హిందూపురం, ఏప్రిల్ 28: గత కొం తకాలంగా గుప్త నిధుల కోసం దుండగులు పురాతన కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా హిందూపురం రూరల్ మండల పరిధిలోని మలుగూ రు సమీపంలో వందేళ్ల చరిత్ర కల్గిన చౌడేశ్వరి దేవాలయం ముంగిట ఉన్న ధ్వజ స్తంభాన్ని శుక్రవారం రాత్రి గుప్త నిధుల వేటగాళ్లు ధ్వంసం చేశారు. గత కొనే్నళ్లుగా ఆ దేవాలయంలో ఎలాంటి దూపధీప నైవేద్యాలు నిర్వహించకపోతుండటంతో మరింత శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుప్త నిధులు ఉంటాయన్న ఉద్దేశంతో ధ్వజ స్తంభాన్ని పెకలించి దాదాపు 5 అడుగుల లోతు వరకూ గుంతలు తవ్వారు. ఇకపోతే ఇటీవలే లేపాక్షి మండలం మామిడిమాకులపల్లి రాజుల దేవరకొండలో గుప్త నిధుల కోసం దుండగులు ఈశ్వర దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. కాగా గోపిందేవరపల్లి గ్రామ సమీపంలో ప్రాచీన కట్టడాలను గుప్త నిధుల వేటగాళ్లు ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో ఏకంగా జెసిబితో ప్రాచీన కట్టడాలను తొలగిస్తుండగా గమనించిన గ్రామస్థులు కేకలు వేయడంతో పరుగులు తీశారు. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన హయాంలో పెనుకొండ డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు నిర్మించారు. ఇప్పటికే గుప్త నిధుల వేటగాళ్ల కారణంగా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రాచీన కట్టడాలు కనుమరగయ్యాయి. అదేవిధంగా శాసనకోట, గుడిబండ, అమరాపురం, మడకశిర, పెనుకొండ వంటి ప్రాంతాల్లో కూడా వేటగాళ్లు ప్రాచీన కట్టడాలను కూల్చివేశారు. పోలీసులు వేటగాళ్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా వుంచి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే కొందరు కర్నాటక ప్రాంతవాసులతో పాటు స్థానికులు ముఠాగా ఏర్పడి పురాతన దేవాలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
లోక్ అదాలత్‌ను
సద్వినియోగం చేసుకోండి
* కలెక్టర్ వి.దుర్గాదాస్
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఏప్రిల్ 28 : కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ‘లోక్ అదాలత్’లు ఏర్పాటు చేసిందని, వీటిని కక్షిదారులు సద్వినియోగం చేసకోవాలని కలెక్టర్ వి.దుర్గాదాస్ పిలుపునిచ్చారు. స్థానిక కోర్టు ఆవరణలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశమందిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కె.శివప్రసాద్ అధ్యక్షతన శనివారం మూడవ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా కేసులు సత్వరమే పరిష్కరించడం నిరుపేద కక్షిదారులకు మంచి అవకాశమన్నారు. నిరుపేద కక్షిదారులకు రాజీ మార్గం ద్వారా ఎటువంటి వ్యయం లేకుండా త్వరితగతిన కేసులు పరిష్కరించి సమాజంలో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు పట్ల గౌరవం ఇనుమడింపజేస్తుందన్నారు. జిల్లా న్యాయాధికార సంస్థకు, లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి జిల్లా యంత్రాంగ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని వేదికగా వినియోగించుకుని జిల్లా శాఖల ద్వారా పరిష్కృత కేసుల జాబితాను కమిటీలో చర్చించి తగు సహాయ సహకారాలు పొందవచ్చన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగేలా న్యాయవాదులు చైతన్యం కలిగించాలన్నారు. ప్రజలు కూడా న్యాయవాదులు చెప్పే విధానాల గురించి లోక్ అదాలత్ గురించి, న్యాయ సేవాధికార సంస్థ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. ధర్మవరంలో అక్రమాలకు సంబంధించి 20 కేసుల పరిష్కారంలో చూపిన చొరవను కలెక్టర్ ప్రశంసించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.శివప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లను త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తూ పేదలకు సామాజిక, ఆర్థిక, న్యాయపరమైన చేయూత అందిస్తున్నామన్నారు. గత 15 ఏళ్లుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకూ లక్షల సంఖ్యలో కేసులు, కోట్లాది రూపాయల క్లయిమ్స్ పరిష్కరించామన్నారు. లోక్ అదాలత్ నిర్వహణకు జిల్లా కలెక్టర్ పూర్తి సహకారం అందిస్తున్నారని, అలాగే నిధులు కేటాయించి జిల్లా కోర్టు అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి టి.వెంకటసుబ్బారావు ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యకలాపాలను చదివి వినిపించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోర్టులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అదనపు జిల్లా జడ్జి చలపతి వందన సమర్పణ గావించారు. కార్యక్రమంలో అదనపు జడ్జిలు కెవి విజయకుమార్, చలపతి, మహంతిలతో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
* ధ్వంసమవుతున్న పురాతన కట్టడాలు
english title:
a
Date:
Sunday, April 29, 2012