ముంబయి, ఏప్రిల్ 26: మహారాష్టల్రో లోకాయుక్త వ్యవస్థ ఎన్నికల కమిషన్‌లాగా ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే అన్నారు. ‘అవినీతి పెరిగిపోతోంది. ధరలు పెరిగిపోతున్న కారణంగా సామాన్యుడు మనుగడ సాగించడం కష్టంగా మారిపోతోంది.. అవినీతిని అదుపు చేయడానికి లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయడం తోడ్పడుతుంది. ఎన్నికల కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టులాగా ఇది కూడా స్వతంత్ర వ్యవస్థగా ఉండాలి, ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు’ అని గురువారం ఇక్కడ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరేతో సమావేశమైన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అన్నా హజారే అన్నారు. మహారాష్టల్రో బలమైన లోకాయుక్త ఏర్పాటుకు వివిధ రాజకీయ పార్టీల నేతల మద్దతును కూడగట్టడం కోసం అన్నా హజారే ముంబయి వచ్చారు. గత ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకోసం పరీక్షలు నిర్వహించడం లాంటి చర్యలు తీసుకున్నందుకు రాజ్‌థాకరేని అన్నా హజారే అభినందించారు. లోకాయుక్తను ఏర్పాటు చేయడం వల్ల 60నుంచి 65 శాతం దాకా అవినీతిని తగ్గించవచ్చన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు. ఎన్నికల్లో ఓటరుకు ఒక అభ్యర్థిని తిరస్కరించే హక్కు ఉండాలన్న డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు. జనానికి ఒక అభ్యర్థి నచ్చకపోయినట్లయితే అతడ్ని తిరస్కరించే అవకాశం ఉండాలని, దీనివల్ల మళ్లీ ఎన్నిక జరగడానికి, రాజకీయాల్లో స్వచ్ఛతకు మార్గం ఏర్పడుతుందని అన్నా హజారే అభిప్రాయ పడ్డారు.
* లోకాయుక్తపై అన్నా హజారే
english title:
hazare
Date:
Friday, April 27, 2012