కందుకూరు, ఏప్రిల్ 26: జిల్లాలోని ఒంగోలు శాసనసభ, నెల్లూరు పార్లమెంట్ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికతో చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్‌డిఓ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల నియమావళి నేపథ్యంలో అధికారుల బదిలీలు జరిగాయని, నూతన అధికారులు విధులలో చేరిన వెంటనే వారికి ప్రత్యేక సూచనలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రజాస్వామ్య విధానాలపై చర్చించి ప్రత్యేక ప్రణాళికలు తయారుచేసి ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యత తానే చేపడుతానని, కందుకూరు నియోజకవర్గ ఎన్నికల అధికారిగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనృసింహం విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మద్యం, నగదు ఇతర వస్తు సామగ్రి పంపిణీ చేయకుండా అడ్డుకునేందుకు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నగదు, మద్యం తరలించడానికి అవకాశం లేకుండా పోలీస్, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీ కేంద్రాలు బుధవారం నుండే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మద్యం, గొలుసు దుకాణాలను మూసివేయించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే అధికారులను సమస్యాత్మక ప్రాంతాలను బూత్‌ల వారీగా గుర్తించి సమస్య లేకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అల్లర్లకు, ఘర్ణణలకు పాల్పడిన వారిని బైండోవర్ చేయాలని రెవిన్యూ, పోలీస్ శాఖలను ఆదేశించినట్లు తెలిపారు. గతంలో జరిగిన విధంగా కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వేలో 18సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు మాత్రమే ఓటు హక్కు కల్పించటం జరుగుతుందని, వలస ఓట్లవల్ల గతంలో జిల్లాకు వచ్చిన చెడ్డపేరు దృష్ట్యా కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిబంధనలు కఠినంగా ఉన్నాయని, అవకతవకలకు పాల్పడితే ఎన్నికలు రద్దు చేయటాటికి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలో 27రూట్లు, 210పోలింగ్ బూత్‌ల ద్వారా 1,87,310మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. కలెక్టర్ అనితా రాజేంద్రతోపాటు ఆర్‌డిఓ మద్దా వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
నిర్భయంగా ఓటుహక్కు
వినియోగించుకోవాలి
మావోయిస్టులపై ప్రత్యేక దృష్టి
నియోజకవర్గం చుట్టూ
ఎనిమిది చెక్‌పోస్టుల ఏర్పాటు
విఐపిలకు షాడో పార్టీల ఏర్పాటు
ఎస్‌పి రఘురామిరెడ్డి స్పష్టం
ఒంగోలు, ఏప్రిల్ 26: త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఓటర్లు నగదు, మద్యం వంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్‌పి కొల్లి రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఉప ఎన్నికలు జరిగే ఒంగోలు, కందుకూరు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల చుట్టూ ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, ఆ చెక్‌పోస్టులు 24 గంటలపాటు పని చేస్తాయని ఆయన వివరించారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతరం తమ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు 20 వేల రూపాయలపైన నగదు తీసుకెళ్లకూడదని, ఆవిధంగా తీసుకువెళ్తే సంబంధిత రసీదులు చూపించాలని ఆయన వివరించారు. పెట్రోలు బంకుల యజమానులు, రోజువారి ఖాతాలు నిర్వహించే వ్యాపారులు సంబంధిత పోలీసుస్టేషన్ల వద్ద చెప్పాలని ఆయన తెలిపారు. పెళ్ళిళ్ళు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు కూడా వివరాలు పోలీసులకు తెలియచేయాలన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి పొందిన వాహనాలను మాత్రమే కాన్వాయ్‌లో అనుమతిస్తామన్నారు. ఒక్కొక్క అభ్యర్థి కాన్వాయ్‌లో మూడు వాహనాలు మాత్రమే ఉండాలన్నారు. అభ్యర్థులు రాత్రి పది గంటల తరువాత మైక్ ప్రచారాన్ని అనుమతించమని, ఆ ప్రచారానికి కూడా పోలీసుల అనుమతి ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదని ఆయన రాజకీయ పార్టీలకు సూచించారు. ప్రైవేటు స్థలాల్లో సమావేశాలు నిర్వహించుకోవాలంటే సంబంధిత స్థల యజమాని అనుమతి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు భద్రత ఇస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా మైదాన ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులపై మావోయిస్టుల దాడులు జరగకుండా ప్రత్యేక భద్రతా చర్యలను తీసుకున్నట్లు ఎస్‌పి రఘురామిరెడ్డి తెలిపారు. గతంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట సుబ్బరామిరెడ్డిపై మావోయిస్టులు కాల్పులు జరిపి హత్య చేశారని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఒడిశా సంఘటనతో నల్లమలలో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్‌పి కొల్లి రఘురామిరెడ్డి స్పష్టం చేశారు.
పెళ్లికి వెళ్తూ పరలోకాలకు...
ఆరుగురి మృతితో ఎర్రపాలెంలో విషాదం
కంభం, ఏప్రిల్ 26: తిరుమలలో దేవసన్నిధిలో జరుగుతున్న పెళ్ళికి వెళుతూ మార్గమధ్యంలో ఆరుగురు మృతి చెందడంతో విషయం తెలుసుకున్న వారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోనికి వెళితే కంభం మండలం ఎర్రపాలెం గ్రామానికి చెందిన ఇ చెన్నకేశవులు, వి ప్రమీలకు గురువారం తిరుమలలో వివాహం చేసేందుకు ఎర్రపాలెం నుంచి 30మంది బుధవారం రాత్రి నాలుగు వాహనాల్లో బయలుదేరి వెళ్ళారు. చిత్తూరు జిల్లా తిరుపతికి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పింబోయిన క్వాలీస్ వాహనం బుదవారం అర్ధరాత్రి చెట్టుకు ఢీకొనగా అందులో ఉన్న 9మందిలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే వాహనంలో ఉన్న కంభం మాజీ ఎంపిపి మామిళ్ళ పుల్లయ్య స్వల్పగాయాలతో బయటపడగా ఆయన భార్య లక్ష్మీకోటమ్మ (54), మాజీ సర్పంచ్ నల్లబోతుల అల్లూరయ్య (45), నల్లబోతుల వెంకటేశ్వర్లు (33), పిక్కిలి చెన్నయ్య (55), మండ్లా బుడ్డయ్య (56), డ్రైవర్ రవి (25)లు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ఉన్న సాయి, సులోచనలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈవిషయం గురువారం తెల్లవారుజామున ఎర్రపాలెం గ్రామంలోని బంధువులకు సమాచారం తెలియడంతో ఆయా కుటుంబాల వారు జరిగిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీనితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కూలీనాలీ చేసుకొని జీవించే తమ కుటుంబాల్లో పెద్దదిక్కు కోల్పోయామని బోరున విలపిస్తున్నారు. కాగా మృతదేహాలు శుక్రవారం ఉదయానికి స్వగ్రామానికి రావచ్చునని భావిస్తున్నారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకుల చేగిరెడ్డి ఓబులరెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, వాసవీ పాలిటెక్నికల్ అధినేత రావూరి జనార్దన్ హుటాహుటీన తిరుపతికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతున్న మాజీ ఎంపిపి పుల్లయ్యకు మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే రాంబాబు చొరవ తీసుకుని ఆర్థికసాయం చేసి చెన్నైకి తరలించినట్లు బంధువులు తెలిపారు.
ఆహార సబ్సిడీలు కొనసాగించాలి
ఐద్వా డిమాండ్
ఎఫ్‌సిఐ గోదాము ముట్టడి
ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 26: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని ఎఫ్‌సిఐ గోదామును ముట్టడించారు. ఎఫ్‌సిఐ గోదామును ముట్టడించడంతో దాదాపు 2 గంటల వరకు బియ్యం లారీలు ఆగిపోయాయి. అధికారులను లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పోయాయి. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యు ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర సహాయక కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఆహార సబ్సిడీలు కొనసాగించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలన్నారు. ప్రణాళికా సంఘం పేదరికానికి ఇచ్చిన నిర్వచనం రద్దు చేయాలన్నారు. అవసరమైన వారికి రేషన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్లలు రక్తహీనతతో బాధ పడుతున్నారన్నారు. రేషన్‌షాపుల ద్వారా ఇస్తున్న చక్కెర, కిరోసిన్ కోటాను తగ్గించారన్నారు. గోధుమలు ప్రతి నెల ఇవ్వడం లేదని, ఇస్తున్న బియ్యం కుటుంబానికి సరిపోవడం లేదన్నారు. ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, దీనివల్ల పేద మహిళలు సరైన పౌష్టికాహారం తీసుకోలేక పేదలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు, ఆర్‌టిసి చార్జీలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని, వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్‌కె మున్వర్ సుల్తానా మాట్లాడుతూ పెద్దలకు వేల కోట్ల రూపాయులు రాయితీలు ఇస్తూ పేదలకు ఇస్తున్న సబ్సిడీలు కుదించడం దుర్మార్గమన్నారు. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టవద్దన్నారు. ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయాలని, అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎఫ్‌సిఐ గోదాము మేనేజర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు కె రమాదేవి, జాలా అన్నపూర్ణ, ఎస్‌కె నాగూర్‌బి, ఎన్ మాలతి, కె రాజేశ్వరి, పి శైలజ, ఆళ్ళ సీతామహాలక్ష్మి, నాగలక్ష్మి, జి ఆదిలక్ష్మి, రమాదేవి, సిఐటియు నాయకులు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఒంగోలు, ఏప్రిల్ 26: ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఒంగోలు తాలూకా పోలీసులు అందించిన కథనం మేరకు వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఒంగోలు నగరంలోని సుజాతనగర్‌కు చెందిన శేషబ్రహ్మం (30) అనే యువకుడు మృతి చెందాడు. ఇతడు ఒంగోలు నుండి కరవది మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా ఎంబి బ్రదర్స్ పెట్రోలు బంకు వద్ద విజయవాడ నుండి కనిగిరి వెళుతున్న బస్సు మరో వాహనాన్ని తప్పించే సమయంలో డివైడర్‌కు, బస్సుకు మధ్య శేషబ్రహ్మం నలిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అకాలవర్షంతో అపారనష్టం!
కొమరోలు, ఏప్రిల్ 26: మండలంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పెనుగాలులతో కురిసిన అకాలవర్షానికి అరటి, బత్తాయి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పచ్చి ఇటుకలు తడిసిపోవడంతో నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయారు. బుధవారం సాయంత్రం 3గంటల నుంచి ఉరుములు మెరుపులతో అకాలవర్షం కురిసింది. పెనుగాలులు తోడుకావడంతో తుపాను వాతావరణాన్ని తలపించింది. వ్యాపార సంస్థల బోర్డులు, పెళ్ళిళ్ల ఫ్లెక్సీలు, పూరిళ్ళ పైకప్పులు లేచిపోయాయి. మండలంలోని అల్లీనగరం, బ్రాహ్మణపల్లి గ్రామాల పొలాల్లో సాగు చేసిన బత్తాయి, అరటి తోటలు దెబ్బతిన్నాయి. అకాలవర్షం కారణంగా కొమరోలులోని పలువీధుల్లో మట్టిరోడ్లపై నీరు నిలిచి ఉండటంతో చిన్నపాటి నీటకుంటలను తలపిస్తున్నాయి. కొమరోలు, తాటిచర్ల గ్రామాల వెలుపల నిర్వహిస్తున్న ఇటుకల బట్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పచ్చి ఇటుకలు వర్షానికి తడిసి కరిగిపోయాయి. ఇటుకలతో పేర్చిన బట్టీలపై పాలిథిన్ పేపర్‌ను కప్పి రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పెనుగాలుల ధాటికి పాలిథిన్ కవర్ ఎగిరిపోయి నష్టపోయామని తెలిపారు. ఒక్కొక్కరికి 10 నుంచి 30వేల రూపాయల మేర నష్టం జరిగిందని వాపోయారు.
సియస్‌పురంలో..
సియస్‌పురం, ఏప్రిల్ 26: మండలంలోని చెన్నపునాయునిపల్లి, విబైలు గ్రామాలలో బుధవారం కురిసిన అకాల వర్షానికి కల్లాలో ఆరబెట్టిన పసుపు కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని విబైలు గ్రామానికి చెందిన కాటంరెడ్డి రమణారెడ్డి, పబర్తి హుస్సేనయ్య, జొన్నలగడ్డ రాజారావు, పటాన్ నాయబ్, జొన్నలగడ్డ రామలక్ష్మమ్మ, సారె వెంకటపతి తదితర రైతులు విబైలు గ్రామంలో పసుపు ఉడకబెట్టి కల్లాల్లో ఆరబోసి ఉండగా పసుపులోకి ఒక్కసారిగా వర్షపు నీరు రావడంతో 20 క్వింటాళ్ళ పసుపు కొట్టుకుపోయింది. అలాగే చెన్నపునాయునిపల్లి గ్రామంలో రఘురాములు, మరోరైతుకు చెందిన 4క్వింటాళ్ళ పసుపు కొట్టుకుపోయింది. అసలే పసుపు పంటకు గిట్టుబాటు లేక అల్లాడుతుంటే, దానికి తోడు బుధవారం కురిసిన అకాల వర్షానికి పసుపుకొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షంతో రైతుల పసుపు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
‘పోలీస్ స్టేషన్లలో ఆధునిక వైర్‌లెస్ సెట్లు’
కనిగిరి, ఏప్రిల్ 26: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపోలీస్ స్టేషన్‌లో ఆధునిక వైర్‌లెస్ సెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఎస్పీ బి.సుదర్శన్ వెల్లడించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న వైర్‌లెస్ సెట్లకంటే నేడు ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన వైర్‌లెస్ సెట్లు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. ఒకేసారి ఎంతమంది అధికారులు అయినా నూతన వైర్‌లెస్ సెట్లు ద్వారా మాట్లాడవచ్చునని తెలిపారు. వైర్‌లెస్ సెట్లు ఎక్కడా జాం కాకుండా నూతన టెక్నాలజీతో ఉపయోగంలోకి తెస్తున్నామన్నారు. ప్రస్తుతం విశాఖయపట్నం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ పట్టణాల్లో దీనిని ఉపయోగిస్తున్నారన్నారు. దీనికోసం సైబరాబాద్‌లో అత్యంత అధునాతన ట్వెట్ వైర్‌లెస్‌సెట్ ఉపయోగిస్తుందన్నారు. ఇందులో వాయిస్ రికార్డింగ్‌తోపాటు, ఎస్‌ఎంఎస్‌లు కూడా ఏక కాలంలో ఉపయోగించుకోవచ్చునన్నారు. ఈసమావేశంలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కె.కరుణాకర్, హెచ్‌ఎంపాడు, కనిగిరి ఎస్సైలు పాల్గొన్నారు.