Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

టిడిపిలో అసమ్మతి లొల్లి!

$
0
0

అనంతపురం, ఏప్రిల్ 26 : అనంతపురం అర్బన్ నియోజకవర్గ టిడిపి నేతల్లో అసంతృప్తి సెగలు రగిలాయి. ‘ఆదిలోనే హంసపాదు’లా మహాలక్ష్మి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో అసమ్మతి గళం విప్పింది. నియోజకవర్గంలో నెలకొన్న అసంతృప్తి సెగలు అటు అభ్యర్థిని.. ఇటు జిల్లా నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పార్టీ బలం అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తే తప్ప అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడం పోయి నేతల్లో వారికి వారే ఆధిపత్యం కోసం యత్నిస్తుండడంతో పార్టీ పరిస్థితి ‘నానాటికీ తీసికట్టు నాగం బొట్టు’ అన్న చందంగా తయారవుతోంది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ బలహీనపడుతుంటే నేతల మధ్య నెలకొన్న అనైక్యత, ఆధిపత్య ధోరణి వల్ల పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంటోంది. ఈ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో మొదటి నుంచీ ఆధిపత్య రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ పార్టీ నేతలు మూడు నాలుగు గ్రూపులుగా విడివడిపోయి ఉన్నారు. అది ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిపై పార్టీ అధినేత పలుమార్లు హెచ్చరించినా ఫలితం శూన్యం. ప్రస్తుతం పార్టీ అభ్యర్థిగా మహాలక్ష్మి శ్రీనివాస్ పేరు ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గంలో మరోసారి అసమ్మతి పడగ విప్పింది. పార్టీ మైనార్టీ నేత ఇప్పటికే తమ క్యాడర్‌తో పలుమార్లు సమావేశమై ఉపఎన్నికల్లో మహాలక్ష్మికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకూడదని సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి మైనార్టీ నేతలు ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. వారి మధ్య అసమ్మతి కారణంగానే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మరో నేత కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇతను కూడా తనకున్న కేడర్‌లోని ద్వితీయ శ్రేణి, ముఖ్య నేతలను సమావేశపరచి ఆ మేరకు ఆదేశించినట్లు తెలిసింది. ఈయన మరో అడుగు ముందుకేసి వైకాపా అభ్యర్థితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఆధీనంలో ఉన్న మొత్తం ఓట్లన్నీ వైకాపా అభ్యర్థికి వేయిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా తెలుసుకున్న అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ ఈ విషయాన్ని జిల్లా నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా నేతలు నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిపై ఆధారాలతో సహా అధినేతకు వివరించినట్లు తెలిసింది. అసమ్మతి విషయమై తాను త్వరలోనే అందరితో మాట్లాడతానని అధినేత వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో నెలకొన్న అసమ్మతి, వెన్నుపోట్లతో అభ్యర్థి మహాలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. ఇక్కడ ఎవరైనా సరే టిడిపి అభ్యర్థి మాత్రమే గెలిచి తీరాలి.. అందుకోసం తన అభ్యర్థిత్వాన్ని సైతం త్యాగం చేస్తానని ఆయన జిల్లా నేతల వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది. తెలుగు తమ్ముళ్ల మధ్యే సయోధ్య లేకపోతే టిడిపికి మద్దతు ఇస్తామన్న సిపిఐ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోందోనని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వీరిలో కూడా చీలికలు తెచ్చేందుకు అసమ్మతి నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఏదేమైనా తమ్ముళ్లలో నెలకొన్న అసమ్మతి పార్టీ అభ్యర్థి గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
టిడిపి ప్రత్యర్థి వైకాపానే..
* గెలుపు కోసం ఐక్యంగా కృషి:కాలవ
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 26: తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. పార్టీ గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషిచేయాలని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాన్ని రాంనగర్ నుండి అరవిందనగర్‌లో గతంలో పరిటాల రవి హత్య జరిగిన భవనానికి మార్చారు. ఈ నూతన కార్యాలయాన్ని పరిటాల సునీత ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశానికి పార్టీ అధ్యక్షుడు బికె. పార్థసారథి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పీఠం కోసమే వైఎస్. జగన్ కొత్త పార్టీని పెట్టారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరవయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. నాయకులు వ్యక్తిగత విషయాలను పక్కకుపెట్టి పార్టీ ఆదేశానుసారం విజయంకోసం పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి సింహస్వప్నమైన పరిటాలరవికి నిజమైన నివాళి పార్టీని గెలిపించటమేనన్నారు. బికె. పార్థసారథి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తపాలనకు, అవినీతి జగన్ ఆగడాలకు చరమగీతం పాడాలని తెలిపారు. జిల్లాలో రెండుస్థానాల్లో విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ విషపు కొమ్మే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ చంద్రబాబు జనానికి భయపడేవాడని, రాజశేఖరరెడ్డి జనాన్ని భయపెట్టేవాడని పేర్కొన్నారు. 2004 తరువాత జరిగిన హత్యలన్నీ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే జరిగాయన్నారు. పరిటాల రవి హత్యకు కారణమైనవారిగా నాడు టిడిపి చేసిన ఆరోపణలు నేడు నిజమవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనకు టిడిపి నాయకులు, కార్యకర్తలు అనేక కష్టనాష్టాలకు గురి అయ్యారని, టిడిపిని గెలిపంచుకోవడం ద్వారానే కష్టాలు తీరుతాయని అన్నారు. పార్టీ కార్యకర్తలు స్తబ్ధత, నిరుత్సాహాన్ని వీడాలని, కష్టాలు వచ్చినప్పుడే మరింత ముందుకు పోవాలన్న ఎన్టీఆర్ మాటలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. టిడిపికి జిల్లా కంచుకోట అన్న విషయాన్ని మరోమారు నిరూపించాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి, ఎమ్మెల్యేలు సునీత, అబ్ధుల్ ఘని, పల్లె రఘునాథరెడ్డి, పార్టీ నాయకులు ప్రభాకరచౌదరి, మహలక్ష్మిశ్రీనివాస్, హనుమంతరాయచౌదరి, శమంతకమణి, సాయినాథ్‌గౌడ్, తదితరులు ప్రసంగిచారు. పేరం నాగిరెడ్డి, ఆలం నరసానాయుడు, బివి. వెంకటరాముడు, ప్రకాష్‌నాయుడు, కృష్ణకుమార్, మురళీధర్‌రెడ్డి తదితరులతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.
రెండు చోట్లే ఎన్నికల నిబంధనలు
* మిగతా చోట్ల సడలింపు
అనంతపురం, ఏప్రిల్ 26 : జిల్లాలోని అనంతపురం అర్బన్, రాయదుర్గం నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఎన్నికల నిబంధనలను సడలిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ఎన్నికల నేపధ్యంలో జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలు వల్ల ఉపాధి హామీ పనులకు అంతరాయం కలిగింది. దీంతో ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. రెండు నియోజకవర్గాల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నందున మిగిలిన చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది. దీనికి సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగే రాయదుర్గం, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో మాత్రమే నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొంది. మిగతా వాటికి మినహాయింపు ఇచ్చింది. రాయదుర్గం, అనంతపురం అర్బన్ మినహా మిగతా చోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ, తాగునీటి పథకాల పనులు, ఉపాధి హామీ పనులు పునరుద్దరించుకోవచ్చని తెలిపింది. కరవు సహాయక చర్యలు చేపట్టవచ్చని సూచించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు జిల్లాలో ఎక్కడా ఎలాంటి అధికారిక పర్యటనలు చేపట్టరాదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.
ఘనంగా సామూహిక వివాహాలు
* వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సునీత
చెనే్నకొత్తపల్లి, ఏప్రిల్ 26: మండల పరిధిలోని బసంపల్లి వద్దనున్న కైవారం తాతయ్యస్వామి ఆశ్రమ నిర్వాహకులు రామయ్యస్వామి ఆధ్వర్యంలో గురువారం 41 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. ఈ వివాహాలకు ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు పలువురు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వివాహ వేదిక ద్వారా వేద మంత్రోశ్ఛరణల మధ్య సామూహిక వివాహాలు నిర్వహించారు. నిర్వాహకులు రామయ్యస్వామి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఎంతో మందికి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పరిటాల సునీత మాట్లాడుతూ సేవానిరతితో ఈ ఆశ్రమంలో ప్రతి యేడాది ఉచిత వివాహాలు చేయడం హర్షదాయకమన్నారు. నిర్వాహకులను స్ఫూర్తిగా తీసుకొని మరికొంత మంది ముందకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులు, బందువులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు రామయ్యస్వామితోపాటు జింకా రాజేంద్ర ప్రసాద్, నిమ్మల కుంట ఆదినారాయణ, ఎస్‌జె చెన్నప్ప, ఒంటికొండ ఆదినారాయణ, ఉపాధ్యాయులు నాగభూషణ, మారెప్ప, నామాల శీన, సత్యసాయి సేవాదళ్, కన్వీనర్లు హాజరయ్యారు. వీరితోపాటు టిడిపినాయకులు ఎల్ నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, పరందామయాదవ్, ఓబిలేసు తదితరులు హాజరయ్యారు.
రిమాండ్ ఖైదీ మృతిపై కలెక్టర్ ఆరా
అనంతపురం రూరల్, ఏప్రిల్ 26: బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్‌లో రిమాండ్ ఖైదీగా వుండి ప్రభుత్వా జనరల్ ఆస్పుత్రిలో ఆనారోగ్యంతో మృతి చెందిన మంజు (50) మృతికి దారితీసిన కారణలపై మెజిస్టిరియల్ విచారణ జరుపు నిమిత్తం అనంతపురం రెవెన్యూ డివిజన్ అధికారి, సబ్ డివిజనల్ మెజిస్ట్రిట్ వారిని విచారణా అధికారులగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ వి.దుర్గాదాస్ నేడొక ప్రకటనలో తెలిపారు. కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా గౌరిబిదనూరు పట్టణానికి చెందిన ఎల్లప్ప కుమారుడు కర్నాటక మంజు జిల్లా జైలులో రిమాండు ఖైదీగా వుంటూ ఆనారోగ్య కారణాలతో ప్రభత్వ జనరల్ ఆస్పుత్రిలో ఈనెల 16న మృతి చెందియున్నారని, ఈమృతికి దారితీసిన సంఘటనలను, జైలు సిబ్బంది సరియైన సమయంలో వైద్య సేవలు అందించడం జరిగినదా, లేదా అనే తదితర అంశాలపై మెజిస్టేరియల్ విచారణ చేసి నివేదికను ఒక మాసంలోగా అందజేయాలని జిల్లా కలెక్టర్ మెజిస్టేట్ అధికారి వి. దుర్గాదాస్ సబ్ డివిజనల్ మెజిస్టేట్, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు.
పురంలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
* చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లుతున్న కాలువలు
హిందూపురం టౌన్, ఏప్రిల్ 26: స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన హిందూపురంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిందూపురం పట్టణంలో దాదాపు 36 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అసలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలు ఉన్న ప్రాంతాల్లో అవి సక్రమంగా లేకపోవడంతో మరింత ఇబ్బందులు తప్పడం లేదు. పలు కాలనీల్లో డ్రైనేజీలను తరచూ శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి మురికి నీరు నిలువ ఉండి దుర్వాసన వెదజల్లుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు చిన్నపాటి వర్షం కురిసినా డ్రైనేజీలు పొంగిపొరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని గాంధీనగర్, హస్నాబాద్, మోడల్‌కాలనీ, అహ్మద్‌నగర్, పైపులైన్ రోడ్డు, సత్యసాయినగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిస్తే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. డ్రైనేజీల్లో నీరు ముందుకు వెళ్ళకుండా నిలబడంతో ఆ నీరంతా ఇళ్ళలోకి వస్తోందని మహిళలు వాపోతున్నారు. దీంతో నీటిని బయటకు ఎత్తిపోసేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. ఇకపోతే ఇటీవల స్థానిక బాలాజీ సర్కిల్‌లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రహదారి ఎత్తును పెంచడంతోపాటు డ్రైనేజీలకు మరమ్మత్తులు చేశారు. అయినప్పటికీ గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి ఆయా ప్రాంతాల్లోని వాణిజ్య సముదాయాలు, నర్సింగ్ హోంలు, ఇళ్ళలోకి నీరు చేరాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే విషయం తెలుసుకొన్న మున్సిపల్ కమిషనర్ ప్రభాత్‌కుమార్ అక్కడికి చేరుకొని ఆయా పరిసరాలను పరిశీలించారు. డ్రైనేజీని ఆక్రమించుకొని మెటికలు, బంకులను ఏర్పాటు చేసుకోవడంతో నీరు ముందుకు వెళ్ళకుండా నిలబడి మురికి నీరు ఇళ్ళలోకి వెళ్ళినట్లు గమనించారు. వెంటనే జెసిబిని రప్పించి డ్రైనేజీపై చోటు చేసుకొన్న ఆక్రమణలను తొలగించారు. దీంతో మురికి నీరు ముందుకు వెళ్ళడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పట్టణ శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో డ్రైనేజీ సమస్య స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్ళలోని మురికి నీటిని కూడా రహదారులపై వదులుతున్నారు. దీంతో రహదారులు అధ్వాన్నంగా తయారై దోమలు, పందులకు నివాసాలుగా మారినట్లు స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులను పారిశుద్ధ్యం మెరుగుకు వినియోగిస్తున్నా ప్రజలకు ఉపయోగ పడటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు పర్యటన
జయప్రదం చేయండి
బొమ్మనహాళ్, ఏప్రిల్ 26: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మే 1వ తేదీ మండలంలో పర్యటించనున్నారని రాయదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జి దీపక్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయం లో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడు తూ టిడిపి కంచుకోట అయిన బొమ్మనహాళ్ మండలంలో చేపట్టనున్న చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయడానికి పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, భారీఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు. బాబు పర్యటన మే 1వ తేదీ డి.హీరేహాల్ నుండి ప్రారంభమై నేమకల్ మీదుగా బొమ్మనహాళ్, ఉద్దేహాళ్, శ్రీరంగాపు రం, ఉప్పరాల, ఎల్‌బి నగర్, గోనేహా ల్, యర్రగుంట, కణేకల్లు నుండి రా యదుర్గం చేరుతుందని తెలిపారు. చంద్రబాబు రాయదుర్గంలో బూత్ కమిటీ మెంబర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. వైకాపా నేత లు కొందరు టిడిపి కార్యకర్తలకు డ బ్బు ఎర వేస్తున్నారని అలాంటి వారి నుండి అప్రమత్తంగా ఉండాలని టిడిపి నేతలు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జగన్నాథ్‌రెడ్డి, మాజీ సర్పంచులు కేశప్ప, రామాంజినేయులు, వెంకటేశులు, మల్లికార్జున, నాగరాజు, శివశంకర్‌రెడ్డి, దేవేంద్రప్ప, నేతు కాం తారావు, మోహన్‌బాబు, నారాయణ ప్ప, చలపతి, ప్రసాద్, గురుప్రసాద్, మాజీ జడ్పీటిసి మల్లికార్జున, మాజీ వైఎస్ ప్రెసిడెంట్ మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఆధ్వర్యంలో వైకాపా నేతలు మల్లికార్జున గౌడ్, బండూరు ఎర్రితాత వంద మంది కార్యకర్తలు టిడిపిలో చేరారు.
అభ్యర్థుల ఎంపికలో
బిజెపి తలమునకలు!
అనంతపురం సిటీ, ఏప్రిల్ 26: జిల్లాలో రెండు స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతుండడంతో భారతీయ జనతా పార్టీ పోటీలో నిలవాలని నిర్ణయించింది. ఇందుకు సంబందించి గురువారం జిల్లా పార్టీ కార్యాలయం లో రాష్ట్ర కార్యదర్శి పార్థసారధి, జిల్లా అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి, జిల్లా నాయకులతో చర్చించారు. జిల్లాలోని అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానున్నండడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికలో నాయకులు కుస్తిపట్టారు. పార్టీలోని నాయకుల గురించి కార్యకర్తలను, ఆయా నియోజవర్గాల నాయకులతో చర్చించారు. అనంతపురంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లలిత్‌కుమార్, మైనార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఫయాజుద్దీన్‌లు, సీనియర్ నాయకుడైన సాకే.బలరామ్‌లు పేర్లు జిల్లా నాయకులు ముందున్నట్లు సమాచారం. జిల్లా నాయకులు మాత్రం లలిత్‌కుమార్‌పై ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మైనార్టీ సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవాలంటే సయ్యద్ ఫయాజుద్దీన్‌కు ఇవ్వాలి. రాయదుర్గం నియోజకవర్గం నుండి బిసి సామాజిక వర్గానికి చెందిన, తిప్పెస్వామి, సీనియర్ అడ్వకేట్ అనంతరామచార్యులు, మాజీ మునిసిపల్ చైర్మన్ జయంతి రాధకృష్ణల పేర్లు నాయకుల ముందున్నట్లు తెలిసింది. జిల్లాలో బిజెపి ఆశిస్తున్నట్లు ఎబివిపి కార్యకర్తల ఓట్లు, ఆర్‌ఎస్‌ఎస్ ఓట్లు కలసి వస్తాయన్న నమ్మకంతో ముందుకు పోతున్నట్లు సమాచారం. గురువారం జరిగిన సమావేశంలో నాయకుల పరిశీలనలో ఉన్న పేర్లును తీసుకపోయి ఈ నెల 31వ తేదిన భీమవరంలో జరగబోవు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో జిల్లా నాయకులు సేకరించిన పేర్లును అధిష్ఠానం ముందు పెట్టి, వారు ప్రతిపాదించిన పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రజా సమస్యల పరిష్కారంలో
అధికార, ప్రతిపక్షాలు విఫలం
కణేకల్లు, ఏప్రిల్ 26: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ టిడిపి పూర్తిగా విఫలమయ్యాయని రాయదుర్గం నియోజకవర్గం లోక్‌సత్తా పార్టీ అభ్యర్థి బాబు విమర్శించారు. మండ ల పరిధిలోని ఎర్రగుంట, కణేకల్లులో గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపి నేతలు ఒకరిపై ఒకరు దూషించుకోవడంలో ఉన్న శ్రద్ధ, ప్రజల సమస్యలు పరిష్కరించడంతలో చూపించడం లేదన్నా రు. మండల పరిధిలోని ప్రతి గ్రా మం లో తాగునీటి సమస్య నెలకొన్నా అధికారులకు, ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభు త్వం ప్రజల సమస్యలు పట్టించుకోకపోయినప్పటికీ వాటిని అమలు పరచాలని, టిడిపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం చెందిందని, తద్వారా అభివృద్ధి పనులు అటకెక్కాని పేర్కొన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సి డీ, ఇన్సూరెన్స్ అందిస్తున్న ప్రభుత్వం రైతులకు శాశ్వత పరిష్కారాలు చూ పించి ఆదుకోవాలన్నారు. అలాగే రోడ్ల విషయంలో కాంగ్రెస్, టిడిపి నేతలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రం మొత్తం మీదుగా 2 శాతం మాత్రమే లోక్ సత్తా నేతలు ఉన్నారని, వీరు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో 20 శాతం ముందున్నారన్నారు. లోక్‌సత్తా పార్టీ కొత్త తరానికి కొత్త రాజకీయం అనే సిద్ధాంతంపై ముందుకు వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తిప్పేస్వామి, నాగరాజు, అబ్దుల్లా, లోకేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
ఉరవకొండ, ఏప్రిల్ 26: పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నివాసం వుంటున్న పవన్‌కుమార్ (25) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత 5 నెలల నుండి ఆరోగ్యం క్షీణించడంతో జీవితంపై విరక్తి చెందిన పవన్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేసున్నట్లు ఎస్సై శంకర్‌రెడ్డి తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
తనకల్లు, ఏప్రిల్ 26: మండల పరిధిలోని చీకటిమాని పల్లికి చెందిన హైదర్‌వలి (49) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అందించిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. హైదర్‌వలి చీకటిమాను పల్లిలో నివాసం ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ కలహాల వల్ల మనస్తాపానికి గురై ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా బంధువులు గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం తనకల్లు ఎస్సై మనోహర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అదృశ్యమైన వ్యక్తి మృతి
* పోలీసుల విచారణలో వెలుగుచూసిన వైనం
పెద్దపప్పూరు, ఏప్రిల్ 26: నాలుగు రోజుల క్రితం అదృశమైన చిక్కేపల్లికి చెందిన వెంకటశివారెడ్డి మృతి చెందినట్లు గురువారం పోలీసుల విచారణలో వెలుగులో చూసింది. పోలీసులు తెలిపిన వివరాల.. చిక్కేపల్లికి గ్రామానికి చెందిన రామిరెడ్డి తన పొలానికి అడవి పందుల బెడద నుండి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వెంకటశివారెడ్డి మృతిచెందాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కితే తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించిన రామిరెడ్డి వెంకటశివారెడ్డి మృతదేహాన్ని ముక్కలుగా కోసి పొలానికి సమీపంలోని బోరుబావిలో పూడ్చి పెట్టినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి పెద్దఎత్తున తరలివచ్చారు. టిడిపి నేత పేరం నాగిరెడ్డి, మండల నేతలు బోరుబావిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోరుబావిలో ఉన్న శవాన్ని శుక్రవారం ప్రొక్లైన్ ద్వారా బయటకు తీస్తామని పెద్దపప్పూ రు ఎస్‌ఐ రాజు తెలిపారు.

* వేరు కుంపటి పెట్టిన మైనార్టీ నేత.. * అదే బాటలో మరో అసంతృప్త నేత.. * చేతులెత్తే యోచనలో మహాలక్ష్మి.. * అధినేత వద్దకు పంచాయితీ..
english title: 
dissidence

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>