Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రెండు నియోజకవర్గాలకే ఎన్నికల నియమావళి వర్తింపు

$
0
0

కర్నూలు, ఏప్రిల్ 26 : ఉప ఎన్నికల నియమావళి నుంచి జిల్లాలోని ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు మినహా మిగతా నియోజకవర్గాలకు మినహాయింపు ఇస్తూ ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తుండడంతో జిల్లా మొత్తానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ది కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తూ ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల పనులు జరిగేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే నియమావళి అమలులో ఉంటుందని పేర్కొంది. మిగతా చోట్ల అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవచ్చని పేర్కొంది. దీంతో జిల్లాలోని ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరులో మాత్రమే ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. మిగతా చోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ,, తాగునీటి పథకాల పనులు, ఉపాధి హామీ పనులను పునరుద్దరించుకోవచ్చని తెలిపింది. కరవు సహాయక చర్యలు చేపట్టవచ్చని సూచించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు జిల్లాలో ఎక్కడా ఎలాంటి అధికారిక పర్యటనలు చేపట్టరాదని ఆంక్షలు విధించింది.

జీవో 98కు... ఎన్నికల గండం!
కర్నూలు, ఏప్రిల్ 26: శ్రీశైలం జలాశయం నిర్మాణం కోసం ఆస్తులు కోల్పోయిన వారి సంక్షేమం కోసం జారీ అయిన జీవో నం. 98 అమలుకు ఉప ఎన్నికలు విఘాతం కల్పించాయి. ఎపుడో 25 సంవత్సరాల క్రితం దివంగత ఎన్టీ రామారావు విడుదల చేసిన ఈ జీవో ఎట్టకేలకు అమలు చేసేందుకు ఇటీవలే ప్రభుత్వం ఆమోదించింది. ఆ మేరకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కర్నూలు జిల్లా నీటి ముంపు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో జీవో నం.98 ద్వారా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన అధికారులు ఆ ప్రక్రియను చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల నియమావళి కారణంగా తమకు రావాల్సిన ఉద్యోగాలు మరో మూడు నెలల కాలం వాయిదా పడతాయని తెలిసి నీటి ముంపు నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంతా కలిసి కలెక్టర్ రాంశంకర్ నాయక్‌ను కలిశారు. ఇందుకు ఆయన సమాధానం చెబుతూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి అనుమతి కోరుతామని అంగీకరిస్తే ఉద్యోగాల కల్పనకు ఆటంకం ఉండబోదని తెలిపారు. అయితే ఎన్నికలు జరుగుతున్న కొన్ని జిల్లాల్లో గ్రామ రెవెన్యూ అధికారుల కౌనె్సలింగ్ కూడా వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఇంకా తమ ఉద్యోగాల భర్తీ తొలి దశలో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందోనని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.

హోమియో వైద్యంతో స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణ
కర్నూలు, ఏప్రిల్ 26: స్వైన్ ఫ్లూ వ్యాధి హెచ్‌ఎన్, ఎన్ వైసర్ వల్ల సోకుతుందని ఈ వ్యాధి గురించి భయం అవసరంలేదని ఆయూష్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ వెంకయ్య, ఆయూష్ కర్నూలు క్లష్టర్ సమన్వయ కర్త డాక్టర్ పివి నాగరాజు, జిల్లా కోఅర్డినేటర్ డాక్టర్ పి. చంద్రశేకర్‌రెడ్డిలు గురువారం తెలిపారు. సీతకాలంలో స్వైన్ ఫ్లూ వైరస్ ఎక్కువగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ వ్యాధి లక్షణాలు జలుబు అధికంగా వుంటుందని, జ్వరంతో ఒళ్లు నొప్పులు ఎక్కువగా వుంటాయని ఛాతి నొప్పిగా వుండి శ్వాస ఇబ్బందికరంగా వుంటుందని, తలనొప్పి, దగ్గు ఉండటం వల్ల రోగి క్షిణించి మరణించే అవకశాం వుందన్నారు. ఇన్‌ప్లూ ఇంజమ్ 200 పొటెన్సీహోమియో మందులను వరుసగా రోజుకు ఒక డోస్ చొప్పున మూడు రోజులు తీసుకున్నట్లైతే ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చన్నారు. జన సమూహం ఎక్కువగా సినిమా హాలు, బస్టాండు, మార్కెట్, రైల్వేస్టేషన్ ప్రదేశాల్లో స్వైన్ ప్లూ వైరస్ ఒకరి నుండి ఒకరికి అతి త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ వ్యాధి లక్షణాలు వున్న వారు వైద్యుల పరివేక్షణలో చికిత్స పొందాలని, చికిత్స కాలంలో వ్యాధి గ్రస్తులు భహిరంగ ప్రదేశాలకు వెల్లరాదని, మాస్క్‌లు ధరించాలని స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన కుటుంబ సభ్యులు తప్పక మాస్క్‌లు ధరించాలని వారు సూచించారు. పరిసరాలు శుభ్రంగా వుంచుకోవాలని తగిన విశ్రాంతి, నిద్ర, ఆహారం పోందాలని వారు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పదవికి చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా
ఆదోని, ఏప్రిల్ 26: ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో మరోమారు విభేదాలు, ఆదిపత్య పోరు బయటకు వెల్లడికావడం జరిగింది. జిల్లా మంత్రి టి.జి.వెంకటేష్ వైఖరికి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ చర్యలకు మనస్తాపం చెంది తాను రాజీనామా చేస్తున్నట్లు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాల భగభగలు మరింత పెరిగాయి. మంత్రి టి.జి.వెంకటేష్ పార్టీని దృష్టిలో పెట్టుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి, పార్టీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించకపోగా అతనికి అనుకూలంగా ఉన్న విట్టా రమేష్‌ను ప్రోత్సహించడం వలన కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి శాఖలో ఉన్న వివిధ నిర్మాణ పనులను విట్టా రమేష్‌కే మంత్రి కట్టబెట్టాడని ఆయన స్పష్టం చేశారు. విట్టా రమేష్ లాడ్జిలో కూర్చుని పనులను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులకు ఇస్తున్నారని ఆయన చెప్పారు. కనీసం పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న తన దృష్టికి కూడా పనులు కట్టబెట్టే అంశాన్ని తీసుకురాకుండా ఇష్టం వచ్చినట్లు పనులు ఇవ్వడం వలన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు కూడా అసంతృప్తి ఉందన్నారు. కార్యకర్తలకు ఇవ్వకపోగా తెలుగుదేశం పార్టీకి అండదండలు అందించే వారికే పనులు ఇవ్వడంపై చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసే విధంగా విట్టా రమేష్ విధానాలు లేవని ఆయన స్పష్టం చేశారు. విట్టా రమేష్ బిజెపి, విశ్వహిందూ పరిషత్ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అందువల్ల పట్టణంలోని ఒక వర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఒకవేళ ఎన్నికల్లో నిలబడిన ఆ వర్గం విట్టా రమేష్‌ను వ్యతిరేకించడం ఖాయమని చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తులను మంత్రి వెంకటేష్ ప్రోత్సహించడం బాధాకరమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మంత్రి చేసిన విధానాల వలన ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. అందువల్ల తాను నాయకుడిగా ఉన్నా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. మార్కెట్ కమిటి అధ్యక్షులుగా ఎన్నికైన దేవిశెట్టి ప్రకాష్ చర్యలు కూడా బాధ కలిగిస్తున్నాయని చెప్పారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైతే తన అంతు చూస్తానని దేవిశెట్టిప్రకాష్ పేర్కొన్నారని ఇప్పుడు ఆయన మార్కెట్ యార్డు కమిటి అధ్యక్షుడయ్యాడు కాబట్టి తన అంతు ఆయన చూడాలని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా దేవిశెట్టి ప్రకాష్‌లో మార్పు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా మంత్రి చర్యలు, దేవిశెట్టి ప్రకాష్ విధానాలతో మనస్తాపానికి గురై తాను రాజీనామా చేయడానికి సిద్ధమయ్యానన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ తనతో చర్చించకుండానే ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులను బదిలీ చేయడం వలన తాను ఉన్నా ప్రయోజనం లేదని ఆయన అన్నారు. ఈ విధంగా తలో వైపు వెళ్తుంటే పార్టీ అభివృద్ధి ఎలా అవుతుందోనని చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎండలో నేతలకు చుక్కలు చూపుతున్న ఎన్నికలు
కర్నూలు, ఏప్రిల్ 26: రాజకీయ నేతలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. మండు వేసవిలో ఎర్రటి ఎండలో చక్కగా ఎసీ గదుల్లో సేద తీరాల్సిన సమయంలో వాటిని పక్కన పెట్టి ఉప ఎన్నికల ప్రచారం కోసం తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నికలు ఖాయమేనని తేలినా ఊహించని రీతిలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో చలువ గదుల్లో కాలం గడపాల్సిన నాయకులు మండే ఎండల్లో చెమటోడుస్తున్నారు. నాయకులు ఎండలకు తిరగలేరనేమో మరి ప్రభుత్వం కూడా ప్రజాపథం కార్యక్రమాన్ని ఉదయం 11గంటల్లో నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. తెల్లవారగానే జనంలోకి వెళ్లే నాయకులు ఎండ ముదరక ముందే ఇళ్లకు చేరి చలువ గదుల్లో సేదతీరే వారు. అయితే అనూహ్యంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ఉప పోరులో గెలవడానికి ప్రచారం చేయాల్సి రావడంతో ఎండలను లెక్క చేయకుండా జనాన్ని కలిసేందుకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలకు జూన్ 12న ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అంటే నాయకులు ఈ వేసవి మొత్తం ఇంకా సుమారు 50రోజులు ఎండలో తిరగక తప్పనిసరి పరిస్థితి దాపురించింది. ఎన్నికల్లో గెలిస్తేనే తలెత్తుకోగలిగేదన్న భావనతో నాయకులు పగలే చుక్కలు కనిపిస్తున్నామన్న ఆ విషయం బయటపడకుండా సంతోషంగా ప్రజలకు ముందుకు వెళ్తూ ఔరా.. ఏమి నాయకులు అని జనంతో అనిపించుకుంటున్నారు.

అందరి దృష్టి ఎమ్మిగనూరు పైనే
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 26: ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడడంతో ఎమ్మిగనూరు నియోజక వర్గంలో ఉప ఎన్నిక వేడి ప్రారంభమైంది. అందరి దృష్టి ఎమ్మిగనూరు పైనే పడింది. ఇందులో భాగంగానే ఈ నెల 30న రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎమ్మిగనూరు ఉప ఎన్నికల పర్యటన వస్తున్న నేపధ్యంలో బాబు పర్యటన ఏర్పాట్లలో మాజీ మంత్రి బి.వి.మోహన్‌రెడ్డి, నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు బిజీగా ఉన్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకై రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్, ఎంపి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డిలు నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి రుద్రగౌడును గెలిపించుకునేందుకు ఎంపి కోట్ల ఎమ్మిగనూరులోనే ఉండేందుకు శిల్ప కాలనీలో ఓ ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. ఎమ్మిగనూరు ఉప ఎన్నిక దేశం అభ్యర్థి బి.వి.మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఉల్లిందకొండ గ్రామం నుంచి ఎమ్మిగనూరుకు వచ్చి స్థానిక ఎంజి కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రుద్రగౌడు విషయానికొస్తే దివంగత మాజీ ఎమ్మెల్యే వీరభద్రగౌడు తనయుడు 20 సంవత్సరాలు మాజీ మంత్రి బి.వి. వెంట ఉన్నారు. ఇరువురి మధ్య విభేదాలు రావడంతో టిడిపికి రాజీనామా చేశారు. అనంతరం ఎంపి కోట్ల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న రుద్రగౌడు రెండుసార్లు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా పనిచేశారు. టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి బి.వి.మోహన్‌రెడ్డి స్వగ్రామం కర్నూలు జిల్లా ఉల్లిందకొండ గ్రామం. ఎన్టీఆర్ స్ఫూర్తితో 1983లో బి.వి.మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరుకు వచ్చి టిడిపి తరుఫున వరసగా 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు రాష్ట్ర మంత్రిగా కొనసాగారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న బి.వి. టిడిపి ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి చేతిలో తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. 7 సంవత్సరాలపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో వై.ఎస్ జగన్‌కు ఓటేయడంతో ఎమ్మిగనూరుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు మండలంలో గల కడిమెట్ల గ్రామ నివాసి. పియుసి వరకు చదువుకున్న చెన్నకేశవరెడ్డి 20 సంవత్సరాలు కడిమెట్ల గ్రామ సర్పంచ్‌గా, టిడిపి ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా, ఎమ్మిగనూరు ఎంపిపిగా కొనసాగారు. రైతుబిడ్డ అయిన చెన్నకేశవరెడ్డి ఉదయం లేస్తూనే తన పంట పొలాలకు వెళ్ళి రావడం జరుగుతుంది. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. మళ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఉప ఎన్నికల్లో తండ్రుల గెలుపుకోసం బి.వి.మోహన్‌రెడ్డి తనయుడు డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి గెలుపునకు తనయుడు జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రుద్రగౌడు గెలుపు కొరకు తనయుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు కుమార్‌గౌడులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి గెలుపుకోసం వై.ఎస్. జగన్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 4రోజుల ఎన్నిక పర్యటన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలో 64,979మంది ఓటర్లు ఉండడంతో కాంగ్రెస్, టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టణంలోనే ఎక్కువ శాతం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికలో ఎమ్మిగనూరుకు త్రీముఖ పోటీ ఏర్పడింది. గెలుపు కొరకు నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఉప ఎన్నిక రంగంలో ఉన్న ఓ అభ్యర్థి ఓటుకు రూ. వెయ్యి ఇస్తామని ఓటర్లకు హామీ ఇచ్చి ముందుకు పోతున్నారని సమాచారం. 100నుంచి 150మంది వరకు ప్రజలు పార్టీ మార్చి పార్టీలోకి వచ్చిన వారికి ఆ ఉప ఎన్నిక అభ్యర్థి 20నుంచి 25వేల వరకు కాసులు ఇస్తున్నట్లు సమాచారం. మరో రెండు వారాల తరువాత ఓటర్లకు క్వాటర్ బాటిల్, బిర్యాని, ఖర్చులకు డబ్బులిచ్చే కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టిడిపి కార్యాలయాల వద్ద డబ్బుల కొరకు ప్రతి రోజు సాయంత్రం నుంచి ప్రజలు కాపుకాస్తూ కూర్చుంటున్నట్లు సమాచారం.

నగదు బదిలీ రద్దు చేయాలి
కల్లూరు, ఏప్రిల్ 26: ఆహార సబ్సిడిలో నగదు బదిలిని రద్దు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి నిర్మల ప్రభుత్వాని డిమాండ్ చేసింది. గురువారం ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆహరసబ్సిడిలో నగదు బదిలీని రద్దు చేయాలని ప్రభుత్వ గోదామ్ ముట్టడిని చేపట్టారు. స్థానిక మహిళ పోలీసులకు ఐద్వా మహిళలకు తోపులాట జరిగి మహిళ నాయకులను అరెస్టు చేసి సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు నిర్మల మాట్లాడుతూ దేశం ఎదుర్కొటుంన్న ప్రధాన సమస్యల్లో ఆహారభద్రత ప్రధాన మైనదని అన్నారు. కృత్రిమ కొరతను సృష్టిస్తు ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తు కోట్ల రూపాయలు దండుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పేదల ఆకలి పట్టదా అని ఆమె ప్రశ్నించారు. కేంద్రంకు వచ్చిన ఆహార బిల్లుతో దేశాన్ని మరింత పేదరికంగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామాల్లో రూ. 26 పట్టణాల్లో రూ. 32 తలసరి ఆదాయం వున్నవారు దారిద్యరేఖకు ఎగువగా వున్న వారిగా పేర్కొనడమంటే పేదలపై ప్రభుత్వాలకు ఎంతటి చిత్తశుద్ధి వుందో అర్థమవుతుందన్నారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీంతో 42 శాతం పిల్లలు పౌష్టిక ఆహారంతో వున్న కూడా కేంద్రం పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఐద్వా నాయకురాలు అలివేలు మాట్లాడుతూ ఆహార విషయంలోప్రభుత్వం పేదలకు ఇచ్చే సబ్సిడీ కేవలం 88 కోట్లని పారిశ్రామిక వేత్తలకు అయితే రూ.5లక్షల కోట్లు ఇవ్వడానికి ముందుకు రావడం దారుణం అన్నారు. ప్రజాపంపిణీని అస్తవ్యస్తం చేసి పేదలకు అందే సరకులను సక్రమంగా పంపిణీ చేయకుండా పేదల జీవితాలతో చెలగాటం అడుతున్న ప్రభుత్వాలకు పేదలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు ధనలక్ష్మి, కిరణ్మయి, రషీద, లత, పద్మ, దానమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

దానాల్లోకెల్లా అన్నదానం మహా గొప్పది
జూపాడుబంగ్లా, ఏప్రిల్ 26: దానా ల్లోకెల్లా అన్నదానం మహా గొప్పదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మండ్లెం గ్రామంలో దస్తగిరి దర్గ స్వామి గంధం కార్యక్రమంలో మంత్రి ఏరాసు, పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి, నందికొట్కూర్ శాసన సభ్యులు లబ్బి వెంకటస్వామిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దస్తగిరి స్వామి దర్గ దగ్గర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నిత్యఅన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని, రాంభూపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం ఎంతో మహోన్నతమైన కార్యక్రమమని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ
జూపాడుబంగ్లా, ఏప్రిల్ 26: మండలంలోని తంగెడంచ గ్రామంలో గురువారం సీతారాములు, లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ఠ, సుంకులమ్మ, బొడ్డురాయి విగ్రహాల ప్రతిష్ఠతో పాటు రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను గ్రామ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

ఎన్నికల కోసం...ఎస్సీ నిధులు దుర్వినియోగం
కర్నూలు, ఏప్రిల్ 26: రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం ఎస్సీ నిధులను దుర్వినియోగం చేస్తోందని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ ఆరోపించారు. ఆమె కర్నూలులోని టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తమ పార్టీతో పాటు ఎస్సీ, ఎస్టీలు ఆందోళన నిర్వహించడంతో ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం వేసి ఎస్సీ, ఎస్టీ నిధులను సద్వినియోగం చేసేందుకు చట్టం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం రూ.1500కోట్లు కేటాయించాల్సి ఉందని ఆమె అన్నారు. ఆ నిధుల్లో ప్రస్తుతం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకు రూ.180కోట్ల మేర ఆయా నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించారని మండిపడ్డారు. నియోజకవర్గాల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని ఇంత కాలం ఆయా నియోజకవర్గాల మీద లేని ప్రేమ ఇపుడు పుట్టుకురావడం, అందుకోసం ఎస్సీ, ఎస్టీ నిధులను వినియోగిందనే తాము తప్పు పడుతున్నామని ఆమె అన్నారు. ప్రభుత్వం కేవలం రాజకీయంగా మాత్రమే అభివృద్ధి కోసం పని చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తొమ్మిది సంవత్సరాలు పని చేసి ఖజానాను నింపితే దాన్ని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు ఖాళీ చేశారని తీవ్ర స్వరంతో అన్నారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఖజానా నింపే ప్రయత్నంలో ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారే కాని ప్రభుత్వ పరంగా సక్రమైన మార్గంలో ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ప్రధానంగా ఎస్సీ నిధుల సద్వినియోగానికి చట్టబద్ధత కల్పిస్తామని మంత్రివర్గ ఉప సంఘం వేసి కూడా ఆ నిధులను పక్కదారి పట్టించడం ఆయన అనుభవరాహిత్యాన్ని బయటపెడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
శిరివెళ్ళ, ఏప్రిల్ 26: మండలంలోని ఒనికెన్‌దినె్నలో శ్రీ రామచంద్ర స్వామి ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమన్ ప్రతిష్ఠ సందర్భంగా గణపతి, నవగ్రహాలు, ధ్వజ, నాగేంద్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుప్రభాతం, గో పూజ, యంత్రములు, సంస్కారములు, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, బలిహరణము తదితర పూజలు చేశారు. భక్తులు మంగళహారతి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొలను భారతి పంచాంగ కర్త శశిభూషణం యజ్ఞ నారాయణ శర్మచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజల్లో పాల్గొన్నారు.

ప్రహ్లాదరాయలకు స్వర్ణ రథోత్సవం
మంత్రాలయం, ఏప్రిల్ 26: రాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం రాఘవరాయుడికి విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రహ్లాదరాయలవారికి ప్రత్యేక పూజలు చేసి స్వర్ణ రథోత్సవంపై ప్రహ్లాదరాయలను ఆభరణాలు, పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. ఉదయం నుంచి రాఘవరాయుడి బృందావనానికి విశేష పూజల్లో భాగంగా నిర్మల్య విసర్జన, సుప్రభాత సేవా, అభిషేకం, హస్తోదకం, తులసి అర్చన, మహామంగళహారతి వంటి పూజలతోపాటు అలంకరణలో భాగంగా పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ప్రహ్లాదరాయలకు మఠం దివాన్ బండాచార్యుల ఆధ్వర్యంలో ఉంజల సేవ నిర్వహించారు. గురువారం రాఘవేంద్రస్వామి వారం కావడంతో పెద్దఎత్తున భక్తులు మంత్రాలయం తరలివచ్చి రాఘవరాయుడి బృందావనాన్ని, గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు.

జింక పిల్లను అడవిలో వదిలిన అటవీ అధికారి
రుద్రవరం, ఏప్రిల్ 26: రుద్రవరం అటవీ రేంజి పరిధిలోని మేడం బావి ప్రాంతంలో గురువారం ఫారెస్ట సెక్షన్ అధికారి శ్రీనివాసులు జింక పిల్లను అడవిలోకి వదిలారు. ఫారెస్టు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని యర్రగుడుదినె్న గ్రామ సమీప పంట పొలాల్లో జింకల మందతోపాటు వచ్చిన ఒక జింక పిల్ల తప్పిపోవడంతో రైతులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు. కాగా రుద్రవరం పోలీస్ స్టేషన్‌లో జింక పిల్లను అప్పగించడం జరిగిందని ఎస్‌ఐ శ్రీకాంతరెడ్డి సమాచారం మేరకు స్టేషన్‌కు వెళ్ళడంతో ఎస్‌ఐ తమకు జింకపిల్లను అప్పగించడం జరిగిందన్నారు. జింక పిల్లను అటవీ ప్రాంతంలో వదిలి వేసినట్లు ఆయన తెలిపారు.

ఉప ఎన్నికల నియమావళి నుంచి జిల్లాలోని ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు మినహా మిగతా నియోజకవర్గాలకు మినహాయింపు ఇస్తూ ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీచేసింది
english title: 
code for two constituencies

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>