శ్రీకాకుళం, ఏప్రిల్ 26: వ్యక్తిగత రాజకీయాలు, సెంటిమెంట్లు ఉపఎన్నికల్లో పనిచేయవని, అభివృద్ధే ధ్యేయంగా, సేవే పరమావధిగా పనిచేసిననాడే విజయం వరిస్తుందని రోడ్లు భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. గురువారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నరసన్నపేట నియోజకవర్గం ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుందని, విజ్ఞతతో ఓటువేసే ప్రత్యేకత వీరికి సొంతమని ఆయన చెప్పుకొచ్చారు. ఉపఎన్నికల బరిలో దిగిన ప్రతిపక్ష పార్టీలు తమ వ్యక్తిగత రాజకీయాలను కాపాడుకోవడానికి ఆరాటపడుతున్నాయని, అలాగే సెంటిమెంట్లు ఉపయోగించుకుంటున్నాయని, ఇటువంటివి సరైన రాజకీయాలు కావన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన జమ్ము, తామరాపల్లి, టెక్కలిపాడు పంచాయతీల్లో గడచినకాలంలో ఆ పార్టీకి వెన్నుదన్నుగానున్న ఆ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాజకీయాలకతీతంగా సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ దిశగా 8కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం మంజూరు చేసామన్నారు. వీరంతా నేడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం, పార్టీ విజయానికి శుభసూచకమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షేమపథకాలను అమలు చేసినా కులమతాలు, రాజకీయాలకతీతంగా అందజేస్తుందని గుర్తుచేశారు. కొన్నిదశాబ్దాలుగా ఓటర్లు ఇచ్చిన తీర్పు ఇక్కడ ఓటర్లు విజ్ఞతకు నిదర్శనమన్నారు. 1989వ సంవత్సరంలో శాసనసభ్యునిగా నరనస్నపేట నుంచి ఎన్నికైన నాడు తనకు మంత్రి పదవి దక్కిందని, తనకున్న అనుభవంతో ముందుకు వెళ్లినప్పటికీ 1994లో జరిగిన ఎన్నికల్లో తాను ఓటమి పాలయ్యేలా పేట ఓటర్లుతీర్పుకు ఇది ఒక తార్కాణమన్నారు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అభివృద్ధిపైనే దృషి సారించడంతో 1999లో విజయం సాధించగలిగామన్నారు. అలాగే తన సోదరుడు కృష్ణదాసుకు నియోజకవర్గం అప్పగించిన తరువాత రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, దీనంతటికి అభివృద్ధి కార్యక్రమాలే కారణమన్నారు. అయితే అనూహ్యమార్పులు రావడంతో స్వార్ధం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేడు ఉపఎన్నికలకు దారితీసిందని వివరించారు. ఏదిఏమైనా అభివృద్ధిని ఎవరు సాధిస్తారో వారికే ఓటర్లు పట్టం కడతారని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొదటివిడత ప్రచారం దాదాపు 80శాతం పూర్తయిందని, రెండవ విడత ప్రచారం ముమ్మరం చేస్తామన్నారు. ఈయనతోపాటు కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన రాందాసు, అధికార ప్రతినిథి టంకాలబాబ్జీ, చింతురామారావు, నర్తు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
6న సిఎం రాక?
శ్రీకాకుళం, ఏప్రిల్ 26: జిల్లాకు వచ్చే నెల ఆరవ తేదీన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విచ్చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారందించిన సమాచారం మేరకు జిల్లాలో నరసన్నపేట ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరవ తేది ఉదయం శ్రీకాకుళం చేరుకుని స్థానిక ఇందిరావిజ్ఞానభవనంలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు నరసన్నపేట పట్టణంలో బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బహిరంగసభ అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. ఏడవ తేదీ ఉదయం పత్రికా విలేఖరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు పయనం కానున్నారు.
వడదెబ్బకు ఇద్దరు వృద్ధులు మృతి
ఆమదాలవలస/ కొత్తూరు ఏప్రిల్ 26: విపరీతంగా కాస్తున్న ఎండలకు, వీస్తున్న వేడిగాలులకు ప్రజలు విలవిల లాడుతున్నారు. జిల్లాలో గురువారం వడదెబ్బ తీవ్రతకు ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఆమదాలవలస మండలం అక్కులపేట గ్రామానికి చెందిన ఉపాధి కూలీ చిడిపోతు అప్పారావు(65), కొత్తూరు మండలం పాతపాడుకు చెందిన మొల్లి పోతయ్య(60) వడదెబ్బ తీవ్రతకు గురై మరణించారు. అప్పారావు ఉపాధి పనుల్లో భాగంగా గ్రామంలోని వెంకటి చెరువులో పూడికతీత పనులను తన సహచరులతో కలసి చేపడుతుండగా వడగాల్పులకు తట్టుకోలేక నేలకొరిగాడు. ఉపాధి పనుల వద్ద బిందెతో మంచినీళ్లు, నీడ కోసం విశ్రాంతి టెంట్‌లు వంటివి లేకపోవడంతో మృతుడు దాహం..దాహం అంటూ గుండెనొప్పితో బాధపడుతుండగా నీళ్లు తెచ్చేలోగా ఊపిరి వదిలాడని సహచర కూలీలు తెలిపారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ గ్రంథి వీర్రాజు, ఎంపిడిఓ పోలినాయుడు, ఎపిఒ శోభాశ్రీ తదితరులు గ్రామానికి చేరుకున్నారు. శవపంచనామా చేసిన అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
అలాగే మొల్లి పోతయ్య సామాన్ల కొనుగోలు కోసం పాతపాడు నుండి నివగాంకు వెళ్లాడు. సామాన్లు కొనుగోలు చేసి తన గ్రామానికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురై మార్గమధ్యలో మృతి చెందినట్లు నివగాం వి ఆర్ ఒ కలమట రమేష్ తెలిపారు.ఈ మేరకు తహశీల్దార్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వి ఆర్ ఒ చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే తహశీల్దార్ ఎం సూర్యనారాయణ , ఎస్ ఐ కె మధుసూదనరావులు సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామ నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
నివాసిత గుర్తింపు కార్డుల జారీకి ఏర్పాట్లు
శ్రీకాకుళం, ఏప్రిల్ 26: జిల్లాలో నివాసిత గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నుట్ల రాష్ట్ర జనాభా గణన సంచాలకులు వై.వి.అనూరాధ తెలిపారు. బయోమెట్రిక్ పద్ధతిలో సమాచారం సేకరించాలని ఆమె సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ జనాభా రిజిష్టర్2011 తయారు చేసేందుకు ప్రతీ కుటుంబంలోని సాధారణ నివాసితులందరికీ నిర్దిష్ట వివరాలు 2010 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సేకరించామన్నారు. సేకరించిన సమయంలో కుటుంబాలకు రసీదులు అందించామని, వాటిని తీసుకువచ్చి ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ కేంద్రంలో ఫోటోలు తీసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. 2007 మార్చి 1 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లల నుంచి పెద్దల వరకు నివాసిత గుర్తింపు కార్డు జారీ చేస్తామన్నారు. ప్రతీ 400 జనాభాగల ప్రాంతాన్ని ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించామన్నారు. ఎన్యూమరేషన్ బ్లాక్ ప్రాంతానికి ఒక బయోమెట్రిక్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ కేంద్రం గరిష్టంగా నాలుగు రోజులుంటుందని, ప్రతీ వ్యక్తి తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. కేంద్రానికి వెళ్లే సమయంలో రేషన్ కార్డులు, ఉపాధి హామీ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు వంటి ఆధారాలు చూపించాలన్నారు. గతంలో నమోదు చేయించుకోని సభ్యులు ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎన్.పి ఆర్.్ఫరంలో నమోదు చేసుకోవాలన్నారు. బయోమెట్రిక్ ప్రక్రియ ఏ విధంగా ఎన్యూమలేషన్ బ్లాక్‌లో గతంలో జనాభాగణన చేసిన ఎన్యూమరేటరు ప్రతీ కుటుంబానికి జాతీయ జనాభా గణన రిజిష్టర్‌లో నమోదుకు బయోమెట్రిక్ పద్ధతిలో వివరాల సేకరణకు కె.వై ఆర్.ప్లస్ (నో యువర్ రెసిడెన్స్) ఫారాన్ని అందిస్తారన్నారు. కుటుంబ యజమాని ఫారాన్ని పూర్తి చేయాలని, బయోమెట్రిక్ కేంద్రానికి వచ్చే సమయంలో ఫారంలో వివరాలు కేంద్రంలోని కంప్యూటర్‌లో పొందుపరుస్తారని వెల్లడించారు. కేంద్రంలోనే బయోమెట్రిక్‌లో చేతి వేళ్ల నమూనాలు, ఐరిష్ కెమెరాలో రెండు కళ్లు, ఫొటో తీస్తారని చెప్పారు. అనంతరం వాటి వివరాలను సంబంధిత వ్యక్తికి కంప్యూటర్‌పై చూపిస్తామని, వాటిలో తప్పులుంటే వెంటనే సరిదిద్దుతారని, అనంతరం రెండు ఫారాలను ప్రింట్ తీస్తారన్నారు. ఒక ఫారాన్ని సంబంధిత కుటుంబానికి ఇస్తారని అనూరాధ వెల్లడించారు.
నివాసిత గుర్తింపు కార్డు ఉపయోగాలు...
నివాసిత గుర్తింపు కార్డు భారతదేశ పౌరునిగా నిరూపించుకునేందుకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ఆధారంగా చూపించేందుకు, వయసు, పుట్టిన తేదీ నిరూపణకు, బ్యాంకు ఖాతాలకు, పాస్‌పోర్టు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్, టెలిఫోన్; గ్యాస్ కనెక్షన్, వివాహ, భూమి, ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, దేశంలో ఏప్రాంతంలో అయినా సురక్షితంగా ప్రయాణించేందుకు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్ఛాపురం, కంచిలి మండలాల నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామనారు. ఆధార్ కార్డులు ఇంకా జారీ కాని మండలాల్లో జాతీయ జనాభా రిజిష్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో 15 మండలాల్లో ఆధార్ ప్రారంభం కాకపోవడం, తక్కువ శాతం పని పూర్తికావడం జరిగిందన్నారు. ఆయా మండలాల్లో వీటిని చేపట్టి మిగిలిన మండలాల్లో క్రమంగా పూర్తి చేయిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి ప్రజలందరికీ తెలియచేసే విధంగా చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్, డి ఆర్వో నూర్ భాషా ఖాసిం, ఆర్డీవోలు ఎన్.సత్యన్నారాయణ, ఎస్.వెంకటేశ్వరరావు, వి.విశే్వశ్వరరరావు, జనాభా గణణ అసిస్టెంట్ డైరక్టర్ శ్రీకాంత్, జిల్లా ఇంఛార్జి వై. జగన్నాధపూరి తదితరులు పాల్గొన్నారు.
సాయం మిథ్యేనా!
ఎచ్చెర్ల, ఏప్రిల్ 26: ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన కరవు సాయం అతీగతి లేకపోవడంతో వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరిసాగుచేసి వర్షాభావ ప్రభావానికి గురై, కాలువల్లో సాగునీరు సరఫరా కాక ఎండిపోవడంతో రైతులు వ్యవసాయమదుపులు రాక నష్టాల నట్టేట మునిగిపోయారు. జిల్లాలో 1,16,745 ఎకరాలలో పంటనష్టం వాటిల్లిందని, వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు సర్వే నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దీని ఆధారంగా జిల్లాలో 30మండలాలను కరవు మండలాలుగా సర్కారు ప్రకటించి అక్కడ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని 28.1లక్ష కోట్ల రూపాయలు సాయంగా ప్రకటిస్తూ ఏప్రిల్ 13న జీవో జారీ చేసింది. నష్టపోయిన రైతులకు బ్యాంకు అకౌంట్లు ద్వారా ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని నిర్ణయించింది. అయితే 1029గ్రామాలలో కరవు రైతులుగా గుర్తించిన 1,37,328మంది రైతుల్లో 73,911మంది రైతులకు మాత్రమే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. మిగిలిన 63,412మంది రైతులకు బ్యాంకుఖాతాలు లేకపోవడంతో వీరికి కూడా ఖాతాలు తెరిపించాలని జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామ్‌రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించి సూచనలు అందజేసారు. అయినప్పటికీ ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల ప్రగతి కానరాలేదనే చెప్పాలి. ఖాతాలు తెరిపించే బాధ్యతలను మండల వ్యవసాయ శాఖాధికారులు, ఎడిలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో బ్యాంకు అధికారులు సహకరించడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, రణస్థలం, పాలకొండ, వంగర, ఎల్‌ఎన్‌పేట, వీరఘట్టం మండలాల మినహా మిగిలిన మండలాలన్నీ కరవు మండలాలుగా సర్కారు గుర్తించినప్పటికీ అక్కడ రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, మరోపక్క ఈ ఏడాది ఖరీఫ్ ముంచుకురావడంతో రైతు కుటుంబాలు నిరాశతో ఎదురుచూడక తప్పడం లేదు. అంతేకాకుండా మరోలక్ష ఎకరాల్లో వర్షాలు సకాలంలో కురవక కాలువల ద్వారా సాగునీరు అందక 30నుంచి 50శాతం పంట రైతులు నష్టపోయారు. ఇటువంటి రైతులను గుర్తించేందుకు కనీస చర్యలు చేపట్టలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రైతులను ఆదుకుంటామని పలుసందర్భాల్లో చెప్పిన కిరణ్‌సర్కారు సకాలంలో కరవు సాయం అందించేందుకు ముందుచూపుతో వ్యవహరించకపోవడంపై రైతు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో తహశీల్దార్, వ్యవసాయాధికారి ఉమ్మడి ఖాతాగా పరిహారం అందించే విధానం తిరిగి అమలు చేసినట్లయితే గుర్తించిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందించడం సునాయసం అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి భిన్నంగా ఆన్‌లైన్‌లో సాయం అందించాలన్న సర్కారు సంకల్పం క్షేత్రస్థాయిలో అన్నదాతలను ఇబ్బందుల్లో నెట్టేసే పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో ఖాతాలు తెరిపించలేకపోవడం సకాలంలో సాయం అందని పరిస్థితి నెలకొనడంతో అన్నదాత కుటుంబాలు గంపెడు ఆశలతో ఎదురుచూడక తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కరవు ప్రాంతాల్లో ఖాతాలు లేని రైతులను గుర్తించి జిరో అకౌంట్ ఖాతాలను తెరిపించి సాయం అందించేందుకు కృషి చేయాలని వారంతా కోరుతున్నారు.
అరకొర ఖాతాలు
ఆశించిన స్థాయిలో కరవు ప్రాంతాలలో రైతులు ఖాతాలు తెరిపించలేకపోతున్నామని వ్యవసాయశాఖ జెడి మురళీకృష్ణ స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను ఎఓ ఎడిలకు అప్పగించినప్పటికీ బ్యాంకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించడం లేదు. రైతుల్లో కూడా చైతన్యం కొరవడడం వల్ల ప్రగతి కానరాని పరిస్థితి నెలకొంది.
టీడీపీ విజయం ఖాయం
నరసన్నపేట, ఏప్రిల్ 26: రానున్న నరసన్నపేట ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిమ్మ స్వామిబాబు విజయం ఖాయమని మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జోస్యం చెప్పారు. కోవూరు ఉపఎన్నికలు ఫలితాలు మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మూడోస్థానమే దక్కుతుందని ఆయన వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు తాయిళాలుగా అందించిన మంత్రులు సైతం నియోజకవర్గంలో మకాంపెట్టిన మూడోస్థానానికి ఆ పార్టీ దిగజారిపోయిందని గుర్తుచేసారు. అదే ఫలితాలు పేటలో కూడా పునరావృతం అవుతాయన్నారు. గడచిన ఎనిమిదేళ్లు మంత్రి ధర్మాన సోదరుడు కృష్ణదాసు ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధికార్యక్రమాలు చేపట్టలేదని, ఆ మాటను మంత్రి ధర్మానే పదేపదే చెబుతూ ఇప్పుడు అభివృద్ధి చేస్తామనడం నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. అభివృద్ది పేరిట ప్రభుత్వ ధనాన్ని మంజూరు చేయించి ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తాయిళాలు మంత్రి ధర్మాన అందిస్తున్నారని విమర్శించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి దొడ్డిదారిన విజయం సాధించాలని ప్రలోభాలకు దిగడం సరికాదన్నారు. ఎన్నడూ లేనివిధంగా దుకాణదారులకు నోటీసులు జారీచేయడం రైస్‌మిల్లర్లపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలోబలగ నాగేశ్వరరావు, పొన్నాడ సీతారాములనాయుడు, చింతు పాపారావులు పాల్గొన్నారు.
ప్రతిభకే పోలీసు ఉద్యోగం
* ఎస్పీ గోపాలరావు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 26: దేహదారుఢ్య పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను రాతపరీక్షకు ఎంపిక చేశామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కెవివి గోపాలరావు స్పష్టం చేశారు. దళారీల మాయలో అభ్యర్థులు పడి మోసపోవద్దని హితవు పలికారు. అటువంటి వ్యక్తుల కదలికలను తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. దేహదారుఢ్య పరీక్షల్లో వచ్చిన మార్కులతోపాటు రాతపరీక్షలో సాధించిన మార్కులను జోడించి కానిస్టేబుల్ నియామకాలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నామన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తెరగాలన్నారు.
‘కాంగ్రెస్ విజయం తథ్యం’
బలగ, ఏప్రిల్ 26: జిల్లాలో జరుగనున్న నరసన్నపేట నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు రత్నాల నర్శింహమూర్తి, ముస్తాక్ మహ్మద్, మూకళ్ల తాతబాబులు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో గురువారం వారు విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఉప ఎన్నిక పోరు షెడ్యూల్ ప్రకటన వెలువడటంతోనే విపక్షాలు తమ వాణిని పెంచాయని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తపరిచారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి కేవలం కొన్ని పత్రికల అండతోనే దూకుడు ప్రచారం గావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. విజయనగరంలో ప్రజాస్వామ్య సూత్రాలకనుగుణంగా పోలీసులు వ్యవహరిస్తే బారికేడ్లను తొలగించి మరీ విధ్వంసానికి పాల్పడటం బాబు అరాచకత్వానికి పరాకాష్ట అన్నారు. జగన్ సభలకు యువత రావడంతో యువత నుద్దేశించి బిరియానీ, డబ్బులకు మోజుపడి వస్తున్నారని చెప్పడం బాబుకు యువత పట్ల చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.
కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్న ఇటీవల ఓపెన్ డిబేట్‌లో మద్యంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అతని తమ్ముళ్ల మద్యం వ్యాపారాల గూర్చి మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎం.పి. కిల్లి కృపారాణిలు జిల్లా అభివృద్ధి పట్ల చూపెడుతున్న చొరవతో నరసన్నపేట నియోజకవర్గంలోని విపక్షాల కార్యకర్తలు అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రానున్న ఉప ఎన్నికల్లో గెలుస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు.
మే 20న నూసెట్
* నన్నయ్య వర్సిటీ రిజిస్ట్రార్ రామ్మోహనరావు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 26: వచ్చే విద్యాసంవత్సరంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం(రాజమండ్రి)లో వివిధ కోర్సుల ప్రవేశానికి మే 20వ తేదీన నూసెట్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఎన్.్భర్గవ్‌రామ్మోహనరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రవేశపరీక్షతో సంబంధం లేకుండా నూసెట్ నిర్వహిస్తున్నామన్నారు. నన్నయ్య వర్శిటీలో ప్రవేశం పొందడానికి నూసెట్‌కు తప్పకుండా హాజరు కావాలని పేర్కొన్నారు. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సైకాలజీ, సోషల్‌వర్క్, తెలుగు, ఎంఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ తదితర కోర్సుల ప్రవేశానికి ఈ సెట్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంట్రిగ్రేటెడ్ మేథమెటిక్స్ అండ్‌కంప్యూటింగ్ కోర్సు, పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్, పిజి ఎకనామిక్స్ వంటి జాబ్‌ఓరియంటేషన్ కోర్సులు వర్శిటీలో ఉన్నాయని వెల్లడించారు. అప్లికేషన్లకు దరఖాస్తులు ఏప్రిల్ 30వ తేదీవరకు పొంది తిరిగి సమర్పించాలని ప్రవేశ పరీక్ష మే 20న నిర్వహిస్తామని, ఫలితాలు మే 31 వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అప్లికేషన్ పొందేందుకు డబ్ల్యు.డబ్ల్యు.నన్నయ్య యూనివర్శిటీ. ఇన్‌ఫో సంప్రదించాలని రిజిస్ట్రార్ తెలిపారు.
‘ఉపాధి’కి ‘నీడ’ కరవు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 26: వ్యవసాయకూలీలకు పనులు కల్పించి వలసలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంలో నిబంధనలను పొందుపరిచినా క్షేత్రస్థాయిలో అవి అమలయ్యే దాఖలాలు కానరావడం లేదు. పేదల ఊటీగా పేరున్న శ్రీకాకుళం జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం ఠారెత్తిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఉపాధి హామీకూలీలకు పనులు చేసే చోట నీడ కల్పించాలన్న నిబంధనను మాత్రం ఇక్కడ అధికారులు ఉల్లంఘిస్తున్నారనే చెప్పాలి. దాహం తీర్చుకునేందుకు మంచినీరు, ప్రథమ చికిత్సకు కిట్లు పనులు నిర్వహించేచోట ఏర్పాటు చేసే దాఖలాలు కానరావడం లేదు. ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుని తాపం ఆరంభం కావడం, ఉపాధి పనుల్లో కూలీలు నిమగ్నం కావడం పరిపాటిగా మారింది. పదిగంటల సమయంకల్లా ఎండతీవ్రత తట్టుకోలేక సమీపంలో ఉన్న చెట్ల కిందకు సేదతీర్చుకునేందుకు కూలీలు ఆపసోపాలు పడుతున్నారు. ఇది అడుగడుగునా దర్శనమిస్తోంది. ఈ విషయమై అధికారులు వద్ద ప్రస్తావించగా ఈ ఏడాది పనుల వద్ద ఏర్పాటు చేయాల్సిన టెంట్ హౌస్‌లో ఇంకా జిల్లాకు చేరలేదని మరోవారం రోజుల్లో వస్తాయంటూ చెప్పుకురావడం విడ్డూరంగా ఉంది. వేటలేక మత్స్యకారులు ఉపాధి పనులు కల్పించాలని ఏకరవు పెట్టుకున్న ఆ గ్రామాలలో పనులు ఆరంభించేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. డి మత్స్యలేశంలో 132మంది బడివానిపేటలో 136మంది, పనుల్లో భాగస్వామ్యులవుతున్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. బుడగట్లపాలేంతోపాటు ఫరీదుపేట గ్రామంలో ఈ పనులు ఇంకా ఆరంభం కాకపోవడం విశేషం. ఇప్పటికైనా ఉపాధి కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్‌హౌస్‌లు ఏర్పాటు చేసి మంచినీటి సమస్య పరిష్కరించాలని వారంతా ఏకరవు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా సర్కారు 137రూపాయల వేతనం, 30శాతం రాయితీ అందే దాఖలాలు లేవని, కూలీలు వాపోతున్నారు. దీనిపై అధికారులు మాత్రం ఉదయం ఏడుగంటల నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం మూడుగంటల నుంచి ఆరుగంటల వరకు పనులు సాగిస్తే ప్రభుత్వం ప్రకటించిన వేతనం, రాయితీ అందుతుందని, అలా కూలీలు పనులు నిర్వహించడం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా నాలుగువేల మందికి జాబ్‌కార్డులు జారీ చేసేందుకు కూడా అధికారులు సమాయత్తం అవుతున్నారు.
24 గ్రామాల్లో పనులు
24 గ్రామాలలో 861 గ్రూపులు ఉపాధి పనుల్లో భాగస్వామ్యం అవుతున్నాయని, 10,363మందికి పని కల్పిస్తున్నామని ఎంపిడిఓ విజయభాస్కర్ స్పష్టం చేసారు. మూడు రోజుల్లో టెంట్లు సరఫరా చేస్తామన్నారు. లీటరు మంచినీరుకు ఒక రూపాయి వంతున ప్రతీ కూలీకి ఐదులీటర్లు మంచినీరు మొత్తాన్ని వేతనంలో చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
బలగ, ఏప్రిల్ 26: వేసవి దృష్ట్యా అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.శారద సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి కార్యాలయంలో ఆమె హెల్త్ సూపర్‌వైజర్లు, ఎ. ఎన్. ఎం.లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది స్థానికంగా నివాసముండాలని లేనియెడల శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో సిబ్బందిపై ఒకింత ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలు, చంటిపిల్లల నమోదుపై ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వారి పట్టికలు పరిశీలించి పాతర్లపల్లి ఆరోగ్యసిబ్బంది నిర్లక్ష్యంపై కఠినంగా ప్రశ్నించారు. ఈపర్యాయం అలసత్వంపై క్షమించేది లేదని, నమోదు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలన్నారు. అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యంగా స్యైన్‌ఫ్లూ పట్ల విస్తృత ప్రచారం గావించి సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. జననీ శిశుసురక్షా కార్యక్రమం గోడ పత్రికలు అన్ని ఆరోగ్యకేంద్రాలకు సరఫరా చేయడమైందని తెలిపారు. కార్యక్రమంలో డిపిఎంఓ డాక్టరు వై.శ్యామల, మాస్ మీడియా అధికారులు బాసిన ముఖలింగం, ఎస్.బి.అశోక్, సీజనల్ వ్యాధుల అధికారి సోమశేఖర్ పాల్గొన్నారు.