పశ్చిమ బెంగాల్ సింగూరులో టాటా కంపెనీ తలపెట్టిన నానో కంపెనీకి భూ సేకరణ సందర్భంగా జరిగిన ఘటనలతోనైనా మన రాష్ట్రం అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సెజ్‌లు (ప్రత్యేక ఆర్థిక మండళ్లు) వౌలిక వసతుల ప్రాజెక్టులు, పరిశ్రమలు దేశ ఆర్థికాభివృద్ధికి నిస్సందేహంగా అవసరమే అయినప్పటికీ, దీనికి ఒక హేతుబద్ధమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో ఆందోళనలు పెరగటం, వాటిని రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకోవడం చివరికి పారిశ్రామిక ప్రగతి కుంటుపడి అభివృద్ధికి ఆటకంగా మారే ప్రమాదం ఉంది. సింగూరు నేపథ్యంలో అక్కడి అనుభావాలను దృష్టిలో పెట్టుకొని, సెజ్‌లకు అత్యధికంగా భూములు కేటాయించిన మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు అనుసరించాల్సిన విధానాలపై తాము ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన కొన్ని సూచనలు కూడా చేశాము. అలాగే విజయనగరం జిల్లాలో జందాల్ కంపెనీ కోసం జరిపిన భూ సేకరణలో జరిగిన అవకవతకలపై తమ పార్టీ జరిపిన అధ్యయనంపై ఒక నివేదికను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. నకిలీ పత్రాలతో కొందరు బడాబాబులు, మధ్య దళారులు నష్టపరిహారం కింద భారీగా నిధులు పొందగా, అసలైన రైతులకు మాత్రం నామమాత్రపు పరిహారం పొందిన ఉదంతాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారమే రైతుల నుంచి సేకరణ జరుపుతున్నప్పటికీ, వాటి ధరలు కొన్ని రోజుల్లోనే యాభై నుంచి వంద రెట్లు పెరిగిపోతున్నాయి. ఇక్కడే పొరపొచ్చాలకు బీజం పడుతోంది. వ్యతిరేకత తలెత్తుతోంది. దాంతో ఆందోళనకు భూ నిర్వాసితులు సిద్ధపడుతున్నారు. వీరికి ఏదో ఒక పార్టీ అండగా నిలుస్తోంది. అలా ఆ ప్రాంతంలో వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. సాంకేతికంగా న్యాయంగానే ఉన్నట్టు కనిపించినా, ఇది పక్కా దోపిడి అనడంలో సందేహం లేదు. మరోవైపు ఏ ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరమో నిర్దిష్టంగా వెల్లడించకుండా భూ సేకరణ చేయిస్తూ కొందరు రాజకీయ నేతలు, అధికారులు లబ్ధిపొందుతున్నారు. ఎక్కడ ప్రాజెక్టు వస్తుందో ముందుగానే పసిగట్టి రైతుల్ని ప్రలోభపెట్టో, బలవంతంగా భూములను తమ పేర్లపై రాయించుకుంటున్నారు. దీంతో రైతుల ఆగ్రహం, అవేదన కట్టలు తెంచుకుంటోంది. ఇది పెద్ద ఆర్థిక, సామాజిక సంక్షోభంగా మారకముందే ఈ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణం చేపట్టాలి. సెజ్‌లు, వౌళిక వసతుల ప్రాజెక్టుల విషయంలో దేశహితం కలిగేలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాల్ని అనుసరించాలి. ఏ సెజ్‌కు ఎంత భూమి అవసరమో నిర్దారించడానికి ఒక పటిష్టమైన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. పరిహారం చెల్లింపునకు మూడింటిని ప్రాతిపదికగా తీసుకోవాలి. సేకరించిన భూమి మార్కెట్ ధర కంటే అధికంగా ఉండాలి. భూమి కోల్పోయిన బాధితుల కుటుంబంలో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగాన్ని ఇవ్వాలి. వారికి నైపుణ్యత లేకపోతే సదరు కంపెనీయే బాధ్యత తీసుకొని శిక్షణ ఇవ్వాలి. అభివృద్ధి చేసిన భూమిలో 15 నుంచి 30 శాతాన్ని భూములు కోల్పోయిన వారికి కేటాయించాలి.
పశ్చిమ బెంగాల్ సింగూరులో టాటా కంపెనీ తలపెట్టిన నానో కంపెనీకి భూ సేకరణ సందర్భంగా
english title:
vidha
Date:
Thursday, April 26, 2012