హైదరాబాద్, ఏప్రిల్ 27: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన సబ్‌ప్లాన్ అమలుపై తొలిసారిగా ఈ నెల 30వ తేదీన మంత్రివర్గ సబ్‌కమిటీ సమావేశం జరగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విడుదల అవుతున్న నిధుల వినియోగంపై చర్చించడానికి ఎనిమిది మంది మంత్రులతో కూడిన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కమిటీలో తనతో పాటు భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, వైద్యవిద్యశాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్ హజరౌతారని ఆయన తెలిపారు.
......................
ఎమ్మార్ కేసులో
రైతులను మరిస్తే ఎలా?
హైదరాబాద్, ఏప్రిల్ 27: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో రైతులకు సంబంధించిన భూమి విషయం గురించి మాట్లాడకపోవడం దారుణమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి అన్నారు. మొత్తం 535 ఎకరాల్లో రైతుల భూములు దాదాపు 80 ఎకరాలు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు చెందినవి 250 ప్లాట్లు ఉన్నాయని, సినీనటి విజయనిర్మలకు 11.26 ఎకరాల భూమిని భూ సేకరణ నుండి మినహాయించి అవ్యాజ అనురాగాన్ని ప్రభుత్వం చూపించిందని , రైతులపై మాత్రం కనీస మానవత్వాన్ని చూపలేదని ఆయన పేర్కొన్నారు. పరిపాలనా వ్యవహారాల్లో పలుకుబడి ఉన్న వారి మాట చలామణి కావడం, అమాయకులు, పేదల మాట పెడచెవిన పెట్టిన తీరు దీని ద్వారా తెలుస్తోందని అన్నారు. ప్రభుత్వ పక్షపాత వైఖరి కారణంగా విజయనిర్మల వందల కోట్ల రూపాయిల ఆస్తికి స్వంతదారుకాగా, అమాయక రైతులు, ప్లాట్ల యజమానులు రోడ్లపాలయ్యారని అన్నారు. న్యాయం వారివైపు ఉన్నా, ఏ వ్యవస్థ ద్వారా కూడా వారికి సహాయం జరగకపోవడం దురదృష్టకరమని అన్నారు. సిబిఐ ఈ విషయాన్ని చార్జిషీట్‌లో ప్రస్తావించకపోవడం అన్యాయమని అన్నారు. రైతులు, ప్లాట్ల యజమానులకు వారి భూములు, స్థలాలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా మణికొంతడలోని పోకల్‌వాడలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బంధువు అనిల్‌కుమార్‌కు చెందిన సంస్థకు కేటాయించిన భూమిని సైతం రద్దు చేసి ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు.