ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం కేటాయించిన భూములను పారిశ్రామికవేత్తలు నిర్ణీత కాలంలో ఒప్పందం మేరకు పరిశ్రమల స్థాపనకు వినియోగించని పక్షంలో ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు వ్యవసాయం నిలిచిపోయి, మరోవైపు పరిశ్రమలు లేక ఇతర ఉత్పత్తుల కోసం వినియోగించని పక్షంలో ఈ భూములు ‘రెంటికి చెడ్డ రేవడి’లా ఉండిపోతున్నాయి. పారిశ్రామికవేత్తలు భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా వినియోగించకపోతే, వారిని క్షమించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎక్కడైనా రైతుల నుండి భూములను స్వాధీనం చేసుకుని, వాటిని పరిశ్రమలకు ఇచ్చిన తర్వాత సద్వినియోగం అయితే నిరుద్యోగులకు ఉపాధి లభించడమే కాకుండా, జాతీయ స్థూల ఉత్పత్తికి కాస్తో, కూస్తో వాటా చేకూర్చినట్టవుతుంది. 2005లో సెజ్‌లు ఏర్పాటు కావడం ప్రారంభమైన తర్వాత, ఈ కార్యక్రమం ధనికులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటోందని స్పష్టమవుతోంది. సెజ్‌ల చట్టం పేద, మధ్య తరగతి రైతుల పాలిట శాపంగా మారిపోయింది. తరతరాలుగా తమ అధీనంలో ఉన్న భూముల్ని రైతులు కోల్పోవడమే కాకుండా, ఉపాధి కూడా కోల్పోతున్నారు. అనేక ప్రాంతాల్లో రైతులను ప్రలోభపెట్టో, బలవంతంగానో వారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. వాస్తవానికి ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని సెజ్‌ల స్థానంలో స్పెషల్ అగ్రికల్చరల్ ఎకనమిక్ జోన్ (ఎస్‌ఎఇజెడ్) లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్‌ఎఇజెడ్‌లలో సంబంధిత రైతులందరికి భాగస్వామ్యం కల్పించాలి. ఆయా ప్రాంతాల్లో ప్రధాన పంటలను ఎంపిక చేసి, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లనే సెజ్‌లలో ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు పత్తిపంట ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తి ఆధారిత స్పిన్నింగ్, వీవింగ్ మిల్లును ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. అలాగే పళ్లు ఎక్కువ ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో పళ్లరసాలు, జాంలు ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చు. ఈ ఉత్పత్తులను తక్కువ ధరలకే వినియోగదారులకు అందించేందుకు వీలుంటుంది. ప్రాసెసింగ్ తర్వాత వచ్చే లాభాల్లో రైతులకు కూడా వాటా ఇవ్వడం వల్ల ఒకవైపు రైతులకు, మరోవైపు పారిశ్రామికవేత్తలకు, ఇంకోవైపు వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుంది. దీనివల్ల సమాజాభివృద్ధి సజావుగా ఉంటుంది. సెజ్‌లలో భూమి లభించిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుండి అనేక రాయితీలు లభిస్తున్నాయి. సెజ్‌ల వెలుపల స్థానికంగా ఏవైనా ఉత్పత్తులు జరుగుతుంటే, అవే తరహా ఉత్పత్తులను సెజ్‌లలో కూడా చేపట్టడం వల్ల సమతూకం దెబ్బతింటుంది. సెజ్‌లలో ఉత్పత్తి ఖర్చు తగ్గడం వల్ల తక్కువ ధరకే ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు వీలవుతుంది. అవే ఉత్పత్తులు సెజ్‌ల వెలుపల జరిగితే ఖర్చులు పెరిగి, అమ్మకం ధరలను అధికంగా నిర్ణయించడం వల్ల సమస్యలు మొదలవుతాయి. దీనివల్ల దేశీయ ఉత్పత్తులు కుంటుపడిపోయే అవకాశం ఉంది. దాంతో కార్మికులకు ఉపాధి అవకాశాలు పోతాయి. భారత కార్మిక చట్టాలు సెజ్‌ల పరిధిలో వర్తించకపోవడం వల్ల కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.
ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం కేటాయించిన భూములను పారిశ్రామికవేత్తలు
english title:
bhoomulu
Date:
Thursday, April 26, 2012