న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి హోం మంత్రి పి చిదంబరంపై తాజాగా మరిన్ని ఆరోపణలు చేసారు. 2006లో తన కుమారుడు కార్తీకి లబ్ధి చేకూర్చడం కోసం అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం టెలికాం సంస్థ ఎయిర్‌సెల్‌ను మలేసియాకు చెందిన మాక్సిస్‌కు విక్రయించడానికి అనుమతి జాప్యం అయ్యేలా చూసారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. అందువల్ల ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో అప్పటి టెలికాం మంత్రి దయానిధి మారన్‌తో పాటుగా చిదంబరం, ఆయన కుమారుడి పేర్లను కూడా చేర్చాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో ఆయన కోరారు. ఒక వేళ అలా చేయని పక్షంలో తాను ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తానని గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. కాగా, సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలపై కీర్తిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా, ఆయన విదేశాల్లో ఉండడంతో సాధ్యం కాలేదు.
ఎయిర్‌సెల్‌లో మాక్సిస్ 4 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కొద్ది రోజుల ముందు అంటే 20006 మార్చిలో కార్తీకి చెందిన సంస్థకు, ఎయిర్‌సెల్‌కు మధ్య ఒక లోపాయికారీ లావాదేవీ జరిగిందని స్వామి ఆరోపించారు. ఎయిర్‌సెల్‌లో కార్తీకి చెందిన సంస్థ వాటా పొందే దాకా ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) అనుమతి రాకుండా ఉండేలా చిదంబరం చూసారని ఆయన ఆరోపించారు. ఈ ఒప్పందం సమయంలో జరిగిన లోపాయికారీ లావాదేవీలకు సంబంధించి తాను ఇప్పటికే సిబిఐకి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు, కంపెనీల రిజిస్ట్రార్‌కు లేఖలు రాసినట్లు స్వామి చెప్పారు. అయితే సిబిఐ, ఇడిలు ఈ కేసులో తమ దర్యాప్తును మారన్, ఆయన సోదరుడి పాత్రకు మాత్రమే పరిమితం చేస్తున్నాయని ఆరోపించారు. ‘బలమైన సాక్ష్యాధారాలున్నప్పటికీ ప్రధానంగా ఐపిఎస్ అధికారులయిన సిబిఐ అధికారులు మంత్రి, ఆయన కుమారుడిపై దర్యాప్తు జరపలేరు. చిదంబరం హోం మంత్రిగా ఉన్నంతవరకు సిబిఐ అధికారులకు నిష్పాక్షికంగా దర్యాప్తు జరపడం సాధ్యం కాదు’ అని కూడా స్వామి అన్నారు. (చిత్రం) తన ఆరోపణలకు సంబంధించిన ఆధార పత్రాల్ని ఢిల్లీలో గురువారం విలేఖరులకు చూపిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి.
చిదంబరంపై సుబ్రహ్మణ్య స్వామి తాజా ఆరోపణ
english title:
subramanya swamy
Date:
Friday, April 27, 2012