అధికారులు తీసుకుంటున్నారు. భక్తకోటి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా వరహ వదనంతో మానవ శరీరంతో సింహవాలంతో విలక్షణ మూర్తిగా మరికొద్దిసేపట్లో వరహా నరసింహుడు నిజరూప దర్శనాన్ని ఇవ్వనున్నాడు.
హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి
english title:
bha
Date:
Tuesday, April 24, 2012