Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం

$
0
0

కడప, ఏప్రిల్ 26 : జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షాలతో జిల్లా రైతాంగం అతలాకుతలమైంది. అసలే వర్షాభావంతో వరుస కరవులు ఎదుర్కొంటున్న రైతాంగానికి అరకొర కాపు కాసి పండ్లు చేతికి వచ్చే సమయానికి వర్షాలు జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచాయి. జిల్లా వ్యాప్తంగా మామిడి, బొప్పాయి, అరటి తోటలు నెలకు ఒరిగాయి. మామిడి కాయలు, అరటి కాయలు చెల్లాచెదురయ్యాయి. దీంతో కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లింది. జిల్లాలో రాయచోటి, పులివెందుల, బద్వేలు, జమ్మలమడుగు, కడప ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం రావడంతో అరటి, బొప్పాయి, మామిడి కాయలు భారీ ఎత్తున రాలిపోవడం, వట వృక్షాలైన మామిడి చెట్లు నేలకొరిగాయి. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, వీరబల్లి, ండుపల్లె తదితర ప్రాంతాల్లో అధికంగా మామిడి తోటలు ఉన్నాయి. ఈ మారు మామిడి కాపు కూడా 25 శాతం లోపే ఉంది. అయితే అకాల వర్షాలకు చేతికి వచ్చే మామిడి కాయలు రాలిపోయాయి. బద్వేల్ నియోజక వర్గం పోరుమామిళ్ళలో వడగడ్లు, ఈదురు గాలులతో అపారంగా పంట నష్టం వాటిల్లడం, రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయంతో పాటు బుధవారం రాతంత్రా కరెంట్ లేకుండా రాత్రి జాగారం చేశారు. అలాగే లింగాల మండలం, పులివెందుల, వేంపల్లె ప్రాంతాల్లో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. ఎగుమతికి ఉపయోగించే మేలు రకమైన అరటి కాయలు, చెట్లు కింద పడి రైతులకు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. అలాగే చేతికి వచ్చిన పసుపును రైతులు శుద్ధి చేసుకుని వాటిని దాచుకునే సమయానికి పొలాలపైనే ఎండుతున్న పసుపు తడిసి ముద్దయింది. అసలే పసుపు పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ఈ అకాల వర్షాలతో ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాలలో భారీ నష్టం వాటిల్లింది. అలాగే జమ్మలమడుగు, గండికోట కొట్టాల పల్లెలో పిడుగుపాటుతో రెండు గేదెలు మృతి చెందాయి. రాయచోటి ప్రాంతంలో పిడుగుపాటు కారణంగా కొబ్బరి చెట్లు మసైపోయాయి. సంబంధిత అధికారులు మాత్రం నష్టం పరిహారం అంచనాలు తప్ప ఏ రైతుకు ఇంత వరకు ఆర్థిక సాయం అందించిన దాఖలాలు కనిపించలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అకాల వర్షాలకు గురై తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కట్టుదిట్టంగా ఎన్నికల
నిబంధనలు అమలు
* ఉప ఎన్నికల నియోజకవర్గాల్లో తహశీల్దార్ల బదిలీ
కడప (కలెక్టరేట్), ఏప్రిల్ 26 : జిల్లాలో ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. రా ష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఒక అడుగు ముందుకు వేసిన జిల్లా అధికారులు ఎలాంటి వత్తిళ్లకు లొంగకుండా చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సుమారు 17 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. ఉప ఎన్నికలు జరుగుతున్న ఆ మూ డు నియోజకవర్గాల తహశీల్దార్లతో పాటు ఈ మండలాలకు సమీపంలో ఉన్న తహశీల్దార్ల సైతం అనంతపురం, కర్నూలు జిల్లాలకు బదిలీ చేశారు. ఎ న్నికలు ముగిశాయక వీరిని తిరిగి జి ల్లాలో నియమించనున్నారు. కాగా జి ల్లాలో అనేక ప్రాంతాల్లో మొదలుకాబోతున్న అభివృద్ధి పనులను నిలిపి వే శారు. అందులో కూడా పాత పథకాల అమలకు అనుమతించి, కొత్త పనుల ప్రారంభాన్ని నిషేధించారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉప ఎన్నికలు జరుగుతున్న రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో సుమారు 490 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకాలు అమలైతే ఖచ్ఛితంగాకాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచితీరుతారనే భావన కనిపించింది. అయితే ఉన్నట్టుండి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ పనులన్నీ నిలిచిపోయాయి. అలాగే ఎన్నికల్లో మద్య ం, ధన ప్రభావాన్ని పూర్తిగా నిరోధించాలని కమిషన్ చేసిన సూచన మేరకు జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఆ నియోజకవర్గాల సరిహద్దుల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాలలకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు భారీగా పోలీసులను నియమిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తం గా ఐదువేలకు పైగా మద్యం, బెల్ట్‌షాపులు ఉన్నాయి. వీటిని నియంత్రించే విధంగా ప్రత్యేక పోలీస్ బలగాలను బరిలో దింపుతున్నారు. కలెక్టర్ వి. అనిల్‌కుమార్, ఎస్పీ సంయుక్తంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు దృష్టి పెట్టారు. రేపోమాపో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, బెల్ట్‌షాపులపై దాడులు వాహనాల తనిఖీలు మొదలయ్యాయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ద్వారకాతో శ్రీకాంత్ చర్చలు
* వైఎస్‌ఆర్‌సిపిలోకి ఆహ్వానం * తిరస్కరించిన గడికోట
రామాపురం, ఏప్రిల్ 26: లక్కిరెడ్డిపల్లెలోని మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి గురువారం జరిపిన చర్చలు జరిపారు. ద్వారకనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ద్వారకనాథరెడ్డి తెలుగుదేశం వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎలాగైనా ద్వారకనాథరెడ్డిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించుకుని తనకు మద్దతుగా ప్రచారం చేసుకుంటే కలిసొస్తుందనే ఉద్దేశంతో కలిసి చర్చించారు. గెలుపు దిశగా పయనించవచ్చనే ఉద్దేశంతోనే కాకుండా గడికోట వర్గం చీలిక లేకుండా పటిష్టంగా ఉండేందుకు చర్చలు నిర్వహించినట్లు తెలిసింది. సోమవారమే శ్రీకాంత్‌రెడ్డి స్వయంగా ఫోన్ ద్వారా ద్వారకనాథరెడ్డిని సంప్రదించగా చూద్దామని చెప్పడంతో బుధవారం తండ్రి లక్కిరెడ్డిపల్లె మోహన్‌రెడ్డిని స్వయంగా ఇంటికి పంపించి చర్చలు జరిపినట్లు తెలిసింది. అయినప్పటికీ ఏ మాత్రం స్పందించకపోవడంతో అదే రోజు రాత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నుండి ఫోన్ ద్వారా రాయబారం పంపనప్పటికీ ఏమాత్రం ఫలితం దక్కనట్లు తెలిసింది. ఇక లాభం లేదనుకున్న శ్రీకాంత్‌రెడ్డి గురువారం స్వయంగా తన అనుచరులతో ద్వారకనాథరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అయినప్పటికీ ససేమిరా అనడంతో శ్రీకాంత్‌రెడ్డి వెనుతిరగక తప్పలేదు. వెంటనే రాయచోటి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడుతో కలిసి ద్వారకనాథ్‌రెడ్డి సమాలోచన చేసుకుని వెంటనే వీరువురు కలిసి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు వెళ్లినట్లు సమాచారం. రామాపురం, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు మండలాల్లో ద్వారకనాథ్‌రెడ్డికి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఏమైనప్పటికీ ద్వారకనాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల శ్రీకాంత్‌రెడ్డికి కాస్త ఓటు శాతం తగ్గే అవకాశం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.

మూడు నియోజకవర్గాలకే
ఎన్నికల నియమావళి వర్తింపు
కడప, ఏప్రిల్ 26 : ఉప ఎన్నికల నియమావళి నుంచి జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు మినహా మిగతా నియోజకవర్గాలకు మినహాయింపు ఇస్తూ ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తుండడంతో జిల్లా మొత్తానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ది కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తూ ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల పనులు జరిగేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే నియమావళి అమలులో ఉంటుందని పేర్కొంది. మిగతా చోట్ల అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవచ్చని పేర్కొంది. దీంతో జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరులో మాత్రమే ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. మిగతా చోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ,, తాగునీటి పథకాల పనులు, ఉపాధి హామీ పనులను పునరుద్దరించుకోవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. కరవు సహాయక చర్యలు చేపట్టవచ్చని సూచించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు జిల్లాలో ఎక్కడా ఎలాంటి అధికారిక పర్యటనలు చేపట్టరాదని ఆంక్షలు విధించింది.
జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం ముక్కలే..
కడప , ఏప్రిల్ 26 : వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వేస్తే రాష్ట్రం రెండు ముక్కలవుతుందని కమలాపురం ఎమ్మెల్యే జి. వీరశివారెడ్డి పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అధికార దాహానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి 17 స్థానాల ఎమ్మెల్యేలను జగన్ బలి చేశారన్నారు. మంచినీటి ఏర్పాట్లకు ప్రజాపథం తరపున ప్రభుత్వం ఐదుకోట్లు ఖర్చుపెట్టిందన్నారు. అలాంటి ప్రజాపథం ఉప ఎన్నికలతో నిలిచిపోయిందన్నారు. దీనివల్ల జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఓ ఎంపిగా ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఆయన అధికార దాహానికి జిల్లా ప్రజలు బలి అవుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పైపు లైన్లు వేయడం, కొత్త బోర్లు వేయడం, మంచినీటి పరిష్కారం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కెసిఆర్‌కు జగన్‌మోహన్‌రెడ్డి మధ్య ఒప్పందాలున్నాయన్నారు. జగన్‌కు ఓటు వేస్తే కేసిఆర్‌కు ఓటు వేసినట్లేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడుస్తున్నారన్నారు. రాజశేఖర్‌రెడ్డి తన ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారన్నారు. అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని కోరుకునేవారన్నారు. కానీ ఆయన తనయుడు మాత్రం కెసిఆర్‌తో కుమ్మకై నీది నీవ్వు చూసుకో, నాది నేను చేసుకుంటానన్న అనైతికంగా ఉన్నారన్నారు. 5 లక్షల 40 వేల మెజార్టీతో ఎంపిగా జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించిన జిల్లా ప్రజలకు ఆయన చేసింది ఏంటని ప్రశ్నించారు. ప్రజాపథం నిలిచిపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయన్న ఆవేదనతో ఏ నియోజక వర్గంలో ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడే ఎన్నికల కోడ్ విధించాలన్నారు. ఎలక్షన్ లేని ప్రాంతాల్లో ప్రజాపథం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ సమస్యపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రం విడిపోయే అవకాశమే లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి వల్లే రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోతుందన్నారు. మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ భాను, సూరి , మంగళి కృష్ణ జగన్‌మోహన్‌రెడ్డి అనుచరులే అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రమేయంతోనే ఆయన పథకం ప్రకారమే పరిటాల రవి హత్య, సెటిల్‌మెంట్, దందాలు, భూకబ్జాలు చేశారన్నారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి, జరుగుతున్న అవినీతికి జగన్‌మోహన్‌రెడ్డే కారణమన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్‌కు ప్రజలందరూ ఓటు వేయాలన్నారు.
రాజంపేట టిడిపి టికెట్ బ్రహ్మయ్యకే
రాజంపేట, ఏప్రిల్ 26:రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య నాలుగోమారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారికంగా రాజంపేటలో బ్రహ్మయ్య పేరును ఎట్టకేలకు ఖరారు చేసింది. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ కె.మదన్‌మోహన్‌రెడ్డి టికెట్ ఆశించినప్పటికి లభించకపోవడంతో అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలిచినా ఆయనను కలవకపోవడంతో రెండుమార్లు బ్రహ్మయ్య పేరును ఖరారు చేసి కూడా అధికారికంగా ప్రకటించని విషయం తెలిసిందే. శనివారం రాజంపేటలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించకుండా నియోజకవర్గంలో పర్యటించడం సహేతుకంగా ఉండదని, ఆలస్యం చేసిన కొద్దీ పార్టీ నష్టపోయే పరిస్థితి ఉందని వచ్చిన సంకేతాలతో చివరికి బ్రహ్మయ్య పేరును అధికారికంగా బుధవారం రాత్రి ప్రకటించారు. దీంతో పసుపులేటి బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ తరపున 4వ మారు పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బ్రహ్మయ్య విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌కు యత్నించి విఫలమయ్యారు. దీంతో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెండు సంవత్సరాలుగా తీవ్రంగా యత్నిస్తూ వస్తున్నారు. సామాజిక సమీకరణల్లో భాగంగా రాజంపేట టికెట్ కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో బ్రహ్మయ్యకు పరిస్థితులు అనుకూలించాయి. దీంతో నాలుగోమారు రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం లభించింది. కాగా పార్టీలో బ్రహ్మయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలను బుజ్జగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి కె.మదన్‌మోహన్‌రెడ్డిని కూడా రాష్టస్థ్రాయిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు సైతం బుజ్జగించేందుకు యత్నించినా ఆయన ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మయ్యకు ప్రచారం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీని సమైఖ్యంగా ముందుకు నడిపించి విజయం సాధించేందుకు బ్రహ్మయ్య చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 1999 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఇద్దరు ఒకే సామాజికవర్గం నేతలు పోటీ చేయడంతో బ్రహ్మయ్య విజయం సునాయాసమైందని, ఇప్పుడు కూడా ప్రధానపక్షాల తరపున ఒకే సామాజికవర్గం నేతలు పోటీ పడుతున్నందున బలిజ సామాజికవర్గానికి చెందిన బ్రహ్మయ్య విజయం సునాయాసమవుతుందన్న నమ్మకంతో ఆయన వర్గీయులున్నారు. రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామలను బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడే పరిస్థితి కూడా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ లోటును ఏ విధంగా బ్రహ్మయ్య భర్తీ చేసుకుంటారన్నది వేచిచూడాలి. మొత్తానికి బ్రహ్మయ్య నియోజవర్గంలోని బలిజ సామాజికవర్గం మద్దతును ఎంతశాతం సాధించగలుగుతారన్న దానిపై ఉప ఎన్నికల్లో విజయం ఆధారపడి ఉంది. కాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో పార్టీలో బ్రహ్మయ్యను వ్యతిరేకించే నేతలు, కార్యకర్తల శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు పర్యటనతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఎంతమంది నేతలు బ్రహ్మయ్యకు సానుకూలంగా వ్యవహరిస్తారు అన్నది తేటతెల్లం కానుంది. అలాగే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వౌనం దాల్చిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ కె.మదన్‌మోహన్‌రెడ్డి వైఖరిపై కూడా ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి
రాయచోటి, ఏప్రిల్ 26: ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఎంఎల్‌సి బచ్చల పుల్లయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన పిఆర్‌టియు శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడెడ్, మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు నోషినల్ ఇంక్రుమెంట్లు వర్తించే విధంగా కృషి చేస్తామన్నారు. భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా, పిఇటిలను పిడిలుగా చేయాలని కోరారు. 1998లో 398తో పని చేసిన ఉపాధ్యాయులకంతా నోషనల్ ఇంక్రుమెంట్లు కలపాలని ఆయన కోరారు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పంచాయతీరాజ్ టీచర్స్ కూడా ప్రభుత్వ టీచర్స్‌తో సమానంగా సదుపాయాలు, ప్రమోషన్లు పొందేందుకు పిఆర్‌టియు కృషి చేసిందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐఇఆర్‌టి ఉపాధ్యాయుల రెగ్యులరైజ్ చేయిస్తామని హామీ ఇచ్చారు. 2008 డిఎస్సీ టీచర్లకు రెగ్యులర్ వేతనం వర్తింజేయడం, ఖాళీగా ఉన్న పోస్టులను బర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరో ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ బడుగు, బలహీన పేద విద్యార్థులని, వీరికి అన్ని రకాల వౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు. పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ 1971 సంవత్సరంలో స్థాపించిన ప్రభుత్వ పంచాయతీరాజ్ టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను సాధించి ప్రమోషన్లు ఇప్పించి 2002లో పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ పేరును ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ మార్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకై ఒంటరిగా, సమిష్టిగా ఎన్నో పోరాటాలు చేసి ఏ ప్రభుత్వాన్నైనా ఒప్పించి, సమస్యను పరిష్కరించింది పిఆర్‌టియు అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు క్రిష్ణయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజు, డైట్ ఇన్‌చార్జి ప్రిన్స్‌పాల్ గుడిపాటి నారాయణ, పనీంద్ర, రోశయ్య, లక్ష్మీరమణయ్య, వేణుమాదవరాజు, మురళి, ఎవి రమణ, శ్రీనివాసులు, రమణ, అన్ని మండలాల నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో శిక్షణా తరగతిలో పాల్గొన్నారు.
ఆరాధన ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్ 26: ఈనెల 28వతేదీ నుండి మేనెల 3వతేదిదీ వరకు జరిగే శ్రీ మద్విరాట్ పొతులూరు వీరబ్రహేంద్రస్వాముల వారి ఆరాధన మహోత్సవాలసందర్భంగా బిమఠం ముస్తాబవుతోంది. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్ళతోపాటు విద్యుత్ దీపాలతో దేవాలయ ప్రాంగణంతోపాటు పార్కు, టిటిడి సత్రం, గోవింద మాంబ సదనం, వీరబ్రహేంద్ర సదనం ప్రాంతాలల్లో చలువ పందిళ్ళను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో హాజరవుతున్న భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌లలో కూడా ఈ చలువ పందిళ్ళను ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా మఠం పురవీధులలో కూడా భక్తులకు అసౌకర్యాలకు గురికాకుండా ఉండేందుకోసం ఈ చలువ పందిళ్ళను ఏర్పాటు చేశారు. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంకోసం తాత్కాలిక మరమ్మతుల గదులతోపాటు తలనీలాలు తీసేందుకు ప్రత్యేకించి చలువ పందిళ్ళను ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్రహ్మంగారి నిత్య అన్నదానం పథకానికి సంబంధించి ప్రత్యేక చలువ పందిళ్ళను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బ్రహ్మంగారి రాతి విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంగణంతోపాటు స్వామి నివాస గృహం వద్ద పొలేరమ్మ, తదితర చోట్ల కూడా అన్ని రకాల అలంకరణలతోపాటు విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణం వైపునగాలి గోపురం, ప్రాంగణమంతా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు అర్బన్ ఏప్రిల్ 26: పెళ్లి మండపం వద్ద ఏర్పాటుచేసిన లైటింగ్ డెకరేషన్‌కు విద్యుత్ ప్రసారం కావడంతో దాన్ని పట్టుకున్న స్కూటరిస్టు మృతి చెందాడు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన ప్రొద్దుటూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వైఎమ్‌ఆర్ కాలనీ, ఆచార్య కాలనీ మధ్యలో ఉన్న శ్రీవాసవి కల్యాణ మండపంలో గురువారం తెల్లవారుజామున పెళ్లికి లైటింగ్ డెకరేషన్ చేశారు. బుధవారం రాత్రి ఆచార్యకాలనీకి చెందిన రవికుమార్‌రెడ్డి అలియాస్ ఎరిశారెడ్డి(38) ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కిందపడబోతూ విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు. దీంతో కరెంట్ షాక్ తగలడంతో రవికుమార్‌రెడ్డి అక్కడే చనిపోయాడు. దీంతో కల్యాణ మండపం నిర్వాహకులు మృతదేహాన్ని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, బాధితులు ప్దెద్దసంఖ్యలో కల్యాణ మండపం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో కల్యాణ మండపంపైకి రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలాయి. విషయం తెలుసుకున్న త్రీటౌన్ ఎస్‌ఐ నాగరాజు కల్యాణ మండపం వద్దకు చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. అయినా వారు వినిపించుకోలేదు. కల్యాణం మండపం అధ్యక్షుడు వల్లంకొండు సత్యనారాయణ కమిటీ సభ్యులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఎస్‌ఐ నాగరాజుతో చర్చలు జరిపారు. అర్బన్ సిఐ యుగంధర్‌బాబు, స్థానిక శాసన సభ్యుడు లింగారెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. తెల్లవారుజాము వరకు ఆందోళన కొనసాగింది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన చర్చలు ఫలించలేదు. పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులు, వివిధ వర్గాల నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అక్కడికి చేరుకొని యాజమాన్యంతో, కాలనీ వాసులతో చర్చించి మృతుని కుటుంబానికి ఐదులక్షల రూపాయల నష్టపరిహారం అందించే విధంగా ఒప్పించారు. అందులో తమ పార్టీ తరుపున మృతుని కుటుంబానికి ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు మిగిలిన వారు 4లక్షలు ఇస్తున్నట్లుప్రకటించడంతో మృతుని బంధువులు, కాలనీ వాసులు శాంతించారు.
మహిళ దారుణహత్య
పోరుమామిళ్ళ, ఏప్రిల్ 26:పట్టణంలోని మహాబూబ్‌నగర్‌లో రాజుపాళెం ఖాదర్‌బీ (45) మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన పోరుమామిళ్ళల్లో బుధవారం సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖాదర్‌బీ భర్త హుస్సేనయ్య మరణంతో కువైట్‌కు వెళ్ళి అక్కడ నుంచి తదితరప్రాంతాల్లో ఉంటూ ఇటీవల ఐదునెలల క్రితం మహాబూబ్‌నగర్‌లో ఒక బాడుగ ఇళ్ళు తీసుకొని బట్టల వ్యాపారం ప్రారంభించింది. ఆమెకు హుస్సేన్‌బీ అనే కూతురు ఉంది. ఈమెను తాడిపత్రి లో వివాహం చేయగా ఖాదర్‌బీ ఒక్కతే ఆ ఇంట్లో ఉంటుంది. బుధవారం రాత్రి 10గంటల ప్రాంతంలోపక్కింటికి వెళ్ళి కరెంటు లేదు ఇంకా రాలేదా అని అడిగి తలుపులువేసుకున్నది. అప్పటి నుండి ఆమె బయటికి రావడం గానీ, పొవడం గానీ లేదు. గురువారం ఇరుపొరుగు వారు ఎంత సేపటికి బయటికి రాకపోవడంతో సాయంత్రం 5గంటలకు తలుపులు తీయగా ఒంటిపై బట్టలు లేకుండా రక్తపుమడుగులో పడి ఉండడం చూసి అవాక్కై ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులుసంఘటనాస్థలానికి చేరుకొని హుస్సేన్‌బీ మరణం హత్యేనని దృవీకరించారు. తల గొడకు బాదినట్లు ఆ గొడమీద రక్తం మరకలు ఉండడం చూసి అర్థం అవుతుందన్నారు. ఆమెను యదాస్థితిగా మంచంపై పడుకొబెట్టారని పోలీసులు తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఈమెతో వివాహేతర సంబంధం ఉన్నవారే చేసి ఉంటారని భావిస్తున్నారు. నిందితున్ని రెండు మూడు రోజుల్లో పట్టుకొని ఈ మిస్టరీ ని చేధిస్తామని మైదుకూరు డిఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన తోపాటు పోరుమామిళ్ళ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ గురివిరెడ్డి, సిబ్బంది ఉన్నారు. మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టంకు పంపించి పూర్తి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షాలతో
english title: 
rains lash dist

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>