తిరుపతి,ఏప్రిల్ 28: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మే 1,2,3వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. జగన్ పర్యటనలో భాగంగా రెండురోజుల పాటు రోడ్‌షోలను నిర్వహించనున్నారు. 25 జంక్షన్లలో జగన్ ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు,తిరుపతి అభ్యర్థి భూమన్ కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో ర్యూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. జగన్మోహన్‌రెడ్డి సూచనల మేరకు రోడ్‌షోలను విజయవంతం చేసేందుకు కరుణాకర్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా వ్యవహారిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని 25 కమిటీలను కూడా నియమించుకున్నారు. తిరుపతి శాసనసభ నియోజకవర్గాన్ని 25 పాయింట్లుగా విభజించి 25 జంక్షన్లలో జగన్ ప్రసంగించే విధంగా రోడ్‌షోను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఒక్కో జంక్షన్‌కు ఒక్కొ కమిటీని నియమించారు. ఒక్కో కమిటీలో ఐదుగురు కమిటీ సభ్యులు ఆ జంక్షన్ సభలను విజయవంతం చేసేందుకు రూపకల్పన చేయనున్నారు. తొలిరోజు మే 1న ఉదయం గంటలకు తిమ్మినాయుడుపాళెం హరిజనవాడ నుండి ప్రారంభమయ్యే రోడ్‌షో లీలామహాల్ జంక్షన్, ఆనంద్ టీస్టాల్, కొర్లగుంట జంక్షన్, తుడా జంక్షన్, శ్రీదేవి కాంప్లెక్స్, గాంధీరోడ్డు జంక్షన్, టికె స్టీట్, శ్రీనివాస థియేటర్, భవానీనగర్ జంక్షన్ మీదుగా జ్యోతిథియేటర్ వద్ద తొలిరోజు రోడ్‌షోను ముగించనున్నారు. తొలిరోజు 13 జంక్షన్లలో జగన్ ప్రసంగించనున్నారు. ఆ రాత్రికి స్థానిక హోటల్ కెన్సస్‌లో బస చేయనున్నారు. రెండవరోజు ఆటోనగర్ నుండి ప్రారంభించే రోడ్‌షోను హోటల్ బ్లిస్, లక్ష్మిపురం జంక్షన్, టివిఎస్ షోరూమ్, అన్నమయ్య సర్కిల్ మీదుగా 12 జంక్షన్లలో జగన్ ప్రసంగించనున్నారు. చివరిగా ఎంఆర్‌పల్లి జంక్షన్‌లో రోడ్‌షోను ముగించనున్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఎక్కడైతే ఎంఆర్‌పల్లి జంక్షన్‌లో రోడ్‌షోను ముగించారో అదే ప్రాంతంలో జగన్‌కూడా తన రోడ్‌షోను ముగించేవిధంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు తిరుపతిలో చేసిన ప్రసంగాలను తిప్పికొట్టే విధంగా జగన్ ప్రసంగించేవిధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. తిరుపతి ప్రజల సెంటిమెంట్లను తన ప్రసంగాల్లో వినిపించనున్నారు. చివరి రోజు 3వతేదిన తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం తిరుమల బాలాజీ నగర్‌లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వారికి అండగా నిలుస్తానని బరోసా ఇవ్వనున్నారు. ఇప్పటికే ఒక పర్యాయం స్వామివారిని దర్శించుకున్న జగన్ రెండవ సారి తిరుమల వెంకన్నను దర్శించుకోనున్నారు. స్ధానిక నాయకులతో సమీక్షించి స్దానికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. జగన్ ఒక నాస్దికుడు అని చంద్రబాబు నాయుడు పదెపదె తిరుపతి పర్యటనలో విమర్శించిన నేపద్యంలో జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని చంద్రబాబు వ్యాఖ్యలకు సరైన సమాదానం చెప్పాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇదిలా వుండగా ఇప్పటికే రెండు పర్యాయాలు తిరుపతిలో పర్యటించి రోడ్‌షోలు నిర్వహించిన చంద్రబాబు నాయుడి పర్యటనను తలతనే్నవిధంగా జగన్ రోడ్‌షోలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతితో పాటు జిల్లా వ్యాప్తంగా వున్న ఆ పార్టీ కార్యకర్తలు విచ్చేయనున్న నేపద్యంలో సుమారు 5 లక్షల మందిని జన సమీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఎమైనా తిరుపతి చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసే సందర్భంలో ఎటువంటి జన స్పందన వచ్చిందో అంతకన్నా ఎక్కువగా జన సమీకరణ చేసి జగన్ రోడ్‌షొలను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. జగన్‌తో పాటు ఆపార్టీ నేతలు అంబటి, రోజా, జూపూడి ప్రభాకర్‌రావు,రెహామాన్,మేకపాటి రాజయోహన్‌రెడ్డి, పుల్లాపద్మావతి, ఎస్వీ సుబ్బారెడ్డి తదితరులను రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఎమైనా జగన్ రోడ్‌షోతో తిరుపతి ఉప ఎన్నికలు మరింతగా వేడెక్కనున్నాయి. చంద్రబాబు ఇప్పటికే తిరుపతిలో రోడ్‌షోలు చేయగా జగన్‌లు మే 1నుండి రోడ్‌షొలు చేయనున్నండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్దిని ఖరారు చేసే పనిలో నిమగ్నం కావడం ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా తీవ్ర నిరాశను రేపుతున్నది.
* సిద్ధమైన ర్యూట్ మ్యాప్ * నగరంలో 25 జంక్షన్లలో ప్రసంగాలు * 3న తిరుమల వెంకన్న దర్శనం
english title:
t
Date:
Sunday, April 29, 2012