చిత్తూరు, ఏప్రిల్ 26: చిత్తూరుజిల్లా ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చేసేందుకు తాను అధికారంలోకి రాగానే కృష్ణాజలాలను చిత్తూరు వరకు తీసుకొస్తానని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. చిత్తూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు గురువారం చిత్తూరు వచ్చిన చంద్రబాబునాయుడు సాయంత్రం గాంధీ విగ్రహం వద్ద ఓపన్‌టాప్ జీపులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా ఆయన తన ప్రసంగాన్ని 20నిమిషాల పాటు కొనసాగించారు. ప్రజలు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా బాబుప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఈ నేపధ్యంలో బాబు మాట్లాడుతూ చిత్తూరులో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించాలని తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నాలు చేశామన్నారు. ఇందులో భాగంగానే కృష్ణాజలాలను చిత్తూరులోని ఎన్టీఆర్ జలాశయానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశామన్నారు. అంతేకాకుండా కళ్యాణ్ డ్యామ్ నీటిని కూడా తీసుకురావాలని భావించామన్నారు. అయితే అటుతర్వాత సమయం లేకుండా పోయిందని, ఈసారి అధికారంలోకి వస్తే కృష్ణాజలాల నీటిని కచ్చితంగా చిత్తూరు ప్రజలకు తాగునీటి సమస్య తీర్చుతానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబుకు పి.నాని గజపూలమాల, పూలకిరీటం, విల్లంబులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.మహదేవనాయుడు, ఎంపి ఎన్.శివప్రసాద్, ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, హేమలత, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,గాలిముద్దుకృష్ణమనాయుడు, టిడిపి నేతలు జంగాలపల్లెశ్రీనివాసులు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు శ్రీ్ధర్‌వర్మ, మాజీ ఎమ్మెల్యేలు లలితకుమారి, ఆర్.గాంధీ, మాజీ ఎం.పి దుర్గారామకృష్ణ, యువత ప్రధాన కార్యదర్శి డిష్‌సురేష్, చక్రి, జిల్లాతెలుగుమహిళ అధ్యక్షురాలు పుష్పావతి, పుష్పలత, నిర్మలాపట్ట్భారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, నీరజాక్షులనాయుడుతోపాటు పలువురు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
* సంఘమిత్రలకు బాబు హామీ
పాకాల, ఏప్రిల్ 26: అపరిష్కృతంగా ఉన్న సంఘమిత్రల సమస్యల పరిష్కారానికి తనవంతుగా సహకారం అందించి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం మధ్యాహ్నం చిత్తూరు పర్యటనలో పాల్గొనేందుకు వెళుతున్న పాకాల మండలం నేండ్రగుంట కూడలి వద్ద కొద్దిసేపు కార్యకర్తలు, అబిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తాము గత 20రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని పాకాల మండలానికి చెందిన సంఘమిత్రలు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన సంఘమిత్రల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవచూపడం లేదని వెంటనే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తెలుగుదేశం నాయకులతో ఆయన మాట్లాడారు. అనంతరం కార్యకర్తలకు అభివాదం చేసి చిత్తూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మహదేవనాయుడు, దేశం నాయకులు వలపల దశరధనాయుడు, హేమాంబరధరరావు, బొల్లినేని భాస్కర్‌నాయుడు, వెంకటాద్రిబాబు, నేండ్రగుంట నాగరాజనాయుడు, సురేష్, ధనంజయనాయుడు, విజయలక్ష్మి, చిన్నబ్బనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణలో
నిష్పక్షపాతంగా వ్యవహరించండి
తిరుపతి,ఏప్రిల్ 26: ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు అధికారులను ఆదేశించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై గురువారం ఆయన స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం మనందరం ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఎలక్షన్ కమిషనర్ ఆదేశించిన ప్రవర్తనా నియమావళిని తప్పకుండా ఆచరించాలన్నారు. ఈ ప్రవర్తనా నియమావళి ఎన్నికలు జరుగుతున్న తిరుపతికే కాకుండా జిల్లా మొత్తానికి అమల్లో వుంటుందన్నారు. బ్యానర్స్, ప్లెక్సిలు, కటౌట్లు, వాల్ పెయింటింగ్స్ తదితరాలు పబ్లిక్ ప్రదేశాల్లో ఏర్పాటు చేయరాదని, అలా ఎవరైనా చేస్తే వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎస్‌పి ప్రభాకర్‌రావును ఆదేశించారు. రౌడీషీటర్లు, సంఘ వ్యతిరేక శక్తులను గురించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఏవైనా లభ్యమైతే వెంటనే సీజ్ చెయ్యాలన్నారు. ఎవ్వరైనా లైసెన్సులు పొంది ఆయుధాలను కల్గి వుంటే వారి ఆయుధాలను డిపాజిట్ చేయించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలు ముగిసేంత వరకూ ఎవరికీ ఆయుధాలను ఉపయోగించటకుకాని, కొత్తగా లైసెన్సులను ఇవ్వడం కాని చేయరాదన్నారు. లౌడ్ స్పీకర్లు ద్వారా ప్రచారం చేసేందుకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. రాజకీయ పార్టీలు ఊరేగింపులను, వీడియో చేయించి భద్రపరచాలని ఎస్‌పికి సూచించారు. లైసెన్సులు లేని మద్యం షాపులు, బెల్టుషాపులను తొలగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. అక్రమంగా దాచివుంచిన మద్యంను సీజ్ చేసి రిపోర్టులను పంపాలని ఆదేశించారు. తిరుపతి అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, అధికారులు పాటించవలసిన విషయాలను విషయాలు, నిబంధనలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు స్థానిక పోలీసులకు తగినంత సమయాన్ని ఇస్తూ సభ నిర్వహించే ప్రదేశం, సమయాన్ని ముందుగా తెలియజేయాలన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులను, చర్చలను, దేవాలయాలను, మరే ఇతర ఆరాధన ప్రదేశాలను వేదికగా చేసుకోరాదని సూచించారు. బ్యానర్స్‌ను, ప్లెక్సిలు, కటౌట్లు, పెయింటింగ్స్ తదితర ప్రచారాలను పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయరాదన్నారు. ఒకవేళ అలా వాడుకుంటే అందుకు సంబంధించి అనుమతి పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందించాలన్నారు. సభలను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు లౌడు స్పీకర్లను వినియోగించడానికి ముందస్తు అనుమతి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్‌పి ప్రభాకర్‌రావు, ఆర్‌డిఓ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ టి ప్రసాద్, ఎంపిడిఓ రాజశేఖర్‌రెడ్డి, అర్బన్ తహశీల్దార్ నాగార్జునరెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి చంద్రవౌళి, ఎస్‌బిఐ డిఎస్‌పి విమలకుమారి, రాజీవ్‌నగర్ పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, విఆర్‌ఓ పిళ్ళై, తుడా అధికారులు, ఎంఆర్‌పల్లి, తిమ్మినాయుడుపాళెం, శెట్టిపల్లి పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఓలు , కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్‌కుమార్‌రెడ్డి, టిడిపి నుండి సుచరిత, నీలంబాలాజి, బుల్లెట్ రమణ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నారాయణస్వామి, టి రాజేంద్ర, ఎస్‌కెబాబు, సిఎంఎం నుండి నాగరాజు, సిపిఐ నుండి చిన్నం పెంచలయ్య, బిజెపి నుండి సామంచి శ్రీనివాస్, లోక్‌సత్తా నుండి నీలకంటేశ్వర్‌రావు, బిఎస్‌పి నుండి బండి రమేష్,తిరుపతి అర్బన్ ఎస్‌పి జే ప్రభాకర్‌రావు, ఆర్‌డిఓ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ టి ప్రసాద్, ఎంపిడిఓ రాజశేఖర్‌రెడ్డి, అర్బన్ తహశీల్దార్ నాగార్జునరెడ్డి, ఎక్సైజ్ కమిషనర్ పి చంద్రవౌళి, ఎస్‌బి డిఎస్‌పి విమలకుమారి, రాజీవ్‌నగర్ పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, విఆర్‌ఓ పిళ్లై, తిమ్మినాయుడుపాళెం, శెట్టిపల్లి, ఎంఆర్‌పల్లి పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఓలు పాల్గొన్నారు.
జూన్ చివరినాటికి నందకం సిద్ధం
తిరుపతి, ఏప్రిల్ 26: తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 30కోట్ల రూపాయలతో టిటిడి నిర్మిస్తున్న నందకం అతిథి భవనం ఈ ఏడాది జూన్ చివరికల్లా సిద్దమవుతుందని తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు అన్నారు. గురువారం ఆయన టిటిడి ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ అధికారులతో నందకం నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎంతో చిత్తశుద్దితో నిర్మాణ పనులు చేపడుతున్నా ఈ పనులను కాంట్రాక్టుకు తీసుకున్న కంపెనీలు మాత్రం తీవ్ర జాప్యాన్ని చేస్తున్నాయన్నారు. ఈ కారణంగా ఇటు భక్తుల వద్ద నుండి, అటు మీడియా వారి నుండి టిటిడి అధికారులు నిందలను మోయాల్సి వస్తోందన్నారు. 2008 ఏప్రిల్ నెలలో ప్రారంభం అయిన నందకం పనులు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తికాకపోవడం చాలా శోచనీయమన్నారు. 30కోట్లతో, 340గదులతో దాదాపు 1500 నుండి రెండువేల మంది భక్తుల దాకా వసతి కల్పించేందుకు నందకం భవన నిర్మాణాన్ని టిటిడి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఇసిఐఎల్ అధికారులు అలసత్వం వలన ఇంకా ఈ భవన నిర్మాణం పనులు పూర్తికాకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని తీవ్రస్వరంతో మండిపడ్డారు. టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు ఇతర సభ్యులు కూడా ఆ సంస్థ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఇప్పటికే ఎన్నో డెడ్‌లైన్లు విధించి పూర్తి అయ్యిందని, ఇక చివరిగా ఈయేడాది చివరికల్లా నందకం నిర్మాణ పనులు పూర్తికాకపోతే కంపెనీపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి టిటిడి వెనకాడబోదని ఆయన ఆ సంస్థ అధికారులను హెచ్చరించారు. ఇపిఐఎల్ జిఎం ప్రసాద్ మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వలన నందకం నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఈ యేడాది జూన్ చివరికల్లా 1.6కోట్ల రూపాయలను పనులు నిర్ణీతసమయంలో పూర్తి చేసి టిటిడికి అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఇ సి ఐ ఎల్ అధికారులు టిటిడి సి ఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఇ ఇ జగన్‌మోహన్‌రెడ్డి నందకం నిర్మాణపనులను తనిఖీ చేశారు.
15నుండి శుభప్రదం
తిరుపతి, ఏప్రిల్ 26: సనాతన ధర్మవ్యాప్తి కోసం మే 15వతేదీ నుండి 26వతేదీ వరకు శుభప్రదం పేరిట వేసవి శిక్షణా తరగతులను టిటిడి రాష్టవ్య్రాప్తంగా నిర్వహించనుందని టిటిడి ప్రజాసంబంధాల అధికారి తలారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి, ఇంటర్ మొదటి , రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా తిరుపతి, అనంతపురం, వరంగల్, హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్టణం నగరాల్లో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఒక్కొక్క కేంద్రంలో 500మందికి తక్కువ కాకుండా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. తిరుపతిలో మాత్రం బాలురకు, బాలికలకు వేర్వేరుగా రెండు కేంద్రాల్లో శిక్షణాతరగతులు ఏర్పాటు చేయనున్నారన్నారు. మిగతా కేంద్రాల్లో బాలురకు మాత్రమే ఈ ఏడాది అవకాశం కల్పించనున్నారని తెలిపారు. వచ్చే సంవత్సరం నండి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఈ వేసవి శిక్షణా కార్యక్రమానికి కావాల్సిన దరఖాస్తులు అన్ని జిల్లాకేంద్రాల్లోని టిటిడి కల్యాణమండపాల్లో ఏప్రిల్ 25వతేదీ నుండి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ దరఖాస్తును పూర్తి చేసి మే 5వతేదీ సాయంత్రం 5గంటల లోపు సంబంధిత కల్యాణమండపంలోనే అందజేయవచ్చునని తెలిపారు. ఈ శిక్షణా తరగతులకు గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు, ఎస్సీ, ఎస్టీ తరగతుల వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. దరఖాస్తు ఫారంలో పైన తెలిపిన ఆరు కేంద్రాల్లో నచ్చిన దానికి సూచించవచ్చునన్నారు. మే 5వతేదీ తరువాత దరఖాస్తులు అనుమతించబోమన్నారు. దరఖాస్తుల పరిశీలన తరువాత ఎంపిక పత్రాన్ని సంబంధిత విద్యార్థి చిరునామాకు పంపుతారు. విద్యార్థులు మే 15వతేదీ ఉదయం 7గంటల కల్లా నిర్దేశించిన కేంద్రానికి చేరుకోవాలి. భోజనం, బస సదుపాయాలు టిటిడి ఉచితంగా కల్పిస్తుంది. విద్యార్థులకు రాను, పోను ప్రయాణఖర్చులకు గరిష్టంగా 600 రూపాయలు అందిస్తుందని తెలిపారు. 12రోజులు పాటు జరిగే ఈ శిక్షణ ముగిసిన వెంటనే ఒక సర్ట్ఫికెట్ కూడా ప్రదానం చేస్తారన్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా మొదటి, చివరిరోజు పాల్గొనవచ్చునని తెలిపారు. తరగతుల్లో రోజువారీ ఉదయం 6గంటల నుండి ఏడుగంటల వరకు యోగాభ్యాసం, 8గంటల నుండి 9గంటల వరకు అంతశ్శక్తుల ఉద్దీపన (మహనీయుల జీవిత చరిత్రల ఆధారంగా), 9.15నుండి 10.30గంటల వరకు హిందూ ధర్మ(పురాణాలు, ఇతిహాసాలు), 10.30గంటల నుండి 11.30గంటల వరకు వ్యక్తిత్వ వికాసం, 11.45గంటల నుండి 12.45గంటల వరకు ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం, మధ్యాహ్నం 2.30గంటల నుండి 3.30గంటల వరకు విజయపథంలోని వ్యక్తులు-వ్యక్తిత్వాలు, సాయంత్రం 6గంటల నుండి 7.30గంటల వరకు భగవన్నామసంకీర్తన, రాత్రి 9గంటల నుండి 9.45గంటల వరకు ఆలోచనామృతం (ఇష్టాగోష్టి) అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ ఉద్దేశాలను గురించి వివరిస్తూ లోకధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని సందేశాత్మకంగా వారికి అందించడం యువతను జాగృతం చేయడం, హిందూమత ఔన్నత్యాన్ని , ధర్మాన్ని, యువ హృదయాలను అర్థవంతంగా అందించడం, భగవత్తత్వాన్ని ఆస్వాదయోగ్యంగా , సనాతన ధర్మాన్ని అనుసరణీయం చేయడమే శుభప్రదం ముఖ్య ఉద్దేశమని రవి ఆ ప్రకటనలో తెలిపారు.
‘నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి ’
చంద్రగిరి, ఏప్రిల్ 26: ప్రస్తుత సమాజంలో పదిమందికి ఆదర్శంగా నిలవాలన్నా, అందరితో కలుపుగోలుతనంతో పోవాలన్నా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బేతేల్ చర్చి నిర్వాహకులు సంగీతం రామమూర్తి తెలిపారు. గురువారం చంద్రగిరిలోని బేతేల్ చారిటబుల్ మిషన్ ఆధ్వర్యంలో జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి ప్రజాసంఘాలు, స్వచ్చంధ సంస్థలు, చర్చి పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు జ్ఞానసాగర్, ఆల్బర్ట్ రవీంద్రకుమార్, ప్రేమకుమార్, శైలర్స్, తదితరులు పాల్గొన్నారు.
‘గ్యాస్ సమస్య తీరాలంటే ప్రజలు అప్రమత్తం కావాలి’
నగరి, ఏప్రిల్ 26: నగరి మున్సిపాలిటీ, రూరల్ ప్రాంతాల్లో హెచ్‌పి గ్యాస్ సరఫరా అధ్వాన్నంగా ఉందని దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ప్రగతి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసన్ అన్నారు. ఆయన గురువారం నగరిలో మాట్లాడుతూ గత నవంబర్‌లో ఆర్డీవో స్థాయి అధికారితో సమావేశం ఏర్పాటు చేసి సత్వరం గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపినా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు లేవన్నారు. ఇందుకు ప్రజలు తమ సమస్యలను ముంబయిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కేంద్ర కార్యాలయానికి పంపాలని తెలిపారు.
టినో కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
చంద్రగిరి, ఏప్రిల్ 26: టినో కంపెనీలో వివిధ ఉద్యోగాల కోసం అర్హుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐకెపి ఫీల్డ్‌స్టాప్ గుర్రప్ప తెలిపారు. గురువారం చంద్రగిరి ఇందిరక్రాంతి పథం కార్యాలయంలో ఐకెపి సిబ్బంది మాట్లాడుతూ చిత్తూరులోని టినో కంపెనీలో మండల కో ఆర్డినేటర్, జిల్లా కో ఆర్డినేటర్, టెక్నికల్ అసిస్టెంట్, తదితర పోస్టులు కలిపి మొత్తం 49 ఉన్నాయని, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రం హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ కోర్సు చేసి ఉండాలని, మిగిలిన వాటికి డిగ్రీ తప్పనిసరి అని తెలిపారు. మేనెల 2వతేదీ లోపు దరఖాస్తులు చేసుకోవచ్చునని, లేదంటే నేరుగా చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు సర్ట్ఫికెట్లతో హాజరు కావాలని కోరారు. చెన్నై సామ్‌సంగ్ కంపెనీలో ఎస్‌ఎస్‌సి, తదితర అర్హతలతో సుమారు 200 ఉద్యోగాలు ఉన్నాయని అర్హులైన వారు ఈనెల 28న చిత్తూరులో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చునని తెలిపారు.
పాకాలలో 133మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
పాకాల, ఏప్రిల్ 26: పాకాల మండలంలో బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన భారీ వర్షం 133మిల్లీమీటర్లుగా నమోదు అయ్యిందని తహశీల్దార్ అరుణ్‌కుమార్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో ఇంతభారీస్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. పాకాల మండలంలో ఈ వర్షానికే పెద్దగా నష్టమేమి సంభవించలేదని అన్నారు. గురువారం సాయంత్రం సైతం పాకాల పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు భారీ వర్షం కురిసింది. బుధవారం కురిసిన వర్షానికే పాకాల, బావిరాగన్నచెరువు, తోటపల్లి, పరిసర ప్రాంతాల్లోని చిన్నచిన్న కుంటలు, చెక్‌డ్యాంలు జలకళతో నిండిపోయాయి. మొత్తం మీద ఈ వర్షం పాకాల పరిసర ప్రాంతాల రైతులకు ఎంతో మేలు చేసింది.
పిడుగు పాటుకు రెండు ఎద్దులు మృతి
ఏర్పేడు, ఏప్రిల్ 26: మండలంలోని ఎండీ పుత్తూరులో గురువారం పిడుగుపడి రెండు ఎద్దులు మృతిచెందాయి . గ్రామానికి చెందిన కె. ఆనందరెడ్డి గ్రామం సమీపంలోని పొలాల్లో కాడెద్దులను మేపుతుండగా గురువారం 3గంటల ప్రాంతంలో గాలి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో మేతమేస్తున్న రెండు ఎద్దులు అక్కడిక్కడే మృతిచెందిన చెందాయి. వీటి విలువ సుమారు 50వేలు రూపాయలు ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నారని తహశీల్దార్ భాస్కర్‌నాయుడు తెలిపారు. రెండు ఎద్దులతో మడకలు దున్ని కూలీ చేసుకుని జీవించే ఆనందరెడ్డి ఎద్దుల మృతితో జీవనాధారం కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
బస్సు సౌకర్యం లేక
లారీలను ఆశ్రయిస్తున్న విద్యార్థులు
నగరి, ఏప్రిల్ 26: పుత్తూరు ఆర్టీసీ డిపో నానాటీకి అధ్వాన్నంగా తయారై బస్సులను సంఖ్యను కుదించడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటోలు ఎన్ని ఉన్నా సకాలంలో విద్యార్థులకు బస్సులు రాక గురువారం నగరి డిగ్రీ కళాశాల విద్యార్థులు లారీని ఆశ్రయించి అందులో ప్రయాణించారు. కాలేజీ వదలంగానే కాలం వృథా చేయకుండా ఎండకు భయపడి ప్రమాదం అని తెలిసినా ఇలాంటి వాహనాల్లో ప్రయాణం చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. డిపో అధికారులు టౌన్‌బస్సులు నడిపి ప్రజలకు విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
సింహ వాహనంపై ఊరేగిన అగీస్థీశ్వరస్వామి
పుత్తూరు, ఏప్రిల్ 26: నారాయణవనంలోని సముదాయం వద్ద వెలసిన శ్రీమరగదవల్లీ సమేత అగస్థీశ్వరస్వామిని గురువారం సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి అమ్మవారిని వేద మంత్రాలతో మేలుకొలిపి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం రంగురంగుల పుష్పలతో అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. నారాయణవన ప్రాంతాన్ని పరిపాలించిన ఆకాశరాజు పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెపుతోంది.
నారాయణవనంలోని సముదాయంలో వెలసిన శ్రీమరగదవల్లీ సమేత అగస్థీశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం తూతూమంత్రంగా జరుపుతున్నారు. ఊరేగింపు సమయంలో అలంకరణ కనీసం 10కేజిల పూలుకూడా వాడకపోవడం స్థానిక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణవనం టిటిడి అధికారులు చిత్తశుద్ధితో పని చేయకపోవడం వల్ల ఉత్సవాలు సక్రమంగా జరగడం లేదని, ఇలాంటి వాటిపై సంబంధింత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నారాయణవనంలో దోమల బెడద
పుత్తూరు, ఏప్రిల్ 26: నారాయణవనంలో మురికి కాలువల్లోనీరు నిల్వ వుండడం, కాలువల నిర్మాణం అర్థాంతరం వదలివేయడం వల్ల దోమలు బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో వున్న ప్రధాన రహదారిపై మట్టి అడుగు మందంతో వుండడం వల్ల వాహనాలు రాకపోకల సందర్భంగా మట్టిరేణువులు ఇళ్లలోకి వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి వాటిపై పంచాయతీ కార్యదర్శికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిపై ఉన్నతస్థాయి అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చంద్రబాబు ప్రసంగాన్ని ఆపిన డిఎస్పీ
తిరుపతి, ఏప్రిల్ 26: ఎన్నికల ప్రచారానికి తిరుపతికి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎంఆర్ పల్లి జంక్షన్‌లో ప్రసంగిస్తుండగా డిఎస్పీ మాల్యాద్రి ఆక్షేపించిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. రాత్రి 9 గంటలకు మహిళా యూనివర్సిటీ జంక్షన్ వద్ద రోడ్డుషోను ప్రారంభించిన చంద్రబాబు 10 గంటల సమయంలో ఎంఆర్ పల్లి జంక్షన్‌లో ముగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు. ఈ నేపధ్యంలో తిరుపతి వెస్ట్ డిఎస్పీ మాల్యాద్రి చంద్రబాబు ప్రసంగిస్తున్న ప్రచార రధం వద్దకు వెళ్ళి సమయం ముగిస్తుందని, ప్రచారాన్ని ఆపాలని కోరారు. అందుకు చంద్రబాబు నిమిషంలో ముగిస్తానంటూ మూడు నిమిషాలు ప్రసంగించి సరిగ్గా 10 గంటలకు ఆపివేశారు. కాగా చంద్రబాబు నాయుడు ప్రసంగంలో మంగలి కృష్ణకు వైఎస్‌ఆర్ పార్టీ అధినేత జగన్‌కు సంబంధాలు ఉన్నాయని, సూరి హత్య కేసులో జగన్ ప్రథమ ముద్దాయని ఆరోపించారు. 2001లో మంగలి కృష్ణ సూరికి ఆయుధాలు సరఫరా చేసారని, ఈ ఆయుధాలను 2005లో పరిటాల రవి హత్య కేసులో ఉపయోగించారని ఆరోపించారు.
షటిల్ కోర్టు ప్రారంభం
తిరుపతి,ఏప్రిల్ 26: తిరుమల మేదరమిట్ట ప్రాంతంలో టిటిడి ఏర్పాటు చేసిన ఉడన్ షటిల్ కోర్టును టిటిడి తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు గురువారం ప్రారంభించారు. ఈ కోర్టులో టిటిడి ఉద్యోగులతో పాటు స్థానికులు వినియోగించుకోవడానికి టిటిడి అనుమతించింది. ఈ కోర్టు ఏర్పాటు పట్ల స్థానికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్ధరణ
తిరుపతి, ఏప్రిల్ 26: తిరుమల పాపవినాసనం రోడ్డుమార్గంలో వున్న వేణుగోపాలస్వామి ఆలయాన్ని హంథీరాం బావాజీ మఠం నిర్వాహకులు పునఃనిర్మాణం చేశారు. ఇందులో భాగంగా గురువారం అత్యంత వైభవంగా సంప్రోక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హంథీరాంజీ మఠాధిపతి అర్జున్‌దాస్, టిటిడి అధికారులు పాల్గొన్నారు.
నేడు లేపాక్షి చేతి ఉత్పత్తుల విక్రయశాల ప్రారంభం
తిరుపతి,ఏప్రిల్ 26: ఆంద్రప్రదేశ్ చేతి ఉత్పత్తుల సంస్ధ (హ్యాండిక్రాఫ్ట్స్) లేపాక్షి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి ఓవర్‌బ్రిడ్జి సమీపంలోని సింధుర ఏసి కల్యాణ మండపంలో లేపాక్షి కాటన్, స్కిల్ మేళా - 2012ని నిర్వహించనున్నట్లు ఆ సంస్ధ తిరుమల మేనేజర్ కె శ్రీహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ఈ నెల 27వతేది నుండి మే 8వతేది వరకూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో బెంగాలీ స్కిల్స్, కాంతావర్క్, చాంద్‌ని స్కిల్స్, కంచి, గద్వాల్, వెంకటగిరి, పొచంపల్లి, ఉప్పాడ, కాటన్, ప్రింటెడ్ ఖాదీ తదితర చీరలు, డ్రస్ మెటీరియల్స్ వుంటాయన్నారు. ఈ ప్రదర్శన ప్రతి రోజు ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకూ వుంటుందని తెలిపారు.
స్విమ్స్‌లో ప్రాణదాన ఆపరేషన్లకు 59మంది ఎంపిక
తిరుపతి, ఏప్రిల్ 26: స్విమ్స్‌లోని ప్రాణదాన పథకం కింద 59మంది పేదలరోగులను ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ అధ్యక్షతన సభ్యులు ప్రసాద్, శ్రీనివాసరావు, గోవిందనారాయణ, వెంకటారెడ్డి, చలపతి, ప్రభాకర్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బియ్యంకార్డులు కలిగి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలను ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్డియాలజీ విభాగంలో నాలుగు, నెఫ్రాలజీ విభాగంలో 7మంది, మెడిసిన్, యూరాలజీ, గాస్ట్రో ఎంట్రాలజీ విభాగాల్లో ఒక్కొక్కరు, న్యూరాలజీ రెండు, న్యూరోసర్జరీ 30మంది, ఆంకాలజీ 8మంది, పోస్ట్ రేడియేషన్ ఆంకాలజీ 4, ఇతర రోగులు ఒకరిని ఈ పరేషన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ 59మంది నిరుపేద రోగులకు స్విమ్స్‌లో టిటిడి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న ప్రాణదాన పథకం కింద ఉచితంగా ఆఫరేషన్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం
పుంగనూరు రూరల్, ఏప్రిల్ 26: పుంగనూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన పుంగనూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద సుమారు రూ. 50 లక్షలతో నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, వ్యక్తిగత సమస్యలు ఉన్నా తనకు మాత్రం పుంగనూరు అభివృద్ధే ధ్యేయమని ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆగిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తయ్యేందుకు తన వంతుకృషి చేస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా పుంగనూరు మడలంలోని మాగాండ్లపల్లె గ్రామంలో వినాయకుని గుడిని ప్రారంభించారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ దైవభక్తి ఉంటేనే ప్రజలు సత్ప్రవర్తన కల్గింటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాగరాజరెడ్డి, మాజీ ఎంపిటిసి వెంకటరెడ్డి యాదవ్, మాజీ సర్పంచ్ మేకలప్ప, కాంగ్రెస్ కార్యకర్తలు, అధిక సంఖ్యలోప్రజలు పాల్గొన్నారు
తిరుమలలో పాముల సయ్యాట
ఆనందంతో తిలకించిన జనం
తిరుపతి, ఏప్రిల్ 26: తిరుమలలో స్థానికులు నివాసం వుంటున్న బాలాజీ నగర్ సమీపంలో ముళ్లపొదల్లో అతిపెద్ద పొడవైన జెర్రిపోతు, నాగుపాము సంభోగం చేశాయి. ఈ దృశ్యాలను చూసిన ఓ యువకుడు ఇంటిలోని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ నోటా, ఈ నోటా పడి భారీ ఎత్తున జనం వచ్చి తిలకిస్తూ వున్నా సర్పాలు పూర్తిగా పరస్పర స్పర్శలతో లీనమై, మమేకమైయ్యాయి. ఈ విన్యాసం గంటపాటు జరిగింది. స్థానికులకు ఈ సర్పవిన్యాసం ఎంతగానో కనువిందు చేసింది.
టిటిడి ఆధ్వర్యంలో నేడు, రేపు
త్యాగరాజస్వామి 245వ జయంతి ఉత్సవాలు
తిరుపతి, ఏప్రిల్ 26: ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీత్యాగరాజస్వామి 245వ జయంతిని పురస్కరించుకుని తొలిసారిగా టిటిడి తిరుపతి, తిరుమల దివ్యక్షేత్రాల్లో ఈనెల 27,28 తేదీల్లో ఘనంగా నిర్వహించనుంది. వైశాఖ శుద్ధ షష్ఠి శుక్రవారం తిరుమలలోని కల్యాణవేదికలో ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనుంది. సంగీత సాహిత్య సార్వభౌముడైన త్యాగరాజు తన అరుదైన కృతులతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చాడు. నేటికీ కర్ణాటక సంగీతంలో త్యాగరాజస్వామి బాణీలు ప్రాంతాలకు అతీతంగా సంగీత విద్వాంసుల నోటిలో నర్తిస్తున్నాయి. ఎందరో మహానుభావులు, తెరతీయగరారా.., రాగసుధా రసాపానముచేసి రంజిల్లవే మనసా వంటి అనేక కృతులు రచించిన ఘనత త్యాగరాజుది. ఎన్ని శతాబ్దాలు అయినా తన అక్షరమాలలతో చిరంజీవిగా నిలిచిపోయిన త్యాగరాజస్వామికి నివాళిగా టిటిడి ఆ మహనీయుడి జయంతి ఉత్సవాన్ని నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. తెలుగువాడైన త్యాగరాజస్వామికి తమిళనాడులోని తిరువాయూరులో ప్రతియేటా నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాల వలే తిరుమల, తిరుపతి పుణ్యక్షేత్రాల్లో నిర్వహించడానికి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఈనెల 27న ముందుగా తిరుమలలోని కల్యాణవేదికలో సాయంత్రం ఆరుగంటలకు త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో ప్రధానంగా శ్రీత్యాగరాజస్వామి కృతులను ఉత్సవ సాంప్రదాయరీతిలో సుమారు 500మంది కళాకారులు బృందగానం చేయనున్నారు. వీరిలో ప్రధానంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావు కూడా పాల్గొననున్నారని ఎస్వీ సంగీత నృత్యకళాశాల ప్రిన్సిపాల్ ప్రభావతి దీక్షితులు తెలిపారు. కల్యాణ వేదిక ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో కళాకారులు త్యాగరాజు పంచరత్నకృతులు బృందగానం చేయనున్నారు. కాగా ఏప్రిల్ 28న తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో సాయంత్రం ఆరుగంటలకు త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ, దివ్యనామసంకీర్తనలను కళాకారులు బృందగానం చేయనున్నారు. కాగా ఇకపై ప్రతి సంవత్సరం ప్రతినెలా ఆయా తిధి నక్షత్రానుసారం ముఖ్యమైన వాగ్గేయకారుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను టిటిడి ‘వాగ్గేయకార వైభవం’పేరుతో ఘనంగా నిర్వహించనుంది.
తిరుమలలో రెండు రోజుల్లో 500 కల్యాణాలు
* పర్యవేక్షించిన తిరుమల జేఇఓ
తిరుపతి, ఏప్రిల్ 26: జగద్గురు శంకరాచార్య స్వామి జయంతిని పురస్కరించుకుని తిరుమల గోగర్భం డ్యామ్ మార్గంలో టిటిడి నిర్మించిన నిత్యకల్యాణవేదికలో గత రెండురోజులుగా 500 జంటలకు వివాహాలు, 40 ఉప నయనాలు జరిగాయి. శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ శుభ కార్యాయాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు స్వయంగా పర్యవేక్షించారు. ఏ వస్తువు ధర అయినా ఆకాశాన్ని అంటుతున్న నేపధ్యంలో నేడు టిటిడి నిర్మించిన నిత్యకల్యాణ సత్రంలో అతి తక్కువ వ్యయంతో కల్యాణాలు నిర్వహించుకోవచ్చునని ఇటు టిటిడి అటు భక్తులు భావిస్తున్న నేపధ్యంలో బుధ, గురువారాల్లో పెద్ద ఎత్తున 500 వివాహాలు,40 ఉపనయనాలు అత్యంత వైభవంగా జరిగాయి. దీంతో తిరుమలలో వసతి, దర్శనాలకు కొరత ఏర్పడింది.