Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వేలి ముద్రల ఆధారంగా రేషన్ పంపిణీ

$
0
0

కాకినాడ, ఏప్రిల్ 26: వేలి ముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా చౌక డిపోల ద్వారా రేషన్ సరఫరా చేసే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లాలో అమలుకు రంగం సిద్ధమవుతోంది. పౌర సరఫరాల వ్యవస్థలో దేశంలోనే ప్రప్రథమంగా ఈ విధానాన్ని అమలుచేయనున్నారు. ఆధార్ నంబరు డేటా సహాయంతో లబ్ధిదారుల వేలిముద్రల నిర్ధారణ ఆధారంగా గుర్తించి రేషన్‌ను పంపిణీ చేయడం ద్వారా రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్టకు వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ద్వారా సదరు లబ్ధిదారుడు రాష్ట్రంలో ఏ రేషన్ షాపునుండైనా తనకు రావల్సిన సరుకులను పొందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ముందుగా తూర్పు గోదావరి జిల్లాలో అమలుచేసి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వినియోగంలోకి తీసుకురానున్నారు. చౌక ధరల దుకాణాల్లో నేరుగా ఈ సాంకేతిక విధానాన్ని ప్రవేశపెడతారు. 3ఇన్‌ఫ్రోన్సిక్స్ సిస్టమ్స్2 అనే సంస్థ ఏజన్సీగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ నూతన విధానాన్ని అమలులోకి తేనుంది. ఆధార్ ఆధారంగా వేలి ముద్రల ద్వారా రేషన్‌ను అందజేసేందుకు 3పాయింట్ ఆఫ్ సేల్2 అనే ఒక పరికరాన్ని ఇందుకోసం వినియోగించనున్నారు. ఈ పరికరం ఆన్‌లైన్ ద్వారా వేలి ముద్రలను పరిశీలించి అప్పటికపుడు లబ్ధిదారుడిని నిర్ధారిస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే జిపిఆర్‌ఎస్ ద్వారా ఆధార్ నంబరు డేటాతో లబ్ధిదారుని వేలిముద్రలను సరిపోల్చి నిర్ధారిస్తుంది. ఈ యంత్రం వేలి ముద్రలను నిర్ధారించడంతో పాటు రెండు రేషన్ రశీదులను సైతం ప్రింట్ చేస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ సహాయంతో పనిచేసే ఈ విధానం ద్వారా లబ్ధిదార్లు రాష్ట్రంలో ఎక్కడినుండైనా, ఏ షాపునుండైనా రేషన్ తీసుకునేందుకు వీలవుతుంది. అలాగే పౌర సరఫరాల శాఖ ఆయా షాపులకు కేటాయించే సరుకులు, పంపిణీ వివరాలు, ఇతర సమాచారాన్ని, షాపు ముగింపు నిల్వల వివరాలను లబ్ధిదారుడి మొబైల్‌కు అందజేస్తుంది. బయోమెట్రిక్ ఆధారంగా నిర్వహించే ఈ ప్రక్రియలో రేషన్ పంపిణీలో అక్రమాలకు తావు ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా తొలి దశగా 20 చౌక ధరల దుకాణాల్లో ఈ బయోమెట్రిక్ విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నారు. ఈ సౌలభ్యం కేవలం ఆధార్ విశిష్ట ఐడి నంబరు జారీ ద్వారానే సాధ్యమైందని అధికార్లు చెప్పారు. జిల్లాలో సుమారు 51 లక్షల మంది జనాభా ఉండగా 50లక్షల 50వేల మందిని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కింద నమోదు చేశారు. వీరిలో 40 లక్షల 50వేల మందికి యూనిక్ ఐడి నంబర్లను జారీ చేశారు. ఆధార్ డేటాను లబ్ధిదార్ల రేషన్ కార్డులతో అనుసంధానం చేస్తున్నారు. జిల్లాలో 12,20,269 కుటుంబాలకు సంబంధించి ఈ విధంగా ఆయా వివరాలను మొబైల్‌కు నేరుగా అందించడంతో పాటు బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది.

ఇరిగేషన్ పనులకు ఇసుక కొరత లేదు
రిజర్వు ఇసుక నిల్వలు వినియోగం
రాజమండ్రి, ఏప్రిల్ 26: ఇసుక తవ్వకాలపై కోర్టు ఆంక్షల నేపథ్యంలో ఇరిగేషన్ పనుల నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. కోర్టు ఆదేశాల మేరకు రిజర్వు ఇసుక నిల్వలను ఇరిగేషన్ పనులకు వినియోగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. పలు ఇసుక రీచ్‌లలో మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధీనంలో ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇరిగేషన్ పనులకు రిజర్వు ఇసుక వినియోగంపై గురువారం ఆర్డీఓ ఎం వేణుగోపాలరెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ఈసందర్భంగా ఆయన తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి ఇసుకరీచ్‌లో 8096 క్యూబిక్‌మీటర్లు, సీతానగరం మండలం వంగలపూడి ఇసుకరీచ్‌లో 1805, కెగంగవరం మండలం కూళ్ల రీచ్‌లో 16వేల 506 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయన్నారు. వాటిని ఇరిగేషన్ పనులకు వినియోగిస్తారన్నారు. అలాగే ఆలమూరు, జొన్నాడ రీచ్‌లలో కూడా నిల్వలు ఉన్నాయన్నారు. ఇసుక తవ్వకాలపై కోర్టు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో 9 ఇసుక రీచ్‌లలో అక్రమ తవ్వకాలు జరగకుండా 24గంటలు గస్తీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం విఆర్వో, పంచాయితీ కార్యదర్శి, పోలీసులతో కూడిన 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ వివరించారు. పగలు, రాత్రి 14 బృందాల చొప్పున ఇక్కడ గస్తీ తిరుగుతాయన్నారు.

రేపు ఎంపి చిరంజీవి రాక
డిసిసి అధ్యక్షుడు దొమ్మేటి ప్రమాణ స్వీకారానికి హాజరు
కాకినాడ, ఏప్రిల్ 26: రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ఈనెల 28న జిల్లాకు రానున్నారు. ఎంపిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన జిల్లా పర్యటనకు రావడం ఇదే తొలిసారి! చిరు ఆరోజు ఉదయం హైదరాబాద్‌లో విమానంలో బయలుదేరి మధురపూడి చేరుకుంటారు. అనంతరం జిల్లా కేంద్రం కాకినాడ చేరుకుని సాయంత్రం 4 గంటలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న దొమ్మేటి వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారోత్సవ సభకు హాజరుకానున్నట్టు రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి తోట నరసింహం తెలిపారు. ఈమేరకు ఆయన కాకినాడలోని ఓ హోటల్‌లో గురువారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడుతూ ఎంపిగా నియమితులైన తర్వాత చిరు తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలకాలని కోరారు. డిసిసి ఇన్‌ఛార్జి అధ్యక్షుడిగా తాళ్ళరేవు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటిని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నియమించినట్టు మంత్రి చెప్పారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో చిరంజీవి పర్యటిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన పర్యటన ఈ దఫా కాకినాడకే పరిమితమని, అయితే మినిట్ టు మినిట్ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు నగరంలోని ఆనందభారతి మైదానంలో జరిగే దొమ్మేటి ప్రమాణ స్వీకారోత్సవానికి చిరంజీవితో పాటు కేంద్ర మంత్రి ఎంఎం పళ్ళంరాజు, కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు హాజరుకానున్నట్టు తెలిపారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైందని, చిరు రాకతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. ప్రజారాజ్యం విలీనం అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు అంతా కాంగ్రెస్ కార్యకర్తలు అయినట్టేనని, విలీనం అనంతరం అక్కడక్కడ సమస్యలున్నా సమన్వయం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమ అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తున్నామని, సోనియాగాంధీ నాయకత్వంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉందని మంత్రి తోట అభిప్రాయపడ్డారు. సమావేశంలో డిసిసి ఇన్‌ఛార్జి అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు పంతం నానాజీ, మోహన్‌రావు, తాళ్ళూరి రాజు, గోపాల్, రాజా, సిరియాల చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
కాకినాడ, ఏప్రిల్ 26: రోడ్లు, బ్రిడ్జ్‌లు ముఖ్యమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆర్ అండ్ బి ఇంజనీర్లును ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆర్ అండ్ బి ఇంజనీర్లతో సంబంధిత పనుల తీరుపై ఆమె సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు చేసిన పనులు కాకుండా ముఖ్యమైన రోడ్లు, బ్రిడ్జిలు తదితర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించినచో అమోదం కొరకు పై అధికారులకు పంపడం జరుగుతుందన్నారు. ఉప్పాడలోని బీచ్‌రోడ్‌ను గతంలో మరమ్మత్తు చేశారని, అది కొద్దికాలానికే పూర్తిగా ఛిద్రమైందన్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆమె ఆదేశించారు. అన్నవరం దేవస్థానం నుండి గ్రామం వరకు గల రోడ్డు అక్రమణకు గురైందని, అక్రమణలు తొలగించి వెడల్పు పనులు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు రిపేరు, ప్యాచ్ వర్క్ కొత్త రోడ్ల ఏర్పాటుకు వచ్చే బడ్జెట్‌లో తొలి ప్రాధాన్యత ఇచ్చి ఆయా పనులు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. పిఠాపురం, బిక్కవోలు తహశిల్దార్ కార్యాలయాలకు అవసరమైన అన్ని మరమత్ములు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కత్తిపూడి, కాకినాడ ఎన్‌హెచ్ 216రోడ్డు వెడల్పు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. ఏజెన్సీ భద్రాచలం- రంపచోడవరం మెయిన్ రోడ్డు పనుల పురోగాభివృద్ధిపై ఆర్ అండ్ బి అధికారులను వివరణ కోరగా 2012-13 సంవత్సరానికి గాను ప్రతిపాదనలను పంపడం జరిగిందని అవి మంజూరు అయిన వెంటనే పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. మారేడుమిల్లి-కుల్లంగి, గురేడు- వై రామవరం తదితర లోతట్టు ప్రాంతాల మెయిన్ రోడ్డు పనులతో పాటు రవాణా సౌకర్యం కల్పించుటకు పనులు చేపట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ద్వారపూడి, కొండయ్యపాలెం రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులపై ఇంజనీర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు పి శ్రీ్ధర్, శాంతికుమార్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

మంచం పట్టిన మన్యం
* ప్రబలుతున్న మలేరియా *రోగులతో ఆసుపత్రులు కిట కిట
రాజవొమ్మంగి, ఏప్రిల్ 26: ఏజెన్సీలో మలేరియా జ్వరాలు సోకుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వాతావరణం వేడెక్కడంతో జ్వరంతో బాధ పడుతూ గురువారం ఆనేకమంది రోగులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మండలంలోని కిమ్మలిగెడ్డ గ్రామానికి చెందిన ఆశపు నూకరత్నం గత రెండు రోజులుగా మలేరియా జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధ పడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సింగంపల్లి గ్రామానికి చెందిన 8 ఏళ్ల పున్నపు శ్యామలాదేవి మలేరియాతో బాధ పడుతూ గురువారం ఆసుపత్రిలో చేరింది. రాజవొమ్మంగి గ్రామానికి చెందిన కర్రి గంగముత్యాలు, శరభవరం గ్రామానికి చెందిన గంటా అప్పయ్యమ్మలు మలేరియా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, లాగరాయి పిహెచ్‌సిల్లో గురువారం ఒక్కరోజే 42 మంది జ్వరాలతో వైద్య సహాయం పొందగా, అనేక మంది ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించారు. వారం రోజుల క్రితం మండలంలో భారీ వర్షాలు పడడంతో కుంటల్లో నీరు చేరింది. ఈ నీటిలో మలేరియాదోమ గుడ్లను పెట్టడంతో దోమల సంఖ్య గత కొంతకాలంగా విపరీతంగా పెరిగింది. ఈ దోమల వల్లే జ్వరాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. మండలంలో మారుమూల గ్రామాలైన వాతంగా, లోదొడ్డి, కొమరాపురం, అమ్మిరేకుల, దోనెలపాలెం, ఓగిపాలెం, గర్రంగి తదితర గ్రామాల్లో మలేరియా జ్వరాలతో అనేక మంది బాధపడుతున్నారు. వీరికి సకాలంలో వైద్య సహాయం అందక బాధపడుతున్నారు. తక్షణం పల్లెల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మలేరియా నివారణకు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ట్రాక్టర్ ప్రమాదంలో బాలుడు మృతి
*డ్రైవర్ నిర్లక్ష్యమే అంటున్న బంధువులు
రాజోలు, ఏప్రిల్ 26: మండలంలోని ములికిపల్లి గ్రామం మామిడిశెట్టివారిపాలెంలో గురువారం రెండవ నెంబర్ కాలువగట్టు వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో చిల్లే రాజశేఖర్‌బాబు (13) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం రాజశేఖర్‌బాబు, గోగి పవన్‌కుమార్‌లు కూనవరం వంతెన వద్ద మట్టిబెడ్డల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌పై ఎక్కి మామిడిశెట్టివారిపాలెంలో మట్టిని దింపి ఖాళీగా వస్తున్న ట్రాక్టర్ ఇంజన్‌పై డ్రైవర్ ప్రక్కన కూర్చున్నారు. వేగంగా వస్తున్న ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో రాజశేఖర్ క్రిందపడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ మందపాటి భీమరాజు సంఘటన స్థలం నుండి పరారయ్యాడు. మట్టి బెడ్డలు దించేందుకు వీరిని తీసుకెళ్ళాడని, ట్రాక్టర్ చక్రం రాజశేఖర్‌పై ఎక్కడంతో బాలుడు మృతిచెందాడని బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుడు రాజశేఖర్ తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్ళారు. రాజశేఖర్, తన ఇద్దరు అక్కలతో తాతయ్య చెల్లి కొండయ్య వద్ద ఉంటున్నారు. మనుమడు చనిపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో అని కొండయ్య చేస్తున్న రోధనలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి. సంఘటన స్థలాన్ని రాజోలు ఎస్సై వి శ్రీనివాసరావు, ఎఎస్సై రామ్మోహనరావులు పరిశీలించి మృతుడు తాతయ్య కొండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సామర్లకోట ఐఎంఎల్ మద్యం పంపిణీ డిపోలో ఏసిబి తనిఖీలు
*బినామీలపై కూపీ*పలు రికార్డులు స్వాధీనం
సామర్లకోట, ఏప్రిల్ 26: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం కుంభకోణంపై జరుగుతున్న ఏసిబి అధికారుల దాడుల్లో భాగంగా జిల్లాలో పలు మద్యం షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్న సామర్లకోటలోని ఐఎం ఎల్ డిపోలో గురువారం ఏసిబి అధికారులు డిఎస్పీ భాస్కరరెడ్డి ఆద్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో బినామీల పేరుతో కొనసాగుతున్న మద్యం దుకాణాలను గుర్తించడానికి వీలుగా సామర్లకోట మద్యం పంపిణీ డిపోలో రికార్డులను పరిశీలించి, డిపో మేనేజర్ సిహెచ్ జగన్నాధరావు, అసిస్టెంట్ మేనేజర్ పి సత్యన్నారాయణలతోపాటు సూపరింటెండెంట్ కాశీలను ఏసిబి డిఎస్పీ సి భాస్కరరెడ్డి, సిఐ బి రామకృష్ణలు ఏకాంతంగా విచారించి ఆరా తీశారు. అనంతరం పలు మద్యం షాపులకు మద్యం పంపిణీ చేసిన రికార్డులను వారు సీజ్ చేశారు.
సిండికేట్లను గుర్తించేందుకే దాడులు: డిఎస్పీ
జిల్లా వ్యాప్తంగా మద్యం సిండికేట్లును గుర్తించేందుకు జిల్లాలో మూడు ఐఎంఎల్ మద్యం పంపిణీ డిపోలు రాజమండ్రి, అమలాపురం సహా సామర్లకోటలో దాడులు నిర్వహించినట్లు ఏసిబి డిఎస్పీ భాస్కరరెడ్డి వెల్లడించారు. జిల్లాలో 550 మద్యం లైసెన్స్‌దారులు ఉండగా, వారిలో 365 మంది లైసెన్స్ దారులకు తెల్ల రేషన్‌కార్డులు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా మద్యం కొనుగోళ్లకు చెందిన 20వేల ఇండెంట్‌లు, బిల్లులును సేకరిస్తున్నామన్నారు. దీనిని బట్టి ఎంతమేర మద్యం సిండికేట్లు విస్తరించి ఉన్నారో? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో లభ్యమైన పత్రాలను సీజ్‌చేసి కోర్టుకు సమర్పిస్తామన్నారు. షాపుదారులు ఎవరి పేరున ఏ బ్యాంకులో డిడిలు తీస్తున్నారు? ఏ ఖాతా నుండి సొమ్ము డ్రా అవుతున్నదనే అంశాలపై క్షుణ్ణంగా దర్యాప్తుచేస్తున్నట్లు ఏసిబి డిఎస్పీ చెప్పారు. గత రెండు రోజలుగా అమలాపురం, రాజమండ్రిలో నిర్వహించిన తనిఖీలతోపాటు సామర్లకోటలో జరుపుతున్న తనిఖీల్లో కోర్టు రుజువులకోసం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో ఎసిబి సిఐ బి రామకృష్ణ, మద్యం ఐఎంఎల్ డిపో సిబ్బందిని తరచి తరచి ప్రశ్నించారు. అలాగే ఎక్సైజ్ ఎస్‌ఐ అహ్మద్ ఆసీఫ్ రికార్డులను పరిశీలించడంలో సహకారమందించారు. రాత్రి 8 గంటల వరకూ ఈ దాడులు కొనసాగాయి.

రామచంద్రపురం ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం
* కొత్త ఓటర్లకు అవకాశం *ఆర్డీవో వేణుగోపాలరెడ్డి
రాజమండ్రి, ఏప్రిల్ 26: త్వరలో జరగబోయే రామచంద్రపురం ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రామచంద్రపురం స్పెషల్ ఆఫీసర్, ఆర్డీఓ ఎం వేణుగోపాలరెడ్డి చెప్పారు. గురువారం ఆయన తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ జనవరి 10వ తేదీ నాటికి ప్రకటించిన తుది జాబితా ప్రకారం రామచంద్రపురం నియోజకవర్గంలోని 205 పోలింగ్ కేంద్రాల పరిధిలో లక్ష 71వేల 237 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఈనెల 23వ తేదీ వరకు ఇంటింటికీ తిరిగి కొత్త ఓటర్ల నమోదు, జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పోలింగ్ కేంద్రాలను కూడా తాను తనిఖీ చేశానన్నారు. పోలింగ్ కేంద్రాలు అన్ని అనువుగా ఉన్నాయన్నారు. కాకినాడలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. కొత్త ఓటర్లకు కూడా ఓటింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈమేరకు రామచంద్రపురం, కాజులూరు తహశీల్దార్, రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయాల్లో డిప్యుటీ తహశీల్దార్ల ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కొత్త ఓటర్ల నమోదులో ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తామన్నారు. గతంలో నామినేషన్ గడువు వరకు కొత్త ఓటర్లను చేర్చుకుని వారికి ఓటు హక్కు కల్పించామని గుర్తుచేశారు. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని 13 ఇ సేవ, ఎపి ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ఓటరుగుర్తింపుకార్డుల జారీకి చర్యలు తీసుకున్నామని ఆర్డీఓ ఎం వేణుగోపాలరెడ్డి వివరించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు రామచంద్రపురం, కాజులూరు, రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈసెట్-2012కు ఏర్పాట్లు పూర్తి
జెఎన్‌టియుకె విసి ప్రొఫెసర్ తులసీరామ్‌దాస్
కాకినాడ, ఏప్రిల్ 26: మే 24న నిర్వహించబోయే ఈసెట్-2012కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జెఎన్‌టియుకె వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ వి తులసీరామ్‌దాస్ తెలిపారు. శుక్రవారం జెఎన్‌టియుకెలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈసెట్‌కు సంబంధించిన వివరాలను తెలిపారు. 34072 అప్లికేషన్స్‌గాను ఇంత వరకు 33,985 మంది అభ్యర్థులు అర్హతలు పొందారన్నారు. అప్లికేషన్స్ దరఖాస్తు గడువు 5వేల రూపాయల అపరాధ రుసుముతో మే 9వ తేదీ వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సుమారు మరో 100 ధరఖాస్తులు వచ్చే అవకాశలు అంచనా వేస్తున్నామన్నారు. ఈసెట్‌కు సంబంధించిన హాల్‌టిక్కెట్లను ఈ నెల 23న పంపడమైనదని, వచ్చే నెల మే 15న ప్రాంతీయ కో-ఆర్డినేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసెట్ ఫలితాలను జూన్ 2వ తేదీన, ర్యాంక్ కార్డులను జూన్ 8వ తేదీన ప్రచురిస్తామని పేర్కొన్నారు. 11 జిల్లాలో 62 సెంటర్‌లలో 33, 985 మంది విద్యార్థులు ఈసెట్ పరీక్షకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. ఈసెట్ కేంద్రం వద్ద ఇన్విజిలేటర్‌తో సహా మరో నలుగురు అదనపు సిబ్బందిని ఏర్పడం చేయడం జరిగిందన్నారు. హాల్‌టిక్కెట్ల్ అందని అభ్యర్థులు మే 22, 23 తేదీలల్లో సంబంధిత కో-ఆర్డినేటర్‌లను కలిస్తే డూప్లికేట్ హాల్‌టిక్కెట్లను అందిస్తారని పేర్కొన్నారు. ఈసెట్‌కు కన్వీనర్‌గా జెఎన్‌టియుకె అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు వ్యవహారిస్తారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఇవి ప్రసాద్, డైరెక్టర్లు డాక్టర్ ప్రసాదరాజు, డాక్టర్ పద్మరాజు, డాక్టర్ బివికె రాజు, రెక్టార్ డాక్టర్ సత్యప్రసాద్‌లు పాల్గొన్నారు.

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
రాజమండ్రి, ఏప్రిల్ 26: కులాంతర వివాహం చేసుకున్న ఒక ప్రేమ జంట గురువారం తూర్పు మండలం డిఎస్పీ సత్యానందంను ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరింది. రాజమండ్రిలోని ఒక కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న చిర్రావూరి కమల్, గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బిటెక్ విద్యార్థిని ప్రత్తిపాటి సురేఖ ప్రేమించుకుని, బుధవారం తంటికొండలో పెళ్లి చేసుకున్నారు. స్నేహితుల ద్వారా రాజమండ్రిలో ఉండే కమల్, వినుకొండలో ఉండే సురేఖల మధ్య పరిచయం జరిగి, ప్రేమికులుగా మారారు. అయితే వీరి ప్రేమను సురేఖ తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో సురేఖ కమల్‌తో వివాహం చేసుకుని కాంగ్రెస్ నాయకులు కె హారిక, షేక్ సుబాన్‌లను ఆశ్రయించింది. వారి సూచనల మేరకు డిఎస్పీని ఆశ్రయించారు. ఈసందర్భంగా సత్యానందం మాట్లాడుతూ వారి కాపురం కలకాలం నిలవాలంటే పెళ్లిని నమోదు చేయించాలని, మరోసారి బంధువుల సమక్షంలో పెళ్లి చేయాలని సూచించారు.

కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు ప్రచారం
రామచంద్రపురం, ఏప్రిల్ 26: రామచంద్రపురం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, కారుకొండ శ్రీరాములు నగర్ తదితర ప్రాంతాలలో కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు గురువారం తన ప్రచారాన్ని నిర్వహించారు. సుస్థిర పాలనకు, అభివృద్ధికి, పేద, బడుగు వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో గరిగిపాటి సూర్యనారాయణ మూర్తి, కొమరిన వీర్రాజు, కొరిపెల్ల వీరవెంకట సత్యనారాయణ, నున్న రామచంద్రరావు తదితర ప్రముఖులతో పాటు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
బోసు ప్రచారం
రామచంద్రపురం పట్టణంలోని పలు వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోసు పలు వార్డుల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. పలు ప్రదేశాలలో ఆయనకు హారతులిచ్చి, స్వాగతం పలికారు.

దేశంలోనే ప్రథమంగా తూ.గో.లో అమలుకు సన్నాహాలు
english title: 
bio metric

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>