Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అక్రమార్కుల గుండెల్లో గుబులు!

$
0
0

ఖమ్మం, ఏప్రిల్ 25: జిల్లాలో మద్యం అక్రమార్కులకు ఏసిబి అధికారులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన పలువురు వ్యాపారస్థులతో పాటు పదవీ విరమణ చేసిన అధికారులను కూడా వదలటం లేదు. 2010 జూన్‌లో జరిగిన మద్యం టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటికే 13మంది ఎక్సైజ్ అధికారులను, రిటైర్డ్ కలెక్టర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసిబి అధికారులు పదుల సంఖ్యలో వ్యాపారస్థులను కూడా అరెస్ట్ చేశారు. ముందుగా నున్నా రమణను అరెస్ట్ చేసిన ఏసిబి అధికారులు ఆయన రిమాండ్ రిపోర్టు ఆధారంగా విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా జిల్లాలోని మెజార్టీ మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించి పలు కీలక ఆధారాలను రాబట్టారు. కాగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు రావటంతో ఖమ్మం ఆర్డీవో వాసం వెంకటేశ్వర్లును విచారణ అధికారిగా నియమించగా ఆయన ఇచ్చిన నివేదికను అప్పటి జిల్లా కలెక్టర్ ఎన్ నాగేశ్వరరావు ఉద్దేశ్యపూర్వకంగా ఆపారని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ ఉన్నతాధికారులతో కలిసి పలు దుకాణాలను కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నాగేశ్వరరావును మంగళవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన గత ఏడాది మార్చి నెలాఖరున పదవీ విరమణ చేశారు. మరోవైపు టెండర్ల సమయంలో ఉన్న పలువురు ఎక్సైజ్ అధికారులు కూడా పదవీ విరమణ చేయగా వారిని సైతం ఎసిబి అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదిలావుండగా మద్యం దుకాణాల కేటాయింపులో అప్పటి జాయింట్ కలెక్టర్ ఎంఏ అజీమ్, అదనపు జాయింట్ కలెక్టర్ సుభాష్ చంద్రబోస్‌ల ప్రమేయం కూడా ఉందని ఏసిబి అధికారులు నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే సుభాష్ చంద్రబోస్‌ను పలుమార్లు విచారించిన అధికారులు అజీమ్‌ను కూడా విచారించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన ఖమ్మం మద్యం సిండికేట్ల వ్యవహారంలో బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఏసిబి అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ముందుగా అరెస్టయిన నున్నా రమణ రిమాండ్ రిపోర్టుతో పాటు ఇటీవల అరెస్టయిన మద్యం వ్యాపారి పారుపల్లి రాము నుంచి అందిన సమాచారం ప్రకారం మరికొందరిని కొద్దిరోజుల్లో అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టుల్లో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు కూడా ఉండటంతో వారంతా ముందస్తు బెయిళ్ళ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మరో నెలన్నర రోజుల్లో మళ్ళీ మద్యం టెండర్లు పిలవాల్సిన సమయంలో గత టెండర్ల అక్రమాలు పూర్తిగా బహిర్గతం కావటం, పలువురు అరెస్ట్ కావటంతో ఈసారి మద్యం టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనే అవకాశం లేదని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉంటుందని ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే ఓ నివేదికను కూడా పంపినట్లు తెలిసింది. ఏసిబి అధికారులు బుధవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారని ప్రచారం జరగటంతో అధికారులతో పాటు వ్యాపారస్థులు కూడా తీవ్ర భయాందోళనలకు లోనై రహస్య ప్రదేశాలకు వెళ్ళినట్లు సమాచారం.
రాజుకుంటున్న
రాజకీయ వేడి!
* వలసల పర్వంలో నేతలు
* ఆత్మరక్షణలో పార్టీలు
కొత్తగూడెం, ఏప్రిల్ 25: స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఏన్నికలు శాసనసభ ఉపఎన్నికల ముందే జరుగుతాయని ఊహాగానాలతో కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. పరస్పర విమర్శనాస్త్రాలను నాయకులు సంధించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలలో పెనుమార్పులు వచ్చాయి. నూతనంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే గతంలో తెలుగుదేశం మాజీ జిల్లా అధ్యక్షుడు మచ్చా శ్రీనివాసరావు, పాల్వంచ ఆత్మకమిటీ చైర్మన్, మాజీ జెడ్‌పిటిసి, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యర్రంశెట్టి ముత్తయ్య తో పాటు పాల్వంచలోని పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్‌ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా గతంలో పిఆర్‌పి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి, కొత్తగూడెం నియోజకవర్గం నుండి పిఆర్‌పి ఆభ్యర్థిగా పోటీచేసి 36వేలపై చిలుకు ఓట్లను సాధించిన ఎడవల్లికృష్ణ పిఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనం అయినప్పటికి ఆపార్టీలో ఇమడలేక వైఎస్‌ఆర్ పార్టీలో మే 1వతేదీన చేరుతున్నట్లు ప్రకటించారు. దీనితో నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో అధికారంలో ఉన్న సిపిఐ ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అభివృద్ధి పనులతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన సిపిఐ జాతీయ మహాసభలలో జాతీయ కార్యవర్గ సభ్యునిగా కూడా కూనంనేని ఎంపిక కావడంతో ఆయనపై పార్టీ బాధ్యత మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేకుండా మొదటినుండి కృషి చేస్తున్న ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, రాబోయే ఎన్నికలలోకాంగ్రెస్ సత్తా చాటేందుకు ప్రణాళిక రూపొందించి పావులు కదుపుతుండగా ఆయన తనయుడు వనమా రాఘవేంద్రరావు ఇటీవల కాలంలో పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతేకాకుండా పార్టీ నుండి ఇతర పార్టీలకు వలసలు వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. తెలంగాణ వాదంతో నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌కు పెరిగిన బలాన్ని ఆపార్టీ అంతర్గత కలహాల కారణంగానిలుపుకోలేకపోతోంది. ద్వితీయశ్రేణి నాయకత్వం, కార్యకర్తలు అధినాయకుల అంతర్గత పోరుమధ్య అడకత్తెరలో పోకచెక్కలా నలుగుతూ ఇతర పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు. వామపక్ష పార్టీలైన సిపిఎం, న్యూడెమోక్రసీలు తమ క్యాడర్‌ను పదిలంగా ఉంచుకోవడంలో సఫలీకృతవౌతున్నాయి. తెలుగుదేశం పార్టీలో సైతం అంతర్గత విభేదాలు ఆపార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. రాబోయే స్థానిక, మున్సిపల్ ఎన్నికల వరకు నియోజకవర్గంలో రాజకీయ కప్పదాట్లు భారీగా జరిగే ఆవకాశాలు ప్రస్తుత పరిస్థితిని బట్టి మెండుగా కనిపిస్తున్నాయి.
కూలీలకు గిట్టుబాటయ్యే పనులకు ప్రాధాన్యం
* ప్రజాపథంలో కలెక్టర్ వెల్లడి
మధిర, ఏప్రిల్ 25: వ్యవసాయ పనులు తక్కువగా ఉన్నందున ఈ సీజన్‌లో కూలీ గిట్టుబాటయ్యే పనులను ప్రాధాన్యత కల్పించనున్నట్టు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. బుధవారం నక్కలగరువులో నిర్వహించిన ప్రజాపథంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని, డ్వాక్రా గ్రూపులకు పావలా వడ్డీ రాయితీలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కూలీలు వలసపోవాల్సిన అవసరం లేదని, స్థానికంగా పనులు కల్పిస్తామన్నారు. ఖరీఫ్‌లో 10లక్షల ప్యాకెట్లకు పైగా పత్తి విత్తనాలను జిల్లాకు తెప్పించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ఎరువుల గురించి ఆందోళన చెందవద్దని, రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేస్తున్నట్టు వెల్లడించారు. భూములను సారవంతం చేసుకునేందుకు ఉపాధి పనుల ద్వారా పూడిక మట్టిని ట్రాక్టర్ల ద్వారా పొలంలో వేసుకోవాలని సూచించారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో చౌకదుకాణం ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని తహశీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. కౌలురైతులకు రుణ అర్హత కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే గడువును మే 10వరకు పొడిగించినట్టు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పాలి
* బిజెవైఎం నేత వెంకటేశ్వర్లు
ఖమ్మం(ఖిల్లా), ఏప్రిల్ 25: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కోట్లాది మంది ప్రజలు పోరాడుతుంటే కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకటేశ్వర్లు ఆరోపించారు. బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్, టిడిపి నాయకులు నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గత ఉప ఎన్నికల తర్వాతనే 16మంది యువతీ యువకులు ప్రాణత్యాగం చేశారని, అది చూసైనా కాంగ్రెస్, టిడిపి నేతలు గుణపాఠం నేర్చుకోవాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అభిప్రాయలను మార్చుకొని ప్రజలను మోసం చేసిన ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీలపైనే ఉందన్నారు. బిజెపి స్పష్టమైన విధానంతోనే వెళ్తుందని, ప్రత్యేక రాష్ట్రం తమతోనే సాధ్యమని పేర్కొన్నారు. స్పష్టమైన విధానాలను వెల్లడించని పార్టీల నాయకులు తమవద్దకు వస్తే ప్రజలు నిలదీసి వారి వైఖరిని తెలియజెప్పేలా ఒత్తిడి తేవాలన్నారు. తాము చేపట్టిన భరోసా యాత్ర వరంగల్ జిల్లా పరకాలలోని అమర్ గ్రామం వద్ద ముగుస్తుందని, గురువారం జరిగే ముగింపు సభకు తమ పార్టీ అధినేతలు హాజరవుతున్నారని వెంకటేశ్వర్లు వెల్లడించారు. సమావేశంలో పార్టీ నాయకులు విక్రమ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, భరత్ గౌడ్, పెరుమాళ్ళ విజయ్‌కుమార్, వీరెల్లి లక్ష్మయ్య, సత్యనారాయణ, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవం
ముదిగొండ, ఏప్రిల్ 25: మండల పరిధిలోని పెద్దమండవలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత రాజగోపాలస్వామి ఆలయంలో బుధవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం, విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పవిత్రంగా జయజయధ్వానాల మధ్య విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవాలయంలో ఈ నెల 19నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భవానీ శంకర్ స్వామి, బొడ్రాయి, ముత్యాలమ్మ వారి ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. పెద్దమండవతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు కార్యక్రమానికి హాజరయ్యారు. కొంకపాక రాధాకృష్ణమూర్తి శిష్య బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠకు పెద్దసంఖ్యలో గ్రామస్థుల ఇళ్ళకు బంధువులు రావటంతో పండుగ వాతావరణం నెలకొంది. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దమండవలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించటంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని ఆలయ కమిటీ సభ్యులు కల్పించారు.
వ్యవసాయ రంగం నిర్వీర్యానికి కుట్ర
ఖమ్మం(జమ్మిబండ), ఏప్రిల్ 25: పాలకులు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటు పరం చేయటం ద్వారా చిన్న, మధ్యతరగతి రైతులను వ్యవసాయ రంగానికి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు ఆరోపించారు. పంట నష్టపరిహారం ఎకరాకు 10వేలు ఇవ్వాలని, కరవు ప్రాంతంలో రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం పట్టణంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కుట్రను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. మిర్చి క్వింటాలకు 10వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జెసి నాయక్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు నున్నా నాగేశ్వరరావు, మాదినేని రమేష్, తాతా భాస్కర్‌రావు, సిద్ధినేని కోటయ్య, తుమ్మల శ్రీనివాసరావు, యల్లంపల్లి అశోక్ పాల్గొన్నారు.
అతిరాత్రంలో విశిష్టంగా సాగిన ప్రవర్గ్యం
భద్రాచలం, ఏప్రిల్ 25: సప్త సోమయాగాల్లో అత్యంత మహిమాన్వితమైన అతిరాత్రం మాహాయాగం భద్రాచలంలోని ఎటపాక జఠాయువు మండపం వద్ద అద్భుతంగా సాగుతోంది. ఐదవ రోజు బుధవారం ఉపాసన దినంగా ప్రత్యేక వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 6గంటలకు యాగ యుజమాని నడువం నారాయణన్ సోమయాజి నంబూద్రి, యజమాని పత్ని సావిత్రి పతినాఢి దంపతులు యాగశాల ప్రవేశం చేసి ప్రైషం కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. ఋత్వికులందరికీ వైదిక మంత్రాలతో సూచనలు, సలహాలను అందించి వారిని మూడు విభాగాలుగా విభజించి దీక్ష, అంకితభావంతో యాగ క్రతువు నిర్వర్తించేలా ప్రేరేపించారు. తర్వాత జరిగిన ఉదయ ప్రవర్గ్యం కార్యక్రమం వేలాది మంది భక్తులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఋగ్, యజ్, సామ, అధర్వణ వేదమంత్రాలతో ప్రవర్గ్యాన్ని నిర్వహించే మహావీర పాత్రకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిన్వనం అనే గరిటె లాంటి మట్టి పాత్రలో మేక పాలను ఉంచి దేవతలను ఆహ్వానిస్తూ వేదమంత్రాలను పఠించారు. మహావీర పాత్రలో ఆవు నెయ్యిని వేసి బాగా మరిగించాక వేదమంత్రాలతో గరిటె లోగల మేకపాలను మహావీర పాత్రలోకి వేయగానే అమిత ఉష్ణంతో అగ్నిగోళం పైకి ఎగిసిపడింది. ఇలా మూడుసార్లు ప్రవర్గ్యం చేయగా మూడుసార్లు ఉష్ణగోళాలు సృష్టించబడి క్షణాల్లో అంతర్ధానమయ్యాయి. దాదాపు గంటన్నర సేపు ఈ ఉదయప్రవర్గ్యం ప్రక్రియలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారి ఎల్‌వి సుబ్రమణ్యంతో సహా అనేక మంది వేద పండితులు, ఆధ్యాత్మికవేత్తలు, వేలాది మంది భక్తజనులు భక్తి శ్రద్ధలతో ప్రత్యక్షంగా చూసి ఆనందపారవశ్యులయ్యారు. ఈ ప్రవర్గ్యం జరుగుతున్న సమయంలోనే యాగశాల ఆవరణలో మరో అద్భుతం చోటు చేసుకుంది. యాగశాల చుట్టూ ఆకాశంలో ఒక్కసారిగా వలయాకారంలో మేఘావృతమై మరో మారు గరుడ పక్షి ప్రదక్షిణ చేసిన సంఘటన అందరినీ అబ్బురపరిచింది. ఎల్‌వి సుబ్రమణ్యం ఆకాశంలో చూస్తూ ఆకాశానికి నమస్కరిస్తూ పులకించిపోయారు. టిటిడి ఇఓ సుబ్రమణ్యం యాగశాల ఆవరణ అంతా కలియ తిరుగుతూ భక్తుల నుంచి యాగశాల విశేషాలను, వారి అనుభూతిని గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత సుబ్రహ్మణ్యాహ్వానం ప్రక్రియ సాగింది. ఇందులో ఒక ఋత్విక్కుడిని సుబ్రహ్మణ్య స్వామిగా ఆవాహన చేసి ప్రత్యేకంగా వేద మంత్రాలతో దేవతాహ్వానం చేశారు. తర్వాత చితికరణం ద్వితీయ ప్రస్థానం సాగింది. యాగశాలలో గరుడ చితికారంలో కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఇటుకలను రెండవ వరుసలో మంత్రాల క్రమంలో పేర్చారు. 200 ఇటుకలకు ప్రాణప్రతిష్ఠలో భాగంగా ఒక్కో ఇటుకకు ఒక్కో దేవతను ఆవాహనం చేసి యజమాని నడువం నారాయణన్ సోమయాజి ఇంకా ఇతర ఋత్విక్కులు రక్షా పురుష, అధ్వర్య, నేష్ట, ఉనే్నత, అవిధ్య, హూత, మైత్రావరుణ, అచవక, బ్రహ్మ, బ్రహ్మణ, ఛాంసి, అగ్నీధ్ర, ఉద్గాత, ప్రస్థోత, ప్రతిహరి, సుబ్రహ్మణ్య, సదస్య ఋత్విక్కులందరూ ఇటుకలకు వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి ప్రవర్గ్యం కొనసాగించారు. దాదాపు 50 వేల మంది భక్తులు యాగశాలవను సందర్శించగా సుమారు 25 వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యాగ రక్షాపురుషులు కేసాప్రగడ హరిహరనాధ శర్మ, భద్రాచలం దేవస్థానం పాలకమండలి చైర్మన్ కురిచేటి పాండురంగారావు, యాగ సారథ్య సంఘం పర్యవేక్షకులు ఎంవిఆర్ శర్మ, కురిచేటి రామచంద్రమూర్తి, బండారు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
గరుడాకృతిలో బలిపీఠం
భద్రాచలం, ఏప్రిల్ 25: భద్రాద్రిలో జరుగుతున్న అతిరాత్రం యాగంలో గరుడ పక్షి రూపంలోబలిపీఠాన్ని నిర్మించే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మహావేది ఉన్న ప్రదేశంలో పునాదిని తవ్వి అందులో విత్తనాలు చల్లి తయారు చేసిన ప్రధాన కుండను భూమిలో పాతిపెట్టారు. పక్షి రూపంలో బలిపీఠం నిర్మాణం బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 400 ఇటుకలను ఇందుకు వాడారు. కేరళ నుంచి తెచ్చిన ఇష్టక ఇటుకలను వేదికకు ఉత్తర దిశగా ఉంచారు. పక్షి నమూనాలో వేసిన సంఖ్యల ప్రకారం ఇటుకలను పేర్చుతున్నారు. 8వ రోజున బలిపీఠంలో మరో అంతస్తును వేయడంతో దానికి ఉపయోగించిన ఇటుకలను గోవులుగా మారాలని యజమాని ప్రార్థన చేయడం కొసమెరుపు.
ఈ క్రతువు అంతా ఇంద్రాద్రి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించడం దీని ప్రత్యేకత. ఐంద్రి, విభక్తి, మండల, రితష్కి, స్కంధ్య, అపస్య, ప్రణదత్, సమక్త్య, అషణధ్రాత్, ముఖం, అగ్నం, ప్రజాపత్యి, రస్బా, లోకం ప్రణం అనే రక రకాల పేర్లతో పిలిచే ఇష్టకాలు ఒక్కోటి పక్షి రూపంలోనే ఒక్కో ప్రాంతంలో అమర్చాల్సి ఉంటుంది. నాలుగు రోజుల్లో వరుసగా బలిపీఠం నిర్మాణం అంచలంచెలుగా కొనసాగిస్తున్నారు. ఎంతో నిష్టతో నియమావళిని అనుసరించి చేసే ఈ ప్రక్రియలో యజమాని నడువం నారాయణన్ దంపతులు, ఋత్విక్కులు ఇందులో పాల్గొంటారు. కాగా యజమాని పిడికిలి బిగించే ఈ కార్యక్రమాన్ని వేదమంత్రాలతో నిర్వహించడం గమనార్హం.
‚శ్రీఆత్మారాముని
తిరు కల్యాణం నేడు
దుమ్ముగూడెం, ఏప్రిల్ 25: దుమ్ముగూడెం గ్రామంలో గల శ్రీ ఆత్మారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం అంగరంగ వైభవంగా స్వామి వారి తిరుకల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు గాను భక్తులకు సరిపడ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ గోర్సా లక్ష్మణ్‌రావు (కాంత) బుధవారం తెలిపారు. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ నందన నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి అభిజిత్ లగ్నంన గురువారం నాడు స్వామి వారి తిరు కల్యాణాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భాజాబజంత్రీల నడుమ నిర్వహించనున్నట్లు చెప్పారు. కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు గాను కలేపల్లి జోగులు, కల్లేపల్లి వీర్రాజుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
తిరుకల్యాణం అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించునున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చి తరలించాలని కోరారు.

* ఎవరినీ వదలని ఏసిబి * రహస్య ప్రాంతాలకు నేతలు, వ్యాపారులు
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>