హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వడదెబ్బ తగిలినట్లుందని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో దుయ్యబట్టారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను బంగాళాఖాతంలో పడవేయాలని చంద్రబాబు అన్నారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీని ఎప్పుడో ప్రజలు బంగాళా ఖాతంలో విసిరి వేసారన్న విషయాన్ని బాబు మరిచి పోరాదని అన్నారు. అంతేకాదు వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత టిడిపి కార్యాలయం ‘ఎన్టీఆర్ భవన్’నూ ప్రజలు బంగాళా ఖాతంలో పడేస్తారని, లేదంటే ‘టు-లెట్’ బోర్డు పెట్టుకోక తప్పదని ఆయన తెలిపారు. అవినీతి రహిత పాలకుడని, సచ్చీలుడని తనను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గుర్తించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నట్లు కనబడుతున్నదని అన్నారు. టిడిపి హయాంలో ఏలేరు కుంభకోణం జరిగిన విషయాన్ని బాబు మరిచిపోరాదని ఆయన తెలిపారు. మల్లెల బాబ్జీ, వంగవీటి రంగాల హత్యల వెనుక ఎవరున్నారనేది వెలికి తీయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాబులా తామూ మాట్లాడగలం కానీ, సంస్కారం అడ్డువస్తుందని తెలిపారు.
నోటికి తాళం వేసుకో..
బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసే సుబ్రహ్మణ్య స్వామి తన నోటికి తాళం వేసుకోవడం మంచిదని పొంగులేటి సూచించారు. సోనియా గాంధీ తన సోదరి భర్త వాల్టర్ విన్నీకి ఆంధ్ర ప్రదేశ్‌లో మైనింగ్ లీజులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. బోఫోర్సుపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయడం అవివేకమని అన్నారు.
బోఫోర్సుపై అనేక దర్యాప్తులు జరిగాయని, రాజీవ్ గాంధీ ప్రమేయం ఏమీ లేదని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.