మంగళగిరి, ఏప్రిల్ 25: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మాదిగ ప్రజలను మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కృష్ణమాదిగ ఈనెల 5న చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ప్రారంభించిన మాదిగల తిరుగుబాటు యాత్ర బుధవారం మంగళగిరి నియోజకవర్గానికి చేరింది. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్లో కృష్ణమాదిగ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004 ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఉల్లంఘించి మోసగించిందని ధ్వజమెత్తారు. 18 ఏళ్ళక్రితం ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం కేవలం మాదిగ ప్రజల కోసమే కాదని, అణగారిన వర్గాల ప్రజల సంక్షేమానికని కృష్ణమాదిగ అన్నారు. 2004లోనే వర్గీకరణ చేపట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ 2008లోనే వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి నివేదిక ఇచ్చిందని, వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని 2009 ఎన్నికల మానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని , రాష్ట్ర జాతీయ పార్టీలు అన్నీ ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖకు రాశాయని, రాజకీయంగా సాంకేతిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలనే వర్గీకరణ జరగడం లేదని కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. వైఎస్ పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, వికలాంగులకు పెన్షన్లు ఎమ్మార్పీఎస్ ప్రేరణేనని, వాటి లబ్ధిదారులు అందరూ మాదిగలు మాత్రం కాదని, అన్ని వర్గాలవారు ఉన్నారని ఆయన అన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. ఇంతకాలం కాంగ్రెస్, టిడిపిలకు ఓట్లు వేశామని త్వరలోనే కొత్తపార్టీ స్థాపిస్తున్నందున ఇక మన ఓట్లు మనమే వేసుకుందామని ఆయన అన్నారు. కొత్తగా పార్టీ పెట్టిన జగన్ విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. న్యాయవాది వై కోటేశ్వరరావు, కోస్తాజిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ మల్లవరపు నాగయ్య, జిల్లా కార్యదర్శి గుంటూరు ఎలీషా, ఇందుపల్లి రామారావు, రజకసంఘం రాష్టన్రేత ముప్పు భిక్షపతి, శ్రీనివాసరావు, చిలువూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో
అధికారులు విఫలం
ప వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు, ఏప్రిల్ 25: నగర ప్రజలకు సక్రమంగా తాగునీరు అందించడంలో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజులుగా నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వేసవి ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఈనెల 25 నుండి నగరానికి మంచినీరు అందించే గుంటూరు ఛానల్‌కు నీటిని నిలిపి వేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించినప్పటికీ నగరపాలక సంస్థ అధికారుల్లో ఏ మాత్రం స్పందన కానరాకపోవడం విచారకరమన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో తాగునీరు అందించేందుకు 150 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి మంజూరు చేయించామని అటు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఇటు ఎంపి రాయపాటి సాంబశివరావు పోటాపోటీగా ప్రకటనలు గుప్పించారని అన్నారు. అయితే ప్రకటనలు ఇచ్చి నెలలు గడుస్తున్నా సంబంధిత పనులు ప్రారంభించక పోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అసలు ఆ నిధులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గతేడాది సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గుంటూరు వచ్చిన సమయంలో రూ. 490 కోట్లతో సమగ్ర మంచినీటి పథకానికి శంకుస్థాపన చేయించి శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశారని, ఇప్పటికీ ఆ పనులు శిలాఫలకానికే పరిమితమయ్యాయని విమర్శించారు. సమగ్ర మంచినీటి పథకానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికీ మంత్రివర్గ ఆమోదం పొందలేదని, ఇది పూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని స్పష్టం చేశారు. మంత్రి వర్గ ఆమోదం, కేంద్ర ఆమోదం, చివరిగా ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపిన తరువాతే సమగ్ర మంచినీటి పథకం పనులు ప్రారంభమవుతాయని, ఇవన్నీ ఎప్పటికీ జరిగేనో సంబంధిత ప్రజా ప్రతినిధులకే తెలియాలని అన్నారు. తక్షణం ప్రజలకు నీరు అందించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వస్తుందని అప్పిరెడ్డి హెచ్చరించారు. విలేఖర్ల సమావేశంలో ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిబాబు, నగర యువజన విభాగం కన్వీనర్ నసీర్ అహమ్మద్, నాయకులు శిఖా బెనర్జీ, దాసరి శ్రీనివాస్, అత్తోట జోసఫ్, మందపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
ఉప ఎన్నికలకు
టిడిపి సిద్ధం
ప పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 25: జిల్లాలో జరగనున్న ఉప ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పుల్లారావు మాట్లాడారు. ఇప్పటికే జిల్లా పార్టీ ముఖ్యనేతలకు ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఈనెల 27వ తేదీన మిర్చి రైతులతో కలిసి చేపట్టదలచిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను కార్యకర్తలు, నాయకులు అడ్డుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలతో ఉన్న హోర్డింగులను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉప ఎన్నికలు జరిగే రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు 27వ తేదీ ఉదయం ఎన్‌టిఆర్ భవన్‌లో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు ఆధ్వర్యంలో ముఖ్యనేతల సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, నిమ్మకాయల రాజనారాయణ, దాసరి రాజామాస్టారు, వెన్నా సాంబశివారెడ్డి, కనగాల చిట్టిబాబు, మాదల వెంకటేశ్వర్లు, షేక్ లాల్‌వజీర్, కొర్రపాటి నాగేశ్వరరావు, చిట్టాబత్తుని చిట్టిబాబు, రాయపాటి సాయి, సగ్గెల రూబెన్, కసుకుర్తి హనుమంతరావు, గుడిమెట్ల దయారత్నం, బెజవాడ శివరామకృష్ణారెడ్డి, కొల్లికొండ శంకర్, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలు
అచ్చంపేట, ఏప్రిల్ 25: మంచినీటి కోసం స్థానిక ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటు, గ్రామస్థులు బుధవారం రోడ్డెక్కి తాగునీరు అందించే వరకూ కదలబోమంటూ ఆంజనేయస్వామి విగ్రహం సెంటర్‌లో ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి వైఎస్‌ఆర్ సిపి, ఎంఆర్‌పిఎస్, డిబిఎఫ్ మద్దతు తెలపడంతో గంటన్నరకు పైగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైఎస్‌ఆర్ సిపి నాయకులు ఎస్ సత్యం మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో మూడు సంవత్సరాల క్రితం వాటర్ ట్యాంకు నిర్మించి పైపులైను వేయక పోవడంతో ట్యాంకు ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పైపులైను నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి 3 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీపై ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, వాటిలో నివసించే ప్రజానీకం మనుషులు కారా అని ప్రశ్నించారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఎంపిడిఒ పిఎస్ పద్మాకర్‌తో అన్ని కాలనీల్లో మంచినీరు, రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణాలతో పాటు బావులలో పూడిక తీయించి బోర్లు వేయిస్తామని హామీ ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. దీంతో ఎంపిడిఒ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఎలాంటి హామీ ఇవ్వలేమన్నారు. మంచినీరయితే అవసరాలకు అనుగుణంగా ట్యాంకుల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. లిఖితపూర్వకంగా సమస్యలను అందిస్తే కలెక్టర్‌కు తెలియజేస్తామన్నారు. మంచినీటి హామీతో శాంతించిన కాలనీవాసులు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపిడిఒకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌రెడ్డి, పుల్లారావు, దాసుబాబు, వెంకట్రావ్, రెహమాన్, సుబ్బారావు, శ్యాంసన్, బాలస్వామి, సాంబిరెడ్డి, వెంకటరెడ్డి, ఆయా కాలనీల మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు.
హత్యకేసులో ఆరుగురి అరెస్ట్
గుంటూరు (క్రైం), ఏప్రిల్ 25: నగర శివారులోని వెంగళాయపాలెం గ్రామంలో జరిగిన రవిబాబు హత్యకేసులో ఆరుగురిని తాలూకా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వెంగళాయపాలెం గ్రామంలో రవిబాబుకు, వెంకట్రావులకు మధ్య కొంతకాలంగా స్థల వివాదం నెలకొని ఉంది. కోర్టులో దావా రాజీపడాలని వెంకట్రావ్ తీవ్రస్థాయిలో రవిబాబుపై ఒత్తిడి తెచ్చేవాడు. అయినప్పటికీ రవిబాబు అంగీకరించక పోవడంతో కక్షకట్టిన వెంకట్రావ్ తన స్నేహితులైన భిక్షాలు, శ్రీనివాసరావు, అంకమ్మ, విజయబాబు, రాంబాబు, జయపాల్‌తో కలిసి ఈనెల 10వ తేదీన వెంగళాయపాలెంలో రవిబాబును హతమార్చారు. ఈ కేసు లో నిందితులైన వెంకట్రావ్, బిక్షాలు, శ్రీనివాసరావు, అంకమ్మ, విజయబాబు, రాంబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. జయపాల్ పరారీలో ఉన్నాడు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
గుంటూరు (క్రైం), ఏప్రిల్ 25: ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు సిమెంటు కంపెనీ మేనేజర్ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గురజాలలోని ఆంధ్రా సిమెంట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న మంచినేని లక్ష్మీనారాయణరావు (56) గుంటూరులోని వికాస్‌నగర్‌లో నివాసముంటున్నారు. బుధవారం ఉద్యోగ పనుల నిమిత్తం పేరేచర్ల గ్రామానికి మోటారు సైకిల్‌పై వెళ్లి తిరిగి గుంటూరుకు వస్తుండగా నగర శివారులోని పలకలూరు రోడ్డు వద్దనున్న విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వెనకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పట్ట్భాపురం పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రా ప్యారిస్‌పై ఏసీబీ గురి!
తెనాలి రూరల్, ఏప్రిల్ 25: రాష్టవ్య్రాప్తంగా వైన్స్ సిండికేట్స్ కార్యాలయాలపై దాడులు నిర్వహించి సంచలన సృష్టించిన ఏసిబి అధికారుల నిఘా ఆంధ్రా ప్యారిస్ వైపునకు మళ్లింది. ఇందుకు మంగళవారం రాత్రివరకు ఏసిబి సిఐ రాజగోపాలనాయుడు ఆధ్వర్యంలో వైన్స్ గోదాముల్లో తనిఖీలు నిర్వహించటం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. వివరాలు ఇలాఉన్నాయి.... రాష్టవ్య్రాప్త దాడుల్లో భాగం గా జిల్లాలోను ఏసిబి అధికారులు సిండికేట్ల కార్యాలయాలపై దాడులు నిర్వహించి అనేకమంది వైన్స్ సిండికేట్ ప్రముఖులు, రాజకీయ నాయకు లు, అధికారులను విచారించటం, అరెస్టులు చేయటం, కోర్టులో హారుపరచటం వంటి సంఘటనలు కొనసాగుతున్న విషయం పాఠకులకు విదితమే. ఈనేపథ్యంలో మొదటగా తెనాలి వైన్స్ డిపో, మేనేజర్ గృహంపై దాడులతో ప్రారంభమైన ఏసిబి సోదాలు క్రమం గా తెనాలి డివిజన్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయంపై దాడులు వర కూ కొనసాగించింది.
ఈసందర్భంగా కార్యాలయానికి సంబంధించి పలు రికార్డులను స్వాధీనం చేసుకొంది. అయితే ఈదాడులకు సంబంధించి ఎ వరినీ అదుపులోకి తీసుకొనకపోవటం విశేషం. క్రమంగా కొనసాగుతున్న ఏసిబి దాడులు మరోమారు తెనాలి మండలం అంగలకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని లిక్కర్ గోదాముల్లో మంగళవారం రాత్రి వరకూ ఏసిబి సిఐ రాజగోపాలనాయుడు ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి. ఈసందర్భంగా అధికారులు గోదాములకు సంబంధించిన అనేక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
జిల్లా వ్యాప్తంగా
జూనియర్ సివిల్ జడ్జీల బదిలీ
గుంటూరు (లీగల్), ఏప్రిల్ 25: గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు నగరం నుండి ఐదుగురు మేజిస్ట్రేట్‌లను బదిలీ చేశారు. గుంటూరు 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె రాంబాబును తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీచేసి ఆయన స్థానంలో అమలాపురంలో పనిచేస్తున్న కె శ్రీదేవిని నియమించారు. మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి లక్ష్మిని కృష్ణాజిల్లా తిరువూరు బదిలీ చేశారు. 4వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆర్ డ్యానీరూత్‌ను పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు, 5వ మేజిస్ట్రేట్ ఎం గురునాథ్‌ను రాజమండ్రి 7వ కోర్టుకు బదిలీ చేశారు. గురునాథ్ స్థానంలో కొవ్వూరులో పనిచేస్తున్న సుంకర శ్రీదేవిని నియమించారు. మొబైల్ మేజిస్ట్రేట్ జి భూపాల్‌రెడ్డి గుంటూరులోనే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా నియమించి ఆయన స్థానంలో ఏ రామచంద్రరావును నియమించారు.
పొన్నూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్ రామకృష్ణను కడప జిల్లా రాయచోటికి బదిలీ చేసి ఆయన స్థానంలో ఒంగోలులో పనిచేస్తున్న బి బేబిరాణిని నియమించారు. పొన్నూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌వి నెల్సన్‌రాజుని విశాఖపట్నంకు బదిలీ చేశారు. నిడదవోలులో పనిచేస్తున్న పి భాస్కరరావును గురజాల, తాడేపల్లి గూడెంలో పనిచేస్తున్న కె సూర్య కోటేశ్వరరావును పిడుగురాళ్ల, విజయనగరంలో పనిచేస్తున్న బి అప్పలస్వామిని రేపల్లెకు, ముమ్మడివరంలో పనిచేస్తున్న కె వాసుదేవరావును నర్సరావుపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిలుగా నియమించారు. నర్సరావుపేట రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి నాగ వెంకటలక్ష్మిని తిరుపతికి బదిలీ చేశారు.
గురజాల 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె మధుస్వామిని జంగారెడ్డిగూడెంకు బదిలీ చేసి, ఆయన స్థానంలో పుత్తూరులో పనిచేస్తున్న కె రత్నకుమార్‌ను నియమించారు. సత్తెనపల్లి ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా తాడేపల్లి గూడెంలో పనిచేస్తున్న ఎం కుముదినిని నియమించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పనిచేస్తున్న వై గోపాలకృష్ణను బాపట్ల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా నియమించారు.
లోక్ అదాలత్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి
చిలకలూరిపేట, ఏప్రిల్ 25: లోక్ అదాలత్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని జిల్లా రూరల్ అడ్మిన్ ఎస్‌పి శ్యాంప్రసాద్ అన్నారు.
బుధవారం పట్టణంలోని కెవి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో ఫిర్యాదుదారులు కక్షిదారులను క్షమించినట్లయితే వారికి శిక్షను తొలగిస్తారన్నారు. చిన్న చిన్న గొడవలు, కక్షలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలాన్ని, జీవితాన్ని వ్యర్థం చేసుకోవడమేనన్నారు. లోక్ అదాలత్‌లో కేసును కొట్టివేసిన తరువాత రెండవసారి కక్షిదారుడు ఫిర్యాదు దారుడ్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా న్యాయస్థానంలో జీవితకాలం శిక్షపడే అవకాశముందన్నారు. అర్ధరాత్రైనా ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించే శాఖ పోలీసుశాఖేనని, అటువంటి శాఖ బలవంతపు రాజీలు చేస్తున్నారనే మాటలు బూటకమన్నారు. నర్సరావుపేట డిఎస్‌పి వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో క్రైం డిఎస్‌పి వరప్రసాద్, సిఐలు కెవి నారాయణ, అళహరి శ్రీనివాస్, జె శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ కార్యదర్శి దాసరి చిట్టిబాబు, ఎపిపి రాధిక, ఎస్‌ఐలు సాంబశివరావు, మురళి, నారాయణ, రాధాకృష్ణ, కక్షిదారులు పాల్గొన్నారు.
విఆర్‌ఒల కౌనె్సలింగ్ వాయిదా
గుంటూరు, ఏప్రిల్ 25: ఉప ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈనెల 26వ తేదీన జరగాల్సిన గ్రామ రెవెన్యూ అధికారుల కౌనె్సలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కౌనె్సలింగ్ తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
కార్మికులందరూ సభ్యత్వం తీసుకోవాలి
యడ్లపాడు, ఏప్రిల్ 25: భవన, ఇతర నిర్మాణాల కార్మికులంతా పైలెట్ ప్రాజెక్టులో సభ్యత్వం తీసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ గుంటూరు ఎన్ శేషగిరిరావు కోరారు. యడ్లపాడులో రీచ్ సేవా సంస్థ, కార్మికశాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్మిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులంతా పైలెట్ ప్రాజెక్టులో సభ్యులు కావాలని, ఇది కార్మికుల శ్రేయస్సుకు బాటలు వేస్తుందని అన్నారు. ఇందువల్ల అనేక ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం ఏర్పడుతుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జి సుబ్బారావుమాట్లాడుతూ కార్మికులు మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నరసరావుపేట అసిస్టెంట్ కమిషనర్ ఆశారాణి, రీచ్ సేవా సంస్థ అధ్యక్షుడు పులిపాటి కెనడి, చిలకలూరిపేట అసిస్టెంట్ కార్మిక అధికారి పద్మావతి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
అచ్చంపేట, ఏప్రిల్ 25: బస్సు లగేజీ దించే ముఠా మేస్ర్తీ పనులు ముగించుకుని భోజనానికి వెళ్తున్న తరుణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తపల్లికి చెందిన నిప్పు కొండలు, బుధవారం ఎప్పటిలాగే కూలి పనులు ముగించుకుని మధ్యాహ్న భోజనానికి అటుగా వెళ్తున్న నరహరి ద్విచక్ర వాహనాన్ని ఎక్కి బయలుదేరాడు. వాహనం సినిమాహాలు సెంటర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న కొండలు ఎడమకాలి ఎముక పూర్తిగా విరిగిపోయి వేలాడింది. బండిపై ఉన్న నరహరికి కూడా స్వల్పగాయాలు కాగా వీరిని వెంటనే గుంటూరు వైద్యశాలకు తరలించారు.
యానిమేటర్ల దీక్షలకు
వైఎస్‌ఆర్ సిపి నేతల మద్దతు
పొన్నూరు, ఏప్రిల్ 25: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట గత ఆరు రోజులుగా యానిమేటర్లు కొనసాగిస్తున్న దీక్షా శిబిరాన్ని నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్‌కె యాసిన్ బృందం బుధవారం సందర్శించి మద్దతు పలికారు. గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు విశేష సేవలందిస్తున్న యానిమేటర్లకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యాసిన్ డిమాండ్ చేశారు. యానిమేటర్ల నాయకురాలు కొర్నెపాటి ప్రభావతి నాయకత్వంలో దీక్షలు జరుపుతున్న యానిమేటర్ల బృందాన్ని యాసిన్‌తో పాటు పుట్లాసంపత్ కోట్లూరి శ్రీహరి, సత్యనారాయణ, గేరా మల్లి, జాఫర్ అలి, కావేటి అంజలి, బుర్రా విజయ్, రాకేష్, సుమన్‌లతో పాటు సిఐటియు నాయకులు ఎంఎ బాషా, సిపిఎం నాయకులు మువ్వా వెంకట్రావ్, ఆవాజ్ కమిటీ నాయకుడు రవూఫ్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి విజయభాస్కర్, శ్రీనివాసులు తమ మద్దతు ప్రకటించారు.
గుర్తింపులేని పాఠశాలలపై
చర్య తీసుకోవాలని ధర్నా
సత్తెనపల్లి, ఏప్రిల్ 25: గుర్తింపులేని పాఠశాలలపై ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని ఎఐఎస్‌ఫ్ ఏరియా అధ్యక్షుడు కుర్రం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గుర్తింపు లేని పాఠశాలలను వెంటనే మూసివేయాలని కోరుతూ బుధవారం నాడు స్థానిక గడియారం స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 942 ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో సగానికి పైగా గుర్తింపు లేకుండా, ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖాధికారులు చోద్యం చూడడం విచారకరమన్నారు. అసలు కనీసం కొన్ని పాఠశాలలయితే దరఖాస్తు కూడా చేయకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు పనిచేస్తుందే ఇట్టే అర్థమవుతుందన్నారు. సత్తెనపల్లి పట్టణంలో దాదాపు 15పాఠశాలలను గుర్తింపు లేకుండా నడుపుతూ, పిల్లల వద్ద నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే స్పందించి గుర్తింపు లేని పాఠశాలలపై తగు చర్యలు తీసుకొని, అందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు. అనంతరం నారాయణ పాఠశాల దిష్టిబొమ్మను ఎఐఎస్‌ఎఫ్ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ నాయకులు షేక్ హబీబుల్లా, గోవర్ధనరెడ్డి, అచ్చిరెడ్డి, బాలరాజు, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.
వ్యాయామ ఉపాధ్యాయులకు
శిక్షణ తరగతులు నిర్వహించాలి
సత్తెనపల్లి, ఏప్రిల్ 25: క్రీడారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహించాలని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం డివిజన్ అధ్యక్షుడు ఎస్ నాగిరెడ్డి, జోనల్ ప్రధాన కార్యదర్శి గండు సాంబశివరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి లాకు పిచ్చయ్య బుధవారం నాడు ఒక ప్రకటనలో కోరారు. ప్రతి సంవత్సరం ఆర్‌విఎం, ఆర్‌ఎంఎస్‌ఏ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా నిర్వహించాలన్నారు. మారుతున్న సమాజ పరిస్థితుల దృష్ట్యా ఇటువంటి శిక్షణా తరగతుల వల్ల ఉపాధ్యాయులకు క్రీడా నియమాల పట్ల మరింత అవగాహన కలిగే అవకాశం ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. ఆ మేరకు తాము సత్తెనపల్లి ఉప విద్యాశాఖాధికారి పివి శేషుబాబుకు వినతిపత్రం కూడా అందచేసినట్లు వారు ఆప్రకటనలో తెలిపారు.
మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాసరావు
మంగళగిరి, ఏప్రిల్ 25: మంగళగిరి మున్సిపల్ కమిషనర్‌గా నియమితులైన పి శ్రీనివాసరావు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా ఉన్న సిహెచ్ శ్రీనివాస్ నుంచి పి శ్రీనివాసరావు బాధ్యతలు తీసుకున్నారు. కొత్త కమిషనర్ శ్రీనివాస్‌ను మున్సిపల్ డిఇ బ్రహ్మానందం, ఎఇలు ఏడుకొండలు, శివాజీ, ఆర్‌ఐ యశోదరావు, జెటిఓ వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర తదితర మున్సిపల్ సిబ్బంది కలిసి అభినందనలు తెలియజేశారు. చీరాల మున్సిపల్ మేనేజర్‌గా పనిచేస్తూ శ్రీనివాసరావు బదిలీపై మంగళగిరి కమిషనర్‌గా వచ్చారు. కాగా ఇప్పటి వరకు కమిషనర్‌గా పనిచేసిన సిహెచ్ శ్రీనివాస్ వీడ్కోలు సభ మున్సిపల్ కార్యాలయంలో ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యాన నిర్వహించారు. కమిషనర్ శ్రీనివాస్‌తో పాటు పదోన్నతిపై పిఠాపురం మున్సిపల్ ఎకౌంటెంట్‌గా వెళుతున్న డి విజయకుమార్‌ను ఎంప్లారుూస్ ఘనంగా సన్మానించారు.
ఆర్‌ఎస్‌ఐ విక్టర్‌కు అభినందన
మంగళగిరి, ఏప్రిల్ 25: మంగళగిరిలోని ఎపిఎస్‌పి ఆరో బెటాలియన్‌లో ఆర్‌ఎస్‌ఐగా పని చేస్తున్న కె విక్టర్ ఇండోర్‌లో జరిగిన 12వ ఆలిండియా పోలీసు షూటింగ్ కాంపిటేషన్స్‌లో రజతపతకం సాధించిన సందర్భంగా బుధవారం బెటాలియన్‌లో జరిగిన కార్యక్రమంలో కమాండెంట్ కె సూర్యచంద్ విక్టర్‌ను ఘనంగా సన్మానించారు. విక్టర్ గతంలో నాలుగు సార్లు ఆలిండియా పోలీసు షూటింగ్‌కు అర్హత సాధించారు. గత జనవరిలో జరిగిన 54వ రాష్ట్ర పోలీసు షూటింగ్ కాంపిటేషన్స్‌లో ఆయన రెండు మెడల్స్ సాధించారు. రెండు పర్యాయాలు ఆలిండియా ఓపెన్ షూటింగ్ కాంపిటేషన్స్‌కు అర్హత సాధించి ఫ్రీ పిస్టల్, ఎయిర్ పిస్టల్‌లో టాప్ 10లో నిలిచారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు
గుంటూరు (కార్పొరేషన్), ఏప్రిల్ 25: నగరపాలక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె సుధాకర్ హెచ్చరించారు. బుధవారం నగర పర్యటనలో భాగంగా ఆయన నలందానగర్ 1వ అడ్డరోడ్డు, శ్యామలానగర్ 8వ లైను, 4/1, విద్యానగర్, వికాస్‌నగర్ 2వ లైను, సాయిబాబా రోడ్డు 1వ లైను తదితర ప్రాంతాల్లో భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రాంతాలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి ప్లాన్‌లను ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని స్పష్టం చేశారు. తదనంతరం శ్యామలానగర్ మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా ఎతె్తైన మట్టిదిబ్బలు ఉండటాన్ని గమనించి ఎన్నిసార్లు హెచ్చరించినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజుల్లో గ్యాంగ్‌వర్క్ చేపట్టి పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్లు నారాయణరావు, రవికుమార్, సిటీప్లానర్ ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలుషిత నీటి సరఫరాను అరికట్టాలి
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 25: గుంటూరు నగరానికి సరఫరా అవుతున్న కలుషిత నీటిని అరికట్టి, అన్ని డివిజన్లకు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలని నందమూరి యువసేన అధ్యక్షుడు నల్లమోతు అజయ్‌చౌదరి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నందమూరి యువసేన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అజయ్ చౌదరి మాట్లాడుతూ ప్రతి డివిజన్ నుండి కలుషిత నీరు సరఫరా అవుతోందని, కార్పొరేషన్‌కు వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్టైనా లేదన్నారు. దుర్వాసన వస్తున్న కలుషిత నీటిని అరికట్టి శుద్ధిచేసిన నీటిని సరఫరా చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరారు. తెలుగు యువత జిల్లా మాజీ కార్యదర్శి ముప్పాళ్ల మురళి మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నందమూరి యువసేన నాయకులు రమేష్‌గౌడ్, లింగం ఆదిశేషయ్య, సంకా రామాంజనేయులు, చిట్టాబత్తుని చిట్టిబాబు, కసుకుర్తి హనుమంతరావు, బెల్లంకొండ సురేష్, గుడిమెట్ల దయారత్నం తదితరులు పాల్గొన్నారు.