Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మండుతున్న ఎండలు అల్లాడుతున్న ప్రజలు

$
0
0

ఒంగోలు, మే 2: ప్రచండ భానుడి ప్రతాపానికి జిల్లా ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. బుధవారం 42 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటీవల జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో ఆ ప్రాంతాల్లో కొంతమేర ఉపశమనం లభించింది. కాని ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల మొదట్లోనే ఎండలు మండుతుంటే మున్ముందు ఎండల తీవ్రత ఏవిధంగా ఉంటుందోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఎండల ధాటికి కొంతమంది గొడుగులను ఉపయోగిస్తున్నారు. జిల్లాలో ఎండలు మండుతుండటంతో శీతలపానీయాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. అదేవిధంగా కొబ్బరిబొండాలు, మజ్జిగ ధరలు పెరిగిపోయాయి. ఉదయం 11 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రోడ్లపైకి వెళ్ళేందుకు ప్రజలు వెనకంజవేసే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఏసీలు, ఎయిర్‌కూలర్‌లు, ఫ్యాన్ల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతున్నప్పటికీ విద్యుత్‌కోతల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. జిల్లాలో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రివేళల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలౌతుండటంతో గ్రామీణప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నారు. గత నెల 27వ తేదీన గరిష్ఠ ఉష్ణోగ్రత 37.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదుకాగా కనిష్ఠం 28.8, 28వ తేదీన గరిష్ఠం 37.5 కాగా కనిష్ఠం 28.3, 29వ తేదీన గరిష్ఠం 38.6, కనిష్ఠం 29.4, 30వ తేదీన గరిష్ఠం 39, కనిష్ఠం 27.4, ఈనెల ఒకటవ తేదీన గరిష్ఠం 39.7 కాగా కనిష్ఠం 29.4 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తమీద జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతుండటంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి.

10 నుండి రైతు చైతన్య యాత్రలు
ఒంగోలు, మే 2: జిల్లాలో రైతు చైతన్యయాత్రలు ఈనెల 10 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర తెలిపారు. రైతు చైతన్యయాత్రలను విజయవంతం చేసేందుకు వ్యవసాయ శాఖాధికారులు దాని అనుబంధ శాఖలు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో రైతు చైతన్య యాత్రలు, రైతు సదస్సులపై వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ తరఫున సీడ్ విలేజ్ ప్రోగ్రాం, పొలంబడి, వర్మికంపోస్ట్, శ్రీవరి సాగులో సాంకేతిక పరిజ్ఞానం, మెట్టసేద్యం, పంట మార్పిడి, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల మార్గాలు, నకిలీ విత్తనాల గురించి రైతులను జాగృతం చేయటం, జాతీయ ఆహార భద్రత మిషన్, రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజనలో కలిగే లాభాలు గురించి రైతు చైతన్యయాత్రల్లో రైతులకు వివరించాలన్నారు. అలాగే రుణ అర్హత కార్డులు కలిగి రుణాలు పొందని రైతులను గుర్తించాలన్నారు. అదేవిధంగా క్రెడిట్ ఇన్సూరెన్స్, పావలా వడ్డీ గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. రసాయనిక ఎరువులు, ఫెస్టిసైడ్స్ వాడకంవల్ల కలిగే నష్టాలను తెలియచేయాలన్నారు. భూమి సారవంతం తగ్గిపోతుందన్న విషయాలను వివరించాలన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా కృత్రిమ గర్భధారణ, పశుక్రాంతి, జీవక్రాంతి పథకాల వల్ల కలిగే లాభాలు, పశుగ్రాసం అభివృద్ధి గురించి రైతుల్లో అవగాహన కల్పించేలా చూడాలన్నారు. ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఎద్దుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్నందున సంబంధిత అంశాలను ఛాయాచిత్రాల ద్వారా రైతులకు నేరుగా అర్ధమయ్యే రీతిలో తెలియచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా సహజసిద్ధంగా పండే పండ్లలో ఉన్న పోషక విలువలు, రసాయానాలు, కార్బైడ్‌తో పండే పండ్ల వల్ల కలిగే అరిష్టాలను అర్ధమయ్యేరీతిలో ప్రజలకు, రైతులకు తెలియచేయాలన్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్ల సాగు, కోత దశ, పంట సంరక్షణ చర్యలు, నాణ్యమైన ఉత్పత్తులు, కోల్డ్‌స్టోరేజ్‌ల వల్ల కలిగే లాభాల గురించి రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులు పండించిన పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర అందుకునే విధంగా వారిని చైతన్యపర్చాలన్నారు. ట్రాన్స్‌కో శాఖ ద్వారా కెపాసిటర్లు, ఐఎస్‌ఐ మార్కు కలిగిన పంపుసెట్లను మాత్రమే రైతులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. బ్యాంకు అధికారులు రైతులకు అందించే వివిధ రకాల రుణాలు, కౌలురైతులకు రుణాలు పంపిణీ గురించి తెలియచేయాలన్నారు. ఒంగోలు, కందుకూరు మినహా అన్నిచోట్ల జాతీయ ఉపాధి హామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు చేయనున్నట్లు చెప్పారు. మత్స్య శాఖ ద్వారా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందించాలన్నారు. చేపల పెంపకంలో అధిక పెరుగుదల, లాభాసాటి చేపల రకాలు వాటి పెంపక విధానం గురించి ఆక్వా రైతులకు వివరించాలన్నారు. ప్రభుత్వం ద్వారా లభ్యమయ్యే రాయితీ వివరాలను తెలియచేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శుల ద్వారా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, పరిశుభ్రతతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారినపడకుండా అవగాహన కల్పించాలన్నారు. రైతులకు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేలా బ్యాంకు అధికారులు సహకరించాలన్నారు. సహకరించని బ్యాంకు, అధికారి పేర్లను తమ దృష్టికి తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికార్లను ఆదేశించారు. ఆత్మ పిడి అన్ని శాఖలతో అనుసంధానం చేసుకుని అన్ని వివరాలతో కరపత్రాలను ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆదర్శ రైతుల ద్వారా రైతు చైతన్యయాత్రల్లో చదివి వినిపించాలన్నారు. ఈసమావేశంలో వ్యవసాయ శాఖ జెడి నరసింహులు, మత్స్యశాఖ ఎడి బలరాం, ఉద్యానవన శాఖ ఎడిలు రవీంద్రబాబు, జెన్నమ్మ, పశుసంవర్ధక జెడి రజనీకుమారి, ట్రాన్స్‌కో డిఇ రమణాదేవి, ఆత్మ పిడి నరసింహారావు, డిసిసి బ్యాంకు డిజిఎం మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

బెట్టింగ్‌ల జోరు! అరికట్టేవారేరీ?
కందుకూరు, మే 2: ఒక్క బెట్టింగ్ గెలిస్తేచాలు రాత్రికిరాత్రే కోటీశ్వరులు కావచ్చు. ఓడితే సర్వం కోల్పోయి బజారునపడ్డవారు ఎందరో ఉన్నారు. బెట్టింగ్‌లకు ఏదీ అనర్హం కాదు. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు, ఉప ఎన్నికలే కాక ఆఖరికి సినిమాలకు కూడా బెట్టింగ్‌లు కడుతున్నారు. అభిమాన హీరో సినిమా ఒకరోజు ఎంత కలెక్షన్లు వసూలు చేస్తుందనే దానిపై బెట్టింగ్, అభిమాన క్రికెటర్ ఎన్ని పరుగులు చేస్తాడనే దానిపై బెట్టింగ్, ఏమ్యాచ్ ఎవరు గెలుస్తారనేదానిపై బెట్టింగ్, చివరకు ఏపార్టీ ఎంతమెజార్టీ వస్తుందనేదానిపై బెట్టింగ్‌లు కడుతున్నారు. పులిని చూసి నక్కవాత పెట్టుకొన్నట్లు ధనవంతులను చూసి మధ్యతరగతి ప్రజలు కూడా బెట్టింగ్‌లు కట్టి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకొంటున్నారు. తెల్లవారేసరికి వీరి బతుకులు రోడ్డున పడుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఒక్క కోవూరు నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల గెలుపోటములపై 200కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్ జరిగినట్లు తెలిసింది. ఒక్క జిల్లాలోనే కోవూరు ఎన్నికపై 30కోట్లకు పైగా బెట్టింగ్ జరిగింది. పోటీచేసే అభ్యర్థులకు పెద్దగా టెన్షన్ లేకపోయినప్పటికీ, బెట్టింగ్‌లు పెట్టిన వారికి మాత్రం చెమటలు కక్కారు. ఈ బెట్టింగ్‌లలో సంపన్న కుటుంబాలతోపాటు, మధ్యతరగతి కుటుంబాల వారు కూడా ఉండడం గమనర్హం. అయితే జూన్ 12వ తేదీన జరగనున్న ఉప ఎన్నికలకు ఇప్పటి నుంచే బెట్టింగ్‌లు కాయడం గమనర్హం. నెల్లూరుపార్లమెంట్ నియోజకవర్గానికి అన్నిపార్టీలకు అభ్యర్థులు ఖరారు కావడం, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా అభ్యర్థులు ఖరారు కావడంతో బెట్టింగ్‌ల జోరు ఇప్పటి నుంచే జోరందుకుంది. ఎన్నికలకు నెల రోజులకు పైగా ఉన్నా, ఇప్పటి నుంచే బెట్టింగ్‌లు పలానా పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడని బెట్టింగ్‌లు కాస్తుండడంతో ఎన్నికల సమయానికి ఇంకా ఎక్కువ బెట్టింగ్‌లు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. కందుకూరు నియోజకవర్గం పరిధిలో మండలాల వారీగా పలానాపార్టీ అభ్యర్థికి మెజార్టీ వస్తుందని బెట్టింగ్‌లు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అలాగే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, రూరల్, కొత్తపట్నం మండలాల వారీగా ఏ పార్టీకి ఎంత మెజార్టీ రావచ్చునన్న దానిపై కూడా బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. బెట్టింగ్‌లో పోయిన సొమ్ము రాబట్టుకోవాలంటే మళ్లీ బెట్టింగ్‌లే శరణ్యం అని అంటున్నారు. గత ఉప ఎన్నికలలో దెబ్బతిన్న వాళ్ళకు ఇప్పుడు కొత్తగా రిలీజైన సినిమాలు, ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు, రానున్న ఉప ఎన్నికలు వరమయ్యాయి. రియల్ ఏస్టేట్ వ్యాపారులు, మద్యం సిండికేట్ సభ్యులు, రాజకీయ నాయకులు, పలువ్యాపారులు బెట్టింగ్‌లలో తలమునకలవుతున్నారు. కొంతమంది అయితే అద్దె భవనాలను తీసుకొని, టీవీ ఏర్పాటు చేసుకొని బెట్టింగ్‌లు కడుతున్నారు. కొందరు అప్పులు చేసి బెట్టింగ్‌ల భారిన పడుతున్నారు. నిన్న, మొన్నటి దాగా లిక్కర్ బిజినెస్‌లో రూపాయకి 10రూపాయల ఆదాయం చూసిన వాళ్ళకు, ఇటీవల లిక్కర్ వ్యాపారులపై ఎసిబి దాడుల కారణంగా ఎంఆర్‌పి ధరలకే మద్యం విక్రయించాలన్న నిబంధనలు ఉండడంతో అక్కడ ఆదాయం తగ్గడంతో లిక్కర్ వ్యాపారులు కూడా బెట్టింగ్‌ల వైపు మరిలారు. ఇంకా ఇతర వ్యాపారాలలో దెబ్బతిన్నవారు ఒక్క దెబ్బతో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయనే భ్రమతో బెట్టింగ్‌లు కట్టి నష్టాలపాలవుతున్నారు. ఇలాంటి వాళ్ళు బెట్టింగ్‌లో కూడా సొమ్ము పోగొట్టుకుంటే ఆఖరికి వీరు పరువుకోసం కొందరు ఊరు వదలిపెట్టి వెళుతుంటే, మరికొందరు ఐపి దాఖలు చేయడం, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యవౌతున్నాయి. అందువల్ల వాస్తవాలను మరచి ఆకాశానికే నిచ్చెన వేస్తే ఏమవుతుందోననేది గ్రహించాలి. ఇప్పటికైనా బెట్టింగ్‌ల జోలికి వెళ్ళకుండా ఉండేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అధికార దాహంతోనే ఎన్నికలు
టిడిపి నేత బలరాం ధ్వజం
ఒంగోలు అర్బన్, మే 2: రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికలు అధికార దాహంతోనే వచ్చాయని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి ధ్వజమెత్తారు. బుధవారం ఒంగోలులోని శ్రీనివాసా గార్డెన్ సమావేశ మందిరంలో యాదవ విద్యార్థి సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిధిగా హాజరైన బలరాం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే రాష్ట్రం అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. మాటలు చెప్పి తప్పుకొనే వ్యక్తి జనార్దన్ కాదన్నారు. భవిష్యత్ ఆలోచించి రానున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజర్టీతో గెలిపించాలని యువతకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే యాదవుల అభివృద్ధి జరిగిందన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ఒంగోలులో యూనివర్సిటీని స్థాపించాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీకి స్థలాన్ని కేటాయిస్తే అదే స్థలాన్ని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని తన తాబేదారులకు కట్టబెట్టారని విమర్శించారు. ఆ స్థలంలో పేదలకు పట్టాలు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని మాట్లాడటం మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ అవినీతిపరులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. అవినీతి డబ్బుతో జగన్ ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్నారన్నారు. బాలినేని జిమ్మిక్కులు నమ్మవద్దని, నమ్మితే ప్రతిఒక్కరికి చెవిలో పూలు పెడతారన్నారు. అవినీతి డబ్బుతో ఒకరు, పోలీసుల అండతో మరొకరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, వారిద్దరికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సభకు తెలుగుయువత జిల్లా ప్రధానకార్యదర్శి బొమ్మినేని మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాపార్టీ ప్రధాన కార్యదర్శి యర్రాకుల శ్రీనివాస్ యాదవ్, జిల్లాపార్టీ అధికార ప్రతినిధి గేనెం సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు బొల్లినేని వాసుకృష్ణ, నాయకులు కొఠారి నాగేశ్వరరావు, కపిల్‌బాషాతోపాటు యాదవ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే
బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తాం
అఖిలపక్ష రైతు సంఘాల హెచ్చరిక
ఒంగోలు, మే 2: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పొగాకు బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని అఖిలపక్ష రైతు సంఘాలు హెచ్చరించాయి. బుధవారం స్థానిక ఒంగోలు-1, 2 వేలం కేంద్రాలను అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, గిట్టుబాటు ధర కల్పించాల్సిన బోర్డు చైర్మన్ జి.కమలవర్థనరావు పొగాకు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పొగాకు వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఏడాది పొగాకు రైతులకు గత ఏడాది కంటే ఉత్పత్తి ఖర్చులు అధికంగా పెరిగాయని, పెరిగిన ఖర్చుల ప్రకారం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే కేజికి కనిష్ట ధర 120 రూపాయలు, గరిష్ట ధర 140 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ పేరుతో 15,500 కోట్ల రూపాయల అదాయం వస్తుందని, అంతర్జాతీయ మారకద్రవ్యం 4,500కోట్ల రూపాయలు వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ రూపాల్లో పొగాకుపై ఆదాయం పొందుతోందని, అయితే అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని పొగాకు రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టడం లేదని, ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పొగాకు రైతులను ఆదుకునేందుకు పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్యకు తగిన నిధులు తీసుకువచ్చి వేలం కేంద్రంలోని పొగాకును కొనుగోలుచేయించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాని, పొగాకు బోర్డు చైర్మన్ గాని, ప్రజాప్రతినిధులు గాని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో తగిన చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. పొగాకు బోర్డులో రైతుల వద్ద చెస్‌రూపంలో వసూలు చేసిన డబ్బులు సుమారు 280కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ 280కోట్ల రూపాయలలో కనీసం 100కోట్ల రూపాయలైనా ప్రభుత్వంపై బోర్డు చైర్మన్లు ఒత్తిడి తీసుకువచ్చి, పొగాకు బోర్డు ట్రేడింగ్ ద్వారా పొగాకు వేలం కేంద్రాల్లో రైతుల బేళ్ళను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆవిధంగా పొగాకు కొనుగోలు చేయడం వల్ల పోటీతత్వం ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పొగాకు ఆర్డర్స్ అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్నప్పటికీ ధరలు సరిగా రావడం లేదని చెప్పడాన్ని ఆయన వ్యాపారుల చర్యలను తప్పుపట్టారు. ఇప్పటికైనా బోర్డు చైర్మన్ ఆదిశగా చర్యలు తీసుకోకపోతే అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో త్వరలో బోర్డు కార్యాలయం ముట్టడితోపాటు, సామూహిక నిరాహారదీక్షలు కూడా చేపడతామని ఆయన హచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకయ్య మాట్లాడుతూ పొగాకు రైతులు ఐక్యంగా ఉండి, గిట్టుబాటు ధర సాధించుకోవాలని కోరారు. పొగాకు వ్యాపారులు సిండికేట్ అయ్యి ధరలు తగ్గిస్తున్నారని, పొగాకు వ్యాపారులు కూడా వేలం కేంద్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నోబిడ్స్ ఎక్కువ లేకుండా చూడాలని బోర్డు అధికారులను కోరారు. ఈవేలం కేంద్రాలను సందర్శించే సమయంలో ఒక కౌలురైతు తాను వేలం కేంద్రానికి మూడుసార్లు పొగాకు బేళ్లు తీసుకువచ్చినప్పటికీ మూడుసార్లు నోబిడ్స్ పెట్టారని, ఇక తమకు డబ్బులు ఎప్పుడు వస్తాయని, రైతు కూలీలకు డబ్బులు ఎప్పుడు ఇవ్వాలని, ఆత్మహత్యలు తప్ప మాకు వేరే మార్గం లేదని ఆ రైతు తన ఆవేదనను అఖిలపక్ష రైతు సంఘాల ముందు వ్యక్తం చేశాడు. దీంతో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు బోర్డు సూపరింటెండెంట్‌తో మాట్లాడి పొగాకు బేళ్ళను నోబిడ్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో వేలం కేంద్రం కొనుగోళ్ళు యధావిధిగా సాగి, ఒకటి రెండు రూపాయలు ధర పెంచి కొనుగోలు చేశారు. ఈకార్యక్రమంలో పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షులు శేషయ్య, పొగాకు పొగాకు బ్రోయర్స్ అసొసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు చుండూరి రంగారావు, పొగాకుబోర్డు మాజీ డైరెక్టర్ మారెళ్ళ బంగారుబాబు, తెలుగురైతు జిల్లా అధ్యక్షులు కె.వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కెవివి.ప్రసాద్, హనుమారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోపీనాధ్, బెజవాడ వెంకటేశ్వర్లు, సిరిపురం రుద్రయ్య, గురవారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ పెట్టుబడులతో
మధ్య తరగతి ప్రజలకు నష్టం
ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం స్పష్టం
కందుకూరు రూరల్, మే 2: అంతర్జాతీయ పెట్టుబడులు మధ్యతరగతి ప్రజలపై ప్రభావం చూపుతుందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌ఐసి కార్యాలయం ఆవరణలో ‘అంతర్జాతీయ పెట్టుబడులు- మధ్య తరగతి ప్రజలపై ప్రభావం’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాంచి మేనేజర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంతర్జాతీయ పెట్టుబడుల ప్రభావం మధ్యతరగతి ప్రజల విద్య, ఆరోగ్యం మీద ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. దీంతో దేశంలోని 30కోట్ల మధ్యతరగతి తరగతి ప్రజల భవిష్యత్తు ఆందోళనకరంగా తయారవుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఐసిఇయు నెల్లూరు డివిజన్ ఉపాధ్యక్షులు షేక్ షియాజుద్దీన్, బ్రాంచి యూనియన్ కార్యదర్శి కిషోర్‌బాబు, యుటిఎఫ్ నాయకులు పిజె.విలియం, పోస్టల్, సిఐటియు, లాయర్స్, స్థానిక యూనియర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు:కలెక్టర్
ఒంగోలు, మే 2: త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనితా రాజేంద్ర రాజకీయ నాయకులను బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో ఎన్నికలు నిర్వహించే నియోజకవర్గాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పెద్దమొత్తంలో నగదు తీసుకువెళ్ళేటప్పుడు ఆధారపత్రాలు తప్పనసరిగా ఉండాలన్నారు. లేనిపక్షంలో తనిఖీ బృందం నగదును జప్తు చేస్తుందని ఆమె హెచ్చరించారు.

జిల్లాలో రూ.79 లక్షల పట్టివేత
ఎస్‌పి రఘురాంరెడ్డి వెల్లడి
ఒంగోలు, మే 2: ఒంగోలు, కందుకూరు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 79 లక్షల 39వేల 108 రూపాయలను పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా ఎస్‌పి కొల్లి రఘురాంరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముత్తరాసుపాలెం చెక్‌పోస్టు వద్ద 23 లక్షల 50 వేల మూడు రూపాయలు, మంగమూరు డొంక చెక్‌పోస్టు వద్ద మూడు లక్షల రూపాయలు, పెంట్రాల చెక్‌పోస్టు వద్ద రెండు లక్షల 30 వేలు, ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డు వద్ద రెండు లక్షల 65 వేలు, కొప్పోలు చెక్‌పోస్టు వద్ద 14 లక్షల 80 వేల, మూడు రూపాయలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే 352 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. కందుకూరులోని టివిఎస్ స్పోర్ట్స్ వాహనాలను సీజ్ చేశామని ఎస్‌పి వెల్లడించారు.

18న పార్వతమ్మ నామినేషన్
ఒంగోలు, మే 2: ఒంగోలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాగుంట పార్వతమ్మ ఈనెల 18వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఆమె ఈనెల ఐదవ తేదీన ఒంగోలుకు రానున్నారు. ఐదవ తేదీ నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈపాటికే పార్వతమ్మ గెలుపును కాంక్షిస్తూ నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారం చేపట్టారు. త్వరలో ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేతలు, మంత్రులు, శాసనసభ్యులు పర్యటించనున్నారు. ఈనెల ఐదవ తేదీ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేపట్టనున్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా హైదరాబాదులో పార్వతమ్మ కలవనున్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిస్థితులపై ఆమె ముఖ్యమంత్రితో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు నియోజకవర్గం నుండి పోటీచేసిన మహిళల్లో పార్వతమ్మ రెండవవారు. తొలిసారిగా జీవరత్నం నాయుడు గెలుపొందగా రెండవ మహిళాగా పార్వతమ్మ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

పార్వతమ్మ విజయానికి కృషి చేయాలి
కార్యకర్తలకు ఎమ్మెల్యే ఉగ్ర పిలుపు
కొత్తపట్నం, మే 2: త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట పార్వతమ్మ గెలుపునకు అందరూ కృషి చేయాలని కనిగిరి శాసనసభ్యుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని మోటుమాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. జరగనున్న ఉప ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు అయినాబత్తిన ఘనశ్యాం, ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాగుంట ప్రతినిధి సురేష్‌రెడ్డి, మండల ఇన్‌చార్జ్ వెంకురెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటారు శ్రీనివాసరావు, వాయల మోహన్‌రావు, చిరుతోటి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

42 సెంటీగ్రేడ్‌కు చేరిన ఉష్ణోగ్రత
english title: 
summer... summer

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles