Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

17.50 నిమషాల్లో నిర్ణీత కక్ష్యలోకి రీశాట్-1

$
0
0

సూళ్లూరుపేట, ఏప్రిల్ 26: భాతర అంతరిక్ష ప్రయోగాల్లో వినీలాకాశంలో త్రివర్ణ పతాకం మరో మారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో పిఎస్‌ఎల్‌వి-సి 19 మరోసారి విజయ బావుటా ఎగరవేయడంతో మనదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేసింది. 1850 కిలోల బరువుగల రిశాట్-1 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టడంతో శాస్తవ్రేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పిఎస్‌ఎల్‌వి-సి 19 ప్రయోగం కోసం శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్‌థావన్ స్పేస్ సెంటర్ షార్‌లో సోమవారం ఉదయం 6.47 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 71గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. గురువారం ఉదయం 5.47 గంటలకు శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి దట్టంగా ఉన్న జామాయిల్ చెట్ల నడుమ నుంచి నారింజ రంగులతో నిప్పులు చిమ్ముతూ పిఎస్‌ఎల్‌వి-సి 19 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగిరిన అనంతరం అందరిలో ఉత్కంఠ నెలకొన్న పిఎస్‌ఎల్‌వి వరుసగా 20వ విజయాన్ని నమోదు చేస్తూ మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ రీశాట్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్తవ్రేత్తలతోపాటు యావత్ భారతదేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
నాలుగు దశల్లో దిగ్విజయంగా కక్ష్యలోకి రీశాట్-1
44.5 మీటర్ల ఎత్తు 321 టన్నుల బరువుగల పిఎస్‌ఎల్‌వి ప్రయాణమంతా నిర్దేశిత మార్గంలోనే కొనసాగింది. రాకెట్‌లోని నాలుగు దశలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. నేల నుంచి నింగికి ఎగిరిన రాకెట్ 17.50 నిమషాల్లోనే గమ్యానికి చేరింది. మొదటి ఘన ఇంధన స్ట్రాపాన్ మోటార్ల బూస్టర్లతో 138 టన్నుల ఘన ఇంధన సాయంతో 111సెకన్లలో సెకనుకు 1.89 వేగంతో 70కి.మీ ఎత్తుకు చేరింది. రెండవ దశ 41 టన్నుల ధ్రవ ఇంధన సాయంతో సెకనుకు 4 కి.మీ వేగంతో 263 సెకన్లలో 226 కి.మీ ఎత్తుకు పయనించింది. మూడవ దశ 7.6 టన్నుల ఘన ఇంధన సాయంతో 385 సెకన్లకు 338 కి.మీ ఎత్తుకు సెకనుకు 67 కి.మీ వేగంతో వెళ్లింది. నాల్గవ దశ 2.5 ద్రవ ఇంధన సాయంతో 524 సెకన్లలో సెకనుకు 77 కి.మీ వేగంతో 480 కి.మీకు చేరింది. మొత్తం 1060 సెకన్లకు రాకెట్ తమ గమ్యాన్ని చేరి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, శాస్తవ్రేత్తల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. తొలిసారిగా పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా తొలి భారత రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌ను పంపి విజయం సాధించారు. ఇంత అధిక బరువుగల ఉపగ్రహాన్ని ఇస్రో ఇంతవరకు పంపలేదు.
వాతావరణంపై నిరంతర అధ్యయనం
ఈ ఉపగ్రహం వాతావరణంలో కలిగే మార్పులు, వ్యవసాయంలో ఖరీఫ్ సీజన్‌లో సంభవించే వినూత్న మార్పులను నిరంతరం అధ్యయనం చేసి ముందుగానే పసిగట్టి ఛాయా చిత్రాలను తీసి పంపుతుంది. ఈ తరహా ఉపగ్రహాన్ని ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. విపత్తులు సంభవించినప్పుడు, మేఘాలు దట్టంగా కమ్మేసిన ప్రతికూల పరిస్థితిలో పగలు రేయి తేడా లేకుండా ఏడాది పొడవునా ఛాయా చిత్రాలను తీసేందుకు ఉపయోపడుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశ ఇస్రో సెంటర్లలో పది సంవత్సరాలు శాస్తవ్రేత్తలు తయారుచేసిన ఉపగ్రహం ఇది. దీనిని పిపిఎస్‌ఎల్‌వి ప్రయోగం ద్వారా ప్రయోగించి నిర్దేశిత కక్ష్యలోకి పంపి ఇస్రో శాస్తవ్రేత్తలు దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో సత్తాను చాటారు. ఈ ఉపగ్రహంలో మూడు కొత్తదనాలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఉన్న సోలార్ ఫ్యాన్‌ల సహాయంతో సెకనుకు 7కి.మీ తిరిగి ఫొటోలు తీస్తుంది. రెండవది ఇందులో ఉన్న రేడియో తరంగాలు వల్ల దట్టంగా మేఘాలు కమ్ముకొని ఉన్నా రేడియో తరంగాల ద్వారా ఛాయా చిత్రాలు తీస్తోంది. మూడవది ఇంత బరువుగల ఉపగ్రహాన్ని ఇప్పటి వరకు ఇస్రో పంపలేదు. ఉపగ్రహం కక్ష్యలోకి పోగానే ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ మిషన్ కంట్రోలర్ సెంటర్ నుంచి ప్రయోగం విజయవంతమని ప్రకటించి ఇస్రోలోని శాస్తవ్రేత్తలందరినీ అభినందించారు. 480 కి.మీ కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని మూడు రోజుల్లో 536కి.మీ అర్బిట్‌లోకి చేర్చనున్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చు 488కోట్ల రూపాయలు కాగా, ఇందులో ఉపగ్రహ ఖర్చు 378 కోట్లు, పిఎస్‌ఎల్‌వి వెహికల్‌కు 110కోట్ల రూపాయలు అన్నారు.

ఇది శాస్తవ్రేత్తల సమష్టి విజయం
* ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ స్పష్టం
సూళ్లూరుపేట, ఏప్రిల్ 26: పిఎస్‌ఎల్‌వి-సి 19 ప్రయోగం విజయం ఇస్రో శాస్తవ్రేత్తల సమష్టి విజయమని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. ప్రయోగం విజయం అనంతరం ఆయన మీడియా సెంటరులో శాస్తవ్రేత్తలతో కలసి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇస్రోలో పనిచేసే శాస్తవ్రేత్తల నుంచి అధికారుల వరకు పది సంవత్సరాలు కష్టపడి పూర్తి స్వదేశీయంతో తయారుచేసిన ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వెనుక అందరి శ్రమ ఉందన్నారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్తవ్రేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ముఖ్యంగా మిషన్ డైరెక్టర్ కున్హికృష్ణన్, శాటిలైట్ డైరెక్టర్ మలర్‌మతి, విఎస్‌ఎస్‌సి డైరెక్టర్ వీరరాఘవన్‌లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇస్రో శాస్తవ్రేత్తలు ఇలాగే ప్రయోగాలు దిగ్విజయంగా చేస్తామన్నారు. పిఎస్‌ఎల్‌వి విజయంతో మా కల నిజమైందని స్పేస్ కమిషన్ సభ్యులు యుఆర్ రావు పేర్కొన్నారు. ఇస్రో మా అందరి కుటుంబమని, అందరి సమష్టి కృషితోనే విజయంతమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ చంద్రదత్తన్, డాక్టర్ టికె అలక్స్, ఎస్ రామకృష్ణ, ఎఎస్ కిరణ్‌కుమార్, వికె దడ్వాల్, షార్ అసోసియేట్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలుచేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
నెల్లూరు, ఏప్రిల్ 26: నెల్లూరు పార్లమెంటు, ఉదయగిరి నియోజకవర్గాలలో ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలుచేయాలని, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ పథకాలను కొనసాగించరాదని అధికారులను జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ ఆదేశించారు. గురువారం స్థానిక గోల్డెన్ జూబ్లి హాలులో ఉప ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికారులు, రెవిన్యూ, పోలీసు శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పలు సూచనలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రౌండింగ్ కాని పథకాలను వెంటనే ఆపివేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రలు జరపరాదన్నారు. కొత్తగా పెన్షన్‌లు, బ్యాంకు లింకేజ్, పావలా వడ్డీ రుణాలు వంటి పథకాలు అమలు చేయరాదన్నారు. బోగస్ కార్డుల ఏరివేత వంటివి కూడా కొనసాగించే వీలులేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు జిల్లాలోని ప్రభుత్వ అతిథి గృహాలు జిల్లా రెవిన్యూ అధికారి పర్యవేక్షణలో ఉంటాయన్నారు. ప్రభుత్వానికి సుంకం చెల్లించే ప్రకటనల బోర్డులు తప్ప, మిగతా హోర్డింగ్‌లు తొలగించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యానర్లు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికార్లను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు వివిధ దినపత్రికలకు వ్యాపార ప్రకటనల రూపేణా ఇచ్చే నోటిఫికేషన్లను కూడా వెంటనే నిలిపివేయాలన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసేందుకు వీలు లేదన్నారు. ప్రత్యేక కారణాల దృష్ట్యా బదిలీ చేయాల్సి వస్తే ఎన్నికల అధికారుల వద్ద అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేయాల్సిన సాధారణ విధులు యథాతథంగా కొనసాగించాలన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాల్సి ఉందని, యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి విద్యుత్ సరఫరా అందించాలని, తాగునీరు, రైతులకు, వ్యవసాయ పనులకు విద్యుత్ సరఫరా ఇబ్బందుల్లేకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్‌ఇకి సూచించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న మద్యం బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని కలెక్టర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికార్లకు సూచించారు.
18న ఎన్నికల నోటిపికేషన్
కాగా, రెవిన్యూ, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికార్లతో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, నామినేషన్ల స్వీకరణ మే 25వ తేదీతో పూర్తవుతుందని, 26న స్క్రూటినీ, 28న నామినేషన్ల ఉప సంహరణకు గడువు, జూన్ 12న పోలింగ్, జూన్ 15న కౌంటింగ్ ఉంటాయన్నారు. ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ పరిధిలో నిర్వహించాల్సిన తనిఖీలు సజావుగా జరగడం లేదనే సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలంటూ అధికార్లకు సూచించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సౌరబ్‌గౌర్, జిల్లా రెవిన్యూ అధికారి బి రామిరెడ్డి, కావలి ఆర్డీఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పట్టాలు తప్పిన గూడ్సు రైలు
ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు
రేణిగుంట మీదుగా చెన్నైకు మళ్లింపు
పలు రైళ్లు రద్దు
ఇబ్బందులు పడిన ప్రయాణికులు
గూడూరు, ఏప్రిల్ 26: చెన్నై సమీపంలోని అత్తిపట్టు వద్ద గురువారం వేకువఝామున ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పి రెండు రైల్వే ట్రాక్‌ల మీద పడిపోవడంతో గూడూరు మీదుగా చెన్నై వెళ్లే పలు రైళ్లు గురువారం మధ్యాహ్నం వరకు ఆలస్యంగా నడవగా, మరికొన్ని రైళ్లను రేణిగుంట మీదుగా చెన్నైకి దారి మళ్లించి నడిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చెన్నై-విజయవాడ జనశతాబ్ది రైలుతో పాటు చెన్నై-నెల్లూరు, చెన్నై- సూళ్లూరుపేట యూనిట్ రైళ్లను గురువారం రద్దుచేసినట్లు గూడూరు రైల్వేస్టేషన్ మేనేజర్ ఆర్‌జిఎస్ కుమార్ తెలిపారు. రైళ్లు రద్దు, ఆలస్యం, దారి మళ్లింపు కారణంగా చెన్నైకి వెళ్లాల్సిన పలువురు ప్రయాణికులతో గూడూరు రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. ఉదయం గూడూరు మీదుగా చెన్నైకి వెళ్లే మెయిల్, బొకారో ఎక్స్‌ప్రెస్ రైళ్లు సూళ్లూరుపేట వరకు వెళ్లి చెన్నైలో లైన్ సరిగాలేని కారణంగా వాటిని తిరిగి గూడూరుకు రప్పించి రేణిగుంట మీదుగా చెన్నైకి దారి మళ్లించి పంపారు. అదేవిధంగా హైదరాబాద్, సర్కార్, ఛార్మినార్, జిటి, గుంటూరు ప్యాసింజర్ రైళ్లను కూడా రేణిగుంట మీదుగా పంపినట్లు, సూళ్లూరుపేట, నాయుడుపేట వెళ్లే ప్రయాణికులకు వారి టికెట్ చార్జీలు తిరిగి ఇచ్చినట్లు స్టేషన్ మేనేజర్ తెలిపారు. దాదాపు ఈ మార్గంలో చెన్నైకి వెళ్లే ప్రతి రైలు రెండున్నర గంటల పాటు ఆలస్యంగా నడిచింది. సమాచారం తెలియని ప్రయాణికులు రైళ్ల కోసం స్టేషన్‌లో పడిగాపులు కాయాల్సివచ్చింది. ఎట్టకేలకు పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం చెన్నైలో ట్రాక్ పనులు పూర్తికావడంతో సూళ్లూరుపేట మీదుగా చెన్నైకి పంపినట్లు మేనేజర్ తెలిపారు.

నాటు తుపాకీ స్వాధీనం
ఒకరు అరెస్టు
వెంకటగిరి, ఏప్రిల్ 26: మండలంలోని పాళెంకోట అటవీప్రాంతంలో జంతువులను వేటాడుతుండగా అడ్డుకున్న అటవీశాఖ సిబ్బందిని నాటు తుపాకీతో చంపుతానని బెదిరించిన పాళెంకోటకు చెందిన కె శంకరయ్యను గురువారం అరెస్టు చేసినట్లు స్థానిక సిఐ అబ్ధుల్ కరీమ్ తెలిపారు. ఈ సందర్భంగా అతని వద్దనున్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. గురువారం స్థానిక పోలీస్ సేష్టన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణపై నిఘాలో ఉన్న పాళెంకోట బీట్ ఆఫీసర్ పెంచలయ్య, రహమతుల్లాలు బుధవారం రాత్రి సిద్దవరం చెరువు ప్రాంతంలో చెట్ల మధ్యలో దాగివున్న శంకరయ్యను పట్టుకునేందుకు ప్రయత్నించగా, పారిపోతూ తన వద్దకు వస్తే తుపాకీతో కాలి చంపుతానని బెదిరించడంతో వదిలివేశారు. అయితే గురువారం ఉదయం పాళెంకోటకు వెళ్ళి తుపాకీ ఎవరికి ఉందని ఆరా తీశారు. దీంతో శంకరయ్య అనే వ్యక్తికి ఉందని తెలియడంతో అటవీశాఖ సిబ్బంది శంకరయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ అన్వర్‌బాషా, అటవీశాఖ సిబ్బంది పాళెంకోటకు వెళ్ళి శంకరయ్యను అదుపులోకి తీసుకొని, అడవిలో దాచి వుంచిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్యను గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు.

వైఎస్‌ఆర్ లేని లోటు జగన్ తీరుస్తాడు
మాజీ ఎంపి మేకపాటి స్పష్టం
నెల్లూరు, ఏప్రిల్ 26: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేని లోటును ఆయన తనయుడు జగన్ తీర్చగలుగుతాడనే విశ్వాసం తనకుందని మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక మేకపాటి అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్తం ప్రతాప్‌కుమార్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆయన విమర్శించారు. వైఎస్‌ఆర్ హయాంలో ప్రజల చెంతకు పాలన అనే విధంగా పాలన జరిగిందన్నారు. ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో నిలబడే పరిస్థితులు లేవన్నారు. అధికార పార్టీ నేతల తీరు మారిందని, సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలనలో పడ్డారని చెప్పారు. వైఎస్‌ఆర్ కొరతను జగన్ తీరుస్తాడని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తే ప్రజలు సహించరన్నారు. తాను రాజీనామా చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రానున్న ఉప ఎన్నికల్లో నెల్లూరు చరిత్రను తిరగరాయాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్‌లో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో తమ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన ఆశాభావం వక్తం చేశారు. ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ రెక్కల కష్టంతో అందలమెక్కిన కొందరు నేతలు ప్రస్తుతం ఆ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆనం సోదరులపై పరోక్షంగా విమర్శలు చేశారు. అన్ని పార్టీల్లో ప్రస్తుతం వలసలు మొదలయ్యాయని, కాంగ్రెస్ పార్టీకి బయటి ప్రాంతాల నుండి నాయకుల్ని వలస తెచ్చుకునే దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. తొలుత బాలాజీనగర్ నుండి మేకపాటి నివాసం వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, అనిత, బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరీయుల అభిమానం మరువలేను
సినీ సంగీత దర్శకుడు చక్రి స్పష్టం
నెల్లూరు, ఏప్రిల్ 26: నెల్లూరీయుల అభిమానం మరువలేనిదని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి అన్నారు. రెయిన్‌బో ఈవెంట్స్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఓ హోటల్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన ఆయన మాట్లాడుతూ తనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి స్నేహ మాధుర్యాన్ని తెలియజేశారని పేర్కొన్నారు. అభిమానుల ఆనందం కోసం రానున్న సినిమాల్లో మంచి సంగీతాన్ని అందిస్తానన్నారు. తొలుత చక్రిని పలువురు అభిమానులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్థసారధి, సత్యంజీ, ప్రసాద్‌రెడ్డి, అమరావతి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ సివిల్ జడ్జీల బదిలీలు
నెల్లూరు , ఏప్రిల్ 26: జిల్లావ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న జూనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎల్ తేజోవతిని స్పెషల్ మొబైల్ మెజిస్ట్రేట్‌గా మచిలీపట్నం, ఈమె స్థానంలో నెల్లూరు రెండవ అదనపు మెజిస్ట్రేట్ మాధవీకృష్ణను బదిలీ చేసారు. అలాగే నెల్లూరు రెండవ అదనపు మెజిస్ట్రేట్‌గా అనంతపురంలో జూనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూషకుమారిని బదిలీ చేసారు. నెల్లూరు 4వ అదనపు మెజిస్ట్రేట్ ఎస్ తంగమణిని అనంతపురం జిల్లా కదిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేసారు. ఈ స్థానంలో తిరుపతి 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా వున్న ప్రవీణ్‌కుమార్‌ను బదిలీ చేసారు. నెల్లూరు మొబైల్ మెజిస్ట్రేట్ ఎం ప్రమీలరాణిని జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేసారు. ఈ స్థానంలో కాకినాడ అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి వెంకటరాజేష్‌ను బదిలీ చేసారు. నెల్లూరు రైల్వే మెజిస్ట్రేట్ ఎ గీతావాణిని ప్రకాశం జిల్లా కనిగిరి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేసారు. కోవూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం వెంకటరమణను ముమ్మడివరం జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేసారు. ఈమె స్థానంలో కోవూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం శోభను బదిలీ చేసారు. సూళ్ళూరుపేట జూనియర్ సివిల్ జడ్జి జి గీతను అనంతపురం జిల్లా హిందూపురం జూనియర్ సివిల్ జడ్జిగా, ఈమె స్థానంలో అనంతపురం జిల్లా రాయదుర్గ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ శశిధర్‌రెడ్డిని బదిలీ చేసారు.

అకాల వర్షం ... రైతుకు తీవ్రనష్టం
అనంతసాగరం, ఏప్రిల్ 26: ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం వల్ల రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. బుధవారం రాత్రి అనంతసాగరం మండలంలో కురిసిన అకాల వర్షం వల్ల అన్నదాత తీవ్రంగా నష్టపోయాడు. రబీ సీజన్ ముగిసే సమయంలో ఈ వర్షం రైతుకు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. మండలంలోని రేవూరు, కొత్తపల్లి, చిలకలమర్రి, గౌరవరం, కమ్మవారిపల్లి, సోమశిల, ఖమ్మంపాడు, ఉప్పలపాడు గ్రామాలలో కోత దశలో ఉన్న పైరు ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల రైతుకు తీవ్రనష్టం వాటిల్లింది. అసలే గిట్టుబాటు ధర లేని రైతులు ఒక వైపు దళారులు దగా చేస్తున్న సమయంలో ఈ వర్షం గోరుచుట్టుపై రోకటి పోటులా తయారైంది. మండలంలో అత్యధికంగా దిగుబడి వచ్చే ఈగ్రామాలలో అకాల వర్షం రైతు వెన్నువిరిచింది. ప్రభుత్వం తమకు సాయం అందించాలని రైతులు ఎదురు చూస్తున్నారు.

జిల్లాలో మరో 10 మంది తహశీల్దార్‌ల బదిలీలు
నెల్లూరుటౌన్, ఏప్రిల్ 26: రానున్న ఉపఎన్నికల నేపధ్యంలో నెల్లూరు జిల్లా పరిధిలో మరో 10 మంది తహశీల్దార్‌లకు స్థానచలనం కలిగింది. గురువారం అధికారికంగా వెల్లడైన జాబితా ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటి వరకు వింజమూరు మండల తహశీల్దార్‌గా పనిచేస్తున్న కెవి రమణయ్యను చిట్టమూరు మండలానికి, కలెక్టరేట్‌లో పనిచేస్తున్న బాలకృష్ణను సూళ్ళూరుపేటకు, సంగం మండల తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఎం సుధాకర్‌ను కలెక్టరేట్‌కు, అదే విధంగా ఉదయగిరి మండలం తహశీల్దార్‌గా పనిచేస్తున్న సిహెచ్ వెంకటనారాయణమ్మను మనుబోలుకు, ఆత్మకూరు మండల తహశీల్దార్‌ను బికె వెంకటేశ్వర్లును పొదలకూరుకు, కలిగిరి మండల తహశీల్దార్‌గా పనిచేస్తున్న రత్నశేఖర్‌ను కావలి డిఆర్‌ఓగా, అలాగే నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న యానాదయ్యను చిన్నమొత్తాల పొదుపు సంస్థ ప్రత్యేక తహశీల్దార్‌గా, అల్లూరు మండల తహశీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులును గూడూరుకు బదిలీ చేసారు. అదే విధంగా ఇప్పటి వరకు సెలవుపై వెళ్ళిన మైత్రేయను డిఆర్‌డిఎకు, వెంకటేశ్వర్లును కలువాయి తహశీల్దార్‌గా నియమితులయ్యారు. కాగా ఉపఎన్నికలు జరిగే మండలాల తహశీల్దార్‌లను విధిగా ఇతర మండలాలకు, ఇతర శాఖలకు బదలాయించటమే లక్ష్యంగా ఈకార్యక్రమాన్ని నిర్వహించారు.

జగన్‌పార్టీలో నీతి లేదు
సిపిఎంతో విభేదాలు తాత్కాలికమే
ఉప ఎన్నికల్లో తెలుగుదేశానికే మద్దతు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడి
నెల్లూరు టౌన్, ఏప్రిల్ 26: కడప ఎంపి జగన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వైఎస్ కాంగ్రెస్‌పార్టీకి కనీస నీతి నియమాలు కూడా లేవని, సిపిఎంతో తమకున్న విభేదాలు తాత్కాలికమేనని, ఉప ఎన్నికల్లో తెలుగుదేశానికే తమ మద్దతు ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గురువారం నెల్లూరు నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దొంగల బండిలా కొనసాగుతున్నాయే తప్ప ప్రజోపయోగ దిశగా ఒక్క నిర్ణయం ఉండటం లేదన్నారు. కాంగ్రెస్‌పార్టీలో రాజకీయ ముటాకోర్లు, అవినీతిపర్కులు, అక్రమార్కులు, అవకాశవాదులు అంతా అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ పార్టీలో కనీస నైతిక విలువలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ తానులో పెరిగిన ముక్కే జగన్ పార్టీ అంటూ ఎద్దేవ చేశారు. ఇప్పుడు వచ్చి పడ్డ ఉప ఎన్నికల వల్ల రెండునెలల పాటు ప్రజాకార్యక్రమాలు స్థంభించిపోతాయంటూ నారాయణ ఆవేదన వ్యక్తపరిచారు. ప్రజాధనం భారీగా వృధా అవుతుందన్నారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికే ఐదు కోట్ల రూపాయల వరకు ఎన్నికల కోసం ఖర్చవుతుందన్నారు. మండుటెండలతో దాహం అంటూ రాష్టవ్య్రాప్తంగా జనం అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ఆ విషయాలు పట్టించుకోకుండా ఉప ఎన్నికలకు నిధులు మాత్రమే విడుదల చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆటంకాలు ఏర్పడుతుండటం బాధాకరమన్నారు. జనం, పశుసంపద దాహార్తితో అలమటిస్తుంటే రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికల కోలాహలంలో మునిగిపోతున్నారని దుయ్యబట్టారు. ఇదిలాఉంటే రైతులకు గిట్టుబాట ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. అలాగే గోదాము సౌకర్యాల్ని వృద్ధి చేయడంలోనూ ప్రభుత్వం శ్రద్ధ చూపాలన్నారు. గుంటూరులో రైతుల పక్షాన నిలబడి సిపిఐ చేసిన పోరాటాల వలనే అక్కడ గోదాముల నిర్మాణాలు విస్తృతంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు రైతుల తరపున ఆందోళన చేస్తున్న నాయకుల్ని జైళ్లలో తోస్తుండటం సిగ్గుచేటన్నారు. అవినీతిపరుల్ని నివారించడానికే రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. తమ పార్టీ ఓట్లు చీలకుండా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశానికి మద్దతివ్వడం వల్ల అవినీతిపార్టీలకు చరమగీతం పాడాలనే సదుద్దేశంతోనే ఉప పోరులో పోటీ విరమణ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అవినీతి, అక్రమాలు, అధికారదాహంతో నీచ రాజకీయాలు నెరుపుతున్న కాంగ్రెస్, వైఎస్ కాంగ్రెస్‌పార్టీల ఓటమే తమ కర్తవ్యమని వెల్లడించారు. కాగా, కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఎనిమిది మంది ఎంపిల్ని సస్పెండ్ చేసి సమైఖ్యభావనకు మద్దతిచ్చినట్లుగా వ్యవహరించిదని దుయ్యబట్టారు. అయితే పరకాలలో మరలా తెలంగాణావాదం బలపరుస్తూ రెండు నాల్కల ధోరణితో లబ్ధిపొందాలని భావిస్తోందని విమర్శ చేశారు. కాంగ్రెస్ అధికారమనే బలంతో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికార దాహంతో అర్ధబలం, అంగబలంతో ఈ ఎన్నికల్లో దిగుతుండటం అప్రజాస్వామికమన్నారు. ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మారుస్తున్నాయని దుయ్యబట్టారు. సిపిఎంతో తాత్కాలిక విభేదాలే తప్ప ఉద్యమాల్లో మాత్రం తోడుగానే వ్యవహరిస్తామన్నారు. రానురాను రాజకీయాల్లో ప్రమాదకరమైన భావాలు, సిద్ధాంతాలు, వ్యక్తులు ప్రవేశించడంతో ప్రజలకు రక్షణ, స్వేచ్ఛ లేకుండా పోతుందన్నారు. విలేఖర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరనాధరెడ్డి, జిల్లా సిపిఐ కార్యదర్శి వి రామరాజు, సహాయ కార్యదర్శి దామా అంకయ్య, నగర సహాయ కార్యదర్శి మునీర్, తదితరులు పాల్గొన్నారు.

వాతావరణంపై నిరంతరం అధ్యయనం * శాస్తవ్రేత్తల్లో వెల్లువెత్తిన ఆనందం
english title: 
resat -1

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>