జామి, ఏప్రిల్ 25: మండలంలో నిర్వహించే ప్రజాపథానికి ప్రజలు పెద్దగా హాజరు కాలేదు. బుధవారం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమానికి నష్ట పరిహారానికి సంబంధించిన పత్రాలు అందజేస్తారన్న ఆశచూపి కొద్దిమంది రైతులను సభకు తరలించి మమ అనిపించుకున్నారు. మండలంలో జామి, జెడ్డెటివలస, గడ్డుకొమ్మ అగ్రహారం, కలగాడ, అలమండ, శిరికిపాలెం గ్రామాల్లో ప్రజాపథం కార్యక్రమం నిర్వహించగా మండలకేంద్రంలో 50మందికూడా హాజరుకాని దుస్థితి ఏర్పడింది. ప్రజాసమస్యలు తీర్చాల్సిన ప్రజాపథం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు లేరని భావించే ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కలగాడలో మాత్రం ఇంతకుముందు నిర్వహించిన గ్రామసందర్శన కార్యక్రమాల్లో గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలని వినతులు అందజేసిన విషయాన్ని మరిచారంటూ అధికారులను కొంతమంది నిలదీశారు. త్వరలోనే రోడ్డు సమస్య పరిష్కరిస్తామని సభను ముగించి అధికారులు వెళ్లిపోయారు. మండల ప్రత్యేకాధికారి ఎస్.కె.అన్నపూర్ణ, ఎంపిడిఓ ఎన్‌ఆర్‌కె సూర్యం, విద్యుత్‌శాఖ అధికారి రాజ్‌కుమార్, వ్యవసాయాధికారి జి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘ఉపాధి కూలీలతో ఎగ్రిమెంటులా?’
జామి, ఏప్రిల్ 25: ఉపాధి హామీ కూలీలతో ఎగ్రిమెంట్ చేసుకుని పనులు చేయించే అధికారం ఎవరిచ్చారని వ్యవసాయ కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గాడి అప్పారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతు గ్రామీణులు వలసలు పోకుండా తన ఊరిలోనే తమకు అవసరమయ్యే పనులు చేసుకుంటూ ఉపాదిని పొందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులు ప్రవేశపెడితే స్థానిక అధికారులు ప్రజలను నిర్బంధించి పనులు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వేపాడ మండలం వీలుకుర్తి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలతో 70రూపాయలు కూలి గిట్టుబాటు అయ్యేలా పనులు చేయగలితేనే పనులకు రావాలని లేనియేడల పనులకు రానీయబోమని చెప్పడం దారుణమన్నారు. కొలతలకు తగ్గపనులు చేపట్టి తగిన వేతనం తీసుకెళ్తామని లేదంటే పనులనుండి తొలగించండి అంటూ హామీపత్రాలు కూలీలతో రాయించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాపథంలో జిల్లాకలెక్టరు కూడా కూలీలపై చిన్నచూపుగా చూస్తూ మాట్లాడారన్నారు. మండుటెండలో పనిచేస్తున్న మాకు గిట్టుబాటు కూలి ఇవ్వడంలేదని ఫిర్యాదు చేస్తే ‘పనిచేయడం చేతకాకపోతే మానేయండి నచ్చితే రండి లేదంటే పొండి’ అంటూ సమాధానాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పనులవద్ద కనీస వసతులు లేనప్పుడు కఠినచర్యలు తీసుకోవాల్సిన కలెక్టరు కూలీలపై ఆగ్రహం వ్యక్తం చేయడం సమంజసం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ కూలీసంఘం అధ్యక్షుడు డేగల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపంపిణీ వ్యవస్థిను పటిష్టం చేయాలి
విజయనగరం (కలెక్టరేట్), ఏప్రిల్ 25: ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి ప్రజలకు ఆహారభద్రత కల్పించాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు పి.రమణమ్మ డిమాండ్‌చేశారు. బుధవారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయని ఇందులోభాగంగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచనలు చేస్తున్నాయన్నారు. తక్షణమే ఈ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై గరువారం పట్టణంలోన దాసన్నపేట వద్దగల పౌరసరఫరాలశాఖ గోదాం ముట్టడికి పిలుపునిచ్చారు. నగదు బదిలీ పథకంవల్ల పేదలు తీవ్రంగా నష్టపోతారని బహిరంగ మార్కెట్‌లో సరుకులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీకి పొంతన కుదరక, దీనతో పేదలు తీవ్రంగా నష్టపోతారన్నారు. కనుక ప్రభుత్వమే ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టంచేసి, పేదలను రక్షించాలని కోరారు. ప్రతి నిరుపేద కుటుంబానికి 30కేజీల చొప్పున బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు హామీని నెరవేర్చలేదన్నారు. పౌరసరఫరాల గోదాం ముట్డడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో ఐద్వా పట్టణశాఖ అద్యక్షురాలు ఎం.చిట్టితల్లి పాల్గొన్నారు.
కర్లాం ప్రభుత్వ భూముల్లోని
జీడి, మామిడి ఫలసాయం వేలం
చీపురుపల్లి, ఏప్రిల్ 25: మండలంలో కర్లాం గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 408లో 83ఎకరాల 47 సెంట్ల ప్రభుత్వ భూమిలో ఉన్న మామిడి, జీడి ఫలసాయంకోసం ఈనెల 28న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తహశీల్దారు మజ్జి శంకరరావు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలమేరకు కర్లాం గ్రామ రామ మందిరం వద్ద ఈనెల 28న ఉదయం 10గంటలకు మామిడి, జీడి ఫలసాయాన్ని బహిరంగవేలం నిర్వహిస్తామని తహశీల్దారు బుధవారం తెలిపారు. ఆసక్తిగల వారు నేరుగా వేలం పాటలో పాల్గొనవచ్చని కోరారు.
బాక్సైట్ తవ్వకాలకు
అనుమతులు రద్దు చేయాలి
విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 25: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించడం రాజ్యాంగ వ్యతిరేకమని తెలుగుదేశంపార్టీ నేత, మాజీ ఎం.పి.డాక్టర్ డి.వి.జి.శంకరరావుఅన్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఈ వ్యవహారంపై మొదటి నుంచి మడమ తిప్పని పోరాటం చేస్తున్నాయన్నారు. అయితే కేంద్ర గిరిజనసంక్షేమశాఖామంత్రి ప్రకటనలు గంభీరంగానే ఉన్నప్పటికీ, అందులో చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా ఉందన్నారు. నాటి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆదిలోనే నిలువరించే అవకాశం ఉన్నప్పటికీ మిన్నకుండిపోయి ఆరేళ్ల తర్వాత నోరు తెరవడంలో నిజాయితీ కన్నా రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా తనస్థాయిలో కేబినెట్ ద్వారా రాజ్యాంగ వ్యతిరేక అనుమతులవను రద్దు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయకుండా గవర్నర్‌కి ఉత్తరాలు పంపడం అర్థరహితమని డాక్టర్ శంకరరావుఅన్నారు. అరకొర ప్రయత్నాలతో అభ్యర్థన కార్యక్రమాలు మానుకొని చిత్తశుద్ధితో అధికారికంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే మంత్రికి గిరిజనం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.
ఉపాధి కూలీకి తీవ్ర గాయాలు
గంట్యాడ, ఏప్రిల్ 25: ఉపాధి పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి ఈమండలం బుడతనాపల్లి గ్రామానికి చెందిన మహిళా కూలీ సింహాచలం బుధవారం తీవ్రంగా గాయపడింది. పద్మనాభరాజు చెరువులో మట్టిపని చేస్తున్న సింహాచలం మట్టితట్టను నెత్తిన పెట్టుకుని చెరువుగట్టు ఎక్కుతండగా జారిపడడంతో చేయి విరిగిపోయింది. గాయపడిన మహిళను జిల్లా కేంద్రాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
సమస్యల పరిష్కారానికే
‘ప్రజాపథం’
నెల్లిమర్ల, ఏప్రిల్ 25: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాపథం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని సారిపల్లి, గరికపేట, నెల్లిమర్ల, మొయిద, పూతికపేట తదితర గ్రామాల్లో బుధవారం ప్రజాపథం జరిగింది. నెల్లిమర్ల సభలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని , సరఫరా సక్రమంగా లేనందున నెలరోజుల నుంచి మంచినీటికి ఇక్కట్లు పలువురు మహిళలు పిర్యాదుచేశారు. చంపావతి నదిలో ఇసుక అక్రమ తరలింపు వల్ల మంచినీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టులో కేసు వేస్తామని పలువురు అధికారులకు స్పష్టంచేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి టి.జ్యోతి, ఎంపిడిఓ సుధాకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
‘సహకార’ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే!
విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 25: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, సహకార సంఘాల పాలకవర్గాల కాలపరిమితి గడువును ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో జరుగనున్న ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సహకార సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి 2010వ సంవత్సరంలోనే సహకార సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గాల కాలపరిమితి గడువుముగిసింది. అప్పటి నుంచి ప్రతిఆరునెలలకు ఒకసారి పాలకవర్గాల కాలపరిమితిని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోంది. జిల్లాలో 94 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల అధ్యక్షులే డిసిసిబి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ పాలకవర్గాలను ఎన్నుకుంటారు. సహకార సంఘాలకు నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించనందున కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే సుమారు 25 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయాయి. దీంతో సహకార సంఘాల్లో మందకొడిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎవరి సీట్లు వారికే: సంక్షేమాధికారులకు కలెక్టర్ ఆదేశాలు
విజయనగరం (కలెక్టరేట్), ఏప్రిల్ 25: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో, ఇతర సంక్షేమ హాస్టళ్లలోను ఎస్సీ విద్యార్ధులకు కేటాయించిన సీట్లను ఆ వర్గానికి చెందిన విద్యార్ధులతోనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య సంక్షేమాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో సాంఘి సంక్షేమ వసతిగృహ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీట్ల భర్తీ విషయంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, ఎవరకి కేటాయించిన సీట్లు ఆ వర్గాలకే భర్తీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో 62 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 6200 సీట్లు ఉండగా వీటిలో 70 శాతం ఎస్సీలకు, 12 శాతం మతమార్పిడి చేసుకున్న ఎస్సీలకు కేటాయించాల్సి ఉండగా గత మూడేళ్లగా ఈ హాస్టళ్లలో ఇతరులకు అధిక సీట్లు కేటాయిస్తూ వసతిగృహ అధికారులు ఎస్సీ విద్యార్ధులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
5084 సీట్లను ఈ ఏడాది పూర్తిగా ఎస్సీలతో భర్తీ చేయాలని సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్ధుల జాబితాను ముందుగా సేకరించాలని సూచించారు. జూన్ 12 నాటికి జిల్లాలోని అన్ని హాస్టళ్లలో ఎస్సీ విద్యార్ధుల సీట్ల భర్తీ కావాలని స్పష్టం చేశారు. మరమ్మతులు తదితర పనులకు జిల్లా పరిషత్‌లో ఎస్సీ నిధులు నుంచి రూ. 20 లక్షల వరకు మంజూరు చేసేందుకు ఆయన సుముఖుత వ్యక్తం చేశారు.
మండల పరిషత్ నుంచి కూడా రూ.15 లక్షల వరకు నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాన్ని ఎజెసి రామారావు, సోషల్‌వెల్ఫేర్ డిడి అప్పారావులు పర్యవేక్షించనున్నారు. ఎజెసి రామారావు, సోషల్ వెల్ఫేర్ డిడి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
‘ఇందిరమ్మ’ ఇళ్ళ నిర్మాణంలో అక్రమాలపై విచారణ
గంట్యాడ, ఏప్రిల్ 25: మండలంలోని పెంటశ్రీరాంపురం గ్రామానికి మూడోవిడత ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ళలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన ఫిర్యాదుపై శ్రీకాకుళం విజిలెన్స్ ప్రత్యేకాధికారి శ్రీరాములు బుధవారం దర్యాప్తు జరిపారు. ఇళ్ళు నిర్మించని వారికి, బినామీ వ్యక్తులకు బిల్లులు చెల్లించారంటూ గ్రామానికి చెందిన ఎం.సింహాద్రి తదితరులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసందే. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేకాధికారి పెంటశ్రీరాంపురం వచ్చి విచారణ జరిపారు. ఈ సందర్భంగా అక్రమాలు గుర్తించిన ఆయన చింతల ఎర్రమ్మనుంచి 25,200, ఇ.సూరిడమ్మ నుంచి 7వేలు, మీసాల సత్యంనుంచి 25,200 రికవరీ చేశారు. ఇదిలా ఉండగా విజిలెన్స్ అధికారులు ఫిర్యాదుదారులకు ముందుగా నోటీసులు పంపకుండా గ్రామంలో విచారణ జరపడంపట్ల సింహాద్రి తదితరులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఫిర్యాదులో తాము పేర్కొన్న మరికొన్ని ఇళ్లకు సంబంధించి విచారణ చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తంచేశారు. నిబంధనల మేరకు విచారణ చేయాలని డిమాండ్ చేశారు.దర్యాప్తులో ఇఇ నారాయణస్వామి, డిఇ నాగరాజు, ఎఇ రమణరాజు పాల్గొన్నారు.
ఖాళీ ఎంఇఒ పోస్టుల భర్తీకి డిమాండ్
పార్వతీపురం, ఏప్రిల్ 25: రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఎంఇఒ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ ఈనెల 26వ తేదీన ఎస్‌ఎస్‌సి స్పాట్ కేంద్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఎస్ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామల సింహాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఇఒ పోస్టుల భర్తీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం కావాలనే రాజకీయ లబ్ధికోసం ఎంఇఒ పోస్టులను భర్తీ చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ఆ పోస్టులను తక్షణమే ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోగల ఎస్‌ఎస్‌సి స్పాట్ కేంద్రం వద్ద మధ్నాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. అందువల్ల మధ్నాహ్నం 12గంటలకు కోటవద్దకు ప్రభుత్వ ఉపాధ్యాయులు చేరుకుని నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. చాలా కాలంగా ఈ విషయమై ప్రభుత్వాన్ని కోరుతున్నా, పట్టించుకోవడం లేదని తెలిపారు. మెరుగైన విద్యా వ్యవస్థకు ఇది దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
మెగా లోక్‌అదాలత్‌ల విజయవంతానికి పిలుపు
పార్వతీపురం, ఏప్రిల్ 25: జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో ఈనెల 28,29 తేదీల్లో నిర్వహించే మెగాలోక్ అదాలత్‌లకు న్యాయవాదులు, పోలీసులు అందరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముత్యాలు నాయుడు కోరారు. బుధవారం పార్వతీపురంలోని కోర్టును సందర్శించిన ఆయన న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 12,777 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వీటి పరిష్కారానికి మెగాలోక్ అదాలత్‌లు వినియోగించుకునే విధంగా కక్షిదారులను ప్రోత్సహించాలని కోరారు. లోక్ అదాలత్‌లో కేసులు సత్వర పరిష్కారానికి కోర్టులు దోహపడతాయన్నారు. లోక్ అదాలత్‌లో కేసు దావావేసినపుడు చెల్లించిన మొత్తాన్ని కేసు పరిష్కారం అయితే మళ్లీ డిపాజిట్‌గా చెల్లించిన మొత్తాన్ని రిఫండ్‌గా దావావేసిన వ్యక్తికి చెల్లిస్తామన్నారు. కేవలం ఈ అదాలత్ కేసులకే ఈ అవకాశాలున్నాయన్నారు. రాజీపద్ధతిలో కేసులు పరిష్కారం చేసుకునే అవకాశం ఈ అదాలత్‌లకు ఉందన్నారు. లోక్ అదాలత్‌లలో పరిష్కారం అయిన కేసులు మళ్లీ అపీల్ చేసుకునే అవకాశం ఉండదన్నారు. ఈకార్యక్రమానికి ముందుగా పార్వతీపురం కోర్టుకు మంజూరైన కొత్త జనరేటర్‌ను జిల్లా జడ్జి ముత్యాలు నాయుడు ప్రారంభించారు.
ఇక్కడి కోర్టు ఆవరణలో కొత్తగా 3.25కోట్ల రూపాయలతో
నిర్మిస్తున్న కోర్టు భవన నిర్మాణం పనులను బుధవారం జిల్లాన్యాయమూర్తి పరిశీలించారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణాలతో పాటు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కోర్ట్భువన నిర్మాణాలను త్వరితగతిని పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో పార్వతీపురం రెండవ అదనపు జిల్లాన్యాయమూర్తి ఎస్.శారదాదేవి, సీనియర్ సివిల్ జడ్జి పివి రాంబాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీహరిలతో పాటు పార్వతీపురం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టి.జోగారావుతదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
ఎన్.టి.ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం
విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 25: పట్టణంలో కలెక్టరేట్ జంక్షన్‌లో ఉన్న ఎన్.టి.ఆర్.విగ్రహానికి బుధవారం ఎన్.టి.ఆర్.అభిమాన సంఘం ప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. తెలుగుదేశంపార్టీ ధర్నాకు నిరసనగా కలెక్టరేట్ జంక్షన్‌లో ఉన్న ఎన్.టి.ఆర్.విగ్రహానికి మంగళవారం కాంగ్రెస్‌నాయకులు ఈ అభిషేకం చేశారు. ఇందుకు నిరసనగా ఎన్.టి.ఆర్.అభిమానులు బుధవారం క్షీరాభిషేకం చేశారు. ఎన్.టి.ఆర్.అభిమానుల సంఘం అధ్యక్షుడు కాగిత శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా 1983లో తెలుగుదేశంపార్టీని ఎన్.టి.ఆర్.స్థాపించారనే విషయాన్ని కాంగ్రెస్‌నేతలు గుర్తించుకోవాలన్నారు. ఇకపై ఎన్.టి.ఆర్.విగ్రహానికి కాంగ్రెస్‌నేతలు క్షీరాభిషేకం చేస్తే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆ సంఘం కార్యదర్శి కనకల మన్మధ్‌కుమార్, అభిమానులు పాల్గొన్నారు.
టీడీపీకి ‘గద్దె’ గుడ్‌బై
చీపురుపల్లి, ఏప్రిల్ 25: ముప్పైఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంతటి బాధలు, అవమానాలు ఎన్నడూ భరించలేదు.. చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ అంటే గద్దె బాబూరావుఅనే సంగతి అందరికీ తెలిసిందే. రెండుసార్లు పార్టీలో వారే వెన్నుపోటు పొడిచి ఓడించారు. మనస్థాపంతో ఇన్‌చార్జి పదవి రాజీనామా చేసినా, పార్టీలోకి మళ్ళీ ఆహ్వానించి ఎన్నోసార్లు అవమానాలు పాలుచేశారు. సహనానికి, ఓర్పుకి హద్దుంటుంది. రెండు గ్రూపులుగా చేసి చీపురుపల్లిలో పార్టీతో అధిష్ఠానం, జిల్లా శాఖ ఆటలాడుకుంటున్నాయి. అవమానాలు భరించలేక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’.. అంటూ ఆ పార్టీ నేత, మాజీ విప్ గద్దె బాబూరావు బుధవారం కన్నీటిపర్యంతయ్యారు. ఇక్కడ నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. చీపురుపల్లి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు, అస్తవ్యక్త పరిస్థితులపైన నాయకుల మనోగతాన్ని ప్రకటించారు. టీడీపీ చైతన్యయాత్రలకు మోటార్‌సైకిల్ యాత్రలకు జిలాల అంతటా తిప్పి నియోజకవర్గానికి వచ్చేసరికి నన్ను నిలుపుదల చేసి ఎన్నోసార్లు అవమానించారని, నియోజకవర్గంలో కక్షసాధింపులకు గురయ్యాను. తన ఆస్తులు, భూములపైన ఎన్నో ఆక్రమణలకు పూనుకున్నారు. న్యాయపరంగా వాటిని ఎదుర్కొన్నానన్నారు. చివరికి తాజాగా జిల్లాకి వచ్చిన చంద్రబాబునాయుడు కూడా చీపురుపల్లి పరిస్థితులపై సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. పార్టీలోకి ఆహ్వానించి అవమానాల పాలు చేస్తున్నారు. తాను ఎవరినీ తనతోపాటు రమ్మని ఒత్తిడి చేయనుకానీ నాయకుడిగా ప్రాణాలు అడ్డంపెట్టి అయినా కార్యకర్తలను కాపాడుకుంటానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీమానా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలోపార్వతీపురం దేశం నాయకులు ఎస్.ఉమామహేశ్వరరావు, సుబ్బరాజు, పతివాడ శ్రీను మంత్రి హరినాయుడు కుమిలి నాగేశ్వరరావు పలువురు చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భవిష్యత్తు నిర్ణయాన్ని గ్రామాలవారీగా కార్యకర్తలతో మాట్లాడి త్వరలో ప్రకటిస్తానని గద్దె విలేఖరులకు తెలిపారు.
పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకుని ఉంటూ రెండుసార్లు శాసనసభ్యునిగా వ్యవహరించారు. ఇది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వెన్నుపోటు రాజకీయాలతో అప్పట్లో వేగలేనంటూ పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలను వదులుకొని రాజకీయాలకు దూరంగా ఉంటూవచ్చారు. గద్దె రాజీనామాతో నాయకత్వ లోపంతో సతమతంలో ఉన్న చీపురుపల్లి నియోజకవర్గం బాధ్యతలను, ఎంపిగాపోటీచేసి ఓటమిచెందిన కె.ఎ.నాయుడుకు పార్టీ అధిష్ఠానం అప్పగించింది. అ తర్వాత పార్టీ సీనియర్ నాయకులు యనముల రామకృష్ణుడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వర్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో గద్దె తిరిగి పార్టీవైపు ఆసక్తి చూపుతూ వచ్చారు. గద్దెను ఇన్‌చార్జిగా కొనసాగుతున్న కె.ఎ.నాయుడు వ్యతిరేకిస్తూ వచ్చారు. అప్పట్లో వీరిమధ్య అంతరం పూడ్చలేనిదిగా మారింది. తర్వాత రెండు సార్లు హైదరాబాద్ పిలిపించి వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా గద్దె తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆయన అనుయాయులు ఎదురుచూస్తున్నారు.
మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు
విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 25: పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి తెలిపారు. ప్రజాపథంలో భాగంగా ఆరోవార్డు సుంకరవీధిలో 6,7,8,9,10 వార్డుల్లో జరిగిన వార్డుసభల్లో ఆయన మాట్లాడారు. వార్డుసభలకు ముందు మున్సిపల్ స్కూల్స్ సూపర్‌వైజర్ వై.అప్పలనాయుడు ముఖ్యమంత్రి సందేశం చదవి వినిపించారు. ఎండల తీవ్రత పెరిగినందున పట్టణంలో అనేక చోట్ల మంచినీటి ఎద్దడి ఏర్పడిందని, అయితే అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంచినీటి సరఫరా నిమిత్తం జిల్లాకలెక్టర్ అయిదు లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. ముఖ్యంగా పాడైన బోర్లకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. పట్టణంలో 38వ వార్డుల్లో ఉన్న స్వయం సహాయక బృందాలకు పావలావడ్డీ రాయితీని విడుదల చేశామన్నారు. ఈ రాయితీని మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోందన్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అరకొరగా మంచినీటి సరఫరా జరుగుతోందని, చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడంలేదని, కాలువల్లో పూడిక తీయడంలేదని, వీధిదీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై స్పందించిన మున్సిపల్‌కమిషనర్ గోవిందస్వామి మాట్లాడుతూ పట్టణంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ కె.వి.్భస్కరరావు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి వి.శోభన్‌బాబు, మండల తహాశీల్దార్ లక్ష్మారెడ్డి, పట్టణ ఇంది క్రాంతిపథం ప్రాజెక్టు అధికారి ఆర్.పి.సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.
‘అందరికీ అందుబాటులో ఉంటా’
విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 25: ‘మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. పరిష్కారానికి కృషి చేస్తాను’.. అంటూ జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో 8వ వార్డు శంకరమఠం వీధిలో బుధవారం జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరుగుతున్న గ్రీవెన్స్‌సెల్‌కు రావాలన్నారు. పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామిని కలెక్టర్ ఆదేశించారు. బోర్లను తనిఖీ చేసి మరమ్మతులు చేయాలన్నారు. విద్యుత్ సమస్య వల్ల మంచినీటిని సరఫరా చేయలేకపోతున్నామని మున్సిపల్ అధికారులు చెప్పడం సరికాదన్నారు. విద్యుత్ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, అందువల్ల మంచినీటి సరఫరాను విద్యుత్‌శాఖతో ముడిపెట్టడం మంచిపద్ధతి కాదన్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఆ సమయంలో పనిచేయాలన్నారు. అవసరమైతే జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంచినీటి సరఫరాకు సంబంధించి ప్రత్యామ్నాయ విద్యుత్‌లైన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మంచినీటికోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మున్సిపల్ అధికారులు చోద్యం చూడటం తగదన్నారు. ఉద్యోగుల్లో సమర్థవంతంగా పనిచేయాలనే తపన లేదన్నారు. పట్టణంలో పన్నుల పెంపుదల ద్వారా 10 కోట్ల రూపాయల ఆదాయం రాగా, మరో అయిదు కోట్ల రూపాయల సాధారణ నిధులు ఉన్నాయన్నారు. నిధులకు కొదవలేనందున ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా పావలావడ్డీరుణాల మంజూరుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, మండల తహాశీల్దార్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ కె.వి.్భస్కరరావు, పట్టణ ప్రణాళిక విభాగం వి.శోభన్‌బాబు, పట్టణ ఇందిర క్రాంతిపథం ప్రాజెక్టు అధికారి ఆర్.పి.సూర్యకళ, మున్సిపల్ స్కూల్స్ సూపర్‌వైజర్ వై.అప్పలనాయుడు, జనార్థనరావుతదితరులు పాల్గొన్నారు.
‘పునాది కార్యక్రమం పండగ’కు కసరత్తు
పార్వతీపురం, ఏప్రిల్ 25: పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో అమలు చేస్తున్న 3పునాది2 అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో ఈనెల 30న పునాది పండగ కార్యమ్రం విజయవంతం చేయాలని పీవో పండాదాస్ ఇచ్చిన పిలుపుమేరకు కసరత్తు ప్రారంభమయింది. ఈమేరకు పార్వతీపురం ఐటిడిఎ గిరిమిత్ర సమావేశం హాలులో పునాది కార్యక్రమంపై సంబంధిత ఉపాధ్యాయులతో పీవో సమావేశం నిర్వహించి పలు సూచనలు అందించారు. పునాది కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులలోజాగృతి కల్పించి విద్యాభివృద్ధిలో వారి పాత్రను విశదీకరించి వేసవిశలవుల్లో జరగాల్సిన కార్యక్రమం సక్రమంగా అమలుకు చర్యలు చేపట్టాలని పీవో పండాదాస్ పిలుపునిచ్చారు. పునాది పండగకు విద్యార్థుల తల్లిదండ్రులను,అతిథులలను ఆహ్వానించాలన్నారు. పునాది పండగలో సాంస్కృతిక కార్యక్రమాలు బాలబాలికలతో ఏర్పాటు చేయాలన్నారు. పునాదికి సంబంధించిన అన్ని చార్టులు సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యాలయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకుని చార్టుల ద్వారా ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
‘పునాది’ అమలులో
చిత్తశుద్ధి కరవు’
పార్వతీపురం, ఏప్రిల్ 25: పునాది కార్యక్రమంలో అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని గిరిజన సమాఖ్య జిల్లా కన్వీనర్ పి.రంజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పార్వతీపురంలో ఏర్పాటు చేసిన విలేఖరులతోసమావేశంలో మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల కోసం పెట్టిన పునాది కార్యక్రమం వసతి గృహం, ఆశ్రమపాఠశాలల్లో అన్నం పెట్టకపోవడం, రేషన్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సామాజిక తనిఖీలు పెడుతున్నా ప్రయోజనం లేదన్నారు. లోపాలపై చర్యలు లేనపుడు సామాజిక తనిఖీలు దేనికని ఆయన ప్రశ్నించారు. ఈ పునాది కార్యక్రమానికి రూ.18కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా ప్రయోజనం శూన్యమని ఆయన పేర్కొన్నారు. పునాది కార్యక్రమంపై చిత్తశుద్ధి చూపితే తప్ప ప్రయోజనం శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.
‘ప్రజాపథం’తో సమస్యల పరిష్కారం
బొబ్బిలి, ఏప్రిల్ 25: ప్రజాపథంలో నివేదించిన సమస్యలను శత శాతం పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు హామీ ఇచ్చారు. ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా బుధవారం 28,29,30 వార్డులలో వార్డు సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను ప్రజాపథం ద్వారా తెలియజేస్తే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్య పరిష్కారానికి పెద్ద పీట వేసినట్లు పేర్కొన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మోటార్లు కొనుగోలు, పైపులైన్లు, కుళాయిలు, బోరింగ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా ఎవరికి ఎటువంటి సౌకర్యం కావాలన్న దరఖాస్తులు చేయాలన్నారు. అర్హులైన వారికి మాత్రమే ఈ పథకాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా స్పెషలాఫీసర్ రామారావు, కమిషనర్ కె ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో సమస్యలను తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. కోట్లాది రూపాయలతో మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి అనుకూలించకపోవడంతో భోజరాజపురం వాటర్ వర్క్స్ వద్ద నీరు అడుగంటుతుందని తెలిపారు. ఈ నీరు లేకపోవడంతో రోజు తప్పించి రోజు నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీటిని సమయాల ప్రకారం సరఫరా చేయలేకపోతున్నామని, ఏదో ఒక సమయంలో అందిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని పట్టణ ప్రజలు గమనించాలని కోరారు. ప్రతి వార్డును సందర్శించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రోడ్లు, కాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు చెక్కులు, ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అప్పారావు, ఐకెపి టిపిఒ యామిని, ఐసిడిఎస్ పిఒ విజయకుమారి, తదితర శాఖాధికారులు, వార్డు మాజీ కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కురుపాం, ఏప్రిల్ 25: కురుపాం జడ్పీ పాఠశాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కురుపాం జడ్పీ పాఠశాల, జూనియర్ కళాశాల, జియ్యమ్మవలస జడ్పీ పాఠశాలల ద్వారా ప్రవేశాలు పొందిన 242 మంది విద్యార్థులకు కురుపాం జడ్పీ పాఠశాల కేంద్రంగా పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్షకు 242 మందికి గాను 228 మంది హాజరయ్యారు. ఇంటర్ రెండు సంవత్సరాలకు గాను ఒకేసారి 5 పేపర్లు ద్వారా సార్వత్రిక ఇంటర్‌గా వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కురుపాం ఎంఇఒ డి.విజయకుమార్ ముఖ్య పరీక్షాధికారిగాను జియ్యమ్మవలస ఎంఇఒ బి.పార్వతీశం డిపార్టుమెంట్ అధికారిగాను వ్యవహరించారు. పరీక్షలలో ఎక్కువగా జిసిసి, అంగన్‌వాడీ, జివివికె పలుశాఖలకు చెందిన నాలుగవ తరగతి ఉద్యోగులున్నారు. పదోన్నతుల కోసం వీరంతా సార్వత్రిక విద్యలో చదువుతున్నారు. పరీక్షల్లో అక్రమాలు జరగకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చీఫ్ సూపరింటెండెంట్ డి విజయకుమార్ తెలిపారు.
సాలూరు మున్సిపల్
ప్రత్యేకాధికారిగా ఎజెసి?
సాలూరు, ఏప్రిల్ 25: మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా ఎజెసి రామారావుని నియమించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభ సమయంలో కొన్ని నెలలు ఎజెసి రామారావు మున్సిపల్ ప్రత్యేకాధికారిగా పనిచేశారు. ఇక్కడ ప్రత్యేకాధికారిగా ఉన్న ఆర్డీవో అంబేద్కర్‌ని పార్వతీపురం బదిలీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి ఒత్తిడి మేరకు అంబేద్కర్‌ని అక్కడ మున్సిపల్ ప్రత్యేకాధికారిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. జయమణి ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే రాజన్నదొరలను ఒప్పించి తాను అనుకున్నది సాధించుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నారు. పార్వతీపురం ప్రత్యేకాధికారిగా ఉన్న ఐటిడిఎ పిఒ సువర్ణపండాదాస్ తీరు పట్ల జయమణి అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. బొబ్బిలి ప్రత్యేకాధికారిగా ఉన్న ఎజెసి రామారావు పనితీరు బాగున్నప్పటికీ అధికారుల్లో కొంత అసంతృప్తి ఉంది. ముక్కుసూటిగా వ్యహరించే రామారావు ప్రభుత్వం నిబంధనల ప్రకారం పనిచేయడం అధికారులకు, నాయకులకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఎజెసి రామారావును తిరిగి సాలూరు ప్రత్యేకాధికారిగా నియమించనున్నారనే ప్రచారం ఊపందుకుంది. రామారావు ప్రత్యేకాధికారిగా వస్తే తమకు కష్టాలు తప్పవనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతోంది.
చలివేంద్రాన్ని
సద్వినియోగం చేసుకోండి
బొబ్బిలి (రూరల్), ఏప్రిల్ 25: ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెట్టవలస ప్రధానోపాధ్యాయులు జెసి రాజు అన్నారు. మండలం మెట్టవలస బస్టాండ్ వద్ద బుధవారం శ్రీ ఆంజనేయ ఆటో సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పా