న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: దేశంలోనే ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ అయిన ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్) తీవ్రమైన సిబ్బంది కొరతతో అల్లాడుతూ ఉంది. ఈ సంస్థలో వాస్తవానికి 625 మంది డాక్టర్లు అవసరం కాగా, ప్రస్తుతం 400 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఆస్పత్రి ప్రతి రోజూ 8 వేల మంది రోగుల అవసరాలను తీరుస్తూ ఉంటుంది. అసలే సిబ్బంది కొరతతో అల్లాడుతూ ఉన్న ఈ సంస్థకు ఇది చాలదన్నట్లుగా గత రెండేళ్ల కాలంలో దేశ విదేశాల్లో మెరుగయిన వేతనాలు, ఉద్యోగ అవకాశాల కారణంగా పలువురు డాక్టర్లు రాజీనామాలు చేసారు. గత పది నెలల్లోనే ఎనిమిది మంది డాక్టర్లు రాజీనామా చేసారు. వీరిలో ముగ్గురు డిపార్ట్‌మెంట్ అధిపతులు కూడా ఉన్నారు. ‘నా శక్తిసామర్థ్యాలను సరిగా ఉపయోగించుకోనందునే నేను ఎయిమ్స్‌నుంచి వైదొలిగాను. నాకు వారానికి ఒక రోజు మాత్రమే ఆపరేషన్లు చేయడానికి రోబోటిక్ పరికరాన్ని ఇచ్చేవారు. ఫలితంగా నేను గత నాలుగేళ్లలో 68 ఆపరేషన్లు మాత్రమే చేసాను. ఇక్కడ నేను నెలలో 11 ఆపరేషన్లు చేసాను’ అని ప్రస్తుతం నగరంలోని సర్ గంగారాం ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేస్తున్న డాక్టర్ అరవింద్ కుమార్ అన్నారు. ఎయిమ్స్‌నుంచి రాజీనామా చేసిన మిగతా డాక్టర్లలో న్యూరో-అనస్తీషియా విభాగం అధిపతి డాక్టర్ హెచ్‌హెచ్ దాష్, ఆఫ్తాల్మాలజీ విభాగం చీఫ్ డాక్టర్ సుప్రియా ఘోష్, డాక్టర్ రాణి ఎ సుందర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, అనస్తీసియాలజీ) డాక్టర్ జాన్ రంజన్( అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్), డాక్టర్ వినయ్ గులాటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్) డాక్టర్ సి వెంకట కార్తికేయన్ (ఇఎన్‌టి విభాగం), డాక్టర్ మనీష్ శర్మ (అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరో సర్జరీ) ఉన్నారు.
ప్రస్తుతం న్యూరో-అనస్తీసియా విభాగం చీఫ్‌గా, ఎయిమ్స్‌కు చెందిన హాస్టల్ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ హెచ్‌హెచ్ దాష్ కూడా తన పదవికి రాజీనామా చేసారు. తాను ఈ ఆస్పత్రిలో 30 ఏళ్లకు పైగా సేవలు అందించానని, సంస్థపై తనకెలాంటి ఫిర్యాదు లేదని ఆయన అంటూ, ఇతరులకు అవకాశం ఇవ్వడం కోసం తాను స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్) తీసుకున్నట్లు దాష్ చెప్పారు. డాక్టర్ సుప్రియా ఘోష్ కూడా అనారోగ్యం కారణంగా విఆర్‌ఎస్ తీసుకున్నట్లు ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ డాక్టర్ చెప్పారు. కాగా, ఎయిమ్స్ సెలక్షన్ కమిటీ తమను ప్రమోషన్‌కు అనర్హులుగా పేర్కొన్న కారణంగా డాక్టర్ రాణి ఎ సుందర్, డాక్టర్ జాన్ రంజన్, మనీష్ శర్మలు ఈ ఏడాది ప్రారంభంలో రాజీనామా చేసారు. విదేశీ ఫెలోషిప్‌పై విదేశాలకు వెళ్లిన అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి డాక్టర్లయిన వినయ్ గులాటి, వెంకట కార్తికేయన్‌లు కూడా గత ఏడాది అక్కడినుంచి తిరిగి వచ్చిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేసారు.
--సిబ్బంది కొరత.. డాక్టర్ల వలస--
english title:
aiims
Date:
Friday, April 27, 2012