రాష్ట్రంలో సెజ్‌ల కోసం కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంటే మనం తిరోగమనంలో పయనించాల్సి వస్తుంది. సెజ్‌ల కోసం కేటాయించిన భూములను ఎందుకు తిరిగి తీసుకోవాలి? అసలు సెజ్‌లకు కేటాయించిన భూముల విస్తీర్ణం ఎంతో పరిశీలిస్తే, ఈ భూములను తిరిగి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమవుతుంది. మన రాష్ట్రంలో 680 లక్షల ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 300 లక్షల ఎకరాల్లోనే సేద్యం జరుగుతోంది. సెజ్‌లకు కేటాయించిన భూములు కేవలం 85 వేల ఎకరాలు మాత్రమే! అంటే మొత్తం విస్తీర్ణంలో సెజ్‌లకు కేటాయించిన భూములు చాలా తక్కువ శాతం అని తేలుతుంది కదా!
ఒకవైపు వ్యవసాయం, మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి రంగం, ఇంకోవైపు సేవల రంగం సమానంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు రాకుండా అడుగడుగునా అడ్డుకుంటే ఏమవుతుంది? మనం బాగా వెనుకబడిపోతాం కదా! ఒక్కసారి చైనాను చూడండి! 1978లో చైనా, మన దేశంకన్నా ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండేది. సెజ్‌లను ఉధృతంగా ఏర్పాటు చేసిన కారణంగా ఇప్పుడు ప్రపంచంలో రెండో అతిపెద్ద పారిశ్రామిక ఉత్పత్తుల దేశంగా మారింది. చైనా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగయింది. చైనా జిడిపి ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. భారత్ జిడిపి ఆరు-ఏడు శాతం కూడా దాటడం లేదు. పారిశ్రామికరంగంలో వృద్ధిరేటు బాగా తక్కువ ఉండటమే ఇందుకు కారణం. సెజ్‌లు ఎక్కువగా వస్తే, విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను ఆధారం చేసుకుని సెజ్‌లలో ఉత్పత్తులను భారీగా పెంచుకునే అవకాశం ఉంది. 2004-08 సంవత్సరాల మధ్య జాతీయ స్థూల ఉత్పత్తి రేటు 9 శాతం నమోదు కాగా, రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా మన రాష్ట్రంలో ఇది 10 శాతంగా నమోదయింది. వైఎస్ హయాంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) విపరీతంగా వచ్చాయి. మన రాష్ట్రంలో సహజ వనరులు బాగా ఉన్నాయి. ఖనిజ సంపదతో పాటు 1000 కిలోమీటర్ల పొడవైన కోస్తాతీరం ఉంది. గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోలిస్తే జనసాంద్రత తక్కువేనని స్పష్టమవుతుంది. అందువల్ల అందుబాటులో ఉన్న భూములను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సెజ్‌లకోసం దాదాపు 85 వేల ఎకరాలను సిద్ధంగా ఉంచారు. పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు వచ్చేవారికి భూమి అందుబాటులో ఉంటే ఆకర్షితులవుతారనడంలో సందేహం లేదు. పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వచ్చేవారిపై కేసులు పెట్టి, జైళ్లకు పంపిస్తే, ఎవరైనా ఎలా ముందుకు వస్తారు? పెట్టుబడులకు సానుకూలమైన వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళతారు. సెజ్‌లకు కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికో మరో వ్యాపారానికో వినియోగించుకునేందుకు వీలులేదు. వాస్తవాలు ఇలా ఉంటే సెజ్‌లకు కేటాయించిన భూములను రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నారంటూ ఆరోపణలు చేయడం శోచనీయం. వాస్తవంగా చంద్రబాబు సిఎంగా ఉండగా రాష్ట్రంలో సెజ్‌లను ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి అనేక పర్యాయాలు లేఖలు రాశారన్న విషయం గమనార్హం.
రాష్ట్రంలో సెజ్‌ల కోసం కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంటే మనం తిరోగమనంలో పయనించాల్సి వస్తుంది.
english title:
vena
Date:
Thursday, April 26, 2012