సెజ్‌ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జమిందార్ల వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. సెజ్‌ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా భూ దోపిడీలకు పాల్పడుతోంది. త్వరిత గతిన ఆర్థికాభివృద్ధి సాధించాలని, దానివల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడాలనే మంచి ఉద్దేశంతో ఆర్థిక మండళ్లకు రూపకల్పన జరిగింది. కానీ వైఎస్. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సెజ్‌ల పేరుతో జరిగిందంతా భూ దోపిడీయే. తాజాగా కాగ్ బయట పెట్టిన నివేదికలో నిబంధనలకు విరుద్ధంగా సెజ్‌ల పేరుతో 88వేల ఎకరాల భూమి అప్పనంగా కొద్దిమందికి అప్పగించారని నివేదికలో పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ చేసే విమర్శలు వేరు. భూ దోపిడీ గురించి టిడిపి మొదటి నుంచి చెబుతూనే ఉంది. రాజకీయ ఉద్దేశంతో విమర్శలు అని ఎదురు దాడి చేశారు. కానీ చివరకు స్వతంత్ర ప్రతిపత్తిగల కాగ్ సైతం భూ దోపిడీ గురించి నివేదిక ఇచ్చింది. ఏ ఉద్దేశంతో భూముల కేటాయింపు జరిగిందో, ఆ భూములను వాటికి ఉపయోగించకపోతే వెనక్కి తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో సెజ్‌ల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. తొలి విడతగా కాకినాడ సెజ్‌పై టిడిపి ఉద్యమించింది. రాష్ట్రంలోని అన్ని సెజ్‌లపై ఇదే విధంగా ఉద్యమిస్తాం.
మూడు దశాబ్దాల పాటు బెంగాల్‌ను పాలించిన పార్టీ నందిగ్రామ్ ఉద్యమం వల్ల అధికారం నుంచి కోల్పోవలసి వచ్చింది. అధికారంలో ఉన్న వారు ఈ విషయాన్ని గ్రహించాలి. బెంగాల్‌లో నందిగ్రామ్ కన్నా ఎన్నో రేట్ల ఎక్కువ భూమి మన రాష్ట్రంలో సెజ్‌ల పేరుతో రైతుల నుండి లాక్కున్నారు. రాష్ట్రంలో 113 సెజ్‌లకు అనుమతి ఇచ్చారు. వీటికి రెండు లక్షల ఎకరాల భూమి ఇచ్చారు. ఎక్కువగా పేద రైతుల నుండి లాక్కున్నదే. కాకినాడ సెజ్‌కు 10,500 ఎకరాల భూమి ఇచ్చారు. గత ఏడేళ్ల నుంచి ఈ భూమిలో ఎలాంటి పనులు చేపట్టలేదు. కనీసం భూమిని చదును కూడా చేయలేదు. రెండు పంటలు పండే భూమిని సెజ్‌ల పేరుతో ఎందుకూ పనికి రాకుండా చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగపడేట్టు చేస్తున్నారు. పంటలు పండని భూములను మాత్రమే సెజ్‌లకు ఉపయోగిస్తామని యుపిఏ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంగా రెండు పంటలు పండే భూములను సైతం సెజ్‌ల పేరుతో లాక్కుంటున్నారు. కాకినాడ సెజ్‌తో మొదలు పెట్టిన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెజ్‌లలో నిర్వహిస్తాం. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల సెజ్‌ల పేరుతో స్వాహా చేసిన భూముల వ్యవహారంపై ఉద్యమిస్తాం. సెజ్‌ల ద్వారా 8లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది, కానీ కనీసం 80వేల ఉద్యోగాలు కూడా రాలేదు.
ప్రభుత్వం చెబుతున్న దానిలో కనీసం పది శాతం కూడా వాస్తవ రూపం దాల్చలేదు. ఫ్యాబ్‌సిటీ, లేపాక్షి వంటి వివిధ పేర్లతో ప్రభుత్వం అడిన భూ నాటకాలను బయటపెడతాం, రైతుల భూములను తిరిగి రైతులకు అప్పగించేంత వరకు ఉద్యమిస్తాం.
సెజ్‌ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జమిందార్ల వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది.
english title:
sez
Date:
Thursday, April 26, 2012