అనంతపురం, ఏప్రిల్ 28:జిల్లా కాంగ్రెస్‌లో త్రిమూర్తులుగా పేరుపడ్డ ఎంపి, ఇద్దరు మంత్రులకు రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తప్పకుండా విజయం సాధించాలన్న కృత నిశ్చయంతో ఈ బృందం వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగానే అనంతపురం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవేళ రెండు నియోజకవర్గాల్లో ఎదురుగాలి వీస్తే అసమ్మతి వర్గం నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు వున్నాయి. దీనికి తోడు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలోని అధిష్ఠానం వద్ద ఇప్పటివరకూ వున్న పరువుకు భంగం వాటిల్లే పరిస్థితి లేకపోలేదు. అందుకే ఎలాగైనా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను గెలిపించుకోవడానికి వీరు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. 2004లో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుండీ జిల్లాకు చెందిన రఘువీరారెడ్డి ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖ నిర్వహించారు. అలాగే 2009లో రెండవ సారి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా మరింత కీలకమైన మంత్రిత్వ శాఖ చేపట్టారు. వైఎస్‌ఆర్ హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గంలో సైతం ఆయన కీలక భూమిక పోషించారు. ఇద్దరు సిఎంలకు సన్నిహితంగా ఉంటూ తన ఎదుగుదలకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. వీటన్నింటితో పాటు 2004 నుంచీ 2012 వరకూ జిల్లాలోనే కాకుండా అధిష్ఠానం స్థాయిలో కూడా ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇలా హైదరాబాద్, ఢిల్లీ స్థాయిలో పెద్దల దృష్టిని ఆకర్షించారు. ఇకపోతే కాంగ్రెస్ అధికారం చేపట్టిన ప్రతిసారి కీలకమైన మంత్రిత్వ శాఖను చేజిక్కించుకునే జెసికి 2009లో ఏర్పాటైన మంత్రి వర్గంలో చోటు దక్కకుండా జిల్లా నేతలందరూ కలిసి అడ్డుకోగలిగారు. దీంతో జెసి వర్గంలో తీవ్రస్థాయిలో అసమ్మతి చెలరేగుతూ వచ్చింది. అది ప్రతి కాంగ్రెస్ సమావేశంలోనూ ప్రతిబింబించింది కూడా. ఇదిలా వుండగా 2009లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సాకే శైలజానాథ్ కూడా అధిష్ఠానం స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతమవుతున్నప్పుడు ఆయన సమైక్యాంధ్ర కోసం పెద్దఎత్తున గళమెత్తారు. సమైక్యాంధ్ర జెఎసి చైర్మన్‌గా అధిష్ఠానం వద్ద మంచి మార్కులు సంపాదించారు. ఇలా వీరిద్దరికి కాంగ్రెస్‌లో అపర చాణుక్యుడిగా పేరుగాంచిన అనంతపురం పార్లమెంటు సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి తోడవ్వడంతో జిల్లాలోనే కాకుండా రాష్టస్థ్రాయిలో కూడా ఈ త్రిమూర్తులకు ఎదురు లేకపోయింది. ఎప్పటికప్పుడు అసమ్మతి గళమెత్తుతున్నా తమదైన శైలిలో వీరు వాటిని అడ్డుకోగలిగారు, అధిష్ఠానం వద్ద పరువు నిలుపుకోగలిగారు. ఉప ఎన్నికల ఫలితాలు సిఎం, పిసిసి అధ్యక్షుడి పీఠాలపై సైతం ప్రభావం చూపవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరి వర్గంగా పేరుబడ్డ త్రిమూర్తులకు కూడా ఉప ఎన్నికలు గడ్డుకాలంగా చెప్పవచ్చని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అందుకే ప్రతి విషయంలో వీరు ఆచితూచి అడుగేస్తున్నారని, ఉప ఎన్నికల ఫలితాల తరువాత కూడా అధిష్ఠానం వద్ద తమ ప్రతిష్టకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా వ్యూహ రచన చేస్తున్నట్లు సమచారం. దీనికి నిదర్శనమే అనంతపురం అభ్యర్థి ఎంపిక వ్యవహారం అని కొందరు ఉదహరిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా అనంత సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాన్ని సున్నితంగా తిరస్కరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొదట్లో అనంత సుబ్బారెడ్డి పేరు వినిపించడం, ప్రస్తుతం మైనార్టీ నేత రషీద్ అహమ్మద్ పేరు వినిపించడం రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకెంతమంది ఆశావహుల పేర్లు వినిపిస్తాయో చూడండని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
1న బాబు పర్యటన
* ఏర్పాట్లపై టిడిపి నేతల సమీక్ష
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 28: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో ఉప ఎన్నికల పర్యటన నిమిత్తం 1న నగరంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను సమీక్షించటానికి పార్టీ నాయకులు కార్యాలయంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పార్టీకి ఉప ఎన్నికలు కీలకమైనవని, ప్రతి ఒక్కరు పార్టీ విజయం కోసం పనిచేయాలని అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సైఫుల్లా మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్‌లో గెలవలేమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలుతాయని అది పార్టీకి లాభిస్తుందని అన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ కార్యకర్తలు పని విభజన చేసుకొని ప్రచారాన్ని నిర్వహించాలని, ప్రజలందరి దగ్గరికి పార్టీ విధానాలను తీసుకెళ్లాలని తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బతికించు కోవాలంటే టిడిపిని గెలిపించుకోవాలని పేర్కొన్నారు. ఒకటవ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్‌కె ఫంక్షన్ హాలులో జరిగే కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని, అనంతరం రోడ్ షో ఉంటుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే అబ్థుల్ ఘని, ప్రభాకరచౌదరి, పేరం నాగిరెడ్డి, శమంతకమణి, సరిపూటి సూర్యనారాయణ, ఆలం నరసానాయుడు, బివి. వెంకటరాముడు, బుగ్గయ్య చౌదరి, నదీమ్ అహ్మద్, కృష్ణకుమార్, ఆదినారాయణ, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.
* తలనొప్పిగా మారిన ‘అనంత’ అభ్యర్థిత్వం.. * ఆచితూచి అడుగులు..
english title:
mp
Date:
Sunday, April 29, 2012