హైదరాబాద్, ఏప్రిల్ 27: ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు మధు శుక్రవారం సిబిఐ కోర్టులో హాజరయ్యారు. దుబాయ్‌లో నివసిస్తున్న మధును ఎమ్మార్ కేసులో 13వ నిందితుడిగా సిబిఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. సిబిఐ గత కొన్ని రోజులుగా కోనేరు మధును దుబాయ్ నుంచి రప్పించే ప్రయత్నం చేసింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల సమన్లు జారీ చేయడంతో మధు కోర్టులో హాజరయ్యారు. మధు పాస్‌పోర్టును స్వాధీనం చేసి దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది. రూ.25 వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్, టి.రంగారావు, విజయరాఘవ, ఎమ్మార్ ఎంజిఎఫ్ తరఫున ఎల్లెన్ బజాజ్ తదితరులు కూడా కోర్టు విచారణకు హాజరయ్యారు. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధి అలబార్‌కు ఇంకా సమన్లు అందకపోవడంతో కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు మే 17వ తేదీకి వాయిదా వేసింది. బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్‌లకు మే 17 వరకు, విజయరాఘవకు మే 2 వరకు రిమాండ్ పొడిగించింది. కోర్టుకు, సిబిఐకి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మధు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విచారణ తప్పించుకునే ఉద్దేశం తనకు లేదని, చట్టాన్ని గౌరవిస్తానని చెప్పారు.
విజయసాయి బెయిల్ విచారణ వాయిదా
వైఎస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు సోమవారానికి విచారణను వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌పై తీర్పు సోమవారం వెలువడే అవకాశం ఉంది.
.......................
తెలంగాణ కోసం
మహిళ ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ ఇవ్వరనే మనస్తాపంతో మహబూబాబాద్ మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన పన్నాల శివరాణి(23) శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. 85 శాతంకు పైగా కాలిన ఆమెను హుటాహుటీన వరంగల్ ఆసుపత్రికి తరలించారు. భర్త వీరాస్వామి ఇంట్లోలేని సమయంలో శివరాణి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. భరించ లేక ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు గమనించి ఆమెను హుటాహుటీన 108 అంబులెన్స్ వాహనంలో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆతరు వాత జిల్లాకేంద్రానికి తరలించారు. పలువురు ఆమెను పరామర్శించారు.
కుటుంబ తగాదాల నేపథ్యంలోనే జరిగిందంటున్న పోలీసులు
విలేఖరులతో తెలంగాణ కోసమే అన్న బాధితురాలు
వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో శివరాణినుండి మెజిస్ట్రేట్ మరణవాంగ్మూలం నమోదు చేయగా, శివరాణి తెలంగాణ కోసమే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పిందని కుటుంబీకులు సమాచారమిచ్చారు. అయితే మహబూబాబాద్ రూరల్ పోలీసులు మాత్రం కుటుంబ తగాదాల నేపథ్యంగానే ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. కాగా ఆసుపత్రిలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ కోసమే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.
............................
శిశు విక్రయానికి వృద్ధుని యత్నం
రామగిరి, ఏప్రిల్ 27: పేదరికం, అనారోగ్యం, పరిస్థితులు సహకరించని పరిస్థితులలో ఒక వృద్ధుడు తన ఆరునెలల మనమరాలుని అమ్మకానికి పెట్టగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి శుక్రవారం శిశువును స్థానిక శిశువిహార్‌కు తరలించిన సంఘటన ఇది. చింతపల్లి మండలం మాల్ గ్రామానికి చెందిన కడమంచి రాములు(60) హైదరాబాద్ మాదన్నపేటలో కొడుకు, కోడలుతో కలిసి ఉంటున్నాడు. కొడుకు, కోడలు గొడవపడి విడిపోడంతో వారికి కలిగిన ఆరునెలల మనమరాలుని మూడు మాసాలుగా రాములు పోషిస్తున్నాడు. వయోభారానికి తోడు అనారోగ్యం, పేదరికంతో శిశువును పోషించలేక రాములు శుక్రవారం పాపను నల్లగొండ 14 వార్డులోని పెద్దబండకు తీసుకువచ్చి విక్రయించేందుకు నిర్ణయించాడు. వార్డు ప్రజలు పోలీసులకు సమాచారం అందించగా తహశీల్‌దార్ కృష్ణారెడ్డి, ఐసిడిఎస్ సిడిపివో లలితాకుమారి విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని శిశువును స్థానిక శిశువిహార్‌కు తరలించారు. కాగా దీనిపై రాములు మాట్లాడుతూ, తాను మనమరాలును అమ్మకానికి పెట్టలేదని, ఎవరైనా పెంచుకుంటారేమోనని ఇక్కడ వారిని సంప్రదించానని చెప్పాడు.