కర్నూలు, ఏప్రిల్ 25: జిల్లా మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్‌కు ఉప ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. రెండు శాసన సభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తేనే అధిష్ఠానం వద్ద తలెత్తుకునే పరిస్థితి ఉంటుందని లేదంటే ఇబ్బందులు తప్పవన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో ఉప ఎన్నికలు వారిద్దరికి ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పవచ్చు. ఉప ఎన్నికల్లో విజయం ఇద్దరు మంత్రులకు అభ్యర్థులకంటే ఎక్కువ అవసరమని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. రెండు స్థానాల్లో ఎన్నికలకు అన్ని విధాలా సమాయత్తమై ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు మంత్రులు మానసికంగా శారీరకంగా సిద్ధపడుతున్నారు. మరో వైపు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నగారా మోగించడంతో ప్రజాపథం కార్యక్రమం కూడా రద్దయింది. దీంతో ఎన్నికల నియమావళి ప్రకారం అధికారాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయంగా రంగంలోకి దిగేందుకు మంత్రులు సన్నద్ధమయ్యారు. ఈ సమయంలో ఆళ్లగడ్డ స్థానం నుంచి గంగుల పోటీ చేస్తారని ప్రకటించిన మంత్రులిద్దరికి ప్రతాప రెడ్డి బుధవారం పెద్ద షాక్ ఇచ్చారు. తాను పోటీ చేసే విషయం ప్రకటించాల్సింది మంత్రులు కాదని, పోటీ చేయాల్సిన తానే ఒక నిర్ణయానికి ఇంకా రాలేదని పేర్కొనడం సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై ఆశలు ఉన్న ఆ ఒక్క స్థానంలో కూడా అభ్యర్థి గంగుల ప్రతాప రెడ్డి ఎదురు తిరగడం మంత్రులకు ఇబ్బంది కలిగించే విషయమేనని విశే్లషకులు పేర్కొంటున్నారు. జిల్లాలో జరిగే ఉప ఎన్నికల్లో రెండింటిలో గెలవకపోయినా ఒక్క స్థానంలోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న మంత్రులకు గంగుల విసిరిన మాటల తూటాలు గట్టిగానే తగిలేలా ఉన్నాయి. వాస్తవాలు ఏంటో గంగుల, ఏరాసు, టీజీలకు మాత్రమే తెలుసునని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో ఎమ్మిగనూరు నియోజవర్గం బాధ్యతలను మంత్రి టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపి కోట్ల సూర్య ప్రకాషరెడ్డికి, ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎన్నికల బాధ్యతను మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి, నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డిలకు అప్పగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బలహీనంగా ఉన్నారని భావిస్తున్న ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి రుద్రగౌడును కలుపుకొని మంత్రి, ఎంపిలు ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగా అధికార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ఓటర్ల ముందుకు వెళ్లారు. ఎలాగైనా విజయం సాధించేందుకు మంత్రి, ఎంపిల మధ్య ఉన్న స్పర్థలను కూడా పక్కన పెట్టి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ విషయంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించకపోవడానికి కారణం గంగుల అంగీకారం లేకపోవడమేనని బుధవారం గంగుల మాటలను బట్టి తెలుస్తోంది. ఇక్కడ గంగుల ప్రతాపరెడ్డి పోటీ చేస్తే విజయం ఖాయమని వైఎస్సార్ పార్టీయేతర పక్షాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఎలాగైనా ఆయననే అభ్యర్థిగా రంగంలోకి దించాలని మంత్రులిద్దరితో పాటు సీనియర్ నాయకులు సైతం ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే గంగుల ప్రతాప రెడ్డి, మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య ఏం చర్చ జరిగిందో బయటకు తెలియకపోయినా గంగుల మాత్రం వాగ్బాణాలు సంధించడంతో రాజకీయం రసవత్తరంగా తయారైంది. ఒక వైపు గంగుల డిమాండ్లకు ముఖ్యమంత్రే స్వయంగా అంగీకరించారని ఇంకా ఏం జరుగుతుందో తెలియాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డలో గంగుల ప్రతాప రెడ్డి కాకుండా మరో వ్యక్తి అయితే ఆశలు వదులుకోవాల్సిందేనని ఆయన పేర్కొంటున్నారు. దీంతో మంత్రులకు మళ్లీ పని పడ్డట్లయింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సైతం అభ్యర్థి ఎంపిక విషయంలో అభిప్రాయ బేధాలు ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోతున్నారని ఆయన వెల్లడించారు. ఆళ్లగడ్డ విషయంలో చివరకు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ఇపుడు అందరిలో నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తల, జిల్లా ప్రజలు, అభ్యర్థుల కన్నా మంత్రులిద్దరికి ఉప ఎన్నికలు చెమటలు కక్కిస్తున్నాయని చర్చించుకోవడం గమనార్హం.
ప్రజలను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
కర్నూలు, ఏప్రిల్ 25: జిల్లా ప్రజలను స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు రెండు రోజుల్లో మృతి చెందారు. దీంతో గ్రామీణులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా హైదరాబాదు, విశాఖపట్టణం తదితర పట్టణాలకు సోకిన స్వైన్ ఫ్లూ వ్యాధి కర్నూలు జిల్లాకు వ్యాపించడంతోప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ముందస్తు వైద్యం చేపట్టాల్సిన వైద్యులు వ్యాధి తీవ్రతరం అయిన తరువాత వైద్యులు చికిత్సల కోసం హడావిడి తప్ప ఫలితం ఉండదన్న విమర్శలు వస్తున్నాయి. ఆకులు కాలక చేతులు పట్టుకున్నారన్న చందంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తీరు స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రజలకు వింత వ్యాధుల గురించి చైతన్య వంతులు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిద్రావస్తలో జోగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామానికి చెందిన రాజశేఖర్ (42) హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వ్యాధితో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. అదే విధంగా కర్నూలు నగరంలోని వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన మహిళ సమీమ్‌బీ(45) కూడా స్వైన్ ఫ్లూ వ్యాధి అనుమానంతో సోమవారం మృతి చెందింది. అయితే సమీమ్‌బీ సాదరణ మరణమే, స్వైన్ ఫ్లూ వ్యాధి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 17న రాజశేఖర్, సీమీమ్‌బీలు వైరల్ నిమ్మోనియా వ్యాధితో కర్నూలు ప్రభుత్వ వైద్యళాలలో చికిత్స కోసం చేరారు. వీరికి సంబంధించిన రక్త నమూనాలు స్వైన్ ఫ్లూ అనుమానంతో పరీక్షలు కోసం హైదరాబాదు ల్యాబ్‌కు పంపారు. ముందు జాగ్రత్త చర్యగా రాజశేఖర్ స్వైన్ ఫ్లూ వ్యాధి నియంత్రణకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. రాజశేఖర్ కుమారుడుకు కూడా స్వైన్ ఫ్లూ వ్యాధి రాకుండ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలోని స్వైన్ ఫ్లూ వార్డులో చికిత్సలు అందిస్తున్నారు. రాజశేఖర్ స్వైన్ ఫ్లూ వ్యాధితో మృతి చెందడంతో లొద్దిపల్లె గ్రామం ప్రజలు వణుకుతున్నారు. గ్రామంలో ముందు జాగ్రత్తలు చర్యలు పాటించాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికైన వైద్య అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని స్వైన్ ఫ్లూ వ్యాధి రాకుండ చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందించడమే
కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం
కల్లూరు, ఏప్రిల్ 25: దివంగత నేత ఇందిరగాంధీ ప్రస్తుత యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాంధీ స్పూర్తితో దేశ వ్యాప్తంగా వున్న ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అందించడంమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాయని శాసన సభ డిప్యూటీ స్పికర్ మల్లు బట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలో పుణ్యక్షేత్రాల సందర్శనార్థమై వెళ్తూ మార్గమధ్యలో బుధవారం కర్నూలు ప్రభుత్వ అతిధి గృహనికి చేరుకున్నారు. స్థానిక కొడుమూరు ఎమ్మెల్యే మురళీ కృష్ణ, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిప్యూకీ స్పికర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల అమలుల్లో చట్టబద్దత కల్పించి అమలు పరుచడానికి అంగీకరించిన రాష్టల్ల్రో ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు. సబ్ ప్లాన్ నిధుల అమలకు చర్యలు ప్రారంభించమన్నారు. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన నిధులు సంక్షేమ పథకాలు ఇతర పథకాలు ఉపయోగించకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భారత రాజ్యంగా నిర్మత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు శాసన సభ ప్రాంగణంలో స్థల పరిశీలన పనుల వేగవంతం అయ్యాయని వీలైనంత త్వరగా అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పటు చేస్తున్నట్లు విలేఖర్లు అడిగిన ప్రశ్నకు సమాదానం చేప్పారు. డిప్యూటీ స్పికర్‌ను కలిసినవారిలో దళితనేతలు నాయకల్లు సోమసుంధరం, బజారి, అనంతరత్నం, లక్ష్మినారాయణ, నరసింహులు వున్నారు.
ఇరిగేషన్ శాఖలో ఎస్సీలపై వివక్ష
ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఎస్సీలకు చెందిన ఇంజనీర్లు అధికారులు వివక్షత చూపిస్తున్నారని సీనియార్టీని పాటించకుండా పదోన్నతలకు అడ్డుతగులుతున్నారని ఇరిగేషన్ షెడ్యుల్డ్ క్యాస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ స్పికర్ మల్లు బట్టి విక్రమార్క వారితో కలిసి ఎస్సీ ఇంజనీర్లకు న్యాయం చేయాలని అసోసియేషన్ నాయకులు రమేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
కర్నూలు మార్కెట్ యార్డును తరలించం
ఆదోని, ఏప్రిల్ 25: కర్నూలులో ఉన్న ప్రస్తుత మార్కెట్ యార్డును ఎక్కడికి తరలించమని మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ కమలాకర్ తెలిపారు. ఆదోనిలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల మార్కెట్ యార్డులలో 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ చేసే గోదాములను నిర్మించినట్లు చెప్పారు. ఒక్కొక్క గోదాం నిర్మాణానికి రూ.కోటి 6 లక్షలు వ్యయమైనట్లు పేర్కొన్నారు. నిర్మించిన గోడౌన్లను ప్రభుత్వ శాఖలకు అద్దెకు ఇస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో నిర్మించిన గోదాములను మార్క్‌ఫెడ్‌కు, నంద్యాలలో నిర్వహించిన గోదాములను సహకార సంఘానికి అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. ఆదోని, ఎమ్మిగనూరులో నిర్మించిన గోదాములను కూడా అద్దెకు ఇస్తున్నట్లు చెప్పారు. ఆదోనిలో ఉన్న గోదాములను పౌర సరఫరా శాఖకు అద్దెకు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే రెవెన్యూ డిఎం వెంకటకృష్ణుడు బుధవారం ఆదోనిలో నిర్మించిన గోదాములను పరిశీలించారు. వెంకటకృష్ణుడు మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని, ప్రభుత్వ అనుమతి వచ్చిన తరువాత గోదాములను అద్దెకు తీసుకుంటామని చెప్పారు. వీరి వెంట ఆదోని మార్కెట్ కార్యదర్శి రామమోహన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
రైతులకు అండగా ఉంటా
ఆదోని, ఏప్రిల్ 25: రైతులకు అండగా ఉండి సమస్యలన్నింటిని పరిశీలిస్తానని ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ ప్రమాణస్వీకార సభలో స్పష్టం చేశారు. బుధవారం రైతు విశ్రాంతి భవనంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణస్వీకార మహోత్సవం జరిగింది. మాజీ శాసన సభ్యులు రాచోటి రామయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ విట్టా కిష్టప్ప, విట్టా రమేష్, మాజీ జెడ్పిటిసి బాలయ్య, కాంగ్రెస్ నాయకులు నసీరుద్దీన్‌పటేల్, సాయినాథ్, ఆదినారాయణరెడ్డి, తెలుగుదేశం నాయకులు కుమార్‌గౌడు, తదితరులు పాల్గొన్నారు. దేవిశెట్టి ప్రకాష్ మాట్లాడుతూ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అండదండలతోనే తనకు చైర్మన్ పదవి లభించిందన్నారు. కోట్ల కుటుంబానికి తాను రుణపడి ఉంటానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పాటుపడితే ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు, వ్యాపారులు తమ సమస్యలను తెలియజేస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఎప్పుడు కూడా రైతుల పక్షమే తాను వహిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున వ్యాపారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పురుష, మహిళా అభ్యర్థులకు
27న దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు, ఏప్రిల్ 25: స్టైఫెండరీ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా 5, 2.5 కిలో మీటర్ల పరుగులో అర్హత సాధించి వివిధ కారణాలతో వారికి కేటాయించిన తేదీల్లో దేహదారుఢ్య పరీక్షలకు గైర్హాజరు అయిన పురుష, మహిళ అభ్యర్థులందరికి ఈ నెల 27వ తేదీన దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ ఉదయం 5 గంటలకు స్థానిక జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంకు చేరుకుంటే దేహదారుఢ్య పరీక్షలు, హై జంప్, లాంగ్ జంప్, షాట్ ఫుట్‌లతో పాటు 100, 800 మీటర్ల పరుగు పందెం నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. అదే విధంగా మహిళ అభ్యర్థులకు ఎత్తు, బరువుతో పాటు 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్ ఫుట్ క్రీడాంశాలల్లో అర్హత సాధించాల్సి వుంటుందన్నారు. కానిస్టేబుళ్ల ఎంపిక కేవలం అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు చెప్పే మాయ మాటలు నమ్మి అభ్యర్థులు మోసపోరాదని ఎస్పీ హెచ్చరించారు. మధ్య దళారుల సమాచారం తెలిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన విజ్ఞప్తి చేశారు. దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన పురుష, మహిళ అభ్యర్థులందరికి జూన్ 17న రాత పరీక్షలు నిర్వహిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
నేటి నుండి గంగాభవాని తిరుణాల
ఉయ్యాలవాడ, ఏప్రిల్ 25: మండల కేంద్రమైన ఉయ్యాలవాడలో నేటి నుండి గంగాభవాని తిరుణాలను నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ తిరుణాల ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. 26న అఖండ స్థాపనం జర్ధిస్థానం, 27న రుూర్లిమాని యాగము, రాత్రికి అలగలపోలు, 28న పుట్ట బంగారం, పొంగుపాలు, రాత్రికి గంగ వేషం, 29న ఉదయం పాలేటి యాగం, గ్రామ బోనములు తెచ్చుట పారువేట, సాయంత్రం మద్దిమాను నరుకుట, ఆవుల పందేరం ముట్టుట, 30న దీవెన బండారు, సుడిబండి ఉత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చాలా రోజులకు జరిగే ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వారు పేర్కొన్నారు.
చాగలమర్రిలో భారీ వర్షం
చాగలమర్రి, ఏప్రిల్ 25: మండలకేంద్రమైన చాగలమర్రితో పాటు పలు గ్రామాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో చాగలమర్రిలోని పలు వీధులు జలమయమై రోడ్లపై నీరు నిలిచాయి. మండు వేసవిలో భారీగా వర్షం కురవడంతో పిల్లలు వర్షానికి తడుస్తు ఆడు కున్నారు. ఎండ వేడిమి అధికం కావడంతో ఉడకపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది.
వేసవిలో దుక్కులు
వ్యవసాయానికి మేలు
ఆస్పరి, ఏప్రిల్ 25: వ్యవసాయ భూముల్లో వేసవిలో దుక్కులు దున్నడం వల్ల వ్యవసాయంకు ఎంతో ఉపయోగకరమని వ్యవసాయాధికారులు తెలిపారు. వేసవిలో లోతుగా అడ్డంగా దుక్కిదున్నడంతో లోపలి పొరలు బైటికొచ్చి బయట పొరలు లోపలికి చేరుతాయి. ఈ దుక్కులు వలన కలుపు మొక్కలు, పురుగులు నశిస్తాయి. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు బినిగేరి, నగరూరు, తదితర గ్రామాల్లో రైతులు పొలాల్లో గుంటలు వేయడం దుక్కులు దున్నడంలో నిమగ్నమయ్యారు.
నంద్యాల ఆసుపత్రిలో
పడకేసిన వైద్య సేవలు
నంద్యాల రూరల్, ఏప్రిల్ 25: నంద్యాల, గోస్పాడు మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొన్నిచోట్ల అలంకార ప్రాయంగా జ్వరం వచ్చిన రోగులకు మందులు ఇవ్వడానికి అక్కడ సిబ్బంది కూడా ఉండడం లేదు. ఇంటి వద్దకు వచ్చి ఆరోగ్య బాగోగులు చూడాల్సిన ఆరోగ్య కార్యకర్తలు చుట్టపుచూపుగా వారికి ఇష్టం వచ్చినప్పుడువచ్చి వెళ్తున్నారు. చిన్నచిన్న రోగాలు వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఆలస్యం అవుతుందని ప్రైవేటు ఆసుపత్రులకువెళ్ళి రోగులు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టులు, ఎఎన్‌ఎంలే దిక్కు అని గ్రామీణ ప్రాంతాల రోగులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్య కేంద్రాలకు వైద్యాధికారులు విదులకు డుమ్మా కొడుతున్నారు. మరికొన్ని పిహెచ్‌సిలలో వైద్యాధికారులు కేవలం ఒక్కపూట మాత్రమే విధులకు హాజరై మధ్యాహ్నం ఎగనామం పెడుతున్నారు. యధారాజ తథాప్రజ అన్నట్లు వైధ్యాదికారులు విధులకు డుమ్మా కొడుతుండడంతో వారిని కింది స్థాయి సిబ్బంది కూడా అనుసరిస్తున్నారు. నంద్యాల, గోస్పాడు మండలాల్లో పిహెచ్‌సిలు ఉన్నప్పటికి వైద్యాధికారులు సక్రమంగా విధులకు వెళ్ళడం లేదని జిల్లా స్థాయి అధికారే చెప్పడం గమనార్హం. పిహెచ్‌సిలో కుటుంబ నియంత్రణ కూడా అటకెక్కినట్లు, ఆమడ దూరంలో మాత్రమే లక్ష్యం నెరవేరిందంటున్నారు. అనుకున్న లక్ష్యం సాధించడంలో విఫలమయ్యారు. వైధ్యాధికారులు డుమ్మా కొట్టడం అధికారుల పర్యవేక్షణలోపం తదితర వాటి కారణాలపై లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచిపోయాయి. జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం కూడా మండలానికి నీరుగారి పోయిందని గ్రామీణ ప్రజలు సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ పథకంలో పిహెచ్‌సి వైద్యులు ఎంఇఓ, సిహెచ్‌ఓలతో కలిసి పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి వచ్చే రుగ్మతలను ప్రారంభంలోనే అరికట్టాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించి గ్రామీణ ప్రాంతాల్లోని పిహెచ్‌సిలను తనిఖీ చేసి పేదలకుమెరుగైన వైద్య సేవలు అందించి గ్రామీణ రోగులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.