రాజాం, ఏప్రిల్ 25: ఉప ఎన్నికల పుణ్యమా అని జిల్లాలో ప్రజాపథం కార్యక్రమానికి బ్రేక్‌లు పడ్డాయి. దీనితో అధికారులకు కొంత ఉపశమనం లభించగా, ప్రజల నిరసనల నుండి ప్రజాప్రతినిధులు తప్పించుకునే అవకాశం కలిగింది. జిల్లాలో ఈ నెల 15 నుండి ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 2వ తేది వరకు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పథకం, నిరంతరం ఏడుగంటల విద్యుత్ సరఫరా, పంటరాయితీ, మహిళా సంఘాలకు పావలావడ్డీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా షెడ్యూల్ రూపొందించారు. అయితే జిల్లాలో జరిగిన ప్రజాపథంలో అడుగడుగునా అధికారులను, ప్రజాప్రతినిధులను వివిధ సమస్యలపై ప్రజలు నిలదీశారు. దాదాపు ప్రతి సభలోను ప్రజల నుండి నిరసనల సెగ తగిలింది. ముఖ్యంగా ప్రజాపథం ప్రారంభమయ్యే సమయానికి జిల్లాలో మంచినీటి సమస్యతో పాటు, విద్యుత్‌కోత తారాస్థాయికి చేరుకుంది. దీనితో ప్రజాపథం సభ నిర్వహణకు అధికారులు, ప్రజాప్రతినిధులు వెనుకడుగేసే పరిస్థితులు నెలకొన్నాయి. అడుగడుగునా ప్రజల నుండి నిరసనలు వ్యక్తమవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రజాపథం నిర్వహణ ఒక సవాల్‌గానే మారింది. ఇందిరమ్మ బిల్లులు, విద్యుత్ సరఫరా మెరుగుపర్చమని, మంచినీటి సరఫరా కల్పించమని దాదాపు ప్రతిసభలోనూ ప్రజలు నిలదీశారు. మరోవైపు ఉద్దానం ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేకుంటే ప్రజాపథాన్ని గ్రామాల్లో జరుగనీయబోమని అధికారులకు ప్రజలు అడ్డుతగులు తున్నారు. ఇన్ని సమస్యలతో అధికారులకు, ప్రజాప్రతనిధులకు ప్రజాపథం నిర్వహణ భారంగా మారింది. మరికొన్ని చోట్ల సమస్యలపై నెపాన్ని అధికారులపై నెట్టి వేసి ప్రజాప్రతినిధులు చల్లగా జారుకునేవారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాపథం సభలో ‘అభివృద్ధి జరిగితే మమ్మల్ని కీర్తించండి.. పనుల్లో తాత్సారం చేస్తే అధికారులను నిలదీయండి’ అని సాక్షాత్తూ ఓ మాజీ ప్రజాప్రతినిధే వ్యాఖ్యానించడం పరిస్థితి తీ వ్రతను గమనించవచ్చు. ఇటువంటి పరిస్థితిల్లో ప్రజాపథం నిర్వహణ అధికారులకు కఠిన పరీక్షగా మారింది. ఇలాంటి పరిస్థితిలో ఎన్నికల కోడ్ అధికారులను ఊపిరిపీల్చుకునేలా చేసింది. జిల్లాలో ఉపఎన్నిక జరగనున్న నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఆ కోడ్ జిల్లా మొత్తానికి వర్తించనుంది. దీనితో జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు జూన్ నెల వరకు పూర్తిగా ఆగిపోనున్నాయి. దీనిలో భాగంగానే ప్రజాపథం కార్యక్రమానికి ఫుల్‌స్టాప్ పడింది. దీనితో అధికారులు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకుంటుంగా.. ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల శాపాల నుండి కొంత వరకు బయటపడగలిగామని లోలోన సంతోషపడుతున్నారు.
రాజాం మండలంలో పేరుకుపోయిన సమస్యలు
మండలంలో వివిధ సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. వీటి నుండి కొంతమేర బయటపడడానికి ప్రజాపథం ఒక వేదికగా మార్చుకోవాలని ప్రజలు భావించారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా కార్యక్రమం నిలిచిపోవడంతో ప్రజలు డీలా పడ్డారు. కంచరాం లో మంచినీటి సమస్య, ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం, రాజయ్యపేటలో గిరిజన వర్గాల పట్ల ఉపాధి పనుల్లో వివక్ష చూపడం, జిసిహెచ్ పల్లి, ఎం జె వలస, బి ఎన్ వలస, గ్రామాలలో మంచినీటి సమస్య, అక్రమ మైనింగ్ వంటి సమస్యలున్నాయి. ఒమ్మి, సోపేరు, శ్యాంపురం గ్రామాలలో మంచినీరు , రహదారులు సమస్య పెనుబాకలో మంచినీటితో పాటు సామాజిక సమస్యలుండగా మారేడుబాకలో మంచినీటి సమస్య దళిత వర్గాల భూ సమస్య, కొఠారిపురంలో అగ్నిబాధితుల సమస్య, నందబలగ, బొద్దాంలో పారిశుద్ధ్య , మంచినీరు సమస్యలున్నాయి. ఇక నగర పంచాయతీ పరిధిలో 10 వార్డులలో మంచినీరు, పారిశుద్ధ్యం, ఇతర సామాజిక సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి.
కోడ్ అమలుకు సమాయత్తం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఏప్రిల్ 25: ఎన్నికల కమిషన్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెనువెంటనే జిల్లాలో నరసన్నపేట నియోజకవర్గం పరిధిలో కోడ్ అమలుకు అధికారులు రెఢీ అయ్యారు. ఇందులో భాగంగా ఇంతవరకు ఏర్పాటు చేసిన బేనర్లు, కటౌట్లు, తోరణాలు, జెండాలను తొలగించే పనిలో పడ్డారు. ఎప్పుడైతే అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేసేందుకు అటు సిద్ధం కాగా ప్రధాన రాజకీయపక్షాల్లో గుబులు మొదలైంది. నేతల ప్రచారంలో వాహనాల నుంచి లౌడ్ స్పీకర్లు, బహిరంగ సభలు, ర్యాలీలు, గ్రామస్థాయిలో నిర్వహించేవరకు అనుమతులు తప్పనిసరి అని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో బరిలో ఉన్న రాజకీయ పక్షాలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతీరోజు ఎన్నికల వ్యయానికి సంబంధించి ఖర్చుల వివరాలు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి నివేదించాలన్న ఆంక్షలు కూడా విధించడంతో రేస్‌లో ఉన్నవారికి మరిన్ని చిక్కులు ఎదురుకానున్నాయి. ఇందులో భాగంగా నరసన్నపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి సి.హెచ్.రంగయ్య ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని రాజకీయపక్షాలను, అధికారులకు హుకుం జారీ చేశారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాన రాజకీయ పార్టీల బేనర్లను తొలగించేందుకు ఆదేశాలు జారీచేశామని పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జాతీయ రహదారిపై పలుపార్టీలకు సంబంధించిన కటౌట్లను, బేనర్లను, తోరణాలను స్థానిక పంచాయితీ కార్యనిర్వహణాధికారి వి.ప్రకాశరావు ఆధ్వర్యంలో యుద్దప్రాతిపదికన తొలగించారు. వివిధ రాజకీయ పార్టీ నేతలకు తమ ప్రచార కటౌట్లను తీసివేయాలని ముందస్తుగా వారికి తెలియజేశామని, లేనిపక్షంలో తాము తొలగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఎన్నికల ఖర్చులో వీటిని జమ చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గపరిధిలోనున్న నాలుగు మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, పంచాయితీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరూ ఆయా సూచనలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నా తమకు తెలియజేయాలని ఆదేశించారు.
రూ.16లక్షలు మాత్రమే ఖర్చుచేయాలి
నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలల్లో భాగంగా పోటీలో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు 16లక్షల రూపాయలను మాత్రమే ఖర్చుచేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్దేశించిందని స్థానిక ఎన్నికల అధికారి సిహెచ్ రంగయ్య స్పష్టం చేశారు. గతంలో ఎనిమిది లక్షలు ఉండగా తర్వాత పది లక్షల రూపాయలుగా నిర్దేశించిందని, 2011 సెప్టెంబర్ నెలలో ఈ ఖర్చును 16లక్షల రూపాయలకు పెంచారని పేర్కొన్నారు. ప్రతీ అభ్యర్థి ప్రతిరోజు తాము ఖర్చుచేస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.
మూసివేతే శరణ్యమా
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఏప్రిల్ 25: జిల్లాలో 12 ఇంజనీరింగ్ కళాశాలలో ఆరింటికి తాళాలు వేసే ఆలోచనలో ఆయా యాజమాన్యాలు ఉన్నట్లు సమాచారం. టెక్నో స్కూళ్లుగా మార్పు చేసేందుకు రెండు కళాశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటుండగా, మరో నాలుగు కళాశాలలకు తాళాలు వేసేలా ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయి. చివరకు బ్యాంకులు కూడా ఆయా కళాశాలలకు ఓవర్ డ్రాఫ్ట్ చెల్లింపులు నిలిపివేసాయి. సర్కార్ నుంచి రావల్సిన కోట్లాది రూపాయలు అందక, సహాయం చేయాల్సిన బ్యాంకులు చేతులేత్తేస్తే...మూసివేతే శరణ్యంగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు ఆర్థిక ఒడుదుడుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. 2011-12 విద్యాసంవత్సరం ముగిసినా నేటికీ స్కాలర్ షిప్పులు విడుదల కాలేదు. మొత్తం ఫీజు రీయింబర్‌సమెంట్, ఉపకార వేతనాల బకాయిలు సుమారు 29కోట్లు రూపాయలు ఉన్నట్లు అధికారులు చెప్పిన లెక్కలు. ప్రభుత్వం మొత్తం బకాయిలు చెల్లించేసామని, నిధుల (మిగతా 2వ పేజీలో)
విడుదలకు ఎటువంటి జాప్యం లేదని పైకి చెబుతున్నా విద్యాసంవత్సరం ముగిసి ముప్పై రోజులు గడిచినా నేటికీ ఇవి అందలేదు. దీంతో కిందటేడాది ఫీజురీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించనందుకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు మార్కుల మెమోలు ఇవ్వకుండా పెట్టిన తిప్పలు గుర్తుచేసుకుంటున్నారు. 2010-11 సంవత్సరానికి సంబందించి బకాయిలే ఇంకా రెండు కోట్ల రూపాయలు సర్కార్ చెల్లించాల్సి ఉంది. 2010-11 విద్యాసంవత్సరానికి 62 వేల మంది విద్యార్థులకు 34 కోట్ల రూపాయలు ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు, 52,148 మంది స్కాలర్‌షిప్పుల బకాయిలు 18 కోట్ల 79 లక్షల 70 వేల 963 రూపాలయలు చెల్లించాల్సి ఉండగా, ఫీజు రీయంబర్స్‌మెంట్ మొత్తం విడుదల చేసి బకాయి పూర్తిచేశారు. స్కాలర్ షిప్పు విషయానికి వస్తే మరో 9,855 మందికి సుమారు రెండు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. 2011-12 సంవత్సరానికి ఫీజు రీయంబర్స్‌మెంట్, విద్యార్థుల స్కాలర్‌షిప్పులకు 65,701 మంది విద్యార్థినీవిద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా వీరికి 37 కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావించి జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దఫదఫాలుగా 22,181 మందికి ఫీజు రీయంబర్స్‌మెంట్‌గా 7.66 కోట్ల రూపాయలు విడుదల చేశారు. విద్యాసంవత్సరం ముగిసి నెలరోజులు కావస్తున్నా ఇంకనూ 43,520 మందికి ట్యూషన్ ఫీజుతో పాటు స్కాలర్ షిప్పులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని కార్పొరేట్ కళాశాల విద్యార్థులకు సంబందించి వెరిఫికేషను కూడా పూర్తికాకపోవడంతో విద్యార్థులు మరింత ఆవేదన చెందుతున్నారు. పరీక్షలు ముగిసి త్వరలో ఫలితాలు విడుదల కానున్న ఈ తరుణంతో మరల వెరిఫికేషన్ పేరుతో విద్యార్థులను కళాశాలల చుట్టూ తిప్పించుకోవడం భావ్యం కాదని విద్యార్థి సంఘాల ఆరోపణ. కిందటి ఏడాదికూడా ఇదేవిధంగా ఫీజు బకాయి ప్రభుత్వం చెల్లించకపోవడంతో కొన్ని కళాశాలలు ఉన్నత చదువుకు వెళ్లడానికి మార్కుల మెమోలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించిన విషయాన్ని విద్యార్థులు ఈ సందర్బంగా గుర్తుచేస్తున్నారు. దీని ప్రభావం రానున్న విద్యా సంవత్సరంపై పడకుండా కళాశాల విడిచి వెళ్లే విద్యార్థులను ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు వేధింపులకు గురిచేయకుండా ఉండాలంటే వెంటనే ప్రభుత్వం స్కాలర్ షిప్పు బకాయిలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
ఎట్టకేలకు ఆలయంలోకి..
శ్రీకాకుళం(కల్చరల్) ఏప్రిల్ 25: ఏ ప్రాంతంలో ఆలయాలు నిత్యనూతనత్వంతో శోభిల్లుతుంటాయో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందనేది పెద్దల నమ్మకం. ఎంతో మంది ధనవంతులు, గొప్ప నాయకులు ఉన్న ప్రాంతమైనా, జగానే్నలే జగన్నాథునికి నీడ కరవైంది. పట్టణంలోని గుజరాతీపేట ప్రాంతంలో దాదాపు ఆరు దశాబ్ధాల క్రితం గుజరాతీయులు నిర్మించిన జగన్నాథ స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. సంవత్సరాలు గడుస్తుండడంతో ఆలయ గాలిగోపురం పూర్తిగా శిథిలమైంది. దశాబ్ధన్నర కాలంగా ఆలయ పునర్నిర్మాణం కోసం అందరూ సహకరించాలంటూ ఆలయ అర్చకులు కోరినా ఆ ప్రాంతంలో ఏ ఒక్కరు ముందుకు రాలేదు. శిథిలమైన ఆలయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో అర్చకులు భక్తుల నుంచి, స్థానికుల నుంచి చందాలు పోగు చేయగా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు సమకూరింది. దీనిని మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో చెల్లిస్తే సి.జి ఎఫ్ నుండి రూ.12లక్షలు మంజూరు చేస్తామని అప్పటి కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ ఆలయానికి ఉన్న విలువైన భూములు అన్యాక్రాంతం అయి, పరుల చేతుల్లో చిక్కుకున్నాయి. దీంతో జగన్నాధునికి ఆలయం లేకుండా పోయింది. ఎనిమిదేళ్ల క్రితం అప్పటి మేనేజర్ చందాలుగా పోగు చేసిన దానిలో లక్షన్నర ఖర్చు చేసి పురాతన ఆలయాన్ని నేలమట్టం చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. ఆలయం పూర్తిగా నేలమట్టం అయిన తరువాత వెంటనే పునర్నిర్మాణం పనులు చేపట్టకపోవడంతో గోతులతో, శిథిలాలు, వ్యర్ధాలతో దర్శనమిచ్చింది. దీంతో జగానే్నలే జగన్నాథుడు పరాయి పంచన ఎనిమిదేళ్లు ఉన్నారు. అప్పుడప్పుడు చేసిన పనులతో గోడల వరకు ఆలయాన్ని నిర్మించి విడిచిపెట్టేసారు. గత ఏడాది దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ దర్భముళ్ల భ్రమరాంబ ఆలయాన్ని సందర్శించి పునర్నిర్మాణానికి నడుం కట్టారు. ముందుగా తన జీతం నుంచే రూ.10వేలు విరాళం ఇచ్చి, తమ సిబ్బంది నుంచి కూడా విరాళాలు సేకరించి ఆలయం పనులు ముమ్మరం చేయడంతో గర్భాలయం పనులు ఎట్టకేలకు పూర్తి చేయించగలిగారు. మరో ఏడాది వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో బుధవారం జగన్నాధస్వామి వారిని ఆలయంలో ప్రతిష్టించేసారు. తరువాత నెమ్మదిగా భక్తులు, దాతల సహకారంతో ఆలయం చుట్టూ బేడామండపం నిర్మాణం పూర్తి చేయిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు.
పగలు ఎండ వేడి..
రాత్రి ఉక్కపోత!
బలగ, ఏప్రిల్ 25 : జిల్లాలో పగలు ఎండలు మండుతున్నాయి. లోడ్‌రిలీఫ్ పేరుతో రాత్రిళ్లు విద్యుత్‌కోత విధిస్తుండటతో పుడమి వేడిమికి ఆవిర్లు పైకొచ్చి మండుతున్న కొలిమిని తలపిస్తుంది. పరీక్షలు ముగిసిన మరుసటి రోజే విద్యుత్ కోత పూర్తిస్థాయిలో విధిస్తుండటతో పలువురు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా జిల్లాలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వివిధ సమయాల్లో నాలుగు గంటల పాటు విద్యుత్‌కోత అమలు చేస్తున్నారు. దీనికి అదనంగా సిబ్బంది లైన్ మెయింట్‌నెన్స్ పేరుతో రాత్రిళ్లు రెండు, మూడు గంటలుపాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు కుటీర పరిశ్రమ యజమానులు వ్యాపారాలు సాగక నానా ఇబ్బందులనెదుర్కొంటున్నారు. పేదల ఊటీగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలోనే ఈవిధమైన పరిస్థితి నెలకొంటే ఇక ఇతర ప్రాంతాల పరిస్థితి చెప్పక్కర్లేదు. ఇక పగటిపూట విషయానికొస్తే ఉదయం ఏడు గంటలనుండే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. విద్యుత్ కోతతో ఉక్కపోతను భరించలేక ఇంటిలోకూడా ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే విద్యుత్ కోత ఏసమయంలో ఉంటుందో తెలీక వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు. అధికారులు ప్రకటించిన సమయానికి అదనంగా లోడ్ రిలీఫ్, లైన్ మెయింటినెన్స్ పేరుతో రోజంతా కోతతోనే బతుకు ఈడ్చవలసి వస్తుందని, తమ వ్యాపారాలు సాగకపోవడంతో తాము భార్యాపిల్లలతో రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని చిన్న వ్యాపారులు, కుటీర పరిశ్రమలు నడిపేవారు ఆవేదన చెందుతున్నారు. అధికారులు మాత్రం జిల్లాకు 2.97మిలియన్ల యూనిట్లు అవసరం కాగా 1.5మిలియన్ల యూనిట్లనుండి 2మిలియన్ల యూనిట్లవరకు విద్యుత్ సరఫరా కావటంతో చేసేదేమీ లేక విద్యుత్‌కోత అనివార్యమైందని నిస్సహాయతను వ్యక్తపరుస్తున్నారు.
సిఫారసులే పనిచేస్తాయి
కోటబొమ్మాళి, ఏప్రిల్ 25: ఎంత బాగా నటించినప్పటికి ప్రముఖ ప్రజాప్రతినిధుల సిఫార్సులు లేనిదే నంది అవార్డులు తమలాంటి వారికి కష్టమేనని ప్రముఖ సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేసారు. వ్యక్తిగత పని మీద కోటబొమ్మాళికి బుధవారం వచ్చిన ఆయన మాట్లాడారు. కొండవలస తాత గారి గ్రామమైన కోటబొమ్మాళికి సినీనటుడు అయిన తర్వాత రావడం ఇదే ప్రథమమని, సినీరంగానికి వెళ్లకముందు అనేక పర్యాయాలు ఇక్కడికి వచ్చినట్లు కొండవలస చెప్పారు. 234 సినిమాల్లో, 2 వేలకు పైగా పరిషత్ నాటిక, నాటకాల్లో నటించిన తనకు సినీరంగం డబ్బు తెచ్చిపెడితే, నాటకరంగమే కీర్తిని, సంతృప్తిని అందించిందన్నారు. ఈ ఆగస్టు నాటికి సినీరంగంలోకి ప్రవేశించి 17 ఏళ్లు పూర్తవుతుందన్నారు. అంతకు ముందు విశాఖ పోర్టులో ఉద్యోగిగా పనిచేసిన తనకు ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా ద్వారా సినీరంగానికి పరిచయమైనట్లు చెప్పారు. ఇదే సినిమాలో పొట్టిరాజు పాత్రలో అయితే, ఓకే అనే డైలాగ్‌తో ప్రజాదరణ పొందానన్నారు. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ..కబడ్డీ, పెళ్లాంతో పనేంటి, ఆడవారికి ఆదివారం సెలవు అనే సినిమాలు తనకు పేరు తెచ్చిపెట్టాయన్నారు. ప్రస్తుతం తాను దేవారాయ, పీపుల్స్‌వార్‌తోపాటు, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. కె.విశ్వనాధ్ తనకు ఇష్టమైన దర్శకుడు అని, నటనతోపాటు స్వాగతం తదితర నాటకాలు రాసానని, 378 అవార్డులు, 2 నంది బహుమతుల వచ్చాయన్నారు. సినీరంగంలో నంది అవార్డులు రాలేదా అన్న దానికి సిఫార్సులు లేనిదే నంది అవార్డులు రావడం అసాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈయన వెంటన ఆనంద, భాస్కరరావులున్నారు. కొండవలసను చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
ట్రాఫిక్ సిఐగా విజయ్‌కుమార్
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 25: ట్రాఫిక్ సిఐగా ఎస్ విజయకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2002 బ్యాచ్‌కు చెందిన విజయ్‌కుమార్ జిల్లాలో కొత్తూరు, దోనుబాయ్, బత్తిలి, స్పెషల్ బ్రాంచ్, ఎచ్చెర్ల, సంతబొమ్మాళి, మెరైన్ పోలీసుస్టేషన్, హిరమండలం, రైల్వేడిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. రైల్వేలో పనిచేస్తూ పదోన్నతిపై శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొనసాగించిన ట్రాఫిక్ నిబంధనలను కొనసాగిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో డ్రైవర్లు తమ ఆటోలను నిర్దేశించిన స్థలాల్లోనే నిలుపుదల చేయాలన్నారు. పట్టణంలో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రోడ్డు విస్తరణ జరుగడం లేదని, అందుకు ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ సిబ్బందితో సహకరించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు.
పీజీ పరీక్షలు ప్రారంభం
నేటి నుంచి నాలుగో సెమిస్టర్
ఎచ్చెర్ల, ఏప్రిల్ 25: పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులకు రెండవ సెమిస్టరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు మే 10వ తేదీవరకు జరుగనున్నాయి. అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులకు స్థానికంగా పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేమాదిరిగా జిల్లాలో ఉన్న పిజి అనుబంధ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలను పరీక్షాకేంద్రంగా ఎంపిక చేశారు. అదే విధంగా నాల్గవ సెమిస్టరీ పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి ఆరంభం కానున్నాయి. బిఎల్, ఎంసిఏ, ఎంబిఏ కోర్సులకు రెండవ సెమిస్టరీ మే 3 నుంచి నిర్వహించేందుకు ఇన్‌చార్జి విసి భగవత్‌కుమార్ తేదీలు ఖరారు చేశారు. అలాగే జిల్లాలో ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ పి.చిరంజీవులు, డీన్ తులసీరావులు పర్యవేక్షిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి రాందాసు విస్తృత ప్రచారం
సారవకోట, ఏప్రిల్ 25: ఉపఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న ధర్మాన రాందాసు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటివరకు పరోక్షంగా రాజకీయాలు నడిపిన రాందాసు ఉపఎన్నికలలో ప్రత్యక్షంగా నేరుగా శాసనసభకు పోటీచేస్తున్న నేపథ్యంలో ఇంటింట ప్రచారం చేస్తూ వ్యక్తిగత పరిచయాలు ఇప్పటివరకు బైదలాపురం, భద్రి, గుమ్మపాడు, లక్ష్మీపురం, అవలింగి, చీడిపుడి గ్రామాలలో పర్యటించి తనను గెలిపించాలని కోరుతున్నారు. చీడిపుడి గ్రామంలో ప్రధానమైన నాయకులందరూ ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నందున ఇక్కడ ఓటుబ్యాంకును మరింత పటిష్టపరచడానికి రాందాసు ప్రాధాన్యతనిచ్చారు. డెడికేటెడ్ మండల కోఆర్డినేటర్ వెంకటసత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లుకలాపు సింహాచలం, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
వేధిస్తున్న లోవోల్టేజి సమస్య
ఆమదాలవలస, ఏప్రిల్ 25: మండలంలో గల బొబ్బిలిపేట, నెల్లిపర్తి, హనుమంతుపురం, వెదుళ్లవలస, చింతలపేట, రామచంద్రాపురం, చిట్టివలస, సైలాడ, కుమ్మరిపేట గ్రామాల్లో లోవోల్టేజి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉండడంతో ఒకపక్క విద్యుత్‌కోత మరోపక్క లోవోల్టేజి సమస్య వర్ణణాతీతం. సాయంత్రం నాలుగుగంటల నుంచి రాత్రి పదిగంటల వరకు లోవోల్టేజి సమస్యతో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, నీటిని తోడుకునే మోటార్లు పనిచేయడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి ఆరుగంటల వరకు విద్యుత్‌సరఫరాను నిలిపివేయడం, ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌శాఖాధికారులు స్పందించి లోవోల్టేజి సమస్య, విద్యుత్ కోత సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.