రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఉత్సాహంగా ప్రారంభించారే కాని, ఆ తర్వాత వాటి అభివృద్ధికి ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదు. అందువల్ల పారిశ్రామిక రంగంలో ఆశించినంత అభివృద్ధి జరగడం లేదు. వాస్తవానికి దేశం మొత్తం మీద ఎక్కువ సెజ్‌లున్న ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు అభివృద్ధి చెందేందుకు మంచి వాతావరణం ఉంది. కాని సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, అలజడులు, అశాంతి, దర్యాప్తులు, దృఢనిశ్చయంతో నిర్ణయాలు తీసుకోకపోవడం, రాజకీయ ప్రక్రియ గాడితప్పడం తదితర కారణాల వల్ల సెజ్‌ల పురోగతి కుంటుపడింది. సెజ్‌ల్లో అవసరమైన వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల సంఖ్య తగ్గింది. మూడేళ్ల క్రితం ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనపడదు. గతంలో హైదరాబాద్, విశాఖపట్నం నగర పరిసరాల్లో అనేక పరిశ్రమలు వచ్చాయంటే అప్పటి మంచి వాతావరణం కారణమని చెప్పవచ్చు. విద్యుత్, నీరు, భూమి ఇతర వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే పరిశ్రమలు వచ్చేవి. ఇప్పుడు అనేక రకాలైన రాయితీలతో పాటు వాతావరణాన్ని కూడా చూస్తున్నారు. భౌతిక వౌలిక సదుపాయాలు, సామాజిక వౌలిక సదుపాయాలు, న్యాయపరమైన సదుపాయాలు, శాసనపరమైన బలమైన చట్టాలుంటే తప్ప పరిశ్రమలు రావు. ప్రపంచ స్థాయి నాణ్యతాయుతమైన ప్రమాణాలున్న వౌలిక సదుపాయాలుండాలి. పారిశ్రామికవేత్తలు అరకొర సదుపాయాలు కల్పించినా సర్దుకుని పోతారనే రోజులకు కాలం చెల్లింది. దేశవ్యాప్తంగా పోటీతత్వం పెరిగింది. అనేక రాష్ట్రాలు రెడ్‌కార్పెట్ పరిచి పరిశ్రమల యజమాన్యాలను ఆహ్వానిస్తున్నాయి. రాష్ట్రంలో 115 సెజ్‌లకు 75 సెజ్‌లను నోటిఫై చేశారు. ఇందులో 43 వరకు ఐటి సెజ్‌లు, మిగతావి ఇతర రంగాలున్నాయి. భూములు కేటాయించి, వౌలిక సదుపాయాలు కల్పించి, సెజ్‌ల పరిసరాల్లో సామాజికపరమైన అవసరాలు అంటే మాల్స్, కాంప్లెక్స్‌లు, స్కూళ్లు ఉండాలి. పుష్కలమైన కరెంటు ఇవ్వాలి. పారిశ్రామికవేత్తలకు ఉద్వేగాలు, ఉద్రిక్తతలకు తావులేని వాతావరణం కల్పించాలి. రాజకీయపరమైన అలజడుల్లోకి పారిశ్రామికవేత్తలను లాగే ధోరణి పెరగడం మంచి పరిణామం కాదు. సెజ్‌ల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే అనుమతుల్లో కూడా వేగం ఉండాలి. అంతేకాని ఇక్కడ విపరీతమైన జాప్యం ఉంటే పరిశ్రమలు రావు. పరిశ్రమలను అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా బలమైన సంకల్పం కావాలి. కరెంటు, పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు, భూమి సేకరణకు చెందిన మంత్రులు గట్టిగా పనిచేయాల్సి ఉంటుంది. అలాగే బ్యూరోక్రసీ వీరికి సహకరించాలి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ మునుపెన్నడూ లేని సంక్షోభ మార్గంలో వెళుతోంది. రాజకీయపార్టీలు పరిశ్రమల జోలికి రాకుండా ఉండాలి. సెజ్ విధానంలో లోపాలుంటే సరిదిద్దాలి. భూముల కేటాయింపులో పారదర్శకత ఉండాలి. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఉండాలి. వేధింపులకు తావులేని విధానం వల్ల తప్పనిసరిగా సెజ్‌లు మంచి ఫలితాలు ఇస్తాయి.
రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఉత్సాహంగా ప్రారంభించారే కాని,
english title:
sadupayaala
Date:
Thursday, April 26, 2012