Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గిరిజనాభివృధ్ధికి పనిచేయని అధికారులను ప్రజల ముందు నిలదీస్తాం

$
0
0

అరకులోయ, ఏప్రిల్ 25: గిరిజనాభివృధ్ధికి పాటుపడని అధికారులను ప్రజల ముందు నిలదీస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు హెచ్చరించారు. మండలంలోని పద్మాపురం మేజరు పంచాయతీ యండపల్లి వలసలో రెండురోజులపాటు ఘనంగా నిర్వహించిన శాంతామణి దేవి జాతర మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఉత్సవ ముగింపురోజు మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా స్ధానిక పర్యాటక అతిథి గృహంలో మంత్రి బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలుచేయని అధికారులపై ఇకనుంచి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మన్యం ప్రగతికి పనిచేయని అధికారులను కార్యాలయాలకు పిలిచి మందలించే సంస్కృతికి స్వస్తి పలికి, అటువంటి వారిని ప్రజల ముందు నిలదీయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అధికారులను సున్నితంగా మందలిస్తుండడం వల్ల ప్రయోజనం కానరావడం లేదని, అభివృద్ధి పనులు జరగడం లేదని ఆయన తెలిపారు. గిరిజనులు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెంది ఆన్ని రంగాల్లో రాణించాలంటే అధికారుల పనితీరును గాడిలో పెట్టవలసిన అవసరం ఉందని గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ మన్యంలో పనిచేస్తున్న అధికారులు బాధ్యతలను గుర్తెరిగి తమ విధులను చిత్తశుధ్ధితో నిర్వహించాలని, లేనిపక్షంలో ప్రజల ముందు తలదించుకోవలసిన పరిస్థితి ఎదురుకాక తప్పదని ఆయన చెప్పారు.
అరకులోయ పర్యాటక కేంద్రంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న వీధి దీపాలు వెలిగించలేని పరిస్థితులలో ఇక్కడి అధికారులు ఉన్నారంటూ స్ధానిక ఎం.పి.డి.ఒ. కె.గౌరీ శంకర్‌ను మందలించారు. నిరుపయోగంగా పడి ఉన్న వీధి దీపాలను వెలిగించేందుకు ఇప్పటికైనా వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ విషయమై పర్యాటక శాఖ అధికారులు, పంచాయతీ నిర్వాహకులతో చర్చించి వీది దీపాలను వెలిగించి స్థానికులు, పర్యాటకులకు వెలుగునివ్వాలని ఆయన సూచించారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, 160 మంది కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఇటీవల సందర్శించిన చొంపి గ్రామంలో మంచినీటి సదుపాయం వెంటనే కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇంతవరకు ఆ గ్రామంలో మంచినీటి సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల మంత్రి అధికారులపై మండిపడ్డారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన అడపవలస గుహల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పర్యాటక శాఖామంత్రి, ఉన్నతాధికారులతో చర్చించి గుహల పరిసర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చేనెల మొదటి వారంలో అరకులోయ పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవానికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి బాలరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్, జిల్లా గిరిజన సంక్షేమ ఉప సంచాలకుడు మల్లిఖార్జున రెడ్డి, తహశీల్దార్ డి.సన్నిబాబు, ఎం.పి.డి.ఓ. కె.గౌరీశంకర్, వెంకన్న కల్యాణ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొల్లా రమేష్‌బాబు, యు.రంగరాజు, సాంబశివరావు, ఎన్.అప్పన్న, దేవభక్తుల వెంకటరావు, గ్రంధి సత్యనారాయణ పాల్గొన్నారు.

తాండవలో క్రషింగ్ పూర్తి
* లక్ష్యాన్ని అధిగమించిన చక్కెర కర్మాగారం
పాయకరావుపేట, ఏప్రిల్ 25: తాండవ చక్కర కర్మాగారంలో 2011- 2012 సంవత్సరానికి క్రషింగ్ ముగిసింది. ఎన్నడూ లేని విధంగా లక్ష్యానికి మించి క్రషింగ్ జరిగింది. తాండవ చక్కెర కర్మాగారం పరిధిలో ఈ ఏడాది 2,953 ఎకరాల్లో మొక్కతోటలు, 6,442 ఎకరాల్లో కార్శితోటలు వెరశి 9,395 ఎకరాల్లో చెరకు సాగు చేపట్టారు. దీని ద్వారా 1 లక్ష 60 వేల టన్నులు చెరకు క్రషింగ్ జరుగుతుందని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే లక్ష్యానికి మించి క్రషింగ్ జరిగినట్లు మేనేజింగ్ డైరక్టర్ జి.వి.రామయ్య తెలిపారు. 1,83,336 టన్నులు చెరకు క్రషింగ్ జరగ్గా 1,81,500 క్వింటాళ్ల పంచదార బస్తాలు ఉత్పత్తి అయినట్లు తెలిపారు. 23,336 టన్నులు చెరకు లక్ష్యానికి మించి క్రషింగ్ జరిగినట్లు తెలిపారు. అలాగే 9.5 శాతం రికవరీ వస్తుందని ఆశించగా, 9.9 శాతం సాధించామన్నారు. 130 రోజులపాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రషింగ్ జరిగిందన్నారు. మార్చి 31వతేదీ వరకు చెరకు రవాణా చేసిన రైతులందరికీ టన్నుకు 1800 రూపాయల చొప్పున 27.50 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. మరో 30 వేల టన్నులకు 4.50 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉందన్నారు. కర్మాగారంలో 1.50 లక్షలు పంచదార బస్తాలు, నాలుగు వేల మెట్రిక్ టన్నుల మొలాసిస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. అలాగే 2012- 2013 ఏడాదికి గాను ప్రస్తుతానికి రెండు వేల ఎకరాల్లో చెరకు నాట్లు వేశారన్నారు. జూన్ నెలాఖరు నాటికి మరో రెండు వేల ఎకరాల్లో చెరకు నాట్లు వేస్తారన్నారు. ఇప్పటికే 4 వేల టన్నుల విత్తనపు చెరకు పంపిణీ చేయగా, రైతులకు కావలసిన ఎరువులు అందజేసేందుకు సిద్ధంచేస్తున్నట్లు ఎం.డి. తెలిపారు. ఈ ఏడాది క్రషింగ్ సజావుగా సాగటానికి సహకరించిన కర్మాగారం పర్సన్ ఇన్‌చార్జి గిరిజా శంకర్‌కు ,రైతులకు, కార్మికులకు,సి బ్బందికి ఎం.డి. జి.వి.రామ య్య కృతజ్ఞతలు తెలిపారు.

సిద్ధాంతం లేని వైఎస్సార్ పార్టీని ప్రజలు ఆదరించరు
* దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
కోటవురట్ల, ఏప్రిల్ 25: సిద్ధాంతం, ఆశయాలు లేకుండా కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం వై. ఎస్.జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించరని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. మండలంలో బోడపాలెంలో పర్యటించిన అయ్యన్న దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం అయ్యన్న విలేఖరులతో మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ అవినీతి గురించి ప్రజలకు తెలుసునన్నారు. వై. ఎస్. ప్రజలకు పది పైసలు విదిల్చుతూ 90 పైసలు నొక్కేసే వాడని ఆరోపించారు. ఈ అవినీతి సొమ్ముతో పార్టీని పెట్టి అధికారాన్ని డబ్బుతో కొందామని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే రాష్ట్ర భవిష్యత్ ఏవిధంగా ఉంటుందో ప్రజలు గ్రహించాలన్నారు. అవినీతిపరుడు సి.ఎం. అయితే రాష్ట్రం అథోగతి పాలవుతుందన్నారు. రోజుకు తొమ్మిది గంటల పాటు నాణ్యమైన, ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేకపోతుందన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేక పోతుందన్నారు. ఎరువుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 27 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. అన్ని వర్గాల వారిని ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదన్నారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయో పార్టీ కార్యకర్తలు ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. జూన్ 12వ తేదీ రాప్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మ్రోగిస్తారన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో దేశం అభ్యర్థి చెంగల గెలుపు ఖాయమన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం అభ్యర్థి చెంగల వెంకట్రావు, మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు, ప్రధాన కార్యదర్శి పినపాత్రుని బాబ్జి, నాయకులు రెడ్డి రామకృష్ణ, వేచలపు జనార్దన్, చిటికెల సత్యనారాయణ, జి.రెడ్డి నానిబాబు పాల్గొన్నారు.

విషాదంలో తొర్రమామిడి, నల్లబిల్లి గ్రామాలు
* కూలిన రంగురాళ్ళ క్వారీ
* ముగ్గురు గిరిజనుల మృతి
గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 25: మంగళవారం నల్లబిల్లి అటవీ ప్రాంతంలో ఉన్న రంగురాళ్ళ క్వారీ కూలిపోయి ముగ్గురు గిరిజనులు మృతి చెందడంతో తొర్రమామిడి, నల్లబిల్లి, లంకవీధి గ్రామాల్లో విషాదం నెలకొంది. పంటలు పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులు రంగురాళ్ళతో పొట్టలు నింపుకుందామని తవ్వకాలకు వెళ్ళి క్వారీ మట్టి పెళ్ళలు విరిగిపడి మృత్యువాత పడ్డారు. దీంతో నల్లబిల్లి గ్రామం విషాదంలో మునిగింది. గ్రామానికి చెందిన సిందేరి బాలన్న, అతని అన్నయ్య సిందేరి సూరిబాబుతో కలిసి రంగురాళ్ళ తవ్వకాలకు వెళ్ళాడు. లోపల ఇద్దరు సుమారు 15 నిమిషాలపాటు తవ్వకాలు జరిపి వెళ్ళిపోదామని సిందేరి బాలన్న అన్నాడు. ఇంతసేపు ఉన్నాకదా మరో పదినిమిషాలపాటు ఉండి వెళ్ళిపోదామని అన్నయ్య తెలిపాడు. మృతుడు బాలన్న అన్నయ్య సూరిబాబు బయటకు రావడానికి సిద్ధపడుతుండడంతో ఒక్కసారిగా మట్టి పెళ్ళలు పడి చిక్కుకున్నారు. తృటిలో తీవ్రంగా గాయపడి బయట ఉన్నవారు సహాయం చేయడంతో సూరిబాబు గాయాలతో బయటపడగా తన తమ్ముడు కళ్ళ ముందే చనిపోయాడని విలపించాడు. లంకవీధి గ్రామానికి చెందిన చెర్రేటి బాలయ్య నల్లబిల్లి గ్రామానికి వచ్చిన తన స్నేహితులతో కలిసి రంగురాళ్ళ క్వారీ తవ్వకానికి వెళ్ళాడు. మత్తుపానీయాలు సేవించిన సమయంలో మాటామాటా కలిసి నేనూ వస్తానని బాలన్న చెప్పడంతో తన స్నేహితులు క్వారీకి తీసుకువెళ్ళారు. ఇతను కూడా క్వారీలో చిక్కుకుని మృతి చెందాడు. మరో గిరిజనుడు తొర్రమామిడికి చెందిన వంతల చంద్రరావు (22) పెళ్ళి చేసుకుని ఏడాది అయింది. ఇతనికి ఒక ఆడ బిడ్డ ఉంది. ఎంతో ఆనందంగా జీవిస్తున్న వీరు క్వారీలో చిక్కుకుని మృతి చెందడంతో భార్య శాంతి తీవ్రంగా రోధిస్తుంది. తొర్రమామిడి, లంకవీధి, నల్లబిల్లి గ్రామాల్లో పూర్తి విషాదఛాయలు అలముకున్నాయి. ఇంత కాలం హాయిగా తవ్వకాలు జరుపకొన్న వీరికి ఒక్కసారిగా క్వారీలో ప్రమాదం జరగడంతో పై గ్రామాల ప్రజలు విషాదంలో మునిగారు. మృతదేహాలను చింతపల్లి ఎం.ఆర్ ఓ. అంబేద్కర్ నల్లబిల్లికి 108 వాహనంలో చింతపల్లి తరలించగా, గాయపడిన గిరిజనులకు క్లష్టర్ వైద్యాధికారి మోహన్‌రావు పరామర్శి ప్రాథమిక చికిత్సలు అందించారు. నల్లబిల్లి సమీప ప్రాంతాల్లో క్వారీ ప్రమాదంలో గాయపడిన వారిని డి.ఎం. అండ్.హెచ్.ఓ. డాక్టర్ సావిత్రి పరామర్శించారు.

* మంత్రి బాలరాజు
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>