హైదరాబాద్, ఏప్రిల్ 26: నగరంలో వచ్చే అక్టోబర్‌లో నిర్వహించే జీవ వైవిధ్య సదస్సులో భారతీయ సంప్రదాయ సేద్యం, పశువుల రక్షణపై కూలంకషంగా చర్చ జరగాలని వివిధ సంస్థలు కోరుతున్నాయి. ఈ నెల 24, 25 తేదీల్లో దక్కన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన జాతీయ ప్రజా వ్యవసాయ జీవ వైవిద్య సమావేశంలో ఈ అంశంపై ప్రాథమికంగా చర్చలు జరిగాయి. దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటి డైరెక్టర్ పి.వి. సతీష్, ఢిల్లీలోని క్యాంపెయిన్ ఫర్ కన్సర్వేషన్ అండ్ కమ్యూనిటీ కంట్రోల్ ఓవర్ బయోడైవర్సిటి ప్రతినిధి షాలిని భుటాని రెండు రోజుల సమావేశ వివరాలను గురువారం తెలిపారు.
జీవ వైవిద్యంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఓపి) లో ప్రజల విజ్ఞానం, ప్రజల జీవ వైవిద్యం ప్రధాన అంశాలుగా ఎజెండాలో పొందుపరచాలని డిమాండ్ చేశారు. జీవవైవిద్యం జీవభద్రత తదితర అంశాలపై అంతర్జాతీయంగా నిర్ణయాలు తీసుకునేందుకే జీవ వైవిధ్య సదస్సును నిర్వహిస్తున్న విషయం గమనార్హమన్నారు. జీవ వైవిద్యం రక్షణపై స్థానిక ప్రజల విజ్ఞానాన్ని పెంపొదించడం మరో ముఖ్యమైన అంశమని వివరించారు. కనె్వన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ (సిబిడి) ఏర్పడి ఇరవై ఏళ్లు అయిందని, ఈ ఇరవైఏళ్లలో జీవ వైవిద్యం, జీవభద్రత తదితర లక్ష్యాలను సాధించామా? లేక బయోట్రేడ్, ప్రైవేట్ సంస్థలకు మాత్రమే ఉపయోగడుతోందా? అన్నది ప్రధాన అంశమన్నారు. జీవ వైవిద్య వ్యాపారం స్థానిక రైతులపై ఆధిపత్యం వహిస్తూ, దోపిడీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక విత్తనాలు, సంప్రదాయ వంగడాలు అంతరించిపోయి బహుళ జాతి సంస్థల ఖరీదైన విత్తనాలు రైతుల భూములను ఆక్రమించాయని, తద్వారా భారతీయ వ్యవసాయ విధానాలు నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు. ఈ కారణాల మూలంగానే బయోటెక్నాలజీపై సామాజిక నియంత్రణ ఉండాలని సూచించారు. జన్యుమార్పిడి వ్యాపారానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ అండ లభించడం వల్ల భవిష్యత్తు దుర్భరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు నిజమైన జీవవైవిద్యానికి వీలు కల్పించాలని, వారే సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండాలని జాతీయ ప్రజా వ్యవసాయ జీవవైవిద్య సమావేశం డిమాండ్ చేసిందని సతీష్, షాలిని భుటాని తెలిపారు.
జగన్‌కు అధికారమిస్తే.. గాలికి గనుల శాఖ.. మంగలి కృష్ణకు హోంశాఖ
*తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, ఏప్రిల్ 26: జగన్‌కు అధికారం కట్టబెడితే గాలి జనార్దన్‌రెడ్డికి గనుల శాఖ, విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ, మంగలి కృష్ణకు హోంశాఖ అప్పగిస్తారని టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరేమైనా ఫరవాలేదు తాను ముఖ్యమంత్రిని కావాలని జగన్ కోరుకుంటున్నారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే భానుకిరణ్‌కు సినిమాటోగ్రఫీ, సునీల్‌రెడ్డికి భారీ పరిశ్రమల శాఖ, కరుణాకర్‌రెడ్డికి దేవాదాయ శాఖ, రవీంద్రనాథ్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, అంబటి రాంబాబుకు మహిళా సంక్షేమ శాఖ ఇచ్చి క్రిమినల్ క్యాబినెట్ ఏర్పాటుచేసే యోచనలో జగన్ ఉన్నారని ఆరోపించారు. ఒక్కో విద్యార్థికి నెలకు 500 రూపాయలు ఇచ్చి చదివిస్తానని జగన్ చెబుతున్నారని, రాష్ట్రంలో 1.55 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి చెల్లించడానికి ఏటా 93వేల కోట్లు అవసరం అవుతాయని అన్నారు. జగన్‌కు నిజాయితీ ఉంటే వైఎస్‌ఆర్ హయాంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులను రద్దుచేయమని డిమాండ్ చేయాలని కోరారు.
గంగవరం, ముదిగొండల్లో అమాయకులను కాల్చి చంపించింది వైఎస్‌ఆర్ అని విమర్శించారు. తారాచౌదరి కేసు మినహా మిగిలిన అన్ని కేసుల్లో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. ఓబుళాపురం, ఎమ్మార్ ప్రాపర్టీస్, అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్ నిందితుడని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పరిటాల రవి కేసుపై సిబిఐతో మళ్లీ విచారణ జరిపించాలని చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
బొత్స సత్యనారాయణ తమ్ముడు అర్ధరాత్రి ప్రభుత్వ కార్యాలయాల్లో తాగి తందనాలు ఆడుతున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభాహైమవతి విమర్శించారు. మద్యపానం, మద్యం విక్రయం పోటీల్లో బొత్స కుటుంబానికే కప్పు వస్తుందని ఎద్దెవా చేశారు.
నేడు గవర్నర్‌తో టిడిపి ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్, ఏప్రిల్ 26: కాగ్ నివేదికపై చర్య తీసుకోవాలని కోరుతూ టిడిపి ఎమ్మెల్యేల బృందం శుక్రవారం గవర్నర్‌ను కలువనుంది. వైఎస్‌ఆర్ హయాంలో 88వేల ఎకరాల భూమిని సెజ్‌ల పేరుతో వివిధ సంస్థలకు అప్పగించారని కాగ్ నివేదికలో పేర్కొందని తెలిపారు. కాగ్ నివేదికను దృష్టిలో పెట్టుకొని ఆ భూమిని స్వాధీనం చేసుకుని రైతులకు అప్పగించాలని టిడిపి డిమాండ్ చేసింది. సెజ్‌లకు భూములు కేటాయించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించనున్నట్టు తెలిపారు. కాకినాడ సెజ్‌తో ఉద్యమాన్ని ప్రారంభించామని, రాష్ట్రంలోని ఇతర సెజ్‌లలలో పర్యటించనున్నట్టు తెలిపారు. కాగ్ నివేదికలో పేర్కొన్న భూములను స్వాధీనం చేసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నాం పనె్నండు గంటలకు టిడిపి ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలుస్తారు.
తప్పుడు భూ రిజిస్ట్రేషన్లు జరిగితే చర్య: మంత్రి తోట
కాకినాడ, ఏప్రిల్ 26: ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పేరుతో తప్పుడు భూ రిజిస్ట్రేషన్లు జరిగితే చట్టపరంగా చర్య తీసుకోవచ్చని, ఇటువంటి రిజిస్ట్రేషన్లను ఖండించాల్సిందేనని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కాకినాడ ఎస్‌ఇజడ్ పేరుతో సుమారు 10వేల ఎకరాలను ఓ ప్రైవేటు వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ చేసిన విషయమై విలేఖరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రైవేటు వ్యక్తి పేరున భూ రిజిస్ట్రేషన్లు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయమై అవసరమైతే విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు.
స్కౌట్స్‌తో మానసికవికాసం
‘రాజ్య’ పురస్కారాల ప్రదానోత్సవంలో గవర్నర్
హైదరాబాద్, ఏప్రిల్ 26: బాల, బాలికలు స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరడం వల్ల వారిలో తెలివితేటలు పెరగడంతో పాటు శారీరక, మానసిక వికాసానికి దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చెప్పారు. గురువారం నాడిక్కడ జరిగిన స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమంలో అర్హులైన వారికి రాజ్య పురస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ జాతికైనా క్రమశిక్షణ కలిగిన యువత ఉన్నారంటే అది ఆ దేశ ఆస్తిగా భావించాలని, ఇందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ మూమెంట్ పాత్ర చాలా ఉందని అన్నారు. పిల్లలను వారి తల్లిదండ్రులు స్కౌట్స్‌లో చేర్పించాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల కర్రికులమ్‌లో ఒక భాగంగా స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను చేర్చాలని గవర్నర్ సూచించారు.
5, 6న అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం
హైదరాబాద్, ఏప్రిల్ 26: మంగళవాద్య కళకు పునర్ వైభవాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో వచ్చే నెల 5, 6వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతికశాఖ సహకారంతో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో లాల్‌బహదూర్ స్టేడియంలోకనీ వినీ ఎరుగని రీతిలో అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం, సిలికానాంధ్ర గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్‌లతో కలిసి సమ్మేళన వివరాలను వెల్లడించారు. మంగళవాద్య కళ ఇటీవలి కాలంలో శుభకార్యాలకు మాత్రమే పరిమితమవడంతో కళాకారులకు ఉపాధి కరవైందని బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మంగళవాద్య అంతర్జాతీయ సమ్మేళనం లోక కళ్యాణానికి, విశ్వశాంతికి దోహదపడాలని ఆకాంక్షించారు.
శాంతా సిన్హాకు యుద్ధవీర్ స్మారక పురస్కారం
హైదరాబాద్, ఏప్రిల్ 26: సుప్రసిద్ధ విద్యావేత్త, జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ శాంతా సిన్హాకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక యుద్ధవీర్ స్మారక పురస్కారాన్ని యుద్ధవీర్ ఫౌండేషన్ ప్రకటించింది. స్వాతంత్ర సమరయోధుడు, హిందీ మిలాప్ దిన పత్రిక వ్యవస్థాపకుడు స్వర్గీయ యుద్ధవీర్ పేరిట నెలకొల్పిన ఈ అవార్డును శాంతా సిన్హాకు ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర లూథర్, కార్యదర్శి వినయ వీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న యుద్ధవీర్ జయంతి సందర్భంగా లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సిభవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో శాంతా సిన్హాను యుద్ధవీర్ అవార్డుతో సత్కరిస్తామని వారు తెలిపారు.
‘అప్రమత్తంగా ఉండండి’
హైదరాబాద్, ఏప్రిల్ 26: మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిర్వహిస్తున్న ఫార్చ్యూన్ పవర్ కార్పొరేషన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐడి అధికారులు హెచ్చరించారు. ఈ కంపెనీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డ్రీమ్స్.కామ్ పేరిట మనీ సర్క్యులేషన్‌తో పాటు నానో హెల్త్ ప్రొడక్ట్స్‌ను విక్రయించి సొమ్ము చేసుకుంటోందని పేర్కొంది. ఆ కంపెనీ విక్రయిస్తున్న ఉత్ప త్తులు వినియోగిస్తే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తాయని స్పష్టం చేసింది.