మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 25: బందరు పోర్టు నిర్మాణం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ స్థానిక 35వ వార్డుల్లో ప్రజాపథంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య, అధికార బృందాన్ని టిడిపి పట్టణ అధ్యక్షుడు మోటమర్రి బాబా ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బుధవారం అడ్డుకున్నారు. బాబా నేతృత్వంలో రుస్తుంబాద గాంధి బొమ్మ శివాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అక్కడి నుండి ప్రజాపథంలో పాల్గొన్న పేర్ని నాని వద్దకు వెళ్ళి పోర్టుపై సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. పేర్ని డౌన్ డౌన్ అంటూ ఆందోళనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలను శాంతింప చేశారు. ఈ సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళీధర్ వారించారు. ఈ సందర్భంగా బాబా ప్రసాద్ విలేఖర్లతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని అసమర్థత కారణంగానే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఒడుగు ఉమాదేవి, బత్తుల రమేష్ బాబు, గాంధి, దుర్గా ప్రసాద్, జొన్నలగడ్డ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డిఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం ఎదుట ఎఎన్‌ఎంల ధర్నా
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 25: సమస్యల పరిష్కారం కోరుతూ ఎఎన్‌ఎంలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పిఎఫ్, యూనిఫాం సౌకర్యం కల్పించాలని, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో సిపిఎం నాయకులు బూర సుబ్రహ్మణ్యం, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.
అయ్యో ‘పాప’ం!
గ్రహణం మొర్రితో పుట్టిందని
పసికందును పడేశారు
విస్సన్నపేట, ఏప్రిల్ 25: గ్రహణం మొర్రితో జన్మించిన బిడ్డను పెంచి పెద్ద చేయడం భారమనుకున్నారో లేక తమకు తగదని ఆలోచించారో కన్న ప్రేమను, పేగు బంధాన్ని మరచి జాలి, దయాలేని కన్నవారు బొడ్డు పేగు కూడా ఊడని ఆ పసిపాపను ఇతరుల ఇంటి వద్ద వదలి వెళ్ళిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి మండల కేంద్రమైన విస్సన్నపేటలో జరిగింది. స్థానిక సత్తుపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు సిహెచ్ మల్లికార్జునరావు ఇంటి ఆవరణలోని మెట్లు వద్ద అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పసిపాప ఏడవటం ఆ ప్రాంతానికి గస్తీకి వచ్చిన గూర్కా విన్నాడు. పసిపాప ఏడుపు వినిపించడం ఏమిటని దగ్గరకు వెళ్లి చూడగా మల్లికార్జునరావు ఇంటి ఆవరణలో మెట్ల వద్ద పసిపాప పెద్ద పెట్టున ఏడవటం చూశాడు. దీంతో గూర్కా ఇంట్లోని వారిని పిలిచాడు. వారు బయటకు రాగా మెట్ల వద్ద పసిపాప ఏడుస్తున్నట్లు తెలిపాడు. తమ ఇంటి ఆవరణలో తమకు తెలియకుండా పసిపాపను ఎవరు ఉంచారో తెలియకపోవడంతో ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు మల్లికార్జునరావు తెలిపారు. అర్ధరాత్రి అయినప్పటికీ ఐసిడిఎస్ అధికారిణిలు, పోలీసువారు సంఘటనా స్థలికి వచ్చి సంబంధిత ఇంటివారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వదలి వెళ్ళిన వారు ఎవరైనా కనిపిస్తారేమో అని ఆ చుట్టుపక్కల గమనించినప్పటికీ ఎవరు కనపడలేదు. ఐసిడిఎస్ సిడిపివో గాయత్రీదేవి, సూపర్‌వైజర్లు కృష్ణకుమారి, గాయత్రిలు సంబంధిత పోలీసు స్టేషన్‌లో పాప దొరికిన ఇంటి యజమాని మల్లికార్జునరావుతో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కె పార్థసారథి కేసు నమోదు చేసి పాపను ఐసిడిఎస్ అధికారులకు అప్పగించగా పసికందును గన్నవరం సమీపంలోని బుద్ధవరంలో గల స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ఆధీనంలోని బాలల సంరక్షణ కేంద్రంలో అప్పగించారు.
జిల్లా బంద్
జయప్రదం చేయండి
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 25: బందరు పోర్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన తలపెట్టిన జిల్లా బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆఖిలపక్ష నేతలు కోరారు. స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయ సమావేశపు మందిరంలో బుధవారం రాత్రి జరిగిన ఆఖిలపక్ష సమావేశంలో ఆఖిలపక్ష నేతలు మాట్లాడుతూ కాంగ్రెసేతర ఆఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్‌లో వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్చందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆఖిలపక్ష నేతలు కొనకళ్ళ బుల్లయ్య, బచ్చుల అర్జునుడు, మోటమర్రి బాబా ప్రసాద్, నిడుమోలు వెంకటేశ్వర ప్రసాద్, బచ్చుల అనీల్ కుమార్, దేవభక్తుని నిర్మల, కొడాలి శర్మ, ఎంవి నాగేశ్వరరావు, మారుమూడి విక్టర్ ప్రసాద్, మామిడి వేణుగోపాలరావు, హుస్సేన్ మాష్టారు, సత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
హైందవమతం అత్యున్నతం
పెనుగంచిప్రోలు, ఏప్రిల్ 25: దేహమే దేవాలయమని అది పవిత్రంగా ఉన్నంత కాలం ఎటువంటి పాపాలు దరిచేరవని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు భక్తులకు అనుగ్రహభాషణ చేశారు. స్థానిక శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ శిఖర ప్రతిష్ఠ, మహాకుంబాభిషేకం బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సిద్ధం చేసుకున్న కలశాలకు స్వరూపానందేంద్రస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ త్రిగోపురములపై శిఖర ప్రతిష్ఠలు నిర్వహించారు. అనంతరం మహాకుంభాభిషేకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల్లోకెల్లా హైందవమతం అత్యున్నతమైనదని, ఈ మతంలో దేహానికి, గుడికి దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. ఆలయంలో దేవుడు ఎంత ముఖ్యమో దేహంలో ప్రాణం అంత ముఖ్యమన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాల వద్ద కుంభాభిషేకాలు నిర్వహించడం వల్ల సకల పాపాలు తొలగి ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని అన్నారు. కానీ నేడు మన ధర్మాదాయ దేవాదాయ శాఖ ఇలాంటి కార్యక్రమాలు ఏమీ నిర్వహించకపోవడం, అలాగే పలు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు కూడా లేక ఆలయాలు శిథిలావస్థకు చేరుతున్నాయని, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో మహాకుంభాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారన్నారు. తిరుపతమ్మ అమ్మవారి ఆలయం నిర్మాణం పూర్తి చేసుకొని 12సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర ఆజాద్ ఇలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాచార్యులు బ్రహ్మశ్రీ వావిలాల లక్ష్మీనారాయణ శర్మ, వారి శిష్యులను ఆయన ఘనంగా సత్కరించారు. అనంతరం సుమారు 5వేల మందికి ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు కోటి రూపాయలతో నిర్మించిన 30గదుల సత్రాలను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నెల్లూరి గోపాలరావు, సభ్యులు మల్లెబోయిన రాంబాబు, ఎర్రంశెట్టి సుబ్బారావు, ఉమ్మినేని రోజారమణి, బత్తుల కోటేశ్వరరావు, తాటి నాగేశ్వరరావు, సముద్రాల లక్ష్మీపతి, నర్రమనేని శిరీష, అధికారులు పాల్గొన్నారు.
రేపటి నుండి బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠ
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 25: స్థానిక నిజాంపేట బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు, దాసాంజనేయస్వామి విగ్రహాల పునః ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఎంటిజి నారాయణ బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో తెలిపారు. 15 లక్షల వ్యయంతో ముఖ మండపం, కల్యాణ మండపం, ముక్కోటి మండపం నిర్మించినట్లు చెప్పారు. ఇందుకు గాను దేవాదాయ, ధర్మాదాయ శాఖ సిజిఎఫ్ నిధుల నుండి రూ.10 లక్షలు మంజూరు చేసిందన్నారు. 27వ తేదీన విష్వక్సేన పూజ, అంకురారోపణ, వాస్తు పూజ జరుగుతాయన్నారు. 28న నవగ్రహ యజ్ఞం, పంచగవ్యాది వాసాలు, ధాన్యాదివాసం, శాలార్చన, 29న యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు యర్రా వీరబాబు, విన్నకోట సురేంద్ర కుమార్, బీరం వెంకట రాజారావు, ఆలయ అర్చకులు దీవి వెంకట రఘునాధాచార్యులు పాల్గొన్నారు.
బందరు పోర్టుతోనే జిల్లా సర్వతోముఖాభివృద్ధి
జిల్లా టిడిపి అధ్యక్షుడు దేవినేని ఉమ
ఎంపి కొనకళ్ల నారాయణ
నందిగామ, ఏప్రిల్ 25: బందరు పోర్టు వల్ల జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణలు పేర్కొన్నారు. స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో బుధవారం సాయంత్రం బందరు పోర్టు సాధన కోసం 27న జరిగే జిల్లా బంద్ విజయవంతంపై అఖిలపక్ష నేతలు, వ్యాపార, వాణిజ్య ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 27న బంద్ విజయవంతం చేయడంతో పాటు పట్టణ, మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాలని, బందరు పోర్టు ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. బందరు పోర్టు సాధన వల్ల ఒనగూరే ప్రయోజనాలను కొనకళ్ల వివరించారు. మండల టిడిపి నాయకుడు అయ్యదేవర కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐ క్రమశిక్షణా సంఘం రాష్ట్ర చైర్మన్ సూర్యదేవర నాగేశ్వరరావు, సిపిఎం నాయకురాలు యార్లగడ్డ జోయ, మండల టిడిపి అధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, బిజెపి మైనార్టీ మోర్చా కోశాధికారి ఎస్‌కె సైదా, బిజెపి నాయకుడు బి కేదార్‌నాథ్, టిడిపి ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షుడు కనె్నకంటి జీవరత్నం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాటి రామకృష్ణ, ముక్కపాటి శివాజీ, పట్టణ టిడిపి నాయకులు అచ్చి చినబాబు, ఓర్సు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపథంలో తాగునీటి సమస్యపై
అధికారులను నిలదీసిన గ్రామస్థులు
మోపిదేవి, ఏప్రిల్ 25: మండల పరిధిలోని పెదకళ్ళేపల్లి, వెంకటాపురం, మెరకనపల్లి, ఉత్తరచిరువోలులంక, మేళ్ళమర్తిలంక గ్రామాల్లో బుధవారం ప్రజాపథం గ్రామసభలు నిర్వహించారు. పెదకళ్ళేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాపథంలో హరిజనవాడ కుళాయిల ద్వారా మురుగునీరు వస్తోందని పలువురు ఫిర్యాదు చేశారు. ఎండివో మణి కుమార్ వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తాననటంతో గ్రామస్థులు తాగునీటి సమస్యపై ఇంత నిర్లక్ష్యమా..? అంటూ అధికారులను నిలదీశారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. వైఎస్‌ఆర్ సిపి మండల కన్వీనర్ అర్జా నరేంద్ర, సిపిఎం దివి డివిజన్ కార్యదర్శి వాకా రామచంద్రరావు ఆర్‌డబ్ల్యుయస్ ఎఇతో వాగ్వివాదానికి దిగారు. సిఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్థులను వారించారు. అనంతరం వెంకటాపురం గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన ప్రజాపథంలో మాజీ ఎంపిటిసి అబ్బూరి నాంచారయ్య, గ్రామస్థులు ఉపాధి హామీ పనులు సక్రమంగా జరగడం లేదని, పని దినాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిడివో మణికుమార్, తహశీల్దార్ సాయి శ్రీనివాస నాయక్, హౌసింగ్ ఎఇ చలపతిరావు, పంచాయతీ రాజ్ ఎఇ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పాలకుల మెడలు వంచైనా బందరు పోర్టు సాధిద్దాం
మైలవరం, ఏప్రిల్ 25: పాలకుల మెడలు వంచైనా చారిత్రక బందరు పోర్టును సాధిస్తామని మచిలీపట్నం ఎంపి కొనకళ్ల నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక భావనారుషి కల్యాణ మంటపంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కొనకళ్ల ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి బందరు పోర్టుతోనే సాధ్యమన్నారు. బందరు పోర్టు నిర్మాణం చేపట్టాలని గత 500 రోజులుగా పోర్టు సాధన కమిటీ నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. బందరు పోర్టుతోనే జిల్లా అభివృద్ధి ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించకపోవటం శోచనీయమన్నారు. గతంలో బందరు పోర్టు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే ఎట్టకేలకు 2008 ఏప్రిల్ 23న పోర్టు శిలాఫలకానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. జిల్లాలో విటిపిఎస్ తప్ప పారిశ్రామికంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. బందరు పోర్టును సాధించే వరకూ మడం తిప్పని పోరాటానికి అందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోర్టు నిర్మాణాలలో జిల్లా ఊసే లేకుండా పోవటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పోర్టు నిర్మాణం చేపట్టాలని గతం నుండి ఆందోళనలు చేస్తున్నా దీనిని పక్కన పెట్టి పశ్చిమగోదావరి జిల్లా గోగిలేరులో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అభ్యంతరకరమన్నారు. బందరు పోర్టు నిర్మాణానికి కావలసిన భూమి ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పోర్టు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బందరు పోర్టు నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని, 27న పూర్తి బంద్ నిర్వహించాలని ఈబంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో సీపీఎం నేతలు ఆంజనేయులు, లోక్‌సత్తా, లయన్స్‌క్లబ్, చాంబర్ ఆఫ్ కామర్స్, బీజేపిలతో పాటు వివిధ సంఘాల నేతలు ప్రసంగించారు.
పోర్టుపై పాలకుల నిర్లక్ష్యం
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 25: పాలకుల నిర్లక్ష్యం వల్లే బందరుపోర్టు నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీలు అవసరాన్ని మించి స్థల సేకరణ చేసి మిగతా స్థలంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, అలా కాకుండా అవసరమైన మేర స్థలం కేటాయించి నవయుగ సంస్థతో వెంటనే పనులు ప్రారంభించాలని లేని పక్షంలో ప్రభుత్వమే బందరుపోర్టు పనులను ప్రారంభించాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో వైజాగ్, కృష్ణపట్నం, కాకినాడ తదితర పోర్టులు అభివృద్ధి జరిగి అక్కడ భారీ పరిశ్రమలు నెలకొన్నాయన్నారు. జిల్లాలో బందరుపోర్టు గూర్చి 2004 నుంచి అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయని, 2006 నుంచి నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని, 2008 ఏప్రిల్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారేగాని ఇప్పటి వరకు ఏవిధమైన నిర్మాణం నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 500 రోజులుగా కోనేరు సెంటర్‌లో బందరు పోర్టు ఐక్యకారాచారణ సమితి ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తొలుత బందరు బంద్, రెండోసారి తూర్పు కృష్ణా బంద్, మూడోసారి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్‌కు మద్దతు పలుకు తున్నాయని, ప్రజలకు సంబంధించిన బంద్ కాబట్టి వ్యాపారులు, ట్రాన్స్‌పోర్టు రంగంవారు, విద్యాసంస్థలు, ఆర్టీసి, థియేటర్లు, అన్ని రంగాలు బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బందరు పోర్టు సాధన కోసం ఈనెల 27న జరిగే జిల్లా బంద్‌కు మద్దతుగా గురువారం సాయంత్రం 4 గంటలకు అఖిలపక్షం ఆధ్వర్యాన లెనిన్ సెంటర్ నుంచి రాఘవయ్య పార్కు వరకు ర్యాలీ నిర్వహించి వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఇదిలావుండగా 2009లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన గద్దె బాబూరావు ఇప్పటికి మూడు సార్లు రాజీనామా చేసిన వ్యక్తని ఈరోజు కొత్తగా తెలుగుదేశానికి రాజీనామా చేసినట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. బాబూరావు పశ్చి అవకాశవాదని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిన తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నేతలు బొండా ఉమా, కె నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.
ఒయు పరిధి అభ్యర్థుల రభస
* నాన్ లోకల్ పిజి మెడికల్ సీట్ల కౌనె్సలింగ్‌కు విఘాతం
హెల్త్ వర్శిటీ, ఏప్రిల్ 25: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వివిధ యూనివర్శిటీల పరిధిలోని పిజి మెడికల్ సీట్ల భర్తీకి నాన్ లోకల్ క్యాటగిరిలో అభ్యర్థులకు జరుగుతున్న కౌనె్సలింగ్ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో చెందిన కొందరు విద్యార్థులు రభస చేయడంతో బుధవారం కౌనె్సలింగ్‌కు తాత్కాలికంగా విఘాతం కలిగింది. నాన్ లోకల్ క్యాటగిరిలో ఒక యూనివర్శిటీ పరిధిలోని 15 శాతం అన్ రిజర్వ్‌డ్ పిజి మెడికల్ సీట్లను రాష్ట్రంలోని ఇతర యూనివర్శిటీలు, రాష్ట్రేతర యూనివర్శిటీల పరిధిలోని అభ్యర్థులకు కేటాయిస్తారు. అయితే ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని కొందరు అభ్యర్థులు 15 శాతం నాన్ లోకల్ సీట్లను తమ యూనివర్శిటీ పరిధికి చెందిన అభ్యర్థులకే కేటాయించాలని పట్టుబట్టడంతో కౌనె్సలింగ్ కార్యక్రమం మధ్యాహ్నానికి నిలిచిపోయింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని నాన్ లోకల్ పిజి సీట్లను శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ అభ్యర్థులకు కేటాయించడంపై ఓయు పరిధిలోని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కౌనె్సలింగ్ తాత్కాలికంగా 11వ రోస్టర్ పాయింట్ వద్ద నిలిచిపోయిన సమయానికి మొత్తం 255 నాన్ లోకల్ క్యాటగిరికి చెందిన పిజి మెడికల్ సీట్లకుగాను 44 సీట్లు భర్తీ అయ్యాయి. హెల్త్ యూనివర్శిటీ యంత్రాంగం అభ్యర్థులతో చర్యలు జరిపిన అనంతరం వివాదం సద్దుమణిగాక రాత్రి 8 గంటల నుంచి తిరిగి కౌనె్సలింగ్‌ను ప్రారంభించారు.
రోగులకు నాణ్యమైన ఆహారం
*వైద్యాధికార్లకు జెసి ఉప్పల్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 25: ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవటంతోపాటు టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ డా గౌరవ్ ఉప్పల్ సంబంధిత వైద్య అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఆహార సరఫరాను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన జిల్లా డైట్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం బుధవారం ఉదయం నగరంలోని జిల్లా జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మచిలీపట్నం, నందిగామ, గుడివాడ, నూజివీడు, మైలవరం, తిరువూరు, అవనిగడ్డ, ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాల్సి వుందన్నారు. ఆహారాన్ని సరఫరా చేసేందుకు గుత్తేదారులను నియమించాల్సి వుందన్నారు. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను తక్షణమే చేపట్టి ప్రతిపాదనలను సమర్పించాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. దీంతోపాటు ఈ ఏడాది నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులలో రోగులకు కూడా ఆహార సరఫరా కార్యక్రమాన్ని చేపట్టాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అర్హత పొందిన గుత్తేదారులు ఆహార పదార్థాలను ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే తయారు చేసి అందించాలని, ఇందుకు అవసరమైన వౌళిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సరఫరా చేసే ఆహారంలో నాణ్యత లోపిస్తే తక్షణమే చర్యలు తీసుకునేలా వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షణను కలిగివుండాలన్నారు. త్వరలో కమిటీ మరోమారు సమావేశమై టెండర్ల ప్రక్రియను ఖరారు చేయటం జరుగుతుందని జెసి ఉప్పల్ తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు డా. పి రామారావు, ఎం సావిత్రమ్మ, డా. పి రాంబాబు, చీఫ్ డైటీషియన్ ఎంఆర్‌కె ప్రసాద్, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.
లోకల్ టివి చానల్స్ నిర్వహణలో
గాంధీనగర్, ఏప్రిల్ 25: ప్రజలలో రియల్ ఎస్టేట్ రంగం పట్ల, ప్రాపర్టీ కొనుగోలు పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఒక ఎగ్జిబిషన్ తరహాలో ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు సిటీఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్లూరి సాయిబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం మొగల్రాజపురంలోని సిటీ చానల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సిటీ చానల్, మాటీవీ, డిచానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27,28,29 తేదీలలో మూడురోజుల పాటు సిటీప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెంజిసర్కిల్ సమీపంలోని ‘వేదిక’ కళ్యాణమండపంలో జరగనున్నట్లు తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉడా వైస్ చైర్మన్ విజయకుమార్, మునిసిపల్ కమిషనర్ రవిబాబు విచ్చేస్తారని తెలియజేశారు. గృహ నిర్మాణానికి అవసరమైన ఇంటిస్థలం మొదలు నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని రకాల మెటీరియల్ వివరాలు ఒకచోట సమగ్ర సమాచారం లభ్యమయ్యే విధంగా సిటీప్రాపర్టీ షో ఉపకరిస్తుందని సాయిబాబు అన్నారు.
రేపటి నుండి శ్రీ కంచికామకోటి పీఠం వార్షికోత్సవ వేడుకలు
విజయవాడ, ఏప్రిల్ 25: లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నెలకొల్పబడిన శ్రీ కంచికామకోటి పీఠం 36వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 27, 28 తేదీల్లో ఘనంగా జరుపనున్నట్లు ఆలయ చైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యం బుధవారం నాడొక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రిటైర్డ్ డిజిపి డాక్టర్ కె అరవిందరావు, తితిదే ఉన్నత వైదిక విద్యా సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆకెళ్ల విభీషణ శర్మ ముఖ్య అతిథులుగా హాజరువుతారని చెప్పారు.
ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్
జోనల్ వైస్ చైర్మన్‌గా ప్రభాకరరావు
విజయవాడ, ఏప్రిల్ 25: ఎపిఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జోనల్ వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ఉద్యోగి బి ప్రభాకరరావును నియమిస్తూ యూనియన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
* అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించిన కమిషనర్ రవిబాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 25: నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను నగరపాలక సంస్థ కమిషనర్ జి రవిబాబు ఆదేశించారు. కమిషనర్ రవిబాబు భ్రమరాంబపురం, కెనాల్ రోడ్ ప్రాంతాల్లో బుధవారం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు యలమంచిలి రవితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గతంలో రెవెన్యూ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు సంయుక్తంగా స్వర్గపురి ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న కుటుంబాలను గుర్తించి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం ద్వారా గృహాలను కేటాయించేందుకు చర్యలు తీసుకొన్నదానిపై, స్థానికంగా ఉంటున్న కుటుంబాల వారు తమ పేర్లు జాబితాలో చేర్చి లేవని తెలిపిన దానిపై విచారించారు. స్థానిక శాసనసభ్యుడు పరిశీలించి తగు చర్యలు తీసుకోవలసిందిగా కమిషనర్‌ను కోరగా, కమిషనర్ స్పందిస్తూ సంబంధిత హౌసింగ్ అధికారులను సమగ్రంగా విచారించి వెంటనే నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించారు. అనంతరం గుణదల గంగిరెద్దుల దిబ్బలోని మంచినీటి సరఫరా ప్లాంట్‌కు సంబంధించి అవసరమైన నీటిని పంపింగ్ చేసేందుకుగాను కెనాల్ రోడ్డులోని ప్రధాన కాల్యయంలో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్ పనులను పరిశీలించారు. ప్రస్తుతము కాల్వలకు నీరు ఆపినందున నిర్మాణంకు సంబంధించిన పనులను వేగవంతము చేసి సకాలములో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవలసిందిగా సంబంధిత కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ మధురానగర్, అంబేద్కర్ కాలనీ ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అంబేద్కర్ కాలనీ కాల్వ ఒడ్డు నివాసాలను తొలగించినప్పటికీ ఇంకా కొన్ని గృహాలు ఖాళీ చేసి వెళ్లక పోవడం పట్ల అగ్రహిస్తూ వెంటనే వారిని ఖాళీ చేసి వెళ్లవలసిందిగా ఆదేశించారు. అనంతరం మధురానగర్ ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి అక్కడ ఎంత మంది పని చేస్తున్నదీ, ఎంతమంది విధులకు రానిదీ సంబంధిత ఆరోగ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో కొన్నిచోట్ల చెత్త తరలించకపోవడం, పారిశుద్ధ్య పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే చెత్తను తొలగించాల్సిందిగా ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జెపి రామకృష్ణ, సహాయ వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. జెడ్ శ్రీనివాసరావు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్వామినాయుడు, ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రజారోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
థియేటర్లలో అగ్ని ప్రమాదాల నిరోధక సాధనాల ఏర్పాటులో
నిర్లక్ష్యం సహించం
*జెసి ఉప్పల్ హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 25: థియేటర్లలో అగ్ని నిరోధక సాధనాలు ఏర్పాటు, ప్రేక్షకులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ హెచ్చరించారు. సినిమా థియేటర్లలో అగ్ని ప్రమాదాల నివారణ సాధనాలు, ప్రేక్షుకలకు వౌళిక వసతుల కల్పనపై బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ నగరంలోని కళ్యాణచక్రవర్తి, కపర్థి, శాంతి, ప్రశాంతి థియేటర్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సినిమా థియేటర్లలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అగ్ని నిరోధక సాధనాల ఏర్పాటు, వౌలిక వసతుల కల్పన వంటి చర్యలను యజమానులు తప్పక పాటించవలసి ఉందన్నారు. జిల్లాలో 127 సినిమా థియేటర్లకుగాను 50 శాతం పైగా థియేటర్లు నగరంలోనే ఉన్నాయన్నారు. 31 థియేటర్లు మాత్రమే ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రేక్షకుల రక్షణను దృష్టిలో ఉంచుకుని మిగిలిన థియేటర్ల యజమానులు తక్షణమే ప్రత్యేక దృష్టి సారించి వసతులు కల్పించని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు, లైసెన్స్‌లు రద్దు చేసేందుకు వెనుకాడేదిలేదని జాయింట్ కలెక్టర్ థియేటర్ యజమానులను హెచ్చరించారు. తినుబండారాలు, శీతలపానీయాలు నిర్ధేశించిన రేట్లకంటే అత్యధిక ధరలకు విక్రయించటంతోపాటు టిక్కెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పలువురు ప్రేక్షకులు తమ దృష్టికి తీసుకురావటం జరిగిందని, అధికారులు తనిఖీల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే జరిమానా విధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆకస్మిక తనిఖీలో జాయింట్ కలెక్టర్‌తోపాటు డిఎఫ్‌ఓ ఎస్‌వి చౌదరి, అర్బన్ తహశీల్దార్ జె శ్రీనివాస్, మున్సిపల్ ఫైర్ ఆఫీసర్ బిబివి ప్రసాద్, డెప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, థియేటర్ మేనేజర్లు పాల్గొన్నారు.