నర్సీపట్నం, ఏప్రిల్ 23: రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనం వీస్తోందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బంహరి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఎం.పి.నిధులతో పట్టణంలోని పలువీధుల్లో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్‌ను, సి.సి.రోడ్లను ప్రారంభించారు. ఈసందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీలో జరిగిన బహిరంగ సభలో హరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి జగన్‌ను సస్పెండ్ చేస్తే ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరి కావడం తథ్యమని గతంలోనే తాను చెప్పానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. జగన్ ముఖ్యమంత్రైతే తమకు మేలు జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు. పాయకరావుపేట ఉప ఎన్నికల్లో మరోసారి గొల్లబాబూరావు ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమన్నారు. వై.ఎస్.కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా త్యజించిన బాబూరావును ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు. 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉపఎన్నికల అనంత రం రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఎన్నికలు ఎప్పడు జరిగినా జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యమని సబ్బంహరి జోస్యం చెప్పారు. మున్సిపాలిటీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని కాపువీధి, ఎస్సీకాలనీల్లో సులబ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ఎం.పి. నిధులు మంజూరు చేశానని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రస్తుతం కేటాయిస్తున్న మూడువేల రూపాయలను ఆరువేలకు పెంచాలని కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ పార్టీ జిల్లా కన్వీనర్ గొల్లబాబూరావు మాట్లాడుతూ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశీస్సులతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వై.ఎస్. కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న వేధింపు చర్యలకు నిరసనగానే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో తాను మరోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోళెం నర్సింహమూర్తి, పీలా వెంకటలక్ష్మి మాట్లాడగా, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, పూడిమంగపతిరావు, మాజీ జెడ్పీ చైర్మన్ వంజంగి కాంతమ్మ , విశాఖనగర వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకుడు ఇళ్ళ శ్రీనివాస్, నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ నాయకులు పెట్ల ఉమాశంకర్ గణేష్, అంకంరెడ్డి జమీలు పలువురు నాయకులు పాల్గొన్నారు.
* అనకాపల్లి ఎం.పి.సబ్బంహరి
english title:
sabbam hari
Date:
Tuesday, April 24, 2012