రాజమండ్రి, ఏప్రిల్ 25: మద్యం డిడిల లావాదేవీలు జరిపిందెవరు? మద్యం దుకాణాల లైసెన్సుల వేలంలో దరఖాస్తులతో పాటు చెల్లించాల్సిన మొత్తాల డిడిలు, వేలంలో దక్కించుకున్న దుకాణానికి సంబంధించి డిడి రూపంలో చెల్లించాల్సిన మొత్తం ఏ ఖాతా నుండి ఎవరు డ్రా చేసారు? తదితర వివరాలపై ఏసిబి అధికారులు దర్యాప్తుసాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం మద్యం దుకాణాల లైసెన్సుల కోసం వేలంలో పోటీపడ్డ మద్యం వ్యాపారులు, తాము ఏ ఖాతా నుండి సొమ్ము డ్రా చేసి డిడి తీస్తున్నామో ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడదే కొంప ముంచేలా ఉంది. మద్యం లైసెన్సులను దక్కించుకునేందుకు తమ వద్ద పనిచేసే తెల్లకార్డుదారులైన కార్మికులు, ఇతర ఉద్యోగుల పేరు మీద మద్యం దుకాణాల లైసెన్సుల కోసం టెండర్లు దాఖలుచేయించిన మద్యం వ్యాపారులు తాజా పరిణామాల్లో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బినామీలతో లైసెన్సులు పొందిన చాలా మంది మద్యం వ్యాపారులు సిండికేట్లు ఏర్పాటుచేసుకుని అక్రమంగా మద్యం వ్యాపారం చేసారన్న కోణంలో దర్యాప్తుసాగిస్తున్న ఏసిబి అధికారులు, తీగలాగేందుకున్న అన్ని మార్గాలను అనే్వషిస్తున్నారు. జరుగుతున్న పరిణామాల్లో ఎవరికి వారు తమకు ఎవరూ బినామీలు లేరని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో, తెల్లకార్డులున్న లైసెన్సుదారులు అసలు అంత సొమ్మును వేలంలో లైసెన్సును దక్కించుకునేటపుడు ఎలా చెల్లించారన్న అంశాన్ని ఏసిబి అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దాంతో వేలం సమయంలో తెల్లకార్డులున్న వారు లైసెన్సు ఫీజు చెల్లించేందుకు దాఖలుచేసిన డిడిల వివరాలతో దర్యాప్తు ప్రారంభించారు. డిడి తీసేందుకు వినియోగించిన సొమ్ము ఎవరి ఖాతా నుండి విత్‌డ్రా చేసారో, ఆ ఖాతాదారుడే తెర వెనుక యజమానిగా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అప్పట్లో ఆదరాబాదరా అవకాశం ఉన్న అన్ని మార్గాల్లోను, డిడిలు తీసుకొచ్చి వేలంలో పాల్గొన్న మద్యం వ్యాపారులు ఈ సారి మాత్రం కొంత వరకు ఇరుక్కుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏసిబి అధికారులకు దొరక్కుండా ఏదో విధంగా తప్పించుకున్న కొంత మంది మద్యం వ్యాపారులు తాజా పరిణామాల్లో ఏసిబి విసిరి వలలో చిక్కుకోక తప్పే పరిస్థితి కనిపించటం లేదు. దీనికి తోడు మద్యం దుకాణాలకు మద్యం సరఫరాచేసే మద్యం డిపోల లెక్కల రికార్డులను ఏసిబి అధికారులు స్వాధీనంచేసుకుంటున్నారు. మంగళవారం అమలాపురం డిపోల రికార్డులను పరిశీలించిన ఏసిబి అధికారులు, బుధవారం రాజమండ్రిలో రికార్డులను పరిశీలించారు. గత 22నెలలుగా మద్యం డిపోల నుండి ఎవరెంత మద్యంను కొనుగోలుచేసారు? కొనుగోలుకు వినియోగించిన నగదు ఎక్కడి నుండి వచ్చింది? తదితర కోణాల్లో ఏసిబి అధికారులు దర్యాప్తుచేస్తున్నారు. దాంతో మద్యం వ్యాపారుల్లో ఒక్కసారిగా మరోసారి ఆందోళన మొదలైంది.
డెల్టా ఆధునికీకరణ, తాగునీటి పథకాల పనులకు
ఇసుక సరఫరా
ఎపిడిఎంసి ఎండి ముకేష్‌కుమార్ మీనా
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఏప్రిల్ 25: ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి డెల్టా కాలువల ఆధునీకరణ పనులు, రక్షిత మంచినీటి సరఫరా పధకాల నిర్మాణాలు తదితర ప్రభుత్వ అవసరాలకు అవసరమైన ఇసుకను క్యూబిక్ మీటర్ 147 రూపాయలకు సరఫరా చేసేందుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక పర్మిట్‌లు జారీ చేసేందుకు రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అనుమతిచ్చిందని ఆ సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ మేరకు బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లో నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, మైన్స్ అండ్ జియాలజీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లా యంత్రాంగం లక్షా 20 వేల క్యూబిక్ మీటర్‌ల వరకు ఇసుకను సీజ్ చేయడం జరిగిందన్నారు. దానిలో అవసరమైన ఇసుకను గోదావరి డెల్టాకు ఆధునీకరణ, తాగునీటి పథకాలు తదితర ప్రభుత్వ అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలిక పర్మిట్‌లు జారీ చేసేందుకు ఎపిఎండిసికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు కూడా రాస్తున్నాయని తెలిపారు. ఈ అవసరాలకు తగిన ఇసుకను ఎపిఎండిసి, జిల్లా కలెక్టర్‌ల పర్యవేక్షణలో సరఫరా చేయడం జరుగుతుందని ఏ పనికి ఎంత మొత్తం ఇసుక అవసరం ఉంటుంది, పనిని నిర్వహించే ఏజెన్సీ ఎవరు, డెస్టినేషన్ పాయింట్ తదితర వివరాలను తెలియజేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇసుకను తరలించేందుకు వినియోగించే వాహనాల నెంబర్లు, వాటి సామర్థ్యాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇసుక అవసరమైన ప్రభుత్వ ఏజెన్సీ లేదా కాంట్రాక్ట్ క్యూబిక్ మీటర్‌కు 147 రూపాయల వంతున అవసరమైన మొత్తానికి సరిపడా సొమ్మును ఎపిఎండిసి ఎండి హైదరాబాద్ పేరిట డిడిలు చెల్లించిన తర్వాత ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని మీనా తెలిపారు. జిల్లాలో 4 ప్రాంతాల్లో సుమారు 45 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక సీజ్ చేయబడి ఉందని వాటిలో అయినవిల్లి, సీతానగరం ప్రాంతాలను ఆర్‌డబ్ల్యూఎస్‌కు, గంగవరం, కోరుమిల్లి ప్రాంతాల్లోని ఇసుకను నీటిపారుదల శాఖకు కేటాయిస్తున్నట్లు ఎపిఎండిసి ఎండి కె మీనా పేర్కొన్నారు. ఇసుకను తీసుకువేళ్ళే పాయింట్ నుండి పని నిర్వహించే ప్రాంతానికి అది సక్రమంగా చేరిందీ లేందీ పర్యవేక్షించేందుకు అలాగే వేబిల్లులు జారీ చేసేందుకు కార్పొరేషన్ తరపున సిబ్బందిని నియమించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇసుకను తీసుకున్న ప్రాంతం నుండి పనిని నిర్వహించే ప్రాంతానికి సక్రమంగా ఎంత మొత్తం చేరిందీ ఈ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు. అంతేకాక ప్రతీవారం సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలు ఎంతమొత్తం ఇసుకను ఆయా డెస్టినేషన్ పాయింట్‌లకు చేర్చింది ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల వారీగా కన్సాలిడేటెడ్ నివేదికలను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా సంబంధిత ఇంజనీరింగ్ విభాగం తరపున పనిజరిగే ప్రతి ప్రాజెక్ట్ వద్ద ఒక బాధ్యతాయుత అధికారిని నియమించాలని ఎండి మీనా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నీతూకుమారి మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గతంలో సీజ్ చేసిన ఇసుకను హైకోర్టు ఆదేశాల మేరకు కాలువల ఆధునీకరణ తాగునీటి పధకాల పనులకు ప్రభుత్వం నిర్ధేశించిన ధరకు సరఫరా చేయడం జరుగుతుందని ఆయా పనులకు సక్రమంగా వినియోగించేందుకు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుకను తరలించేందుకు వినియోగించే వాహనాలు రిజిస్ట్రార్ నెంబర్‌లు వాటి సామర్థ్యం తదితర వివరాలను తెలియజేసి ఇసుకను పొందాలని సూచించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో 10 ప్రాంతాల్లో గతంలో సుమారు లక్షా 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను సీజ్ చేయడం జరిగిందని దానిని నేడు హైకోర్టు ఆదేశాల ప్రకారం కాలువల ఆధునీకరణ, మంచినీటి పధకాల పనులకు ఎపిఎండిసి ద్వారా సరఫరా చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆలమూరుకు సంబంధించి కోర్టు స్టే ఉందని మిగతా వాటి నుండి ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ నివాస్, రాజమండ్రి, అమలాపురం ఆర్డీఓలు వేణుగోపాలరెడ్డి, సంపత్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ నందారావు, నీటి పారుదలశాఖ ఇఇలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మద్యం గోదాములో ఏసిబి సోదాలు
రాజమండ్రి, ఏప్రిల్ 25: మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడినట్లు చట్టపరంగా నిర్ధారించేందుకు అవినీతి నిరోధకశాఖ అధికారులు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎపిబిసిఎల్) గోదాముల్లో సోదాలు జరుపుతున్నారు. మంగళవారం అమలాపురం గోదాములో సోదాలు నిర్వహించగా, బుధవారం సాయంత్రం రాజమండ్రిలోని ఎపిబిసిఎల్ గోదాములో డిఎస్పీ సి భాస్కర్‌రెడ్డి, సిఐ రామకృష్ణ సోదాలు నిర్వహించారు. ఈసందర్భంగా గోదాము ఇన్‌చార్జిని విచారించారు. మద్యం వ్యాపారానికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లు, పర్మిట్లు, ఇండెంట్లు, రిజిస్టర్లు, స్టాక్‌కు సంబంధించిన ఫైళ్లను సీజ్ చేశారు. బుధవారం అర్థరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఈసందర్భంగా డిఎస్పీ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారా లేదా అన్న అంశాన్ని రుజువు చేసేందుకు ఈసోదాలు జరుపుతున్నామని చెప్పారు. జిల్లాలో 555 మద్యం షాపులు ఉన్నాయని, మద్యం షాపులకు సంబంధించిన టెండర్లను పరిశీలించగా 365 మంది వ్యాపారులు తెల్లరేషన్‌కార్డుదారులేనని తేలిందన్నారు. ఈమేరకు వారిపై కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలోని గోదాముల్లో స్టాకు తరలింపు, మద్యం అమ్మకాల మధ్య తేడాను పరిశీలిస్తున్నామన్నారు. తద్వారా నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయా లేదా అన్న అంశం కూడా వెలుగులోకి వస్తుందన్నారు. మద్యం సిండికేట్లకు సంబంధించిన ఆధారాలు లభ్యమైతే సూత్రధారులను అరెస్టు చేస్తామని భాస్కర్‌రెడ్డి చెప్పారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటా
*చాలెంజ్-3 విన్నర్ లిఖిత
మామిడికుదురు, ఏప్రిల్ 25: సామాజిక సేవే లక్ష్యంగా నిర్వహించే అన్ని డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఛాలెంజ్-3 విన్నర్ పెచ్చెట్టి లిఖిత అన్నారు. మాటీవీలో ప్రసారమయ్యే ఛాలెంజ్-3 విన్నర్‌గా నిలిచిన లిఖిత బుధవారం మామిడికుదురులో విలేఖరులతో మాట్లాడారు. ఈ విజయం ద్వారా తాము గెలుచుకున్న 25లక్షల నుండి 20లక్షలను బియ్యపుతిప్పకు వెళ్లే ఫైబర్‌బోటు కోసం బహుమతిగా అందజేశానని పేర్కొన్నారు. పోటీ ఆరంభంలో విధించిన నియమ నిబంధనల ప్రకారం విజేత 20లక్షల రూపాయలు బియ్యపుతిప్ప సంఘటనకు సంబంధించి అందజేయాల్సి ఉంటుందని లిఖిత వివరించారు. దీని ప్రకారమే ఆ 20లక్షలను ఇచ్చానని ఆమె తెలిపారు. ఈ విధంగా సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా నిర్వహించే ఏ పోటీల్లోనైనా పాల్గొంటానని ఆమె చెప్పారు. జీటీవీ నిర్వహించిన ఆట-5 పోటీల్లో ఫైనల్‌కు చేరుకునేటప్పటికీ విజయం సాధించకపోవడం కొంత నిరాశా నిస్పృహలకు గురిచేసిందన్నారు. తాను ఛాలెంజ్-3లో గెలుపొందేందుకు ఎస్‌ఎంఎస్‌లు పోలీసు విభాగానికి, విద్యార్థినీ విద్యార్థులకు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మద్యం మాఫియాలో టిడిపి పాత్ర ఎక్కువ
*బెల్ట్‌షాపులు బాబు హయాంలోనే వెలిసాయి*ఎస్‌ఇజెడ్ పాపం బాబుదే*మంత్రి తోట
కడియం, ఏప్రిల్ 25: రాష్ట్రంలో టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులు బినామీ పేర్లతో మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని, మద్యం మాఫియాలో వారి పాత్రే ఎక్కువని, అందుకే ఎసిబి దాడులంటే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి తోట నరసింహం అన్నారు. బుధవారం కడియం మండలంలో మంత్రి తోట పర్యటించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ మద్యంపై ఉద్యమిస్తానంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ఎవరూ నమ్మరని, ఎన్టీఆర్ మద్యపాన నిషేధం విధిస్తే, బాబు గ్రామ గ్రామాన మద్యం షాపులు తెరిచారన్నారు. అవి చాలక బెల్ట్ షాపులను కూడా బాబు ప్రోత్సహించారన్నారు. మద్యం వ్యాపారంలో లొసుగులను బట్టబయలు చేసేందుకు ఎసిబి రాష్టవ్య్రాప్తంగా దాడులు జరుపుతోందని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధీనంలో పనిచేసే ఎసిబికి అడ్డు చెబితే, ఆ దాడులు ఆగిపోతాయన్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎటువంటి జోక్యం చేసుకోలేదన్నారు. తెలుగుదేశం పార్టీలోనే మద్యం మాఫియా ఎక్కువగా ఉందని తోట ఆరోపించారు. విజయనగరం జిల్లాలో టిడిపి ధర్నాకు అనుమతి ఇవ్వలేదని జిల్లా ఎస్పీని నోటికొచ్చినట్లు విమర్శించారని, అది చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ధర్నాకు అనుమతి కోరిందని, తమకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వలేదని బాబు తెలుసుకోవాలన్నారు. పచ్చని పొలాలపై ఎస్‌ఇజెడ్ చిచ్చురేపింది చంద్రబాబేనని మంత్రి తోట పేర్కొన్నారు. 2002లో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్‌ఇజెడ్‌కు అనుకూలంగా 169 జివోను విడుదల చేసారన్నారు. విజన్-2020 అంటూ ఎస్‌ఇజెడ్‌ను ప్రోత్సహిస్తూ హైటెక్ ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పర్యటించి నాగళ్ళు పట్టుకుని రైతు వేషధారణల్లో నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ పిసిసి సభ్యులు తోరాటి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రయ్య, మాజీ సర్పంచ్‌లు గట్టి నర్సయ్య, దూడల నాగేశ్వరరావు, సాంపిరెడ్డి సూరిబాబు, కాంగ్రెస్ నాయకులు వారా రాము, జి సత్యనారాయణ, ఎడ్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా ఎమ్మెల్యే బండారు తనయుడి వివాహం
రావులపాలెం, ఏప్రిల్ 25 : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రథమ కుమారుడు సందీప్ వివాహం పెద్దాడకు చెందిన పోలిశెట్టి సుబ్బారావు కుమార్తె సునీతతో రావులపాలెం సిఆర్‌సిలో బుధవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం నుండే రావులపాలెం సిఆర్‌సి రోడ్డు వచ్చిపోయే అతిథులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బండారు అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ వివాహ వేడుకలకు చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు, రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖామంత్రి తోట నరసింహం, డిసిసి అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు, ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, రాజా అశోక్‌బాబు, పాముల రాజేశ్వరీదేవి, వేగుళ్ళ జోగేశ్వరరావు, రాపాక వరప్రసాదరావు, టిడిపి జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, మానేపల్లి అయ్యాజీవేమా, పిసిసి కార్యదర్శి కెవి సత్యనారాయణరెడబ్డి, మాజీ జడ్‌పి ఛైర్మన్ చెల్లుబోయిన వేణు, జడ్‌పి సిఇవో భవానీదాస్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు. ఎమ్మెల్యే బండారు ప్రతీ ఒక్కరినీ సాదరంగా ఆహ్వానించారు. తెల్లవారు జామున ముహూర్తం కాగా రాత్రి 7 గంటల నుండి రిసెప్షన్ నిర్వహించారు.
వైభవంగా శ్రీచక్రపీఠం ప్రతిష్ఠాపన మహోత్సవం
రాజమండ్రి, ఏప్రిల్ 25: రాజమండ్రి గోదావరితీరంలోని గౌతమీఘాట్‌లో నిర్మించిన అక్షరకోటి గాయత్రీ శ్రీచక్రపీఠం ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల సూక్త గాయత్రీ మంత్రోచ్చరణల మధ్య తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి, విజయదుర్గా పీఠాధిపతి వెదురుపాక గాడ్ షట్‌చక్ర సహిత గాయత్రీమాతల విగ్రహాలు, శ్రీచక్రప్రతిష్టలు జరిగాయి. కపిలవాయి రామశాస్ర్తీ, ఏలూరిపాటి మల్లిఖార్జునశర్మ నేతృత్వంలో వందమందికి పైగా రుత్విక్కులు ఈప్రతిష్ఠాపన మహోత్సవంలో పాలుపంచుకున్నారు. గణపతి సహస్ర శివలింగం, విష్ణుమూర్తి, సూర్యనారాయణమూర్తి, క్షేత్రపాలక కార్తికేయస్వామి, ఆంజనేయస్వామి, సరస్వతి, షిర్డీసాయి, దుర్గా, లక్ష్మీ, అన్నపూర్ణ, దత్తాత్రేయ ఉపాలయాల్లో విగ్రహప్రతిష్ఠలు చేశారు. ఈసందర్భంగా సచ్చిదానంద సరస్వతి మాట్లాడుతూ కొన్ని కార్యాలను స్వయంగా గాయత్రీమాతే నిర్వహించుకుంటుందన్నారు. శ్రీచక్రపీఠం కూడా అలాంటిదేనన్నారు. వెదురుపాక గాడ్ మాట్లాడుతూ ఓంకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపమన్నారు. గాయత్రీ పంచభూతాత్మకమైన స్వరూపని పేర్కొన్నారు. పీఠం నిర్మాణకర్త సవితాల చక్రభాస్కరరావు మాట్లాడుతూ గోదావరితీరంలో ఒక మహోన్నత కట్టడాన్ని నిర్మించే అవకాశం రావడం వేదమాత గాయత్రీ దివ్య ఆశీస్సుల వల్లే సాధ్యమైందన్నారు. పీఠం నిర్మాణంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దూళిపాళ మహదేవమణి, ఎర్రాప్రగడ రామకృష్ణ పలు ఆధ్యాత్మిక విశేషాలను భక్తులకు వివరించారు. అనంతరం అన్నసమారాధన జరిగింది. ఈకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు.
సత్యనారాయణస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
అన్నవరం, ఏప్రిల్ 25: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి వారి కళ్యాణ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పెద్దాపురం ఆర్డీఓ కె నటరాజ్ తెలిపారు. బుధవారం కొండపై ప్రెస్ బోర్డు మీటింగ్ హాల్ నందు వివిధ శాఖల అధికారులతో ఆర్డీఓ సంయుక్త సమావేశం నిర్వహించారు. మే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 7 రోజుల పాటు శ్రీసత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని, 2వ తేదీన 9.30 గంటలకు శ్రీస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని, 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు గ్రామోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలు అందించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆయన అధికారులను కోరారు. ముఖ్యంగా విద్యుత్, ఆర్ అండ్‌బి, నీటిపారుదల శాఖ, ట్రాన్స్‌కో, వైద్య ఆరోగ్య, పోలీస్ డిపార్ట్‌మెంట్ తదితర విభాగాల సేవలు ఎంతో అవసరమని ఆయా అధికారుల సిబ్బంది, దేవస్థాన అధికారులతో సమన్వయం అయ్యి కార్యక్రమాల నిర్వాహణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఇఓ కె రామచంద్రమోహన్ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రామాలయం పక్కన కళ్యాణ వేదిక ఏర్పాట్లను ఆర్డీఓ, డిఎస్పీలకు ఇఓ వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కె కరణం కుమార్, ప్రధాన అర్చకులు కె సత్యనారాయణ, వేద పండితులు గొల్లపల్లి సుబ్రహ్మణ్యశర్మ, ఇఇ వి ప్రసాదరావు, ఎఇఓ కె రామచంద్రమోహన్, తులారాముడు తదితరులు పాల్గొన్నారు.