ఏలూరు, ఏప్రిల్ 25: జిల్లా రాజకీయాల్లో మళ్లీ సందడి మొదలైంది. ఉపఎన్నికల షెడ్యూలు విడుదల కావటంతో రాజకీయ పార్టీలు హడావిడి పడుతున్నాయి. జిల్లాలోని పోలవరం, నర్సాపురం శాసనసభ స్ధానాలకు ఉప ఎన్నికల తేదీలు ఖరారు అయ్యాయి. ఇవి మూడు ప్రధాన పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పార్టీ గుర్తుపై గెలిచి జగన్ వర్గంలోకి ఫిరాయించిన నేపధ్యంలో మళ్లీ ఆ స్ధానాల్లో గెలుపొంది పరువు నిలబెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. పదవులను వదులుకుని తమ వర్గంలోకి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించుకోడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఈ రెండు స్ధానాలను ఎట్టి పరిస్ధితుల్లో సాధించుకోవాలని, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్ధితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని తెలుగుదేశం పట్టుదలతో ఉంది. ఈనేపధ్యంలో ఈ ఉపఎన్నికలు రసవత్తర రాజకీయాలకు వేదికకానున్నాయి.
అధికార పార్టీకి పెద్ద సవాల్...
ఉపఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారనున్నాయి. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల ప్రతిష్ఠ ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది. పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోకపోతే పరువు పోయే ప్రమాదం ఉంది. కానీ జిల్లా కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి, వర్గ విభేదాలు పార్టీకి ప్రతిబంధకంగా మారబోతున్నాయి. ఈ ఎన్నికలు వస్తాయని ముందుగా ఊహించకపోవటమో, ఎవరికివారు సొంత నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కావటం, అధికారులపై పట్టు లేకపోవటం తదితర కారణాలతో జిల్లా పార్టీ వ్యవహారాలను ప్రజాప్రతినిధులు గాలికొదిలేశారని చెప్పుకోవచ్చు. చివరకు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న గోకరాజు రామరాజు కూడా పార్టీ పరిస్థితిని పట్టించుకోవటం లేదు. మంత్రులు ఇద్దరూ ఎవరికివారే అన్నట్లుగా ఉన్నారు. అడపాదడపా పక్కనున్న నియోజకవర్గాల వైపు చూస్తున్నా పార్టీ విబేధాలను పరిష్కరించేవిధంగా మాత్రం ఉపయోగపడటం లేదు. క్యాడర్‌ను పట్టించుకున్న పాపాన పోవకపోవటంతో వారిలో నిరాశ,నిస్పృహలు చోటుచేసుకున్నాయి. తాము జగన్ వర్గంలోనే ఉంటామని ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, ముదునూరి ప్రసాదరాజు గత కొద్దికాలం నుంచి కుండబద్దలుకొట్టి చెప్పినా ఇంతవరకు ఆ రెండు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను నియమించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. నర్సాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఏకాభిప్రాయ అభ్యర్థిగా ఎంపికైనా పోలవరంలో మాత్రం అభ్యర్థి ఎంపిక కూడా పార్టీకి కొంత కష్టంగా మారింది. ఇక్కడ చాలామంది పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగిలినవారు ఎంతవరకు పార్టీ కోసం పనిచేస్తారన్నది అనుమానమే. జిల్లాలోని మంత్రులు, ముఖ్యనేతలందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసేలా చూడటం అధిష్ఠానంపై ఉన్న పెద్ద సవాల్.
టిడిపికి కలిసొచ్చేనా...
ఉపఎన్నికల రూపంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని అవకాశం కలిసివచ్చింది. జిల్లా రాజకీయాలపై పట్టు సాధించేందుకు టిడిపికి ఇదో అవకాశం. కాస్త శ్రద్ద పెడితే రెండింటిలో ఒక స్థ్ధానాన్నైనా సొంతం చేసుకోగలమన్న ధీమాతో పార్టీ జిల్లా నాయకత్వం ఉంది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే మినహా ఇది కష్టమే. ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా టిడిపి నేతల మధ్య విబేధాలు రాజుకుంటూ వస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు మాటను కూడా ధిక్కరించి జిల్లాలో కొన్ని పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని నేతలే ఆరోపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు జిల్లాలో చేసిన పర్యటన నేపథ్యంలో పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు చేసిన సూచనలు, సలహాలను నేతలు పట్టించుకోవటం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. నేతల సంగతి ఎలాఉన్నా ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండటం ఆ పార్టీకి కలసొచ్చే అవకాశం. నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి చినిమిల్లి సత్యనారాయణను, పోలవరానికి మొడియం శ్రీనివాసరావును పార్టీ అభ్యర్ధులుగా ప్రకటించారు. వారు ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నరసాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొత్తపల్లి, వైఎస్సార్‌సిపి అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు టిడిపి అభ్యర్థి చినిమిల్లి ఎంతవరకు దీటైన పోటీ ఇస్తారనేది ముందు ముందుగాని చెప్పలేని అంశం. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పరిమితమైన సంగతి గమనార్హం. ఇక పోలవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర తన కుమారునికి టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అంతేకాదు ఆయన కుటుంబసభ్యులందరూ వైఎస్సార్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో పోలవరం నియోజకవర్గంలో టిడిపికి కొంత ఎదురుదెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీకి విషమ పరీక్ష
కాంగ్రెస్, టిడిపిలతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ విషమపరీక్షను ఎదుర్కొనుందని భావించవచ్చు. కొత్త పార్టీ కావటం, పార్టీకి ఎంత కేడర్ ఉందో, జనంలో ఎంత బలం ఉందో అంచనాలు దొరకని పరిస్ధితి. పదవులు వదులుకుని పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను గెలిపించుకోకపోతే పరువు పోయే ప్రమాదం ఉంది. అదేసమయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకోవాల్సి ఉంది. రెండు నియోజకవర్గాల్లో పరిస్ధితి కొంత ఆస్తవ్యస్తంగా ఉంది. నాయకుల మధ్య సయోధ్య లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అయా నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేకత మరో ప్రతికూలాంశం. పార్టీ అధినేత జగన్ నర్సాపురం, పోలవరం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించటంతో పార్టీ పరిస్ధితి కొంత మెరుగుపడిందని నేతలు సంబరపడుతున్నారు. ఈ పార్టీకి అభ్యర్ధులను వెతుక్కోవాల్సిన పనిలేదు. నర్సాపురంలో ముదునూరి ప్రసాదరాజు, పోలవరంలో తెల్లం బాలరాజు పోటీ చేస్తున్నారు. వారి గెలుపు కోసం ఏం చేయాలన్నదే ఇప్పుడు ఆ పార్టీ ముందున్న సవాల్.
నలుగురు తహసీల్దార్లకు
స్థానచలనం
ఏలూరు, ఏప్రిల్ 25: ఎన్నికల నిబంధనలు అమలులోకి రాగానే కొన్ని బదిలీలకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఉప ఎన్నికలు జరుగుతున్న నర్సాపురం, పోలవరం నియోజకవర్గాల పరిధిలోని మండలాలకు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా నుండి ఆరుగురు తహసిల్దార్లను నియమిస్తూ సిసిఎల్‌ఎ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. అలాగే జిల్లాలోని మూడు మండలాల తహసీల్దార్లను తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేశారు. దీంతో జిల్లాలోని కొన్ని మండలాలకు తహిసీల్దార్లను నియమించాల్సి వచ్చింది. టి నర్సాపురం తహిసీల్దార్ పద్మావతిని గణపవరం తహిసీల్దార్ గా, బుట్టాయిగూడెం తహిసీల్దార్ నర్సింహమూర్తిని ఏలూరు తహిసీల్దార్‌గా, జీలుగుమిల్లి తహిసీల్దార్ జి సాంబశివరావును పాలకొల్లు తహసీల్దార్‌గా, మొగల్తూరు తహసీల్దార్ కె దేవరాజ్‌ను పోడూరు తహిసీల్దార్‌గా కలెక్టర్ బదిలీ చేశారు.
ఆధునికీకరణ పనులకు
తాత్కాలిక పర్మిట్లపై ఇసుక
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 25: ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి డెల్టా కాలువల ఆధునీకరణ పనులు, రక్షిత మంచినీటి సరఫరా పథధకాల నిర్మాణాలు తదితరాలకు అవసరమైన ఇసుకను ఆయా కాంట్రాక్టర్లకు తాత్కాలిక పర్మిట్లపై సరఫరా చేయనున్నారు. ఇసుక వ్యవహారంలో చోటుచేసుకుంటున్న లొసుగుల నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత మూడు వారాలుగా ఇసుక తవ్వకాలు, క్రయ విక్రయాలు నిలిచిపోయిన సంగతి విదితమే. అయితే కీలకమైన డెల్టా ఆధునికీకరణ, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలు తదితరాలకు ఇసుక సరఫరాకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి)కు అధికారమిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఆయా పనులు నిర్వహించే కాంట్రాక్టర్లకు జిల్లాలో అధికార్లు సీజ్ చేసిన ఇసుకను తాత్కాలిక పర్మిట్లపై సరఫరా చేస్తారు. క్యూబిక్ మీటర్ 147 రూపాయల వంతున ఇసుక సరఫరా చేస్తారు. ఎపిఎండిసి, జిల్లా కలెక్టర్‌ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏ పనికి ఎంత మొత్తంలో ఇసుక అవసరం ఉంటుంది, పనిని నిర్వహించే ఏజెన్సీ ఎవరు, చేరాల్సిన ప్రదేశం తదితర వివరాలను కాంట్రాక్టర్లు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఇసుకను తరలించేందుకు వినియోగించే వాహనాల నెంబర్లు, వాటి సామర్థ్యాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఇసుక అవసరమైన ప్రభుత్వ ఏజెన్సీ లేదా కాంట్రాక్టరు క్యూబిక్ మీటర్‌కు 147 రూపాయల వంతున అవసరమైన మొత్తానికి సరిపడా సొమ్మును ఎపిఎండిసి ఎండి హైదరాబాద్ పేరిట డిడిలు చెల్లించిన తర్వాత ఇసుకను సరఫరా చేస్తారు. ఇసుకను తీసుకువేళ్ళే పాయింట్ నుండి పని నిర్వహించే ప్రాంతానికి అది సక్రమంగా చేరిందీ లేందీ పర్యవేక్షించడానికి, అలాగే వేబిల్లులు జారీకి ఎపిఎండిసి సిబ్బందిని నియమిస్తారు. ఇసుక పని నిర్వహించే ప్రాంతానికి సక్రమంగా ఎంత మొత్తం చేరిందీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రతీ వారం సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలు ఎంత మొత్తం ఇసుకను పని నిర్వహించే ప్రాంతాలకు చేర్చిందీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల వారీగా నివేదికలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
‘మీ సేవ’కూ కోడ్ కొరడా!
సర్వాంగ సుందరంగా ముస్తాబైనా నేటి ప్రారంభోత్సవానికి ఆటంకం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 25: ప్రభుత్వం ఆర్భాటంగా ‘మీసేవ’ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తున్నామని ప్రకటించింది. ఇందు కోసం రాష్టవ్య్రాప్తంగా ఎనిమిది జిల్లాల్లో ప్రాథమికంగా మీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఎనిమిది జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. 26వ తేదీన జిల్లాలోని 47 సెంటర్లలో ‘మీసేవ’ కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉంది. దీని కోసం హడావుడిగా నిర్వాహకులు పనులు ప్రారంభించారు. రంగులు వేయించి, అందమైన బోర్డులు రాయించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైన వౌలిక వసతులన్నీ కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. వేలాది రూపాయల వ్యయంతో ఈ పనులను ప్రాథమికంగా చేశారు. అయితే ఇంతలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రారంభోత్సవాలు నిలిచిపోయాయి. దీనితో నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. వేలాది రూపాయల వ్యయం చేసిన తరువాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అప్పులుచేసి ఈ పనులు ప్రారంభించిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే ఇ-సేవ ల ద్వారా కొన్ని నష్టాలను చవిచూస్తున్న వీరికి మీసేవ ద్వారా మేలు కలుగుతుందని భావించారు. కానీ ఆరంభంలోనే మీసేవ నిర్వాహకులను ఉప ఎన్నికలు అప్పులపాల్జేశాయి. దీంతో వారు లబోదిబోమంటున్నారు. సుమారు 20 రకాల సేవలను ప్రభుత్వం అందిస్తుందని మీసేవ నిర్వాహకులకు ఆదేశాలు అందాయి. అయితే తొలుత ఆన్‌లైన్ ద్వారా అనుమతి రావటంతో ప్రజలకు ఎఫ్‌ఎంబి, అడంగళ్, ఆర్‌ఒఆర్, సబ్ రిజిస్ట్రార్, నకళ్లు అందజేస్తారు. వీటి సంగతెలా ఉన్నా నేటి నుంచి మీసేవ ప్రారంభమైతే ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మీసేవ నిర్వాహకులు ఉన్నారు.
‘సగం కాన్పు’పై విచారణ
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నుండి వివరాలు సేకరించిన ఆర్డీవో
ఏలూరు, ఏప్రిల్ 25 : స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో సగం కాన్పు జరిగిన ఘటనపై బుధవారం ఆసుపత్రిలో ఏలూరు ఆర్డీవో కె నాగేశ్వరరావు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత వైద్యుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఆదివారం ఉదయం స్థానిక కండ్రికగూడెం ద్వారకానగర్‌కు చెందిన బెజవాడ ఝాన్సీరాణి ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో చేరడం, అనంతరం వివాదం రేగడం తెలిసిందే. ఆ సమయంలో ఆమెకు ప్రసవం చేసేందుకు ఆసుపత్రి వైద్యులు ప్రయత్నించినా బిడ్డ సగం బయటకు వచ్చి ఉండిపోవడం, మిగిలిన శిశువును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తే తల్లి ప్రాణానికి ముప్పని చెప్పి వైద్యులు ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ చేయడం, అనంతర పరిణామాల్లో ఆ బిడ్డ మృతిచెందడం తెలిసిందే. దీనిపైన ఝాన్సీరాణి బంధువులు బిడ్డ మృతిచెందడానికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ధర్నాకు దిగి, అనంతరం వైద్యురాలిపై దాడి చేశారు. ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ దృష్టికి వెళ్లడంతో ఆమె సీరియస్ అయ్యారు. బాధ్యులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలోనే ఏలూరు ఆర్డీవో కె నాగేశ్వరరావు బుధవారం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని డిసిహెచ్‌ఎస్ ఛాంబర్‌లో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత వైద్యుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. విచారణలో డిసిహెచ్ ఎస్ డాక్టర్ నాగార్జున, సూపరింటెండెంట్ శైలజ, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
ముద్దు పెట్టడం... తల నిమరడం!
ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి జగన్ పాట్లు
బుట్టాయగూడెం, ఏప్రిల్ 25: ఏదైనా చేసి.. ఎన్నయినా చెప్పి.. చివరకు విజయం సాధించు.. ఇదే ప్రస్తుతం జగన్ మంత్రంలా కనిపిస్తుంది. పోలవరం నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా గత నాలుగు రోజులుగా ఏజన్సీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. తన పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు విజయం కోసం అనుసరించిన విధానం కార్యకర్తల్లోను, ప్రజల్లోను చర్చనీయాంశమైంది. ఎక్కడ ఇద్దరు, ముగ్గురు నిలబడినా ఎర్రని ఎండలో సైతం కారు దిగి వెళ్ళి వాళ్ళను పలకరించి వాళ్ళు చెప్పే కష్టాలు విన్నారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఏ కష్టం లేకుండా చూస్తానంటూ భరోసా ఇచ్చారు. ఇక సభల్లో అయితే అవ్వా.. ఇటు చూడవ్వా.. ఓ తాతా.. నినే్న కళ్ళజోడు పెట్టుకున్న తాతా, పచ్చచీర కట్టుకున్న అవ్వా, చెల్లెమ్మా, అక్కా, ఒక స్నేహితుడు, ఒక సోదరుడు అంటూ చేతిని షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు వణికిస్తూ తిప్పడం, చిరునవ్వులు చిందించడం ఎంతటి వారినైనా ఆకట్టుకునేట్టు హావ భావాలు ప్రదర్శించి ఓట్ల కోసం జగన్ పడరాని పాట్లు పడ్డారు. ఇక అవ్వలను, ఆడవారిని శిరస్సుల మీద ఆప్యాయంగా పెట్టుకున్న ముద్దుల సునామీకి లెక్కేలేదు. ప్రతి గ్రామంలో కనీసం పది మందికిపైగా తల్లులు తమ చిన్నారులను జగన్ చేతికి పోటీలు పడి అందించి, పరవశించి పోయారు. బై అమ్మా, బై అన్నా అంటూ ప్రతి ఒక్కరి కళ్ళలోకి చూస్తూ చెప్పిన వీడ్కోలు సైతం ఓటర్లను మంత్ర ముగ్ధులను చేసిందని చెప్పవచ్చు. ఇక ప్రార్థనా మందిరాల్లో పూజారులు, ఫాస్టర్లు, ఇమాంలతో ప్రార్థనా సమయాల్లో ఆచారాల ప్రకారం వ్యవహరించడం మరో ఆకర్షణగా నిలిచింది. అన్నింటినీ మించి ఎవరు ఏది పెట్టినా వద్దనకుండా ఎంతో కొంత తిని, పెట్టిన వారిని సంతోష పరచడం విశేషంగా చెప్పుకోవచ్చు. రోడ్‌షోలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం అందుబాటులో ఉన్న సామాన్యుల మరుగుదొడ్లనే వినియోగించుకుని దేనికైనా తను సంసిద్ధుడినని సందేశమిచ్చినట్టయింది. మండలంలోని ఎన్.ఆర్.పాలెంలో ఒక తాటాకింట్లో సేద తీరి వారు పెట్టిన పెరుగన్నం మధ్యాహ్న భోజనంగా స్వీకరించడంతో నిరాడంబరతను ప్రకటించినట్టయింది. కోయ, లంబాడి భాషలలో చిన్న చిన్న మాటలు మాట్లాడి గిరిజనులను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా సఫలమైనట్టే. జగన్ ఎన్నికల ఫీట్లు రానున్న ఉప ఎన్నికల్లో ఏ మాత్రం ఓట్లను రాబడతాయో వేచి చూడాలి. అయితే ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకోవడానికి జగన్ పాట్లు పడుతుంటే, ఆయన భద్రతా సిబ్బంది మాత్రం తమ దురుసు ప్రవర్తనతో పలువురిని గాయపరిచారు. ఒకపక్క ప్రజల కోసం పరితపిస్తూ, మరోపక్క ఇలా దాడిచేయడం ఏమిటని పలువురు నిలదీయడం విశేషం.
జగన్ రోడ్ షోకు జనం కరవు!
నరసాపురం, ఏప్రిల్ 25: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్.జగన్మోహనరెడ్డి నరసాపురం నియోజకవర్గంలో చేపట్టిన రెండోవిడత ఉపఎన్నికల ప్రచారానికి మిశ్రమ స్పందన కనిపించింది. పోలవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని మంగళవారం రాత్రి నరసాపురం చేరుకున్న జగన్ పట్టణంలోని కొమానపల్లి కుమారరాజు గృహంలో బసచేశారు. బుధవారం ఉదయం కుమారరాజు ఇంటి నుంచి ఆయన రోడ్‌షో ప్రారంభించారు. ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మండలంలోని ముష్కేపాలెం, లక్ష్మణేశ్వరం, రాజులలంక, దర్భరేవు, మఱ్ఱితిప్ప, వేములదీవి తూర్పు, బియ్యపుతిప్ప, వేములదీవి పడమర, సర్దుకొడప మీదుగా తొమ్మిది గ్రామాలలో 11 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. లక్ష్మణేశ్వరం, వేములదీవి తూర్పు, బియ్యపుతిప్ప, సర్దుకొడప గ్రామాలలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. లక్ష్మణేశ్వరం, వేములదీవి గ్రామాలు మినహా ఇతర గ్రామాలలో జగన్ పర్యటనకు జనస్పందన కరువైంది.
మిగిలిన గ్రామాలలో ప్రజలు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. దీంతో జగన్మోహనరెడ్డి వేములదీవి గ్రామంలో మినహా ఎక్కడా మాట్లాడలేదు. వేములదీవి మురుగుడ్రెయిన్లో మత్స్యకారులతో కలిసి వల విసిరారు. కొబ్బరి దింపు కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల చిన్నారులను, వృద్ధులను ముద్దాడారు.
రేపు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి గ్రంధి
భీమవరంలోని స్వగృహంలో జగన్ సమక్షంలో పార్టీ తీర్థం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 25: ఎట్టకేలకు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నెల 27వ తేదీన గ్రంధి శ్రీనివాస్ ఇంటికి రానున్నారు. ఆయన సమక్షంలో గ్రంధి ఆ పార్టీలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయంపై గ్రంధి శ్రీనివాస్ యూత్ బుధవారం హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గ్రంధి శ్రీనివాస్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని యూత్ నాయకులు మాగాపు ప్రసాద్ తెలిపారు. గతంలో వైఎస్సార్ ఆశయాలకనుగుణంగా భీమవరం ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ప్రసాద్ తెలిపారు. సమ్మర్‌స్టోరేజి ట్యాంకు, బైపాస్ రహదారి నిర్మాణం, టౌన్‌షిప్‌లో వేలాదిమందికి ఇందిరమ్మ గృహాలు, పట్టణం శివారును 82 ఎకరాల స్థల సేకరణ తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేగా గ్రంధి శ్రీనివాస్ అహర్నిశలు కృషిచేశారని తెలిపారు. 27న గ్రంధి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో రావాలని పిలుపునిచ్చారు.
ఆహా... కాలువకు నీరొచ్చింది!
పాలకొల్లు, ఏప్రిల్ 25: ఉన్న నీరు సరిగా పారుదల లేక ముంపు సమస్యను ఎదుర్కొనే పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కాల్వకు నీరు వచ్చిందని మహదానందంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాల్వల ఆధునికీకరణ పేరుతో గత ఐదు నెలలుగా కాల్వలు మూసి ఉంచారు. ఫిబ్రవరిలో 10 రోజులు నీరు ఇవ్వటంతో కాకరపర్రు నుండి మొగల్తూరు వరకు ఉన్న నర్సాపురం, బ్యాంకు కాల్వలపై ఆధారపడిన వారికి మంచినీరు లభించి ఊరట చెందారు. మళ్లీ నీటికి కటకట ఏర్పడింది. ఈమేరకు మళ్లీ నీరు విడుదలచేయటడంతో బుధవారం పూర్తిగా చేరింది. అన్ని గ్రామాలకు మంచినీరు నింపుకునే పరిస్థితిలో ఉన్నారు. పాలకొల్లు సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు ఒఎన్‌జిసి వారు ఉచితంగా నీరందించటంతో మున్సిపాలిటీకి ఆర్థిక భారం తప్పింది. ఈ పనులను ఎమ్మెల్యే బంగారు ఉషారాణి పరిశీలించారు. స్వచ్ఛందంగా ప్రజల కోసం కృషి చేసిన అధికార బృందాన్ని అమె అభినందించారు. మున్సిపల్ అధికారులు ఈ నీటిని ప్రజలకు సక్రమంగా అందించి సహకరించాలని ఆమె కోరారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ కెవిఆర్‌ఆర్ రాజు, మున్సిపల్ ఎఇ బాలాజీ తదితరులున్నారు.
మృత్యువును జయించిన చిన్నారులు!
పెంటపాడు, ఏప్రిల్ 25: మండలంలోని దర్శిపర్రు శివారు బిళ్లగుంటలో మంగళవారం తల్లి చేతుల మీదుగా పురుగులమందు సేవించిన చిన్నారులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఈ ఘటనలో తల్లి కృష్ణవేణి మృతిచెందిన సంగతి విదితమే. అస్వస్థతకు గురైన సాయి (7), లోకేష్ (3)ను గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారు కోలుకున్నారు బుధవారం తండ్రితో కలిసి తల్లి దహన సంస్కారాలకు హాజరయ్యారు.