బెళుగుప్ప, ఏప్రిల్ 28: భర్తను వదిలేసిన వదిన (్భర్య అక్క)ను రెండవ వివాహం చేసుకునేందుకు నిరాకరించడాన్ని సహించలేని అల్లుడు అత్తను దారుణంగా హత్య చేసిన సంఘటన శనివారం మండల పరిధిలోని ఎలగలవంక తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఎలగలవంక తండాకు చెందిన జయమ్మబాయికి ముగ్గురు కుమార్తెలు. పెద్దకుమార్తె లలితబాయిని భర్త వదిలేశాడు. అయితే రెండవ కుమార్తె సరోజబాయిని పెళ్లి చేసుకున్న గోపాల్‌నాయక్ ఎలగలవంక తండాలోనే కాపురం ఉంటున్నాడు. లలితబాయిని రెండవ పెళ్లి చేసుకుంటానని అత్త జయమ్మబాయిని ప్రతి రోజు వేధిస్తూండేవాడని, ఈ నేపథ్యంలోనే కుటుంబంలో, కాపురంలో రోజురోజుకూ గొడవలు అధికమయ్యాయి. శనివారం అతిగా మద్యం తాగిన గోపాల్ నాయక్ పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న జయమ్మబాయిని దారిలోని నరసాపురం గేట్ వద్ద కొడవలితో నరికి అతి దారుణంగా హత్య చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జయమ్మబాయిని కల్యాణదుర్గం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. వరసకు వదిన అయిన లలితాబాయిని పెళ్లి చేసుకునే దురుద్దేశ్యంతో గోపాల్‌నాయక్ ఈ దారుణానికి ఒడిగట్టాడని ఎస్సై రఫీ తెలిపారు. సంఘటనా స్థలానికి సిఐ రామకృష్ణయ్య చేరుకుని వివరాలు సేకరించారు. హత్య చేసిన గోపాల్‌నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పిడుగుపాటుకు 35 గొర్రెలు మృతి
* ఈదురు గాలులకు నేలకొరిగిన తమల పాకు, అరటి తోటలు
* 50 ఎకరాల్లో పంట నష్టం
రాయదుర్గం రూరల్, ఏప్రిల్ 28 : రాయదుర్గం మండలంలో శుక్రవారం అర్ధరాత్రి మెరుగుపులతో కూడిన భారీ వర్షానికి పశు సంపద, తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండలంలోని మల్లాపురం, చదం గ్రామ సమీపంలో ఉన్న బొందనకల్లు అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన 35 గొర్రెలు పిడుగు పాటుతో మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ. రెండు లక్షల ఉంటుందని యజమానులు సన్నప్పయ్య, బాగురప్పలు తెలిపారు. మృతి చెందిన గొర్రెలను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని గొర్రెల కాపరులు అధికారులను కోరారు. అలాగే మండలంలోని 74 ఉడేగోళం గ్రామ సమీపంలో ఈదురు గాలులకు 30 ఎకరాల్లో తమల పాకు తోట, 15 ఎకరాల ఆరటి తోట నెలకొరిగాయి. తహసీల్దార్ ఆంజనేయులు, హార్టికల్చర్ అధికారి నెట్టికంటయ్య, వీఆర్‌వో జయరామిరెడ్డిలు తోటలను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ నష్టం అంచనా వేసిన ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకదాటిక కురిసిన వర్షం 121.5 మి.మీ.గా నమోదయ్యిందని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అనంతపురం సిటీ, ఏప్రిల్ 28: నగర శివారు కక్కలపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బుక్కరాయసముద్రం మండలం అమ్మవారి పేటకు చెందిన కుళ్ళాయప్ప (24) మృతి చెందాడు. కక్కలపల్లి నుండి వస్తుండగా ఎదురుగా వచ్చిన వ్యాను ఢీ కొంది. దీంతో కుళ్ళాయప్ప అక్కడిక్కడే మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సిఐ గురునాథ్ బాబు తెలిపారు.
* ఎలగలవంక తండాలో దారుణం
english title:
a
Date:
Sunday, April 29, 2012